మార్పు - పరివర్తన (భాగం 4)
మనం ఈ రోజున మరి కొన్ని ప్రశ్నలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
మన చేతుల్లో ఎంత వరకూ ఉంది? మన చేతుల్లో లేనిదేమిటి?
గతం గతః అంటారు. గతించినది మన చేతుల్లో లేదు. కాబట్టి మార్చలేము. భవిష్యత్తు ఇంకా రాలేదు. వర్తమానం మన గతాన్ని బట్టే ఉంది కాబట్టి వర్తమానాన్ని బట్టే మన భవిష్యత్తు ఉండబోతోంది. కాబట్టి మన చేతుల్లో ఉన్నది వర్తమానం, ఇక్కడే-ఇప్పుడే, ఏమి చెయ్యాలన్నా. ఇక్కడ-ఇప్పుడు మనం చెయ్యవలసినది చెయ్యకపోతే గతం యొక్క ప్రభావాన్నే అనుభవిస్తూండటం కొనసాగుతూ ఉంటుంది. Past is a history, Future is a mystery, Today is a Gift, that is why it is called Present. అంటారు ఇంగ్లీషులో. గతం చరిత్ర అయిపోయింది; భవిష్యత్తు చెప్పలేనిది; ఈ రోజు మనకున్న కానుక; అందుకే దీన్ని ఇంగ్లీషులో ప్రెజెంట్ అంటారు. గతం ఇక మన చేతుల్లో లేదు; వెనక్కి వెళ్ళి సరిదిద్దుకోలేము; గతం నుండి కేవలం పాఠాలు నేర్చుకోగలం మళ్ళీ చేసిన పొరపాట్లు చెయ్యకుండా పాఠాలు మాత్రమే నేర్చుకోగలం.
మన కర్మ ప్రభావం ఏమైనా ఉంటుందా? విధివ్రాత ఎలా ఉంటే అలా జరుగుతుందంటారు, మరి మన విధిని మనం మార్చుకోగలమా?
మన విధి అంటే మనం గతంలో చేసుకున్న కర్మే. అదే మన ప్రస్తుతాన్ని శాసించేది స్థూల స్థాయి నుండి సూక్ష్మస్థాయిల వరకూ శాసిస్తూనే ఉంటుంది. దాన్నే కర్మ సిద్ధాంతం లేక ఇంగ్లీషులో కార్మిక్ లా అని అంటారు. ఇది తిరుగులేని సిద్ధాంతం. దీన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు, దేవతలు, మహాపురుషులు, అవతార పురుషులూ కూడా దీనికి అతీతులు కారు. వ్యక్తిగత కర్మ, ఉమ్మడి కర్మను బట్టి కూడా మన జీవితాలు ప్రభావితమవుతూ ఉంటాయి.
అయితే మానవుడిలో సంకల్ప శక్తి (free will) కూడా ఉంది. మన విధి అంటే కర్మ-సంకల్పశక్తుల కలయిక. కాబట్టి కర్మకు సంబంధించినంతవరకూ అనుభవించక తప్పదు. అందుకే విధి ఎలా ఉంటే అలాగే జరుగుతుందంటారు. అలాగే సంకల్పబలం ద్వారా ప్రస్తుతాన్ని సరిదిద్దుకోవచ్చు; కర్మలను చెఱిపేసుకోవచ్చు, కొత్తవి ఏర్పడకుండా చూసుకోవచ్చు. ఆ విధంగా మన విధిని మనమే నిర్మాణం చేసుకోవచ్చు. ఈ సందర్భంలో పూజ్య చారీజీ నాకు వ్రాసిన ఒక లేఖలో విధిని గురించి ప్రశ్నించగా వ్రాసిన సమాధానంగా వ్రాసినది ఈ అవగాహనలో వెలుగునిస్తుందని భావిస్తున్నాను: విధి లేక విధివ్రాత అనేది తమ విధిని మార్చుకోవడానికి ఏ ప్రయత్నమూ చేయనివారికి మాత్రమే వర్తిస్తుంది. ఈ వాక్యం నుండి మనం అనేక విషయాలను అర్థం చేసుకోవచ్చు. దయచేసి ఆలోచించండి.
అయితే మన శాస్త్రాల్లో కర్మను మూడు రకాలుగా వర్ణిస్తారు: 1) ప్రారబ్ధ కర్మ 2) సంచిత కర్మ 3) ఆగామి కర్మ. ఈ మూడూ తేలికగా గుర్తుంచుకోవాలంటే వదిలేసిన బాణం (ప్రారబ్ధం) , చేతిలో ఉన్న బాణం (సంచితం), అమ్ములపొదిలో ఉన్న బాణాలు (ఆగామి) ఇలా గుర్తు పెట్టుకోవచ్చు. 1) ప్రారబ్ధ కర్మ అంటే వదిలేసిన బాణం, తిరిగి రాదు, ఏమీ చెయ్యలేము; దాని పర్యవసానం అనుభవించవలసినదే. 2) సంచిత కర్మ అంటే చేతిలో ఉన్న బాణం ఇంకా వెయ్యలేదు కాబట్టి మన నియంత్రణలోనే ఉన్న కర్మ అన్నమాట. 3) ఆగామి కర్మ అంటే అమ్ములపొదిలోని బాణాలు ఇంకా వెయ్యవలసిన బాణాలు లేక అనుభవించవలసిన కర్మలు. సారాంశం ఏమిటంటే ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ సంచిత ఆగామి కర్మలను నాశనం చేసుకొమ్మని ఆధ్యాత్మికత చెబుతూ ఉన్నది. ఇదెలాగ అనేది ఈ వ్యాసంలో రానున్న భాగాల్లో తెలుసుకుందాం.
ఇక మనిషిలో కలుగవలసిన మార్పును గురించి, కర్మను తొలగించుకోవడం ఎలాగో, వ్యక్తిత్వంలో లేక శీలంలోని మార్పులు ఎలాగో, అసలు మనిషిలో మారవలసినదేమిటో, వ్యక్తిగ్తంగా మారవలసిన అవసరం, ఉమ్మడిగా మారవలసిన అవసరం మొదలగు విషయాలను గురించి రానున్న భాగాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి