సనాతన వేద వాజ్ఞ్మయం
అగ్నిర్మీలే పురోహితం యజ్ఞస్య దేవామృత్త్విజం | హోతారం రత్నధాతమం ||
(ఋగ్వేద మంత్రం 1, 1)
మనందరమూ భారతీయులుగా సనాతన వైదిక ధర్మంలో జన్మించినవారము. మన ప్రతి రక్త కణంలో ఈ వైదిక పరమాణువులు ఏదొక రూపంలో నిద్రాణ స్థితిలో ఉన్నా, కచ్చితంగా అందరిలో ఉన్నాయి. వాటిని బహిర్గతం చేయవలసిన అవసరం ప్రతీ సాధకుడికి ఏదొక దశలో ఏర్పడుతుంది; తెలుసుకోవాలన్న తపన పెరుగుతుంది; తెలుసుకోవలసిన ధర్మం కూడా ఉందని అర్థమవుతుంది. క్లుప్తంగానైనా సరే, అసలు ఈ వేద వాజ్ఞ్మయం అంటే ఏమిటో, ఎంత విస్తృతమైనదో, ఇందులో ఏమేమి గ్రంథాలున్నాయో, శాస్త్రాలున్నాయో, ఇంకా ఇతర వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అంతకంటే ముందు మనకు సనాతన ధర్మం అంటే ఏమిటో తెలియాలి. సనాతన ధర్మం అంటే మానవునికి, మానవ జీవితంలోని ప్రతీ అంశానికీ ఎప్పటికీ వర్తించే ధర్మం. కేవలం భారతీయులకే కాదు, మానవుడు ఎక్కడున్నా వర్తించేటువంటి ధర్మాలు ఇందులో పొందుపరచి ఉన్నాయి. సనాతనంగా అంటే ఎప్పటికీ ఉండే ధర్మం, ఎప్పటికీ వర్తించే ధర్మం. సనాతన ధర్మం.
వేదం అనేది ఒక గ్రంథం కాదు. ఇది ఒక విశాల జ్ఞాన సమూహం. ఈ జ్ఞాన సమూహాన్నే వేదం అంటారు; వేద అంటే జ్ఞానం. ఈ జ్ఞాన సమూహంలో శ్రుతులు, స్మృతులు అని రెండున్నాయి; వేదాన్ని 4 వేదాలుగా విభజించడం జరిగింది - ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వ వేదం; వీటినే శ్రుతులు అని కూడా అంటారు. శ్రుతులు అంటే వినిపించినవి అని అర్థం. వేదములు ఎవరో రచించినవి కావు; అందుకే వాటిని అపౌరుషేయాలు అని కూడా అంటారు. ఇవి మూలాలు వైదిక వాజ్ఞ్మయానికి. వీటి నుండి వెలువడినవి స్మృతులు.
మహర్షులు శృతులుగా శబ్దరూపంగా (శబ్దం అంటే ఆంగ్లంలో వైబ్రేషన్) అందుకున్న ఈ వేదాన్ని మౌఖికంగా గురు-శిష్య పరంపర ద్వారా ఎన్నో శతాబ్దాలు ఒక తరం నుండి మరొక తరానికి అందిస్తూ రావడం జరిగింది. అప్పట్లో వ్రాయడం ఉండేది కాదు. ఆ తరువాత కాలక్రమేణా తాళపత్ర గ్రంథాలపై వ్రాయడం మొదలుపెట్టారు. వాటిని చాలా వరకూ అనేకమంది మన దేశంపై చేసిన దండయాత్రల్లో ధ్వంసం చేయడం జరిగింది. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవి వ్యాస భగవానుడు చేసిన కృషిలో చాలా తక్కువ భాగమే ఉంది, అయినా చాలా ఉన్నట్లుగా మనకనిపిస్తుంది.
అటువంటి వేదం అనే విస్తృత జ్ఞాన సమూహాన్ని శ్రీ కృష్ణ ద్వైపాయన వేదవ్యాస మహర్షి మానవాళి తేలికగా అధ్యయనం చేసుకోగలగడం కోసం, ఈ విధంగా సంకలనం చేయడం, క్రోడీకరించడం, వర్గీకరించడం జరిగింది. వారి అనుపమాన కృషికి, ఊహించలేని కృషికి, అపార కరుణకు, సర్వదా మానవాళి కృతజ్ఞతతో ఉండవలసినదే.
పూజ్య గురుదేవులు దాజీ వేదాలను గురించి ఆంగ్లంలో వ్రాసుకున్న అంశాలు:
Vedas
Who wrote them?
Who received that knowledge?
Can we also receive knowledge in the same way?
That knowledge was actually revealed to the individuals who were pure at heart. They had no iota of ego OR any desire to compete with anyone. They did not care for any recognition. Where 'I' ness is absent, who would write or claim their authorship?
వేదాలు
వాటిని ఎవరు వ్రాసారు?
ఆ జ్ఞానాన్ని ఎవరు అందుకున్నారు?
అదే విధంగా మనం కూడా అందుకోగలమా ?
పవిత్రమైన, స్వచ్ఛమైన హృదయం గలవారికి మాత్రమే ఈ జ్ఞానాన్ని అందజేయబడింది. వాళ్ళకు లేశమాత్రం కూడా అహం లేదు, ఎవరితోనూ పోటీ పడే తత్త్వం లేదు. గుర్తింపు కావాలన్న ఆలోచన లేదు. ఎక్కడా 'నేను' అనే భావమే ఉండదో, అక్కడ కర్తలు తామని వ్రాసుకోవడం గాని, చెప్పుకోవడం ఎవరు చేస్తారు?
వేద వాజ్ఞ్మయం ఈ క్రింది విధంగా ఉంది:
శృతి: వేదం
4 వేదాలు/మూల సంహితలు : ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వవేదము
స్మృతులు: సంహితలు, 108 ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు ఉన్నాయి.
ప్రధాన ఉపనిషత్తులు: అయితరేయ, కౌశిటాకి, ఛాందోగ్య, కేన, బృహదారణ్యక, ఈశ, తైత్రేయ, కఠ, శ్వేతాశ్వతార , మైత్రి, ముండక, మాండూక్య, ప్రశ్న.
ఇతర సంహితలు: అష్టావక్ర సంహిత, భృగు సంహిత, బ్రహ్మ సంహిత, దేవ సంహిత, గార్గి సంహిత, కశ్యప సంహిత, శివ సంహిత, యాజ్ఞవల్క్య సంహిత ఇత్యాదివి కొన్ని ఉదాహరణలు.
4 ఉపవేదాలు - 1) ధనుర్వేదము, 2) గంధర్వవేదము, 3) శిల్పవేదము, 4) ఆయుర్వేదము.
అష్టాదశ పురాణాలు అంటే 18 పురాణాలు; పురాణం అంటే ప్రాచీనమైనది అని అర్థం. అవి ఇలా ఉన్నాయి: 1) బ్రహ్మ పురాణము, 2) విష్ణు పురాణము, 3) శివ పురాణము, 4) గరుఢ పురాణము, 5) దేవీ పురాణము, 6) భాగవత పురాణము, 7) నారద పురాణము 8) వరాహ పురాణము, 9) వామన పురాణము, 10) కూర్మ పురాణము, 11) మృత్యు పురాణము, 12) బ్రహ్మాండ పురాణము 13) బ్రహ్మవైవర్ణ పురాణము, 14) మార్కండేయ పురాణము, 15) భవిష్య పురాణము, 16) లింగ పురాణము, 17) స్కంద పురాణము, 18) అగ్నిపురాణము.
ఇతిహాసాలు: రామాయణం (24000 శ్లోకాలు), మహాభారతం (లక్ష శ్లోకాలు)
6 వేదాంగాలు: 1) శిక్షా 2) కల్ప 3) వ్యాకరణ 4) నిరుక్తం 5) ఛంద 6) జ్యోతిషం
6 షడ్దర్శనాలు: 1) ఉత్తర మీమాంస, 2) న్యాయ, 3) వైశేషిక 4) సాంఖ్య, 5) యోగ, 6) పూర్వ మీమాంస
3 తంత్ర శాస్త్రాలు : శైవ, శాక్త, వైష్ణవ తంత్ర శాస్త్రాలు
ఆగమ శాస్త్రాలు: 1) వైఖానస ఆగమం 2) పాంచరాత్ర ఆగమం
శాస్త్రాలు, సూత్రాలు: ధర్మ శాస్త్ర, అర్థ శాస్త్ర, కామసూత్ర, బ్రహ్మ సూత్ర, సాంఖ్య సూత్ర, మీమాంస సూత్ర, న్యాయ సూత్ర, వైశేషిక సూత్ర, యోగ సూత్ర, ప్రమాణ సూత్ర, చరక సంహిత, శుశ్రుత సంహిత, నాట్య శాస్త్ర, వాస్తు శాస్త్ర, పంచ తంత్ర, దివ్య ప్రబంధ, తిరుమురై, రామచరితమానస్, యోగవాశిష్ఠం, స్వర యోగం, శివ సంహిత, ఘేరండ సంహిత, వంచదశి, వేదాంతసార స్తోత్ర.
వినమ్ర ప్రార్థన
పాఠకులందరూ మన అపార వేద సంపదను గుర్తించి, సమర్థ గురువు యొక్క ఆశ్రయంలో, మార్గదర్శనంలో తగిన విధంగా అన్వయించుకొని కృతార్థులగుదురుగాక!