సృష్టి ఆవిర్భవించిన క్షణం నుండీ మారుతూనే ఉంది, విస్తరిస్తూనే ఉంది - స్థూలంగానూ మార్పులు సంభవిస్తున్నాయి, సూక్ష్మంగానూ సంభవిస్తున్నాయి. ఒక ప్రవాహంలా కొనసాగుతూ ఉంటుంది సృష్టి. నదిలో ఒకే రకమైన నీళ్ళల్లో మనం కాళ్ళు కడుగుకోలేమంటారు, ఎందుకంటే నదిలో నీరు ప్రవహిస్తూ ఉండటం వల్ల నీరు మారిపోతూనే ఉంటుంది. అలాగే ఈ శరీరం క్షణభంగురం అంటారు: ఇందులోని కణాల్లో ప్రతీక్షణం మారిపోతూ ఉంటాయి, ఎన్నో కణాలు చనిపోతూ ఉంటాయి, ఎన్నో కొత్త కణాలు పుఫుతూ ఉంటాయి. మనకు పుట్టినప్పుడున్న శరీరానికి ప్రస్తుత శరీరానికీ పోలికే లేదు. ఇది మనుషులకే గాక సమస్త చరాచర వస్తువులన్నిటికీ వర్తిస్తుంది. ఇవి ప్రకృతిలో స్వతఃసిద్ధంగా జరుగుతూ ఉండే మార్పులు; అటువంటి మార్పుల వల్లే ప్రపంచంలో బహుశా జీవం ఉంది, అందం ఉంది, ఉత్సాహం ఉంది. ఇటువంటి మార్పుల వల్లే అన్నీతా వికాసం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మార్పు, అనివార్యము, శాశ్వతము. అది ఆగిపోయినప్పుడు బహుశః ఇక సృష్టి ఉండదేమో. బహుశా మార్పులేని లేక మార్పురహితమైన స్థితికి చేరుకొనే వరకూ ఈ మార్పులు ఈ విధంగా కొనసాగుతూనే ఉంటుంది.
ఇక మనం మనుషుల్లో కలిగే మార్పుల విషయానికొచ్చేద్దాం. పైన ప్రస్తావించినవన్నీ స్వతఃసిద్ధంగా, స్వాభావికంగా, అప్రయత్నంగా, తనంతతానుగా, ఏ సంకల్పం లేకుండా, లేక ప్రకృతి సంకల్పం మేరకు జరుగుతూ ఉండే మార్పులు. వాటిల్లో మనిషి ప్రమేయం లేదు, ఎందుకంటే తాను కూడా ప్రకృతిలోని భాగమే కాబట్టి, ప్రకృతిలో జరిగేవన్నీ కూడా మనిషికి కూడా వర్తిస్తాయి. కాని మనం మాట్లాడుకునే మనిషిలో కలిగే/కలుగవలసిన మార్పు ఏమిటి?
యావత్ ప్రపంచం అంతా కూడా ఆకాశంతో ఎలా నిండి ఉందో, అలాసృష్టి సంస్తం కూడా చైతన్యంతో నిండి ఉంది. అంతటా వ్యాపించి ఉంది. ఈ చైతన్యం అంటే ఏమిటి? చైతన్యం అంటే స్పృహ, ఎరుక, జ్ఞానము, మనిషి ఏదైనా తెలుసుకోగలుగుతున్నాడూ అంటే అది దీని వల్లే. ఈ చైతన్యం సమస్త చరాచర అంటే కదిలేవి, కదిలనివి అన్న్టిల్లోనూ అణువణువునా వ్యాపించి ఉంది. అయితే కదలని వస్తువుల్లో అంటే రాళ్ళల్లోనూ, ఖనిజాల్లోనూ ఇటువంటి వస్తువుల్లో నిద్రాణమై ఉంది. వృక్ష ప్రపంచంలో ఈ చైతన్యం కాస్త మేల్కొన్న స్థితిలో ఉంది; ఇక జంతు ప్రపంచంలో మరికాస్త మేల్కొన్న స్థితిలో ఉంటుంది; మనిషిలో సంపూర్ణంగా మేల్కొన్న స్థితిలో ఉంది వీటితో పోలిస్తే. ఈ మేల్కొని ఉండటం అంటే ఏమిటి వికసించి ఉండటం. మానవేతర వస్తువుల్లో ఉన్న చైతన్యం తమ ఉనికిని కాపాడుకునేంత మేరకు మాత్రమే వికసించి ఉంటుంది. సృష్టిలో జరిగే పరిణామ ప్రక్రియకు కారణం ఈ చైతన్యం. వృక్షప్రపంచంలోనూ, జంతుప్రపంచంలోనూ తమను తాము తెలుసుకునేంతగా ఈ చైతన్య వికాసం జరగలేదు. మనిషిలో మాత్రమే తనను తాను సంపూర్ణంగా తెలుసుకొనే అవకాశం ఉంది.
ఈ చైతన్య వికాసాన్ని బట్టే పరిణామ ప్రక్రియ జరుగుతుందని అనుకున్నాం. ఆ విధంంగా అర్థం చేసుకున్నప్పుడు మనకు శాస్త్రాల్లో చెప్పిన ఈ వాక్యం అర్థంవుతుంది - " ఆత్మ 84 లక్షల యోనుల్లో నుండి ప్రవేశించిన తరువాత గాని మానవ జన్మ సంభవించదు" అంటుంది శాస్త్రం. అంటే ఈ చైతన్య వికాసం జరిగి మానవస్థాయికి చేరుకోవడానికి ఈ పరిణామ క్రమంలో 84 లక్షల జీవరాసుల్లో నుండి ప్రవేశించాలి. అంటే అమీబా వంటి ఏకకణ జీవి నుండి మనిషి వరకూ మన శాస్త్రాల ప్రకారం సుమారు 84 లక్షల రకాల జీవరాసులున్నాయి. ఈ విషయం గనుక మనం అంగీకరించగలిగితే, కేవలం మనిషిగా జన్మించడంతోనే చాలా పెద్ద ప్రయాణం పూర్తి చేసేశాం అని అర్థం, ఈ వికాసపథంలో, ఈ పరిణామక్రమంలో. ఎంత కాలం పట్టిందో కదా!! లెఖ్క కూడా వేయలేము. అందుకే మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనది. చాలా ఉన్నతమైనది అని అంటారు. డార్విన్ పరిణామ సిద్ధాంతం కూడా ఇక్కడితో ఆగిపోతుంది. కాని మానవ జన్మ తరువాత వికాసం ఉండదా? వికాసపథం పరిసమాప్తమైపోతుందా? మానవలోకం తరువాత ఇక లోకాల్లేవా? మానవ లోకానికి అడుగున జంతులోకం, వృక్షలోకం, ఖనిజలోకం ఉన్నట్లుగా మానవ లోకానికి పైన లోకాలేవీ లేవా? ఇక వికాసం ఉండదా? అంటే అది వికాసపథానికే విరుద్ధం; పరిణామ ప్రక్రియకే విరుద్ధం; అది ప్రకృతికే విరుద్ధం.
ఇక్కడ పరమపూజ్య చారీజీ (పార్థసారథి రాజగోపాలాచారి, హార్ట్ఫుల్నెస్ సాంప్రదాయంలోని గురుపరంపరలో మూడవ గురువర్యులు) ఈ సందర్భంలో పలికిన వాక్కులు మనకు చక్కటి వెలుగునిస్తాయి. మనిషి జన్మ వచ్చే వరకూ జరిగే ఈ వికాస యాత్రలో ఆత్మ ప్రమేయం లేకుండా, ఏ ప్రయత్నమూ లేకుండా, తనంతతానుగా సాగుతుంది ఈ ప్రయాణం. మనిషి వరకూ చేసిన యాత్రం ఎంతుందో అంతకంటే ఊహకందనంత యాత్ర మానవ జన్మ తరువాత కూడా ఉంది. వీటినే ఊర్ధ్వలోకాలు అని అంటారు. కాబట్టి మానవజన్మతో ఈ యాత్ర ఆగిపోదు. మానవ జన్మ వరకూ ఆత్మ వివిధ రకాల శరీరాలు ధరించినట్లే, బహుశా ఊర్ధ్వలోకాల్లో ధరించే శరీరాలు వేరుగా ఉండవచ్చునేమో! అంటే వికాసానికి అంతులేదన్నమాట; పరిణామానికి అంతు లేదన్నమాట. అందుకే మన గురువులు మానవజన్మ ప్రయోజనం ఆధ్యాత్మిక పరిణామం అనే చెప్తారు; మనిషి జన్మనెత్తినది వికాసం కోసమే. ఆధ్యాత్మిక పరిణతి కోసమే. అయితే పూజ్య చారీజీ మరొక విషయాన్ని కుడా స్పష్టం చేస్తారు. ఈ వికాసం మానవ జన్మ సంభవించే అంతవరకూ అప్రయత్నంగా జరిగిపోయినా, ఇక నుండి చెయ్యవలసిన ప్రయాణం మాత్రం అంటే మనిషి జన్మ తరువాత మాత్రం ఆ జీవుడికి ఇష్టమైతేనే యాత్ర ముందుకు కొనసాగుతుంది, లేదా జరుగదు. ప్రకృతికి ఇకపై జరిగే యాత్రకు ఇష్టపూర్వకంగా, సంసిద్ధులుగా ఉన్నవారికి మాత్రమే తెరిచి ఉంటుంది ఈ ఊర్ధ్వలోకాల వికాస యాత్ర. అందుకే ఈ హార్ట్ఫుల్నెస్ ఆధ్యాత్మిక ధ్యాన పద్ధతిని అందించిన వ్యవస్థపక గురువులు సమర్థగురు బాబూజీ మహారాజ్, ఈ సాధన ప్రారంభించాలంటే కావలసిన అర్హత మీ సంసిద్ధత మాత్రమేనంటారు. (సశేషం)
Namaskaram
రిప్లయితొలగించండి