మార్పు - పరివర్తన (భాగం 6)
ఆధ్యాత్మిక పరివర్తన
మనం ఇప్పటి వరకూ చర్చించుకున్నది ఆధ్యాత్మిక మార్పును గురించి, అంతరంగంలో జరుగవలసిన మార్పును గురించి; అదే నిజమైన మార్పు. ఆ మార్పు అనంతంగా కొనసాగుతూనే ఉంటుంది ఇక మార్పుకు అవకాశం లేని స్థితి కలిగే వరకూ; అదే మూలంలో లయమైపోవడం లేక భగవంతునిలో సంపూర్ణ ఐక్యం పొదడం లేక మనిషి పరిపూర్ణత్వాన్ని సాధించడం అంటే. దీన్నే అంతరంగా ప్రవర్తన అని కూడా అనవచ్చు. ఈ సూక్ష్మ శారీరాల్లో పరివర్తన కలగడానికి మనం ఆధ్యాత్మిక సాధన సహాయం తీసుకుంటాం. ముఖ్యంగా హార్ట్ఫుల్నెస్ వంటి సమర్థవంతమైన సాధనను ఆశ్రయిస్తాం.
మార్పు-పరివర్తన
మార్పు అంటే వస్తువులోని అంశాల యొక్క అమరిక మారుతూ ఉండటం; మార్పు అనేది ప్రతీ క్షణమూ జరుగుతూ ఉండేది. పరివర్తన అంటే పూర్వాశ్రమంలోని ఏ పోలికా లేకుండా పూర్తిగా మారిపోవడం. మనం ఇంతకు పూర్వం చెప్పినట్లుగా పరివర్తన అంటే, పురుగు సీతాకోకచిలుకగా పరివర్తన చెందడం; బందిపోటుగా ఉన్న రత్నాకరుడు వాల్మీకి మహర్షిగా పరివర్తన చెందడం. పాశవికంగా ఉండే మానవుడు మానవత్వం గల మానవుడుగానూ మానవత్వం గల మానవుడు దివ్యమానవుడిగా పరివర్తన చెందడమూ అన్నమాట.
శీలపరమైన పరివర్తన
కేవలం ఆధ్యాత్మిక పరివర్తన వస్తే సరిపోదు, అదే అసలైన మార్పు అయినా కూడా. దానికి దీటుగా, తగినట్లుగా, అంతరంగ మార్పుకు అనుగుణంగా బాహ్యమైన శీలమార్పులు జరుగకపోయినట్లయితే అంతరంగంలో జరిగిన ప్రవర్తన నిరర్థకమైపోతుంది. అందుకే ఆధ్యాత్మిక సాధన ద్వారా సంభవిస్తున్న అంతరంగ మార్పులను అప్రమత్తంగా ఉంటూ గమనిస్తూ, దానికి అనుగుణంగా మన ఆలోచనలను, మన చేతలను, మన అలవాట్లను, మన ప్రవర్తనను, వెరసి మన శీలాన్ని గనుక మలచుకోకపోయినట్లయితే సూక్ష్మ శరీరాల్లో సంభవించిన మార్పుల ప్రయోజనం సరిగ్గా చేకూరదు. ఈ అంశం కొంత ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కాని కొంచెం పరికించి చూసినట్లయితే అర్థమవుతుంది. దీపంలో ఉన్న జ్యోతి దేదీప్యమానంగా వెలుగుతున్నా కూడా వెలుతురు బయటకు రాకపోవచ్చు. దీపానికి పట్టే మస్సే దీనికి కారణం. ఈ మస్సి (అంటే సౌశీల్యం లేకపోవడమే) పట్టకుండా ఎప్పటికప్పుడు చూసుకోకపోతే లోపల వెలుగు ఎంత గొప్పగా ఉన్నా అది సరిగ్గా బయటకు రాదు. అదే విధంగా లోపల కలుగుతున్న ఆధ్యాత్మిక ప్రగతికి అనుగుణంగా ఎప్పటికప్పుడు శీలాన్ని తగినట్లుగా సరిదిద్దుకోవడం, మలచుకోవడం చెయ్యవలసినది సాధకుడి బాధ్యత. ఈ విధంగా ఆధ్యాత్మిక వికాసం, శీల వికాసం రెండూ చేదోడు-వాదోడుగా ముందుకు సాగుతూ ఉండాలి. అప్పుడే మనిషిలో సమగ్రమైన పరివర్తన రోజురోజుకూ స్రైన దిశలో కొనసాగుతూ సంతృప్తికరమైన మనుగడను సాగించడం ప్రతీ మనిషికి సాధ్యపడుతుంది.
సౌశీల్యంలో కలుగవలసిన మార్పులకు కొన్ని మార్గాలు
సౌశీల్యాన్ని ఎప్పటికప్పుడు సరిదిద్దుకోవడానికి లేక తగిన విధంగా మలచుకోడానికి చేపట్టవలసిన కొన్ని మార్గాలు:
- ఆదర్శ వ్యక్తిని అనుసరించడం అంటే విధేయతగా ఉంటూ గురువును అనుకరించే/అనుసరించే ప్రయత్నం. వారి అలవాట్లు, వారి ప్రవర్తనను, వారి లక్షణాలను అనుసరించే ప్రయత్నం
- స్వాధ్యాయం అంటే సముచిత గ్రంథాలను చదవడం, తనను తాను సూక్ష్మంగా సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చెయ్యడం
- ఎప్పటికప్పుడు ఆత్మావలోకనం ద్వారా తన ఆలోచనలను, చేతలను, అలవాట్లను, ప్రవర్తనను గమనించుకుంటూ సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉండటం.
- ఇతరుల సేవలో, గురువుల సేవలో కొంతైనా సమయాన్ని వెచ్చించడం.
(సశేషం)
Very thoughtful sir. I'm regularly following your sessions in zoom
రిప్లయితొలగించండిTq brother chala bagavrasaru
రిప్లయితొలగించండిVery nicely explained 👍
రిప్లయితొలగించండి