మార్పు - పరివర్తన - గురువు (భాగం 9)
3) గురువు
గు అంటే చీకటి లేక అంధకారం; రు అంటే తొలగించి జ్ఞానం అనే వెలుగును నింపేవాడు అని అర్థం. ఇక్కడ చీకటి అంటే అజ్ఞానం, అవిద్య అని చెప్తారు పెద్దలు. ఈ శరీర వ్యవస్థలో అనేకం కనిపిస్తాయి - అవయవాలతో కూడిన శరీరమే గాక, ఇందులో పంచభూతాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకోశాలు, పంచప్రాణాలు, మనసు, బుద్ధి, అహంకారం, చిత్తము వీటన్నిటితో తయారైనది ఈ శరీర వ్యవస్థ. వీటన్నిటికీ కదలికను, ప్రాణాన్ని ఇచ్చేది ఆత్మ. ఆత్మ అనేది వస్తువు కాదు; ఒక ఉనికి. ఈ ఉనికి వ్యక్తమవ్వాలంటే ఈ శరీరం అనే వ్యవస్థ అవసరం. ఆత్మ వ్యక్తమయ్యేందుకు శరీరాన్ని సాధనంగా ఉపయోగిస్తుంది. ఈ శరీర వ్యవస్థ ద్వారా ఈ ఆత్మ పట్టుపురుగులా తన ప్రపంచాన్ని తానే అల్లుకుంటూ (ఆ కక్కూన్ లో) అందులో తానే ఇరుక్కుపోయింది. ఆ కక్కూనే మనం అనుకునే కర్మ/వాసనలు/సంస్కారాలు/మలినాలు, సంక్లిష్టతలు. దీన్నే అజ్ఞానం లేక అంధకారం అని అంటాం. వీటి మూలానే మనిషి జన్మ, మృత్యు, జరా, వ్యాధులను అనుభవిస్తూ ఉన్నాడు; జనన-మరణ వలయంలో ఇరుక్కుని ఉన్నాడు; ఈ జ్ఞానం లేక మరింత ఈ సంస్కారాల ఊబిలో ఇరుక్కుపోతున్నాడు. నిజానికి ప్రతీ ఆత్మ ఈ బంధం నుండి విముక్తి కావాలని పరితపిస్తూ ఉంది. ఈ ఊబిలో నుండి బయటకు లాగి రక్షించేవాడే, ఈ అజ్ఞానం తొలిగే మార్గాన్ని చూపించేవాడే గురువు. ఆదిశంకరులవారు చెప్పినట్లుగా అటువంటి మహాపురుషుడు, సమర్థుడైనటువంటి గురువును పొందడం దుర్లభమే.
అటువంటి సమర్థుడైన గురువును వెదకడం ఎలా?
మన పరిమితమైన జ్ఞానంతో, పరిమితమైన అనుభవంతో, పరిమితమైన తెలివితేటలతో అటువంటి గురువును వెదకలేము, ఊహించలేము, ఊహించినా అది పరిమితమైనదే అవుతుంది. కాబట్టి అటువంటి ప్రయత్నం చేయడం వ్యర్థమే అవుతుంది. మరేం చెయ్యాలి?
ఏ విధంగానైతే నేల విత్తనాన్ని వెతుక్కుంటూ వెళ్ళదో అలాగే జిజ్ఞాసువు, తపించేవాడు గురువును వెతుక్కుంటూ వెళ్ళనవసరం లేదు. విత్తనమే సారవంతమైన నేలను వెతుక్కుంటూ వస్తుంది. నేల సారవంతంగా ఉంటే విత్తనమే నేలను వెతుక్కుంటూ వస్తుంది. నేల సారవంతంగా ఉండేలా చూసుకోవాలి అన్నారు స్వామి వివేకానంద. ఇక్కడ నేల అంటే హృదయం. హృదయం సారవంతంగా ఉండేలా చూసుకోవాలి. హృదయం సారవంతమయ్యేది తపన ద్వారా మాత్రమే. అటువంటి హృదయం కోసం గురువే స్వయంగా వెతుక్కుంంం వస్తాడు. ఆ విధంగా గురువు కోసం లేక మనిషి అస్తిత్వానికి సంబంధించిన ప్రశ్నల సమాధానాల కోసం పరితపించేవాడు ఓపికగా వేచి ఉంటాడు గురువు తటస్థమయ్యే వరకూ.
గురువు తటస్థమైనప్పుడు గుర్తించేదెలా?
అటువంటి గురువు గనుక తటస్థమైనప్పుడు హృదయం వెంటనే గుర్తిస్తుంది; స్పందిస్తుంది; వెంటనే అద్భుతమైన సూచనలు కలుగుతాయి. వాటిని సాధారణంగా తప్పించుకోలేము; నిర్లక్ష్యం చెయ్యలేము. గుర్తించిన మరుక్షణమే వారికి దాసోహమవగలిగేవాళ్ళు పరమ ధన్యులు.
ఇతర మార్గాలు
పైన చెప్పిన మార్గం చాలా సహజమైన మార్గం. హృదయాన్ని వినగలిగేవాళ్లకు ఇది తేలిక. మనలో అత్యధికమంది హృదయాన్ని గాక బుద్ధిని అనుసరించేవారే ఎక్కువగా ఉండేవారికి, హితులు, శ్రేయోభిలాషులు, సూచించినవారిని కొంతకాలం అనుసరించి ప్రత్యక్షానుభవం ద్వారా మీలో మార్పులు వస్తున్నాయో లేదో అన్నది తెలుసుకున్న తరువాత వారిని తమ గురువులుగా స్వ్వెకరించవచ్చు. మహాత్ములు సూచించిన మరో మార్గం: అటువంటి వ్యక్తుల సమక్షంలో కూర్చున్నంత సేపూ మనసు ఆలోచనరహితంగా, నిశ్చలంగా అప్రయత్నంగా మారిపోతుంది; ఒక అలౌకికమైన ఆనందం కలుగుతుంది; హృదయం చాలా తేలికగా అయిపోతుంది. ఇవి మరికొన్ని సంకేతాలు సరైన గురువు సన్నిధికి చేరుకున్నామనడానికి. మరొక సూచన: వారితో సంభాషిస్తున్నప్పుడు గాని లేక సాన్నిధ్యంలో గాని వారి ఉనికి మన అస్తిత్వాన్నే కుదిపేసే విధంగా ఉంటే వెంటనే వారిని మీ గురువుగా భావించండి, మీ అహంకారం అడ్డు వచ్చినా కూడా.
గురువు సంప్రాప్తమైన తరువాత మనం ఏం చెయ్యాలి?
అటువంటి సమర్థ గురువు యొక్క ఆశ్రయం దొరికిందన్న దృఢమైన విశ్వాసం హృదయంలో బలంగా ఏర్పడిన తరువాత మనలను మనం వారితో ఇనుము సంకేళ్ళతో బంధించేసుకోవాలి. ఎప్పటికీ విడదీయరాని విధంగా వారిని కలవాలి. ఆ క్షణం నుండి పరోక్షంగా వారి పట్ల విధేయత ప్రారంభమవ్వాలి. వారు చెప్పింది చెయ్యడానికి అన్ని విధాలా ప్రయత్నించాలి. జిజ్ఞాసతో వేసిన ప్రశ్నలకు సమాధానాలు వెంటనే రాకపోతే వేచి ఉండాలి కాని వెంటనే నిర్ధారణకు రాకూడదు.ఖచ్చితంగా అన్ని ప్రశ్నలకూ సమాధానాలొస్తాయి. క్రమం తప్పక వారు నిర్దేశించిన ధ్యాన పద్ధతిని అనుసరించాలి; వారు నిర్దేశించిన జీవన విధానాన్ని అవలంబించడానికి ప్రయత్నించాలి. వారితో అనుబంధం దినదినప్రవర్ధమానమవ్వాలి. గురువుతో అంటే వారి ఆధ్యాత్మిక గురుతత్త్వంతో తాదాత్మ్యం పూర్తిగా చేమ్దే వరకూ వారిని అనుసరిస్తూనే ఉండాలి. వారిపై ఆధారపడటం రోజురోజుకూ పెరుగుతూ ఉండాలి. గురురేవ పరబ్రహ్మ అని సాక్షాత్కరించుకున్న తరువాత కూడా గురువును వీడరాదు.
గురువు తన శిష్యుడికి ఏ విధంగా తోడ్పడతాడు?
గురువు మన ఆధ్యాత్మిక యాత్రలో ఒక ఉత్ప్రేరకంలా పని చేస్తాడు. గురువు లేనిదే మన ఆధ్యాత్మిక యాత్ర అసంభవం. గురువు శిష్యునికి ఒక రక్షణ కవచంగా వ్యవహరిస్తాడు; గురువు ఒక సజీవ శాస్త్రం; శిష్యునిలో ఉన్న దైవత్వాన్ని వెలికి తీస్తాడు; శీష్యుడి యాత్ర పూర్తయ్యే వరకూ వెన్నంటే ఉంటూ సమ్రక్సిస్తూ ఉంటాడు; శాస్త్ర జ్ఞానం ఇస్తాడు, అనుభూతులనిస్తాడు; ప్రేమగా మారుస్తాడు; పొరపాట్లు చేసినప్పుడు మందలిస్తాడు. సర్వకాల సర్వావస్థల్లోనూ మనకు తెలిసినా తెలియకపోయినా మన యాత్రలో చెయ్యి పట్టుకొని తోడుగా ఉంటాడు. తల్లి, తండ్రి, గురువు, దైవంగా, సాక్షాత్తు పరబ్రహ్మగా మారిపోతాడు.
గురు ఋణం ఎప్పటికైనా తీర్చుకోగలమా?
జన్మనిచ్చిన తల్లి ఋణమైనా తీర్చుకోగలమేమో గాని అటువంటి గురువు యొక్క ఋణం ఏ విధంగానూ తీర్చుకోలేము. ఎన్ని విరాళాలిచ్చినా, ఎంత సేవ చేసినా, ఎన్ని జన్మలు చేసినా ఈ ఋణం తీరేది కాదు. మరేమి చెయ్యగలం? అది కూడా మన గురువులే చెప్పడం జరిగింది. మనం వారికి ఇవ్వగల గురుదక్షిణ మనం మారడమే. మనలో కలిగే పరివర్తనే వారికి అసలైన గురుదక్షిణ. సంపూర్ణంగా వారిలా మారగలిగితే పూర్తిగా ఋణం తీర్చుకున్నట్లనుకోవచ్చు. కాని నిజానికి గురువు ఋణం అప్పటికీ తీరదు. ప్రతీ తండ్రీ తన కొడుకు తన కంటే గొప్పగా ఎదగాలని కోరుకుంటాడు; అలాగే ప్రతీ గురువు తన శిష్యుడు తనను మించి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. అలా ఎదిగినప్పుడు గురువు మనసుకు అసలైన ఆనందాన్ని కలుగజేసినవాడవుతాడు శిష్యుడు.
Thank you sir 🙏
రిప్లయితొలగించండిDhanyavadaamulu 🙏🎁
రిప్లయితొలగించండి