30, అక్టోబర్ 2021, శనివారం

మార్పు - పరివర్తన - ఆత్మావలోకనం (భాగం 7)


మార్పు - పరివర్తన - ఆత్మావలోకనం  (భాగం 7)

 

మార్పు అంటే  ఎదుగుదల. ఎదుగుదల  ఆనందాన్నిస్తుంది.  ఎదుగుదల  పరిణామానికి  అనుకూలమైనది.  అందుకే  ప్రకృతికి  కూడా  అనుకూలమైనది.  మార్పు  ఎప్పుడూ  మెరుగుపడటానికే.  మార్పు  ఒక్కటే శాశ్వతం  ఈ  సృష్టిలో.  మార్పుకు  అడ్డుపడటం  ప్రకృతి  ప్రవాహానికి  అడ్డు  పడటమే;  అది  వినాశనానికే  దారి  తీస్తుంది. మార్పు  లేనిదే  భవిష్యత్తు  లేదు. 

మార్పు  అనేది  ప్రక్ఱ్ర్తిలో  అన్ని  స్థాయిల్లో  ప్రతీ క్షణం  జరుగుతున్నా  కూడా  అది  చాలా  నెమ్మదిగా  జరుగుతూ  ఉంటుంది.  తనంతతానుగా  జరుగుతుంది.  ఈ  మార్పు  మహాప్రళయం  వరకూ  కొనసాగుతూ  ఉంటుంది  మన  శాస్త్రాల  ప్రకారం.  కాబట్టి  మార్పు  అనేది  ప్రకృతి నియమం.  సమస్త చరాచర జీవుల్లోనూ  అప్రయత్నంగా  జరుగుతూ  ఉంటుంది. దాన్నే  వికాసం  అని  పరిణామం  అని  కూడా  అంటారు.  ఈ  పరిణామ  ప్రక్రియలో  మనకిష్టమున్నా  లేకపోయినా  పాల్గొనవలసినదే - ప్రత్యక్సంగానో,  పరోక్షంగానో.  కాని  కేవలం  మనిషిలో  మాత్రమే  ఈ  ప్రకృతి  కార్యంలో  ప్రయత్న  పూర్వకంగా  పాల్గొనే  అవకాశం  ఉంది.  ఎందుకంటే  మనిషిలో  మాత్రమే  తనను  తాను  తెలుసుకోగలిగే  బాగా వికసించిన పరికరాలున్నాయి. వాటినే  మనం  సూక్ష్మశరీరాలంటాం;  ప్రధానంగా  మనసు, బుద్ధి,  అహంకారం, చిత్తము అనేవి  నాలుగు. ఇవి  యే  జీవరాసుల్లోనూ  ఇంతగా  వికసించి  లేవు. అలాగే  మనిషి  తరువాత  ఉండే  అనంత  యాత్రలో  ఉన్న  దేవతలకు  కూడా  లేవంటారు  పెద్దలు.  అందుకే  వాళ్ళైనా  సరే,  అత్యున్నత  ఆధ్యాత్మిక  శిఖరాలకు  ఎదగాలంటే  ఈ  మానవ  జన్మ  ధరించవలసినదే.  ఇక్కడే  ఈ  మానవ  జన్మలోనే  అత్యున్నత  ఆధ్యాత్మిక  వికాసం  సుసాధ్యమవుతుంది.  అందుకే  మానవ జన్మ  చాలా  విలువైనది. మానవ  జన్మెత్తిన  ముఖ్యోద్దేశ్యం వికాసం, పరిణామం. దీనికి  విరుద్ధంగా  జీవించడం  లేక  కాలాన్ని  వృథా చేయడం    మానవజన్మను  వ్యర్థం  చేసుకోవడం అవుతుంది. మానవుడు  ఎప్పుడైతే  అత్యున్నత  వికాసం  కోసం  ప్రయత్నపూర్వకంగా  పాల్గొనడానికి  ప్రయత్నిస్తాడో  అప్పుడు  ప్రకృతి  కూడా  సహకరిస్తుంది; ఎందుకంటే  ఇది ప్రకృతి  కార్యం  గనుక. అప్పుడు  మనిషి  వికాసం  త్వరితంగా  జరుగుతుంది.  ఈ  ప్రయత్నపూర్వకంగా  పాల్గొనడాన్నే  ఆధ్యాత్మిక  సాధన  అంటారు. ఇటువంటి  ఆధ్యాత్మిక సాధన  వల్ల ఎంతో కాలాన్ని  ఆదా  చేయడం  జరుగుతుంది;  జీవితాన్ని  అర్థవంతంగా  గడిపినట్లవుతుంది; ఎంతో  ఆత్మసతృప్తినిస్తుంది;  జీవిత  గమనం  సరైన దిశలో  జరుగుతుంది;  ఆలోచనలో  స్పష్టత  ఉంటుంది; సరైన  నిర్ణయాలు  తీసుకుంటూ  ఉంటాం;  రోజురోజుకూ  సూక్ష్మత్వం  పెరుగుతూ  ఉంటుంది;  లోపలి  ప్రపంచంం  బయట ప్రపంచాన్ని  గురించి  సమగ్రమైన  అవగాహన  పెరుగుతూ  ఉంటుంది;  ఈ  సృష్టిలో  మన  స్థానం  ఏమిటో  అర్థమవుతుంది;  మన ఉనికికి  సంబంధించిన  రహస్యాలను  తెలుసుకోగలుగుతాం -  దీన్నే  ఆత్మ  సాక్షాత్కారం  అని  కూడా  అంటారు. ఇక  నిత్య  జీవితంలో  ఈ  మార్పు  దిశగా,  ఈ  పరిణామ  దిశగా  ప్రయత్నపూర్వకంగా  చేసే  ఈ  హార్ట్ఫుల్నెస్ ఆధ్యాత్మిక  యాత్ర  విజయవంతంగా  సాగడానికి మనం  అనుసరించవలసినవి, అనుసరించదగ్గవి:  1) ఆత్మావలోకనం  2) సాధన  3) గురువు 4) స్వాధ్యాయం  5)  సేవ

1) ఆత్మావలోకనం: ఇవన్నీ  విస్తృతంగా  చెప్పుకోవలసిన అంశాలు. ప్రస్తుతానికి మనం  ఆత్మావలోకనం  గురించి  చెప్పుకుందాం. ఇది  మనిషిలో  రావలసిన  మార్పును  త్వరితంగా  తీసుకురాగలిగే  చాలా  కీలకమైన  పరికరం. 

ఇక్కడ  ఆత్మావలోకనం  అంటే యేది  కాదో  కూడా  తెలుసుకోవడం  అవసరం. ఆత్మావలోకనం  అంటే  కేవలం  కళ్ళు  మూసుకుని  కూర్చోవడం  కాదు;  ధ్యానించడమూ  కాదు; ఏకాగ్రతా  కాదు.

ఆత్మావలోకనం  అంటే  తనను తాను యథాతథంగా  ఉన్నదున్నట్లుగా ఎటువంటి పక్షపాత  ధోరణి  లేకుందా  గ్రహించగలగడం;  తనలో  ఉండవలసిన  లక్షణాలను,  ఉండకూడని  లక్షణాలను  గుర్తించడం; ఈ  ప్రక్రియ  ఎప్పటికప్పుడు  తన  ఆలోచనలను,  తన  చేతలను,  తన  అలవాట్లను,  తన  కోరికలను,  తన ప్రవర్తనను,  తన  ఉద్దేశాలను, తన  ఉద్వేగాలను, తనలో  కలిగే  భావాలను ఒక  సాక్షి  భావంతో  గమనించడం  ద్వారా  సాధ్యపడుతుంది. అప్పుడే  సరిదిద్దుకోవలసినవాటిని  సరిదిద్దుకోవడం  సాధ్యపడుతుంది; తొలగించుకోవలసినవాటిని  తొలగించుకోవడం  సాధ్యపడుతుంది. ఆత్మావలోకనం  సూక్ష్మగ్రాహ్యతను  కూడా  పెంపొందిస్తుంది. 

కొరతలు,  దోషాలు  గుర్తించిన  తరువాత  వాటిని  మనస్ఫూర్తిగా  స్వీకరించాలి;  ఎప్పటికప్పుడు  ప్రయత్నపూర్వకంగా  తొలగించుకునే  ప్రయత్నం  చెయ్యాలి. అలాగే  మెరుగుపరచుకోవలసిన  లక్షణాలను  గుర్తించిన  తరువాత  వాటిపై  దృష్టి పెట్టి  అవసరమైనది  చెయ్యాలి.  ఇది  ప్రతి  నిత్యం  జరగాలి.  మన  నిత్యజీవనంలో  ఈ  ఆత్మావలోకన  ప్రక్రియ  అంతర్లీనంగా  నేపథ్యంలో  జరుగుతూ  ఉండాలి. ఇది ప్రయత్నిస్తేనే  జరుగుతుంది. ఇది  జరగాలంటే  తనలో  పరివర్తన  రావాలన్న  ఆకాంక్ష,  ఆసక్తి,  తపన చాలా  అవసరం. గుర్తించిన  అంశాల్లో  కొన్ని  బాగుచేయడం  గాని,  తొలగించడం  గాని,  సరిదిద్దుకోవడం  గాని  అసాధ్యమయ్యేవి  ఉండవచ్చు.  వాటిని  హృడయపూర్వకంగా  స్వీకరించి  వాటికి  తగినట్లుగా  మనలను  సర్దుకుంటూ  దివ్యప్రణాళికలో  వీటి  పాత్ర  యేదో  ఉండుంటుందని  ప్రార్థనాపూర్వకంగా  స్వీకరించడానికి  ప్రయత్నించాలి.  ఇక్కడ  హార్ట్ఫుల్నెస్  ప్రార్థన  ఎంతగానో  సహాయపడుతుంది. గుర్తించిన  దోషాలను  తొలగించుకోవడానికి  హార్ట్ఫుల్నెస్  శుద్ధీకరణ  ప్రక్రియ ఎంతో  చేయూతనిస్తుంది;  అలాగే  ఉన్న  మంచి  లక్షణాలను  మెరుగుపరచుకోవడానికి,  హృదయ  వికాసం  జరగడానికి  ధ్యానం  ఎంతగానో  ఉపకరిస్తుంది. 

ఇవన్నీ  క్రమక్రమంగా  చేయడం  వల్ల  మన  శీలంలో  గణనీయమైన  మార్పు  లోపల  ప్రాణాహుతితో  కూడిన  ధ్యానం  ద్వారా కలిగే  ఆధ్యాత్మిక  స్థితికి  అనుగుణంగా  సర్దుకుంటుంది;  ఆ  విధంగా  మన  ఆధ్యాత్మిక  ప్రగతి,  పరిణతి,  యాత్ర  త్వరితంగా  జరుగుతుంది. ఇది  మనందరమూ  ప్రత్యక్షానుభవంతో  తెలుసుకోవచ్చు.  (సశేషం)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...