21, అక్టోబర్ 2021, గురువారం

మార్పు - పరివర్తన (భాగం 3)

మార్పు - పరివర్తన (భాగం 3)

 అందుకే  మనిషి  మారాలనుకుంటేనే  గాని మారడం  జరగదు.  మనకి  మారాలనుంది,  అని అనుకుందాం.    

ఈ  మార్పు   ఎక్కడినుండి  మొదలవుతుంది?  మనం  చెయ్యాల్సింది  ఏమైనా ఉందా?  

లేక తనంతతానుగా  జరిగిపోతుందా? అసలు  మనలో  మారవలసినదేది? 

ఈ  మార్పు  అలా  ఎంతకాలం  కొనసాగుతూ  ఉంటుంది లేక  కొనసాగుతూ  ఉండాలి?  

మన  చేతుల్లో  ఎంత  వరకూ  ఉంది?  మన  చేతుల్లో  లేనిదేమిటి? 

మన కర్మ  ప్రభావం  ఏమైనా  ఉంటుందా? విధివ్రాత ఎలా  ఉంటే  అలా  జరుగుతుందంటారు, మరి  విధిని  మార్చుకోగలమా? 

ఈ  మార్పు  ఎక్కడ  ఆగిపోతుంది?  

మార్పుకు,  పరివర్తనకు  ఏమైనా  తేడా  ఉందా? రెండూ  ఒక్కటేనా?  ఇటువంటి  ప్రశ్నలు  నాలాంటివాళ్ళకు  మనలో  కొంతమందికి  కలుగుతూ  ఉండవచ్చు. వీటికి  సమాధానాలు  కనుగొనే  ప్రయత్నం  చేద్దాం.  

మనం  తెలుసుకోవాలనుకుంటున్నది  పైపైన  జరిగే  మార్పు  కాదు,  సమగ్రమైన  మార్పు గురించి  అని  మనం  మరచిపోకూడదు.  పైపైన  కలిగే  మార్పులు, లేక  తెచ్చిపెట్టుకున్న  మార్పులు  తాత్కాలికమైనవి, ఎక్కువ సేపు  నిలబడవు.  ఇంగ్లీషులో  వీటిని  కాస్మెటిక్ ఛేంజె స్ అంటారు.  మన లక్ష్యం  శాశ్వతమైన  మార్పు, దీనిన్నే  మనం  పరివర్తన  అంటాం.  మార్పు  పరివర్తనకు  దారితీయాలి.  స్పష్టంగా  అర్థం  అవ్వాలంటే  పరివర్తన  అంటే  గొంగళి  పురుగు  సీతాకోకచిలుకగా  మారడం, రత్నాకరుడు  అనే  బందిపోటు  వాల్మీకి  మహర్షిగా  మారడం, పశువులా ఉండే  మనిషి,  మానవత్వం  గల  మనిషిగా మార్డం,  ఆ  మనిషి  దైవంగా  మారడం. ఇటువంటి  పరివర్తన  జరగాలంటే  ప్రతినిత్యం  అనేక  దశల్లో  మార్పులు  జరుగుతూనే  ఉండాలి.  సంపూర్ణ  పరివర్తన  కలిగే  వరకూ  ఈ  మార్పులు  సంభవిస్తూనే  ఉంటాయి. దాని  కోసం  మన  వంతు  కృషిని  కొనసాగిస్తూనే  ఉండాలి.  దాన్నే  మనం  సాధన,  తపస్సు  అని  అంటాం. 

ఈ  మార్పు   ఎక్కడినుండి  మొదలవుతుంది? మనం  కోరుకునే  మార్పు  అది  సమాజంలో గాని,  కుటుంబంలో  గాని  మరెక్కడైనా గాని  మొదలవ్వాల్సినది  మనలోనే. ప్రకృతిలో  మారినదేమీ  లేదు, మారేదేదీ లేదు,  అవే  వృక్షాలు,  అదే  గాలి,  అదే  ఆకాశం,  అదే  అగ్ని, అవే  నీళ్ళు. వాటిల్ని  కూడా  మనం  పాడు  చేశాం  తప్ప  ప్రకృతి ఇప్పటికీ  బహుశా  సృష్టి  మొదలైనప్పటి  నుండీ  అలాగే  ఉంది.  మార్పు  రావలసినది  మనిషిలోనే,  కాబట్టి  మార్పు  మనతోనే  ప్రారంభమవ్వాలి. ఇందులో  రెండో  ఆలోచన  లేదు.  

మనం  చెయ్యాల్సింది  ఏమైనా ఉందా?  లేక తనంతతానుగా  జరిగిపోతుందా? సృష్టి  మారుతూ  ఉంది  కాబట్టి,  మనం  కూడా  సృష్టిలో  అవిభాజ్య  భాగాలమే గనుక,    అదే  గతిలో  మనలో  కూడా  మార్పు  అన్ని  స్థాయిల్లోనూ  జరుగుతూ  ఉంటుంది.  మనం  ఏమీ  చెయ్యకపో యినా  కూడా  తనంతతానుగా  జరుగుతూనే  ఉంటుంది. కాని  అదృష్టవశాన  ఈ  మార్పు  సంభవించే  గతిని  పెంచేటువంటి  అవకాశం  మనిషికి  ఉంది.  మనిషిలో  ఉన్న  చతన్యం  అటువంటి  వికసించిన  దశలో  ఉండటం  వల్ల  మానవుడికి  మాత్రమే  ఆ  అవకాశం  ఉంది.  దీనిని  మనం  ఆధ్యాత్మిక  సాధన  ద్వారా, తపస్సు  ద్వారా  ఈ  అవకాశాన్ని  వినియోగించుకోవడం  జరుగుతుంది.  ఆధ్యాత్మిక  సాధన  సహజంగా  ప్రకృతికి  అనుకూలంగా  ఉండటం  వల్ల మానవ  ప్రయత్నానికి  ప్రకృతి  కూడా  సహకరించడం  ప్రారంభిస్తుంది.  ఈ  కారణం  వల్ల  ఆధ్యాత్మిక  సాధన  మనిషిలో  వికాసాన్ని  తీవ్రతరం  చేస్తుంది,  మనిషి  యాత్ర  అత్యున్నత  పరిణామ  దిశలో  వేగంగా  ప్రయాణించే అవకాశం  ఉంది  అది  మనిషి  తన  అనుభవంలో  అనుభూతి  చెందడం  కూడా  జరుగుతుంది.  కాబట్టి  మనం  చెయ్యవలసినదే  ఎక్కువగా  ఉంది  మనం  వికాసంలో.  ఈ  జనన-మరణ  చక్రం  కూడా మనిషికి  తన  వికాసానికి  ప్రకృతి  అందించే  అవకాశాలు  మాత్రమే. అవి  శిక్షలు  కాదు.  జనన-మరణాల మీద  సంపూర్ణంగా  పట్టు  వచ్చే  వరకూ  అవి  తప్పవు.  మార్పు-పరివర్తన ప్రయాణ దిశలో  భాగమే  ఈ  జన-మరణాలు. అందుకే  మనిషి  తన  ప్రయత్నాన్ని  తీవ్రతరం  చేసుకోవలసిన  అవసరం,  వీటి నుండి  బయట  పడి  యాత్రను  కొనసాగించాలంటే.  

ఈ  మార్పు  అలా  ఎంతకాలం  కొనసాగుతూ  ఉంటుంది లేక  కొనసాగుతూ  ఉండాలి? 

ఈ  మార్పు  లేదా  ఈ  వికాసం  జీవుడు  అత్యున్నత  పరిణామ  శిఖరాన్ని  చేరుకొనే  వరకూ  కొనసాగుతూనే  ఉంటుంది,  అనంతంగా. ఈ  మార్పులు  మనలో  అన్ని  స్థాయిల్లోనూ  సహజంగా  సంభవిస్తున్నప్పుడు  మనిషి  మరింత మరింత  పరిశుద్ధంగా  (refinement) మారుతూ  ఉంటాడు.  ఈ  సుద్ధత్వానికి  అంతు  అంటూ  లేదు.  ఇది  అనంత  యాత్ర.  దానితో  మనం  జీవిత6లో సరైన  దశలో  ప్రయాణిస్తున్నామన్న  ఆత్మవిశ్వాసం  కూడా  రోజురోజుకూ  పెరుగుతూ  ఉంటుంది.  ఇది  మనం  ప్రతినిత్యమూ  చూడగలిగేటువంటి  పరిణామం. (సశేషం)   

4 కామెంట్‌లు:

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...