మనం ఇంతకు పూర్వం చెప్పుకున్నట్లుగా, మనిషి మారడానికి ఇష్టపడినా, ఇష్టపడకపోయినా కూడా ప్రకృతిపరంగా ఉండే సహజ పరిణామ క్రమంలో మార్పులో పరాకాష్ఠకు చేరుకునే వరకూ సహజసిద్ధంగా మార్పు కొనసాగుతూనే ఉంటుంది. అంటే ప్రకృతిలోని ఇతర జీవరాసుల్లో అప్రయత్నంగా ఏ విధంగా పరిణామక్రమంలో మార్పులు వస్తున్నాయో ఆ విధంగా మనుషుల్లో కూడా వస్తుంది. కాని ఈ మార్పు యొక్క గతి చాలా మెల్లగా ఉంటుంది. అంటే ఉదాహరణకు అమీబా అనే ఏకకణ జీవి మనిషిగా పరిణామం చెందాలంటే కొన్ని లక్షల సంవత్సరాలు పట్టవచ్చు. అలాగే మనిషి తను మారాలనుకున్న స్థితికి ఏ ప్రయత్నమూ లేకుండా మారాలనుకుంటే చాలా సమయం పట్టవచ్చు. మనిషి ఒక్కడే, ఈ జీవి ఒక్కటే తనను తాను తెలుసుకోగలిగే సమర్థత ఉంది కాబట్టి, మార్పు ప్రయత్నం ఉంటే త్వరితంగా జరిగే అవకాశం ఉంది; అదీ అత్యున్నతమైన మార్పు ఒక్క జన్మలోనే సంభవించే మహత్తర అవకాశం ఉంది. లేకపోతే సహజంగా జరిగే పరిణామ క్రమంలో ఎన్ని జన్మమ్లు పడుతుందో చెప్పడానికి లేదు. కాబట్టి ఈ జన్మలోనే మనిషి కాలాన్ని వ్యర్థం చేయకుండా అత్యున్నత చైతన్య స్థితులకు పరిణతి చెందడం చాలా ముఖ్యము, అవసరము కూడా. కాబట్టి మనిషి పుట్టిన ప్రయోజనమే పరిణతి చెందడం. అదే జన్మనెత్తిన ప్రతీ ఆత్మ యొక్క స్వధర్మం. ప్రతీ ఆత్మ పరితపించేది దీని కోసమే. ప్రతీ ఆత్మలో ఉన్న వెలితి ఇదే. ఎంత ధనము, ఎంత జ్ఞానం, ఎన్ని అధికారాలున్నా, భూమ్మీద ఎంత శక్తివంతులుగా చలామణి అవుతున్నా ప్రతీ ఆత్మ లోలోతుల్లో పడే వ్యధ, వేదన దీని కోసమే, ఈ పరిణతి కోసమే. కేవలం ఆ పరిణతి మాత్రమే ఆ దాహాన్ని, ఆ తృష్ణను తీర్చగలిగేది. ఇటువంటి దాహాన్ని, ఇటువంటి ఆధ్యాత్మిక ఆకలిని, ఆధ్యాత్మిక తృష్ణను, తీర్చేదే ఆధ్యాత్మికత లేక ధ్యానం. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
ప్రతి ఆత్మా పరితపించే ఈ ఆధ్యాత్మిక పరిణతిని త్వరితంగా సాధించగలిగేది ఆధ్యాత్మికత ద్వారానే లేక ప్రయత్నపూర్వకంగా చేసే ఈ ధ్యానం ద్వారానే. ప్రకృతి కూడా ఇదే పరిణామ దిశలో ప్రయాణిస్తున్నది కాబట్టి, మనిషి ప్రయత్నపూర్వకంగా చేసే ఈ ప్రయత్నంలో ప్రకృతి సహకారం కూడా తోడవడం ప్రతీ సాధకుడూ గమనించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రకృతి లక్ష్యం కూడా అదే కాబట్టి. అందుకే మహాత్ములందరూ కూడా ప్రకృతితో శృతి కలిగి ఉండమంటారు; ప్రకృతికి విరుద్ధంగా ఉండద్దంటారు. అందుకే మనం ఎంపిక చేసుకునే ఆధ్యాత్మిక ధ్యాన సాధన ప్రకృతితో శృతిలో ఉండె విధంగా జాగ్రత్త పడాలి.
ఇప్పుడు మనం మనిషిలో రావలసిన మార్పును గురించి, కోరుకోవలసిన మార్పులను గురించి, ఆ మార్పు జరగవలసినది ఎక్కడో, ఏ విధంగానో, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మనిషిలో మూడు శరీరాలుంటాయని మనకు ఇప్పటికే తెలుసు - స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. ఇందులో స్థూల శరీరంలో జరిగే మార్పులు ప్రకృతి చూసుకుంటుంది, మనం ఆ భౌతిక శరీరాన్ని పోషించడం తప్ప పెద్దగా చేసేదేమీ ఉండదు. ఇక కారణ శరీరం, అంటే యేది లేకపోతే మిగిలిన రెండు శరీరాలూ ఉండవో, దాన్నే ఆత్మ అంటాం; అది మార్పు లేనిది, అందులో మార్వలసినదేదీ లేదు; ఆత్మ పవిత్రమైనది, శుద్ధమైనది, కాబట్టి ఆత్మలో లేక కారణ శరీరంలో మారేదీ లేదు.
ఇక మిగిలినది ఈ రెండు శరీరాల మధ్య ఉన్న సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరాలు మొత్తం పదిహేనో, పదహారో ఉన్నా మన శాస్త్రాల ప్రకారం, ప్రధానంగా నాలుగున్నాయి - మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం. కాబట్టి మార్పు రావలసినది వీటిల్లో. ఇక్కడ ముఖ్యంగా మనసు, బుద్ధి, అహంకారం మారుతూ ఉన్న కొద్దీ మన చిత్తం లేక చైతన్యం మారుతూ ఉంటుంది. చైతన్యం మారడమే మనిషి మారడం అంటే. మన చైతన్యం ఎలా ఉంటే మన జీవితం అలా ఉంటుంది. తరచి చూస్తే మనిషి జీవితం ఈ మనసు, బుద్ధి అహంకారాల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. వీటి నాణ్యతను బట్టే మన జీవితం యొక్క నాణ్యత కూడా ఉంటుంది. కాబట్టి మనిషి మారాలంటే చైతన్యం మారాలి. అంటే ఈ సూక్ష్మ శరీరాలు మారాలి. ఇవి కనిపించని వస్తువులు. కనిపించని వాటిని మార్చడం ఎలా? ఎలాగైతే వ్యాయామం, యోగాసనాలు, ప్రాణాయామాలు వంటివి చేస్తే భౌతిక శరీరానికి ఏ విధంగా ఆరోగ్యం చేకూరుతుందో, అదే విధంగా ధ్యానం చేసినప్పుడు, ముఖ్యంగా ఈ హార్ట్ఫుల్నెస్ ధ్యాన సాధన చేసినప్పుడు ఈ సూక్ష్మశరీరాలకు ఆరోగ్యం చేకూరడం జరుగుతుంది; సూక్ష్మ శరీరాల శుద్ధి జరుగుతుంది, తద్వారా చైతన్యంలో మార్పులు సహజంగా అప్రయత్నంగా వస్తాయి, ఆలోచనల్లోనూ, చేతల్లోనూ, ప్రవర్తనలోనూ, వ్యక్తిత్వంలోనూ, శీలంలోనూ సహజమైన మార్పులు సంభవిస్తాయి; జీవితం నడవవలసిన సరైన పరిణామ దిశలో నడుస్తుంది. (సశేషం)
నమస్కారం సార్,
రిప్లయితొలగించండిఈ ఆర్టికల్ ద్వారా చాలా సులభంగా మనలో ఉన్న చైతన్యం గురుంచి మరియు శరీరాల ప్రభావం గురించి తెలుసుకోగలిగామ్, అదేవిధంగా మానవ జీవనంలో ధ్యానం యొక్క ఆవశ్యకత అర్థమయింది. మీరు ఇలాగే మాకు ఆర్టికల్స్ షేర్ చేయవలసిందిగా మనవి.
Namaste Brother
రిప్లయితొలగించండిWith this article It is
Simple to know what is life
అబ్యాసీ గా సాదనతో సమకూరు ధర లోన అనే వేమన సూక్తి. మీరు అనుభవించి మాకు అందించే శీర్షికలు మమ్మలను మార్పు దిశగా ప్రేరేపించినది.
రిప్లయితొలగించండిBrother 🙏 namaste chalabaga vrasaru aacharanaki vatchesariki enno sandehaalu brother tq
రిప్లయితొలగించండి