21, నవంబర్ 2021, ఆదివారం

గీతా హృదయం - అధ్యయనం (క్లుప్తంగా)

                                      

గీతా హృదయం - అధ్యయనం (క్లుప్తంగా)   
 కిరీటి, సవ్యశాచి, విజయుడు, పార్థుడు, గాండీవధారి వంటి అద్భుత పరాక్రమానికి   సంబంధిచిన  బిరుదులు  సంపాదించిన  అర్జునుడు తాను  ధర్మపక్షాన  యుద్ధాన్ని  చేస్తున్నాడన్న  వాస్తవాన్ని  మరచి,  ధర్మానికి  ప్రతినిధిత్వం వహిస్తున్నాడన్న సత్యాన్ని  మరచి, తన  క్షాత్ర ధర్మాన్ని  విస్మరించి, యుద్ధన్ని  వ్యక్తిగతంగా  తీసుకోవడం  వల్ల, ఎదురుగా  కనిపిస్తున్న  బంధుమిత్రజనమే  కనిపించడం వల్ల దుఃఖం చెంది,  ఆ  దుఃఖం శోకంగా  మారి,  శోకం  విషాదంగా మారిపోయి  అంతటి  ధీరుడు  భీరువుగా మారిపోయి  రెండు  సైన్యాలు  యుద్ధసన్నద్ధులై  ఎదురెదురుగా నిలబడిన  క్షణంలో యుద్ధం  చెయ్యనని  నిశ్చయించుకున్న  అర్జునుడిని  మరల తన  కర్తవ్య బోధను చేసి, మళ్ళీ  అతన్ని  ఉత్తిష్ఠుడిని  చేసే ప్రయత్నంలో  పలికిన  భగవానుడి  పలుకులు  ఈ  ఏడు శ్లోకాల్లో  నిక్షిప్తమై  ఉన్నది. ఈ  ఏడు  శ్లోకాల  ద్వారా మనం  ఇప్పుడు  చదువుకుంటున్న  గీతాసారాన్ని  అర్జునుడి  హృదయంలో  నిక్షిప్తం  చేసి  యుద్ధానికి  ఉద్యుక్తుడిని  చేశాడు  భగవానుడు. 

ఈ  ఏడు  శ్లోకాలను  పరిశీలిస్తే, శ్రీకృష్ణుడు  అర్జునుడిలో ఏ  విధంగా  ఆతనిలో వివిధ రకాల  స్థితులను  అనుభవింపజేసి, ఆతని చైతన్యంలో  పరివర్తన  కలిగేలా  చూశాడో అర్థమవుతుంది.   

మొదటి శ్లోకం ద్వారా  అందించిన స్థితి - స్థితప్రజ్ఞత్వం 

రెండవ శ్లోకం ద్వారా  అందించిన స్థితి  - క్రోధం ఎలా ఉద్భవిస్తుంది?

మూడవ శ్లోకం ద్వారా  అందించిన స్థితి  -  క్రోధం ఏ విధంగా మనిషిని  అథోగతిపాలు  చేస్తుంది? 

నాల్గవ శ్లోకం ద్వారా  అందించిన స్థితి - మనోనిగ్రహం ద్వారా మనిషి ఏ విధంగా విముక్తుడవుతాడు?

అయిదవ శ్లోకం ద్వారా  అందించిన స్థితి  - మనశ్శాంతి  లేకుండా  సంతోషం  లేదు. 

ఆరవ శ్లోకం ద్వారా  అందించిన స్థితి  -  పరధర్మం కంటే స్వధర్మమే  మేలు

ఏడవ శ్లోకం ద్వారా  అందించిన స్థితి  - కర్మ చెయ్యకుండా  నైష్కర్మ్య సిద్ధి పొందలేము 

కృంగిపోయిన  అర్జునుడు, ఇలా  ఏడు  రత్నాల  ద్వారా పరివర్తన  చెందిన  చైతన్యంతో,  తిరిగి  తన ధర్మాన్ని  నిర్వర్తించడానికి సిద్ధమవుతాడు. 

భౌతిక ప్రపంచంలో మానవులకు ధర్మాధర్మాల మధ్య యుద్ధం అంతరంగంలో  నిత్యం  జరుగుతూనే  ఉంటుంది. అలాగే  ఆధ్యాత్మిక  సాధకులు  ఆత్మ-అనాత్మ వివేకం  కోసం  నిత్యం  పరితపిస్తూ  ఉంటారు. ఈ  యుద్ధాలన్నీ  హృదయంలోనే  ప్రతీ  మనిషిలోనూ  జరుగుతూ  ఉంటుంది  కాబట్టి శ్రీకృష్ణుడు బోధించినది  అప్పటికీ, ఇప్పటికీ  ఎప్పటికీ  వర్తిస్తుంది. 

కావున  పూజ్య  బాబూజీ  పూజ్య  దాజీ  ద్వారా ఆగష్టు 29, 2021 న  వెల్లడి  చేయించిన  ఈ  గీతాహృదయంలోని  ఈ  ఏడు  రత్నాలను  కేవలం  శ్రవణమే  గాక, మనన, నిధిధ్యాసనల  ద్వారా సాక్షాత్కారింపజేసుకుని  మనందరమూ  మన  జీవితాలను  తరింపజేసుకొనే  ప్రయత్నంలో ఎల్లప్పుడూ  ఉందాం.  

తరువాయి  భాగాల్లో  ఈ  శ్లోకాలను  వివరంగా అధ్యయనం  చేసే  ప్రయత్నం  చేద్దాం. 

(సశేషం) 

1 కామెంట్‌:

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...