4) స్వాధ్యాయం
పతంజలి యోగసూత్రాల ప్రకారం, కైవల్యప్రాప్తి కోసం అంటే పరమోత్కృష్ఠ యోగస్థితి మానవుడు సిద్ధింపజేసుకోవడం కోసం, అష్టాంగ యోగాన్ని ప్రతిపాదిస్తాడు మహర్షి - యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన సమాధి అనే 8 అంగాలు. దీని ప్రకారం, నియమంలో నాలుగు అంశాలున్నాయి: 1) సంతోషము, 2) తపస్సు, 3) స్వాధ్యాయం 4) ఈశ్వర ప్రణిధానం. ఇందులో స్వాధ్యాయం సాధకుడు అనుసరించవలసిన నియమాల్లో మూడవ నియమం స్వాధ్యాయం.
ప్రాచీన సాంప్రదాయం ప్రకారం స్వాధ్యాయం అంటే స్వ+అధ్యయనం అంటే తనను తాను తెలుసుకొనే ప్రయత్నం, తనను తాను అధ్య్యయనం చేసుకొనే ప్రయత్నం. దేహాత్మను, పరమాత్మను కూడా తెలుసుకొనే ప్రయత్నం చెయ్యడం. ఇందులో భాగంగా శాస్త్రాలు అధ్యయనం చేస్తూంటారు.
హార్ట్ఫుల్నెస్ గురువులు స్వాధ్యాయాన్ని పరికించే విధానం, సూచనలు ఈ విధంగా ఉన్నాయి: స్వాధ్యాయం అంటే సంపూర్ణ స్పృహతో తనను తాను అధ్యయనం చేసుకొనే ప్రక్రియ. వారి ప్రకారం స్వాధ్యాయం అంటే "నేను తప్పనిసరిగా చెయ్యవలసినది" అని అంటారు.
ఆధ్యాత్మిక సాధకులందరూ సమానంగా కోరుకునే లక్ష్యం ఆత్మ-పరివర్తన, స్వీయ పరివర్తన. ఇంచుమించు ఆధ్యాత్మికపథాలన్నీ కూడా గురువు మీద ఆధారపడటమే మార్గంగా బోధిస్తూ ఉంటాయి. కాని పరివర్తన అనేది మరొకరిపై ఆధారపడినంతవరకూ అది అసాధ్యమే. "ఇది నా బాధ్యత" అని కర్తవ్యంగా భావిస్తేనే పరివర్తన సాధ్యపడుతుంది. భగవంతునిపై భారం పెట్టడం కూడా తప్పించుకోవడమే అవుతుందంటారు పూజ్య దాజీ.
అందుకే హార్ట్ఫుల్నెస్ సాధకులకు అంతరంగీకరణ (interiorization) చాలా ముఖ్యం. సాధనలో ముందుకు సాగుతున్న కొద్దీ మనలను మనం పరికించి చూసుకోవాలి; ఆత్మవిమర్శ చేసుకోవాలి; ధ్యానం ద్వారా అందించినదాన్ని విలీనం చేసుకోవాలి; విలీనాకి అడ్డుపడేదాన్ని విశ్లేషించుకోవాలి; అడ్డుపడుతున్న లక్షణాలేమిటి నాలో అని ప్రశ్నించుకోవాలి. ఆత్మవిమర్శ ద్వారానే మనకు మనం ప్రేరణ కావాలి; ఆత్మవిమర్శ ద్వారానే గుర్తించిన మార్పులను ఇష్టపూర్వకంగా మనలో కలిగేలా చూసుకోవాలి. మనలను మనం అధ్యయనం చేసుకోవడంలోని సూక్ష్మాలను గ్రహించగలగాలి. ఎక్కడ పొరపడుతున్నామో మనమే తెలుసుకోవాలి. మనం ఎక్కడ తప్పులు చేస్తున్నామో తెలియడానికి గురువు అవసరం లేదు. అదే స్వాధ్యాయం.
మనం ఇలా ఉండటానికి కారణం మనమేనని మనం గుర్తించాలి; అంగీకరించాలి. మరోలా తయారవ్వాలంటే కూడా మీరే కారణం కాగలరని ఇది ఋజువు చేస్తోంది. అలాగే మనలను మనం మార్చుకోగలిగే సామర్థ్యం కూడా మనలోనే ఉందనడానికి ఇదే ఋజువు. మనిషి జంతువుగా మారగలుగుతున్నాడంటే, జంతువు కూడా తిరిగి మనిషి కాగలదు. కాబట్టి మన ఆధ్యాత్మిక వికాసానికి బాధ్యత కేవలం మనపైనే ఉందని గ్రహించాలి.
సాధన ద్వారా మన ఆలోచనలను, చేతలను, అలవాట్లను, ఉద్వేగాలను, భావాలను, ప్రవర్తనను, శీలాన్ని మనం ప్రత్యక్షంగా చూడగలుగుతాం. మనలో ఉండే భయాలు, చింతలు ఇంకా ఇతర నకారాత్మక విషయాల వల్ల మనలో వత్తిడి ఏర్పడుతుంది. ఆ వత్తిడి మన దవ్డల్లోనూ, మెడలోనూ, భుజాల్లోనూ, నుదుటిపైన, వీపులోనూ, మోకాళ్ళల్లోనూ, ఉదరభాగంలోనూ, ఛాతీలోనూ, నడుంలోనూ ఇలా అనేక చోట్ల పేరుకుపోతూ ఉంటుంది. దీన్ని మనం గమనించడానికి ప్రయత్నించాలి; ఈ వత్తిడికి కారణం ఏమిటో పరిశీలించాలి; హార్ట్ఫుల్నెస్ రిలాక్సేషన్ పద్ధతి ద్వారా ఈ వత్తిడిని తొలగించుకొనే ప్రయత్నం చెయ్యాలి. ఆలోచనలే, చేతలవుతాయి; చేతలే అలవాట్లవుతాయి; అలవాట్లే ప్రవర్తనగా మారుతుంది; ఇదే శీలంగా మారుతుందిమారుతుంది; శీలాన్ని గమనించి స్వరించుకుంటే మన విధిగా మారుతుంది. కాబట్టి స్వాధ్యాయం అనేది ప్రతీ సాధకుడు ప్రయత్నపూర్వకంగా నిత్యమూ ఆచరించవలసిన ప్రక్రియ అను మనం గుర్తుంచుకోవాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి