ఎందుకో గాని ప్రతి మనిషిలోని అంతరాత్మ, మార్పును కోరుకుంటూ ఉంటుంది; తన చుట్తూ ఉన్నవన్నీ మారాలని, పరిస్థితులు మారాలని, తన కుటుంబ సభ్యులు మారాలని, జనం మారాలని, ప్రభుత్వం మారాలని, తన తోటి ఉద్యోగులు మారాలని, సమాజం మారాలని, వెరసి మనుషులందరూ మారాలని కోరుకుంటూ ఉంటాడు. ఆ మార్పు అనేదేమిటో ప్రత్యేకంగా చెప్పలేకపోయినా కూడా. ఈ ధోరణి చూస్తే 'మార్పు' అంటే ఏదైనా సరే కొంచెం మెరుగు పడటం అని అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా ఏదైనా మెరుగుపడినప్పుడు ఆత్మకు కొంత సుఖం కలుగుతూ ఉంటుంది. అదే సమ్యంలో మరింత మార్పు జరగాలని కూడా తపిస్తూ ఉంటుంది ఈ ఆత్మ.
విచిత్రం ఏమిటంటే, ఆత్మ తాను కూడా మారాలన్న విషయాన్ని ఎందుకో మరచిపోతుంది. ఎపూడూ చుట్టూ ఉన్నవి మారాలనే కోరుకుంటుంది; అది జరగనప్పుడు నిరాశానిస్పృహలతో కొనసాగుతూ ఉంటుందే తప్ప తాను మారాలన్న విషయం తనకు స్పృహలోకి రాదు. ఇందులో సృష్టి రహస్యం ఏమిటో అనిపిస్తుంది.
చాలా మంది మహానుభావులు, మహనీయులు, మహాత్ములు అందరూ కూడా మనిషిలో మార్పు తనతోనే ప్రారంభమవ్వాలి అని చెప్పారు; వాళ్ళు తమ జీవితాల్లో ఆవిష్కరించుకున్నదే తమ జీవన విధానాల ద్వారా మానవాళికి తెలియజేశారు, తెలియజేస్తున్నారు, ఇప్పటికీ.
కాబట్టి మార్పు అంటే అది ఏమైనప్పటికీ ఎప్పుడు వ్యక్తిలో సంభవించే అవకాశం ఉంటుందీ అంటే, ఆ కోరుకుంటున్న మార్పు ఆ వ్యక్తి తనలోనే మొదలవ్వాలనుకున్నప్పుడే జరుగుతుంది. లేకపోతే తనలోనూ మార్పు ఉండదు, చుట్టూ ఉన్న ప్రపంచంలో జరిగే మార్పు కూడా కనిపించదు. ఇది మొదటి సూత్రం.
ఈ సరళమైన హార్ట్ఫుల్నెస్ ఆధ్యాత్మిక పద్ధతిని అవలంబించడం ప్రారంభించాక, మార్పును గురించిన సమగ్ర అవగాహన కొంచెం-కొంచెంగా ఏర్పడటమే గాక గొప్ప ఆత్మ సంతృప్తి కలుగుతోంది. ఆత్మసంతృప్తి కలగడమే మనం సరైన మార్గంలో ముందుకు సాగుతున్నామన్న ఆత్మ-విశ్వాసాన్ని కలిగించేది. మనస్సాక్షి ఎంతో సంతృప్తికరంగా ఉండటం అనుభూతి చెందుతాం. దానికంటే గొప్ప సుఖం మనిషికి అందుబాటులో యేదీ లేదనిపిస్తుంది. మిగిలిన సుఖాలన్నీ ఎన్ని ఉన్నా ఇది లేకపోయినట్లయితే మనిషికి అసలు సుఖం లేనట్లే.
ఎందుకూ అంటే ఈ సాధనను కొనసాగిస్తున్నకొద్దీ, ప్రతినిత్యం అనుష్ఠానం చేస్తూ మనలో వచ్చే మార్పులు గమనిస్తూ ఉంటే కలిగే ఆత్మవిశ్వాసం గాని, గొప్ప సంతుష్ఠి గాని, అంతరంగంలో యేదో తెలియని బలం వృద్ధి అవుతూఁడటం గాని, మనలో తెలియకుండా, అప్రయత్నంగా, మన అలవాట్లలో, మనం స్పందించే విధానాల్లో గాని, మన అవగాహనలో గాని సహజంగా మార్పులు జరుగుతూండటం చూస్తే, ఇదే సరైన జీవన విధానం, ఇదే మనస్సాక్షిని అనుసరించి జీవించవలసిన మార్గం అని మనకు రూఢీగా అర్థమైపోతుంది. మంస్సాక్షిని అనుసరించే ధైర్యాన్ని కోల్పోయిన మనం నెమ్మదిగా మన మనస్సాక్షిని అనుసరించే ధైర్యం రోజురోజుకీ పెరుగుతూ ఉంటుంది. మానసిక ప్రశాంతత పెరుగుతూ ఉంటుంది; ఇంతకు ముందెన్నడూ లేనటువంటి అలౌకిక అంతరంగ సుఖాన్ని అనుభవించడం జరుగుతూ ఉంది. జీవితంలో ఎదురయ్యే కష్టాలను చూసి బెంబేలెత్తిపోకుండా ధైర్యంగా ఎదుర్కొని పరిష్కరించుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. భవసాగరం ఈదడం రోజురోజుకూ తేలికైపోతున్నది. అర్థవంతంగా జీవితాన్ని కొనసాగిస్తున్నామన్న తృప్తి కలుగుతూ ఉన్నది. మనసు రోజురోజుకూ తేలికైపోతుంది; 24 గంటల్లో మనసు చాలా వరకూ ప్రశాంతంగా ఉంటోంంంం దాని వల్ల సరైన నిర్ణయాలను నిర్భయంగా తీసుకోగలగడం జరుగుతూ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే, మాటల్లో వ్యక్తం చేయలేని ప్రయోజనాలు అనేకం కనిపిస్తున్నాయి. ఎవరికి వారు ప్రత్యక్షానుభవం ద్వారా ప్రయత్నించి చూడవలసినదే గాని మాటల్లో చెప్పడానికి లేదు.
అయితే ఈ మార్పును గురించి నాకు కలిగిన ప్రస్తుత అవ్గాహనను ఇక్కడ మీతో పంచుకోవాలనుకుంటున్నాను:
నేనింతకూ పూర్వం చెప్పినట్లుగా, మనిషిలో సమూలమైన మార్పు రావాలంటే మనిషి స్వయంగా తాను మారాలనుకుంటే తప్ప జరగదు. బహుశా ఇది ప్రకృతి నియమం. మనిషికి మారాలని లేకపోతే సాక్షాత్తు భగవంతుడు కూడా నిస్సహాయుడైపోతాడు. కాబట్టి మార్పును కోరుకోపోవడం ప్రకృతివిరుద్ధమైన జీవనం. కాబట్టి ప్రతి మనిషి తన శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని చేసుకోవలసిన సంకల్పం ఇది. ఆ ఉద్దేశ్యం మనిషిలో ఉండటం చాలా అవసరం. ఆ తరువాత ఆ సంకల్పానికి ఒక దిశ ఏర్పరచుకోవాలి. ఆ దిశ ఏర్పరచేదే ఇటువంటి ఆధ్యాత్మిక ధ్యాన పద్ధతి.
మార్పు అనేది ఎప్పుడూ కూడా మన మంచికే. మార్పు అనేది నిత్యనూతనమైనది. మార్పు లేకపోతే జీవితమే లేదు. మార్పు అనేది మన మనుగడకు సంకేతం. మనిషిలోని ప్రతీ అంశంలోనూ మార్పు సంభవిస్తూ ఉండాలి. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో గాని, మనం కూడా ప్రకృతిలోని అవిభాజ్య భాగాలమే కాబట్టి మనిషి ప్రకృతిలో ఎన్నెన్నో మార్పులు జరుగుతూండటం గమనించవచ్చు. మన శరీరంలో గాని, మన మనసులో గాని, బుద్ధిలో గాని, మన అహంకారంలో గాని, అంటే స్థూల సూక్ష్మ శరీరాల్లోనూ, పంచకోశాల్లోనూ, అన్నిటిల్లోనూ మనకు తెలియకుండా ఎన్నెన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. అవన్నీ ప్రకృతి సిద్ధంగా జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులు జరుగకపోయినట్లయితే ఈ ప్రపంచంలో నూతనత్వం గాని, ఎదుగుదల గాని ఉండేది కాదు. (సశేషం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి