31, డిసెంబర్ 2025, బుధవారం

2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు

2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు  

సాధకుడికి ప్రతి క్షణమూ ఒక నూతన సంవత్సర ఆరంభమే. ఎందుకంటే సాధకుడు ప్రతీ క్షణమూ దృష్టిలో ఉంచుకుంటూ, యే పని చేసినా, యే సంకల్పాలు చేసుకున్నా, యే ప్రయత్నాలు చేసినా, ఆధ్యాత్మిక వికాస దిశగానే ఉండాలి. మనిషి జీవించే జాగృత, స్వప్న, సుషుప్తి అవస్థల్లో కూడా శారీరక శ్వాసతో పాటు ఆధ్యాత్మిక శ్వాస కూడా కొనసాగాలి. ప్రతీ క్షణమూ మనిషి బాహ్యంగా కూడా అన్నీ విధాలా మరింత మరింత మెరుగైన మానవునిగా తయారయ్యే పనిలో నిమగ్నమవ్వాలి.  

గత సంవత్సరంలో ఆధ్యాత్మికంగా గురుదేవుల నుండి అనేక సత్సంగాలు, అనేక ప్రత్యేక సత్సంగాలు(భండారాల్లో), అనేక ఆధ్యాత్మిక ప్రసంగాలు, పరాశిక్షకుల నుండి అనేక వ్యక్తిగత ధ్యాన సిట్టింగులు, అనేక సందేశాలు, అనేక ప్రత్యేక సమావేశాలు, అనేక చర్చలు, అనేక ఆధ్యాత్మిక గ్రంథాల పఠనం, వ్యక్తిగత సాధన, వలంటీరు సేవ, వృత్తిపరమైన, కుటుంబపరమైన, సామాజిక పరమైన బాధ్యతలు, నిర్వహించి ఉంటాం. చేతనా పరమైన వికాసాన్ని, పురోగతిని సాధించిన అనుభూతిని మనం పొందుతున్నాం. అందుకు 2025 వ సంవత్సరానికి  సర్వదా కృతజ్ఞులమై ఉంటూ, పూజ్య దాజీ 2026 వ సంవత్సరం గడుపవలసిన విధానాన్ని, అనుక్షణం మనసులో ఉంచుకుంటూ, వారి సంకల్పానికి తగినట్లుగా పసిహృదయాన్ని నిలుపుకుంటూ జీవన గమనాన్ని ముందుకు సాగిద్ధాం. 

29, డిసెంబర్ 2025, సోమవారం

మీలోని పసి హృదయాన్ని అలాగే నిలుపుకోండి - పూజ్య దాజీ 2026 నూతన సంవత్సర సందేశం

 


     మీలోని పసి హృదయాన్ని అలాగే నిలుపుకోండి                  పూజ్య దాజీ 2026 నూతన సంవత్సర సందేశం                            పూజ్య బాబూజీ అందించిన విస్పర్శ్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ సందేశ స్ఫూర్తితో 

(పూజ్య దాజీ ఆంగ్ల సందేశానికి తెలుగు అనువాదం)

యహీ దిల్ హై జానమ్, మాసూమియత్ మే ఖోజా తూ 

మీరు గందరగోళంలో పడిపోతే అమాయకంగా మారిపోండి. ఆత్మ ఎక్కడ నివసిస్తుందో అదే హృదయం. ప్రియతమలారా, మిమ్మల్ని మీరు సరళత్వంలోకి సాగిపోనివ్వండి. 

ప్రియమైన సోదరసోదరీమణుల్లారా, 

మనం 2026 వ సంవత్సరంలోకి సమీపిస్తున్న తరుణంలో మీ అందరూ మన మాస్టర్లు ఎప్పుడూ చెప్తూ ఉండే, మీ పసి హృదయాన్నిఅలాగే నిలుపుకోండి అనే సందేశాన్ని కాస్త ఆగి మననం చేసుకోవాలని కోరుతున్నాను. సరళమైన ఈ ఒక్క మార్గదర్శక సూచన మొత్తం ఆధ్యాత్మిక జీవనానికి కీలకమైనది. కానీ ఈ పాఠం, ఎప్పుడూ కంటే ఇప్పుడు ఎందుకు ముఖ్యమో, మన జాతి అత్యున్నత ఆశయానికి ఎందుకు కీలకమైనదో మీతో పంచుకోదలచుకున్నాను.    

ఈ లోకమంతా ఒకే కుటుంబం లేక వసుధైవ కుటుంబకం అంటారు. ఇది మన ప్రాచీన భారత మాత సందేశం.  మనకీ పలుకులు పలకడం అంటే గర్వపడుతూ ఉంటాం. పలు దేశాలు ఒకచోట సమావేశమైనప్పుడు ఈ సందేశాన్ని తలచుకుంటూ ఉంటాం. కాని ఇక్కడ మనం కాస్త ఆగి ప్రశ్నించుకోవలసిన ప్రశ్న ఒకటుంది: ఇది మన ఇళ్ళల్లోనే సాధించుకోలేనప్పుడు, ఇక ప్రపంచంలో సాధ్యపడే అవకశశాం ఉందా అని?

మీ కుటుంబాన్ని గరించే ఆలోచించండి. ముగ్గురో, నలుగురో లేక అంతా కంటే ఎక్కువో ఉన్నారనుకుందాం. ఈ చిన్న కుటుంబంలోనే మీరు బాగా ప్రేమించే వ్యక్తిని గమనించగలుగుతున్నారా? అవతలి వ్యక్తి ఎలా ప్రవర్తించాడో లేక ఎలా ప్రవర్తించలేదో, మీ మనసులో లెక్కలు వేసుకుంటున్నారా? "ఫలానా ఆవిడ నన్ను 2019 లో ఇలా అంది." "నా త్యాగానికి అతనెప్పుడూ విలువ ఇవ్వలేదు."  "నేను చేసిన పనిని ఎప్పుడూ మెచ్చుకోరు."  కొన్నిసార్లు ఇలాటి లెక్కలు మన మనసుల్లో తెలియకుండానే వేసుకుంటూ ఉంటాం. ఇలా మనం మనసుల్లో లెక్కలేసుకుంటున్నంత కాలం, వసుధైవ  కుటుంబకం అనేది ఒక అందమైన వాక్యంగానే మిగిలిపోతుంది. 

ఇప్పుడొక పసిమనసును చూడండి. పసిమనసు సంపూర్ణంగా ఉంటుంది. వాళ్ళు నీళ్ళల్లో ఆడుకుంటున్నప్పుడు హైడ్రోజెన్ గురించి. ఆక్సిజన్ గురించి ఆలోచించరు; హాయిగా ఆడుకుంటారంతే. షరతులుండవు, హద్దులుండవు, ప్రేమించే సమయంలో పాత జ్ఞాపకాలుంచుకోరు.  పసిపిల్లలు "నువ్వు ఇలా ఉంటేనే ప్రేమిస్తాను" అని షరతులు పెట్టరు. నిన్న తగిలిన దెబ్బలు గుర్తుంచుకోరు. పసి హృదయం అంటే ఇబ్బందులకు దూరంగా ఉండేది, జీవితంలో కష్టాల నుండి క్షేమగా ఉండేది. కుటుంబాన్ని నిజంగా కుటుంబంగా మార్చేది ఈ హృదయమే; ఆ కుటుంబం చిన్నది కావచ్చు లేక ప్రపంచమంతా ఆవరించి ఉండవచ్చు. 

ఆత్మ యొక్క సింహాసనం 

ఆత్మ నివసించేది ఈ హృదయమేనని మన మాస్టర్లు గుర్తు చేస్తూ ఉంటారు; అన్నిటికీ అతీతంగా ఎదగాలన్న ఆకాంక్షతో ఉన్న జీవుడి తత్త్వసారం  ఈ హృదయం. విషయం అంతా ఈ స్థాయిలోనే ఉంది. మనం ఏమి సాధించామన్నది కాదు, మనం ఎంత ఆధ్యాత్మికంగా కనిపిస్తున్నామన్నది కాదు, ఎంత కాలం ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని అనుసరించామన్నది కాదు. మన హృదయాలు ఎంత స్వచ్ఛంగా, ఎంత సరళంగా, ఎంత పసితనంతో నిండి ఉన్నాయన్నదే ముఖ్యం. 

పసివాడు నేర్పించకుండా ఎలా తెలుసుకుంటాడు ? 

సాధారణమైనవాటిని చూసి ఆశ్చర్యపోవడం. నిదర్శనాలు అడుగకుండా నమ్మగలగడం. మనసులో లెక్కలలేకుండా ప్రేమించగలగడం. వ్యూహాల్లేకుండా ఉండగలగడం. జ్ఞాపకం పెట్టుకోకుండా క్షమించగలగడం. యేమీ ఆశించకుండా ఇవ్వగలగడం. 

ఈ జాబితాని జాగ్రత్తగా పరిశీలించండి. వసుధైవ కుటుంబకం అనేది మన నుండి ఆశించేది సరిగ్గా ఇదే కదా? తత్త్వశాస్త్రాల నుండి, క్రమశిక్షణ ద్వారా మనం నేర్చుకోవాలని చేస్తున్న కృషి వీటి కోసమే కదా? 

కాఠిన్యం మనం పోగొట్టుకోవాలి 

జీవితం మనలను కఠినంగా తయారు చేస్తుంది. నిరాశలు  హృదయాన్ని కఠినంగా చేస్తాయి. బాధ్యతలు కావచాలుగా  మారతాయి. చివరికి ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం చేసే సాధన కూడా, సమర్పణకు గాకుండా ఆర్జించడం కోసం చేస్తే అది కూడా ఏర్పడే కాఠినయానికి కారణం అవుతుంది. నెమ్మదిగా, తెలియకుండా మనం మనసుల్లో లెక్కలు వేసుకోవడం ప్రారంభిస్తాం. అర్థం చేసుకోని జీవిత భాగస్వామి. ఫోన్ కాల చేయని సంతానం. నిరాకరించిన తల్లిదండ్రులు. సహకరించని తోబుట్టువు. మనసులో పడే ఉద్వేగపరమైన ప్రతీ లెక్క, మనం బాగా ప్రేమించే వ్యక్తులకు మనకు మధ్య ఏర్పడే అడ్డుగోడలో ఒక్కో ఇటుకలా పని చేస్తుంది. 

నలుగురే ఉన్న మన ఈ చిన్న కుటుంబంలోనే ఈ అవరోధాలను తొలగించుకోలేకపోతే, దేశాల మధ్య, మతాల మధ్య, జాతుల మధ్య ఉన్న హద్దులను చెరపగలిగే పరిస్థితి ఎక్కడుంటుంది? 

2026 లోని రహస్యం 

2026 అందించే రహస్యం ఇదే: భగవంతుడిని సమీపించేది ఆధ్యాత్మికానుభవాలను వెంట పడటమూ కాదు లేక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బాగా ప్రోగుచేసుకోవడమూ కాదు. పసి హృదయాల్లా తయారవడం మార్గం. ఒక పువ్వుని ఆశ్చర్యంగా చూడటం; సిగ్గు పడకుండా ఏడవగలగడం; కారణం లేకుండా నవ్వగలగడం; భయం లేకుండా ప్రేమించగలగడం; మనసులో లెక్కల్లేకుండా క్షమించగలగడం. 

భగవంతునితో అనుసంధానం సాధ్యం చేసే హృదయమే, మనలను పరస్పరం కలుపుతుంది. భగవంతునితో అనుసంధానమవడానికి, ఒక హృదయం, కుటుంబంతో కలవడానికి మరో హృదయం అని రెండు హృదయాలు అవసరం లేదు. కావలసినది ఒక్కటే హృదయం, అది - పసి హృదయం. 

ప్రపంచం ఎదగమంటుంది; గంభీరంగా ఉండమంటుంది; నిన్ను నివ్వు కాపాడుకో అంటుంది; ఆధ్యాత్మిక ప్రగతిని కొలుచుకోమంటుంది. కానీ మాస్టర్లు మరోలా మాట్లాడుతున్నారు: "పసి పిల్లల్లా తయారవ్వండి" ; "మూలానికి తిరుగు ప్రయాణం చేసి, తాజా జీవితాన్ని పొందండి" అంటారు. "ప్రతీదీ హృదయంపై ఆధారపడుంది" అంటారు మాస్టర్లు. 

ఈ సంవత్సరంలో మీరు చేయడానికొక అభ్యాసం 

ఈ సంవత్సరాన్ని మీలోని పసివాళ్ళ స్వభావాన్ని పునరుద్ధరించుకోవడం ద్వారా మీ ఇంట్లో ప్రారంభించండి. మీరు ధ్యానానికి కూర్చున్నప్పుడు, ఖాళీ చేతులతోనూ, తెరచిన హృదయంతోనూ, రండి; ఒక పసివాడు తన తల్లిదండ్రుల వద్దకు యే లెక్కలూ, అజెండా లేకుండా వచ్చినట్లు రండి. ధ్యానం నుండి లేచిన తరువాత అదే హృదయంతో బ్రేక్ ఫాస్ట్ చేయండి, మీ భాగస్వామి వద్దకు వెళ్ళండి; మీ పిల్లల వద్దకు వెళ్ళండి; మీ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళండి. 

ఎవరు ఏమి అన్నారో వాటిని మనసులో పెట్టుకోకండి. గతంలో ఎవరైనా బాధ పెట్టుమటే మనసులో నుండి తీసేయండి. మీరు ఆశించినట్లుగా ఉండటం వల్ల ఇతరులు మీ ప్రేమను పొందాలని అనుకోవద్దు. 

ఇతరులకు సేవ చేసేటప్పుడు, పిల్లలు తమ ఆటబొమ్మలను మనకు చూపిస్తూ ఆనందిస్తున్నట్లుగా సేవ చేయండి; పేరు కోసం కానీ గుర్తింపు కోసం గాని చేయకుండా కేవలం పంచుకోవడం అనే ఆనందం కోసం సేవ చేయండి. సంబంధాల్లో ఇబ్బందులొచ్చినప్పుడు చిన పిల్లవాడు నమ్మినట్లు నమ్మండి; అవతలి వ్యక్తి అర్హుడని కాదు, అందుకు ఋజువులున్నాయని కాదు; నమ్మాడమే మీ స్వభావం కాబట్టి, మీ హృదయంలో అస్సలు అనుమానం గూడు కట్టుకోలేదు కాబట్టి. 

పరివర్తనా తరంగం 

ఇది గనుక మనం చేయగలిగితే అసాధారణమైనది జరుగుతుంది. మనింట్లో మొదలైన వసుధైవ కుటుంబకం బయటకు ప్రసరించడం ప్రారంభమవుతుంది. మనసుల్లో లెక్కలేసుకోని కుటుంబం లెక్కలేసుకోని సమాజంగా తయారవుతుంది. బేషరతుగా ప్రేమించగలిగే సమాజం బేషరతుగా ప్రేమించే జాతికి బీజం అవుతుంది. నిజంగా ఒక్క కుటుంబంలా తయారైన దేశం, అప్పుడు ప్రపంచాన్ని కూడా ఒక్క కుటుంబంగా ఉండాలన్న ఆహ్వానాన్ని త్రికరణ శుద్ధిగా ఇవ్వగలుగుతుంది. 

పరివర్తన ఎక్కడో అక్కడ ప్రారంభమవ్వాలి. అది మీ హృదయంలో ప్రారంభం కానివ్వండి. మీ ఇంట్లో మొదలు కానివ్వండి. ఈ సంవత్సరం ప్రారంభం కానివ్వండి. 

ఈ సందేశానికి స్ఫూర్తినిచ్చిన విస్పర్ సందేశం 

ఈ భావాలను నాలో ప్రేరణ కలిగించిన, బాబూజీ దివ్యలోకం నుండి అందించిన సందేశాల్లో ఒక సందేశం పరిశీలిద్దాం. 

సోమవారం, అక్టోబర్ 18, 2004 - ఊయదయం 10:00 గంటలు 

"నీకు హాని కలుగకుండా క్షేమంగా ఉంచిన నీ పసి హృదయాన్ని నిలుపుకో. ఈ విషయాన్ని మన సోదరులందరికీ ప్రతీ ఒక్కరికీ చెప్పవచ్చు: ఈ ఆత్మ నివాసం ఉండేది ఈ హృదయంలోనే. అన్నిటికీ అతీతంగా ఉండే పరిస్థితిని తీవ్రంగా అన్వేషించే జీవుడి యదార్థ తత్త్వం ఇదే. ప్రతీదీ ఆధారపడున్నది ఈ స్థాయిలోనే. పసిపిల్లల్లా ఉండండి. జీవితం మిమ్మల్ని కఠినంగా తయారు చేసి, మూలానికి దూరం చేసి ఉంటే, తిరిగి మళ్ళీ పునరుద్ధరణ జరిగేది ఈ పసి హృదయం ద్వారానే. అసలైన విషయం మీద మీరు మీ దృష్టిని సారించడానికి సహకరించడమే ఈ ఆధ్యాత్మిక యాత్ర యొక్క లక్ష్యం. 

"నీలో ఈ అవసరాన్ని నువ్వు అనుభూతి చెందుతున్నావు. నీ ప్రాపంచిక జీవనం నీకు సంతోషం కలిగించవచ్చు, కానీ నీలో యేదో శూన్యత కలిగించవచ్చు కూడా, యేదో లేని వెలితి అనుభూతి చెందుతారు. కానీ అంతులేకుండా చేసే సాధన ఆ దివ్యత్వంతో ఏకమైపోవాలన్న తీవ్ర తపన మరింత మరింత ఎక్కువగా ఉపరితలంపైకి వాస్తు ఉంటుంది. సుదీర్ఘ అన్వేషణ యొక్క చరమాంకం ఇదే, తిరుగాడుతూ ఉండగా అన్వేషకునికి సత్యము దర్శనం ఇస్తుంది. 

"ఈ రంగంలో ప్రతీదీ చాలా తేలిక: నువ్వు చేయవలసినదల్లా కావాలనుకోవడం, సరైన విధంగా సాధన చేయడం, సమస్యలతో నిండిన నకిలీ జీవితం వల్ల నిజమైన గమ్యానికి దూరంగా ఉంచడంలో   హక్కులను కోల్పోయినప్పుడు పోగొట్టుకున్న వివేకాన్ని గుర్తుంచుకోవడం."

మనం మరచిపోయిన సరళత్వం  

ప్రతీ విషయం చాలా తేలికంటున్నారు బాబూజీ. కావాలనుకోవడం, సరిగ్గా సాధన చేయడం, కోల్పోయిన వివేకాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం, ఇంతే మనకు కావలసినది. ఇక్కడ వివేకం అంటే పసివాడి వివేకం; లెక్కలేసుకోకుండా ప్రేమించడం; గుర్తుంచుకోకుండా క్షమించగలగడం; యేమీ ఆశించకుండా ఇవ్వగలగడం.  ఇటువంటి వివేకం వసుధైవ కుటుంబకం అనేది సాధ్యపడేలా చేస్తుంది. మనం యే హరదాయంతో జన్మించామో అక్కడే ఈ వివేకం ఉంది; దాన్ని మరలా ఇప్పుడు స్వాధీనం చేసుకోవాలనుకోవచ్చు. 

ఈ 2026 వ సంవత్సరం మిమ్మల్ని మీరు మరలా సరళంగా తయారయ్యేలా అనుకూలించనివ్వండి. ఈ సంవత్సరం మీరు హాయిగా నవ్వగలగాలి, స్వేచ్ఛగా ఏడవగలగాలి, ఎల్లల్లేకుండా ప్రేమించగలగాలి, ప్రగాఢంగా నమ్మగలగాలి. ఈ సంవత్సరం మీరు బాగా ప్రేమించేవారి పట్ల, బహుశా కొన్ని దశాబ్దాలు  మనసులో ఏర్పరచుకున్న లెక్కలను కాల్చివేయండి. ఈ సంవత్సరం ఎలా ఉండాలంటే, సాధన చేసేది యేదో సాధించాలని కాకుండా, అంతరంగంలో ఎప్పుడూ ఉన్న, ఎప్పుడూ వదిలిపెట్టని ఆ దివ్యమైన పసివాడిని తిరిగి కనుగొనాలని చేయడం. ఆ పసిహృదయం అక్కడే కనుగొనబడాలని, ఆదరించబడాలని, గౌరవించబడాలని,  జీవించాలని వేచి ఉన్నది. 

ఒకే గమ్యం, ఒకే హృదయం

మీరు తపిస్తున్న యోగస్థితి,  మీరు ప్రార్థిస్తున్న లయావస్థ, మీరు అభ్యాసం చేస్తున్న అతీత స్థితి, అన్నీ ఈ పసి హృదయంలో దాగి ఉన్నాయి. అలాగే వసుధైవ  కుటుంబకంలో కూడా దాగి ఉన్నాయి. ఈ రెండూ రెండు గమ్యాలు కావు. రెండూ ఒక్కటే. దివ్యత్వంలో లయమవగలిగే హృదయం కుటుంబంలో కూడా లయమవగలదు. భగవంతుని పట్ల ఎటువంటి లెక్కలు ఉంచుకోని హృదయం, జీవిత భాగస్వామి పట్ల, సంతానం పట్ల, తోబుట్టువుల పట్ల, తల్లిదండ్రుల పట్ల ఎటువంటి లెక్కలూ ఉంచుకోదు. 

ఆ పసి హృదయం మీరే. ఎప్పుడూ అలాగే ఉన్నారు. ఎప్పటికీ అలాగే ఉంటారు కూడా. 

హ్యాపీ న్యూ ఇయర్ 2026!

ప్రియతమలారా, ఎక్కడ గందరగోళంగా ఉంటుందో, అక్కడ అమాయకంగా మారిపోదాం. 

యహీ దిల్ హై జానమ్, మాసూమియత్ మే ఖోజా తూ 

పూజ్య దాజీ ఇచ్చిన ఆంగ్ల సందేశం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 


22, డిసెంబర్ 2025, సోమవారం

ప్రపంచ ధ్యాన దినోత్సవంలో హార్ట్హుల్నెస్ గిన్నిస్ బుక్ రికార్డ్


ప్రపంచ ధ్యాన దినోత్సవంలో  
హార్ట్హుల్నెస్  గిన్నిస్ బుక్ రికార్డ్ 

ఐక్య రాజ్య సమితి గత సంవత్సరం ప్రకటించినట్లుగా డిశంబర్ 21, 2025 న రెండవ ప్రపంచ ధ్యాన దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా హార్ట్ఫుల్నెస్  సంస్థ ఆన్ లైన్ లో,  ధ్యానం నిర్వహించడం జరిగింది. ఈ ధ్యానాన్ని సంస్థ అధ్యక్షులు పూజ్య దాజీ రాత్రి 8 గంటలకు నిర్వహించడం జరిగింది. ఇందులో 3,57,655 మంది పాల్గొనడం జరిగింది. 20 లక్షల మందిని   పైగా ఆహ్వానించడం జరిగింది ఈ బృహత్ కార్యాన్ని 160 దేశాల్లోని సంస్థ వాలంటీర్లందరూ చేసిన కృషి, దాజీ అనుగ్రహం. 

గత సంవత్సరం ఆర్ట్ ఆఫ్ లివ్వింగ్ సంస్థ 3.44 లక్షల మంది ధ్యానంలో పాల్గొనడం జరిగింది. ఈ సంవత్సరం హార్ట్ఫుల్నెస్ 3.57 లక్షల మంది పాల్గొనడం చేత హార్ట్ఫుల్నెస్ సంస్థ గత సంవత్సరం ఆర్ట్ ఆఫ్ లివ్వింగ్  వారు ఏర్పరచుకున్న గిన్నీస్ బుక్ రికార్డును మించి కొత్త రికార్డును స్థాపించడం జరిగింది. 

పైన చిత్రాల్లో గిన్నీస్ రికార్డ్ సర్టిఫికేట్, పూజ్య దాజీ ధన్యవాదాలు చెప్తున్న చిత్రాలు. 

ఇది రికార్డు స్థాపించడం, స్థాపించకపోవడం కంటే కూడా సమిష్ఠి చేతనలో, సంవత్సర-సంవత్సరానికీ  ధ్యానం యొక్క ప్రాముఖ్యత పెరుగుతూ ఉన్నట్లుగా కనిపిస్తున్నది. అంతా కంటే ముఖ్యం ప్రపంచంలో ఇటువంటి ధ్యాన యజ్ఞం వల్ల, ఇంత మంది, భూమ్మీద శాంతి-సామరస్యాల కోసమన్న ఒకే ఆలోచనతో, ఒకే సంకల్పంతో ధ్యానించినందువల్ల భూమి చుట్టూ ఒక సూక్ష్మ వెలుగుతో కూడిన వాతావరణం ఏర్పడి మానవాళి పరివర్తనకు దోహద పడే అవకాశం ఉంటుంది. దీని ప్రభావం రానున్న రోజుల్లో గమనించవచ్చు. 

ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని ప్రకటించిన  ఐక్యరాజ్య సమితికి, ఇటువంటి  మహత్తర ధ్యాన యజ్ఞాన్ని తలపెట్టిన పూజ్య దాజీ సంకల్పానికి, దానికి కృషి చేసిన సంస్థ వలంటీర్లకు, ఆన్ లైన్ ధ్యానంలో పాల్గొన్న ధ్యానాభిలాషులకు కృతజ్ఞతలు. 

ఇది కేవలం ధ్యాన యాత్రలో ఆరంభం మాత్రమే. ఆశక్తీ కొనసాగించదాలచుకున్న వారు దయచేసి సమీప హార్ట్ఫుల్నెస్ కేంద్రాన్ని గాని, హార్ట్ఫుల్నెస్ ధ్యాన శిక్షకులను సంప్రదించి సాధన ప్రారంభించాలని ప్రార్థన. 

20, డిసెంబర్ 2025, శనివారం

పూజ్య చారీజీ స్మృతిలో ...

 


పూజ్య చారీజీ స్మృతిలో ... 

పరమపూజ్య పార్థసారథి రాజగోపాలాచారీజీ, ఆరడుగుల ఆజానుబాహుడు; ఒక దివ్య పురుషుడు; వారిలో దివ్యత్వం కాదు, దివ్యత్వంలోనే వారున్నట్లుగా దేదీప్యమానంగా మయిమరపించే చిరునవ్వుతో ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉండేవారు. వారి కంఠస్వరం గంభీరంగా, సింహగర్జనలా ఉండేది. వారు మాట్లాడిన విషయం ప్రతీ హృదయంలోనూ చొచ్చుకుపోయి తన పని పూర్త చేసేది; వారు మాట్లాడే భాష అర్థంకాని వారి హృదయంలో కూడా చోటు చేసుకుని వారికి అందవలసిన సందేశం అర్థమయ్యేట్లుగా ఉండేది. మా అమ్మమ్మగారు, ఇంగ్లీషు అస్సలు అర్థంకాని  మనిషి, చారీజీని ఎప్పుడూ చూడని మనిషి, ధ్యానం అంటే అవగాహన లేని 80 సంవత్సరాల వృద్ధురాలు, "ఒరేయ్ ఆయన క్యాసెట్ పెట్టరా, ఆయన కంఠస్వరం బాగుంటుంది.. "అంటూ వారి ఆంగ్ల ప్రసంగాలు వింటూండేవారు. అదీ చారీజీ ప్రభావం. 

వారిని 1990 లో మొట్టమొదటిసారి చూడక ముందు, నాలో వేల సంఖ్యలో ప్రశ్నలతో వేధింపబడుతూ ఉండేవాడిని; వారిని మొట్టమొదటిసారిగా దర్శించిన వెంటనే నాలో అన్ని ప్రశ్నలకూ ఒకేసారి సమాధానం దొరికినట్లు, అపూర్వమైన శాంతిని అనుభూతిని పొందాను. ఆ క్షణమే నాకు తెలియకుండానే ఇక వీరితోనే నా జీవితం అన్న దృఢసంకల్పం జరిగిపోయింది. ఆ తరువాత ఇక వెనక్కి తిరిగి చూసింది లేదు. బహుశా ఇటువంటి అనుభూతే చాలా మంది సాధకులకు కూడా కలిగి ఉంటుందని నా ప్రగాఢ విశ్వాసం. ఈ జనారణ్యంలో సరైన గురువును కనుగొన్న మధురాతి మధుర క్షణం అది. 

బాబూజీని ప్రత్యక్షంగా చూడని అభ్యాసులకు ఆ వెలితిని పూజ్య చారీజీ తన జీవన శైలి ద్వారా, బాబూజీ బోధల ద్వారా, బాబూజీ ఛలోక్తుల ద్వారా, అఅబూజీ అద్భుతమైన హావభావ అనుకరణాల ద్వారా, పూడ్చఏవయారు; సాక్షాత్తు బాబూజీనే దర్శింపజేసేవారు.  ఆయన పలికిన ప్రతీ వాక్యంలోనూ బాబూజే అన్న పదం తప్పనిసరిగా ఉండేది. సరిగ్గా బాబూజీ కూడా లాలజీని ఇలాగే స్మరిస్తూండేవారట. ఇది కూడా చారీజీ ద్వారానే తెలిసింది. ఆ విధంగా బాబూజీ యొక్క సరళత్వం, స్వచ్ఛత యొక్క ప్రస్తుత అభ్యాసులకు అనుభూతి కలిగేది. తద్వారా పూజ్య చారీజీ అభ్యాసుల హృదయాలలో నిర్మించవలసిన ఆధ్యాత్మిక సౌధాలకు చక్కటి పటిష్ఠమైన ప్రేమ పునాడీని వేయడం జరిగింది. దాని పైన ప్రస్తుత మాస్టర్ పూజ్య దాజీ ఆధ్యాత్మిక సౌధాన్ని నిర్మించే పనిలో నిమగ్నమై ఉన్నారు. 

19, డిసెంబర్ 2025, శుక్రవారం

పూజ్యశ్రీ పార్థసారథి రాజగోపాలాచారీజీ - సమాధి - మణపాక్కం, చెన్నై

 

పూజ్యశ్రీ  పార్థసారథి రాజగోపాలాచారీజీ - సమాధి  మణపాక్కం, చెన్నై   

అధ్యక్షులు 

శ్రీరామ చంద్ర మిషన్, 

హెడ్ క్వార్టర్స్: షాజహాన్ పూర్ (ఉ. ప్ర.), భారత్ 

1983 నుండి 2014 

జననం: జూలై 24, 1927 

మహాసమాధి : డిశంబర్ 20, 2014 

(ఈ రోజు మన ప్రియతమ గురుదేవులు పూజ్యశ్రీ చారీజీ మహాసమాధి పొందిన రోజు; కాస్సేపు మౌనంగా ధ్యానంలో ఉందాం.) 




సహజ మార్గ ధ్యాన పద్ధతి (ఆడియోలో)

సహజ మార్గ ధ్యాన పద్ధతి (ఆడియోలో)


సహజమార్గ సాధన ప్రారంభించాలనుకున్నవారు సమీప ట్రైనర్లను సంప్రదించి ఈ క్రింది ప్రక్రియలను ప్రత్యక్షంగా నేర్చుకోగలరు. ఈ క్రింది వెబ్ సైట్ క్లిక్ చేసి మరింత సమాచారాన్ని పొందగలరు. 

www.heartfulness.org  

క్లుప్త పరిచయం 

ఈ క్రింది ఆడియో లింకులను క్లిక్ చేసి వినగలరు:

హార్ట్ఫుల్నెస్  రిలాక్సేషన్ 

హార్టఫుల్నెస్ రిలాక్సేషన్

హార్ట్ఫుల్నెస్ ధ్యానం గురించిన ప్రసంగం 

హార్టఫుల్నెస్ ధ్యాన ప్రసంగం 

హార్ట్ఫుల్నెస్ క్లీనింగ్ ప్రసంగం 

హార్ట్ఫూలనెస్ నిర్మలీకరణ ప్రసంగం 

హార్ట్ఫుల్నెస్ గైడెడ్ క్లీనింగ్ 

గైడెడ్ క్లీనింగ్

హార్ట్ఫుల్నెస్ ప్రార్థన 

హార్టపులనెస్ ప్రార్థన  

నైతికత లేనిదే ఆధ్యాత్మికత నిలవదు

 


విలువలతో కూడిన ఆధ్యాత్మిక దిగ్గజం, స్వామి వివేకానంద 
నైతికత లేనిదే ఆధ్యాత్మికత నిలవదు  

నైతిక విలువలు లేనిదే సౌశీల్యం అసాధ్యం. సౌశీల్యం లేనిదే ఆధ్యాత్మిక ప్రగతి నిష్ప్రయోజనమవుతుంది. 

నైతిక విలువలు ఎలా అలవడతాయి?
ప్రధానంగా అలవరచుకోవాలన్న సంకల్పం వల్ల అలవడతాయి. ఆ తరువాత
పుట్టుకతో కొంత గత జన్మ సంస్కారాల వల్ల, కుటుంబ సంస్కృతి వల్ల , పెరిగే వాతావరణం వల్ల, సజ్జనుల సాంగత్యం వల్ల, విద్యాభ్యాసం వల్ల, ఆశయాల వల్ల, జ్ఞానం వల్ల, ధ్యానం వల్ల విలువలు మనిషిలో పెంపొందుతాయి. 
విలువలతో కూడిన జీవితం అందరి హృదయంలో ఉన్న అంతర్యామి యొక్క వెలుగును బయటకు ప్రసరించేలా చేస్తుంది.
 
లాంతరు ఉపమానం 
లాంతరులో దీపం వెలుగు బయటకు రావాలంటే చిమ్నీ యే విధంగా మసి లేకుండా శుభ్రంగా  ఉండాలో, అలాగే బాహ్య జీవనం లోపలి ఆధ్యాత్మిక ప్రగతికి తగినట్లుగా విలువలతో కూడి ఉండటం వల్ల సాధ్యపడుతుంది. 

విలువలతో జీవనం అనేది నిర్విరామంగా కొనసాగవలసిన ప్రయత్నం. ప్రయత్నపూర్వకంగా కొనసాగవలసిన ప్రక్రియ. 

16, డిసెంబర్ 2025, మంగళవారం

సంపూర్ణ ఐక్యం

 


సంపూర్ణ ఐక్యం 

ప్రతీ ఆధ్యాత్మిక సాధకుని పరమ లక్ష్యం, ఆ సృష్టికర్తలో సంపూర్ణ ఐక్యం పొందడం అంటారు బాబూజీ.  ఆత్మ పరమాత్మలో లయమవడం అన్నా అదే. వర్షం చుక్క మహాసముద్రంలో ఒకటైపోవడం అన్నా అదే. నదులు మహాసముద్రంలో కలవడం అన్నా అదే అర్థం. ప్రతీ ఆత్మ భగవంతునిలో కలవడం అనే సంకల్పం ప్రతీ ఆత్మలోనూ స్వతఃసిద్ధంగా నిహితమై ఉంది. కాబట్టి ఆ ప్రవాహానికి అనుకూలంగా ప్రయాణించడమే జీవుడి పని. దానికి విరుద్ధ దిశలో పయనించడం అంటే ఒత్తిళ్ళు కొని తెచ్చుకుంటున్నట్లే. సాధ్యమైనంత త్వరగా ఈ సత్యాన్ని ఎరిగి తదనుగుణంగా ప్రయాణించడమే ఆత్మకు శ్రేయస్కరం. 

అసలు భగవంతునిలో సంపూర్ణ ఐక్యం పొందవలసిన అవసరం ఏమిటన్న జిజ్ఞాస సాధకునికి కలుగవచ్చు. సంపూర్ణ లయం పొందితే గాని సాధకుడు తనను తాను లేక తన అస్తిత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకోలేడట. అందుకే మనిషి జన్మ యొక్క పరమ లక్ష్యం భగవంతుని పొందడమే. అదొక సమాధానమైతే, ఆత్మ తన మూలానికి చేరుకునే వరకూ అశాంతిగానే ఉంటుందన్నది మరొక సమాధానం. యేది అయినప్పటికీ సాధకుడు ధ్యాన సాధన చేస్తూ, గురువుల అడుగుజాడల్లో నడిచే ప్రయత్నం చేస్తున్న ప్రతీసారి, నిజంగా ఆత్మసంతుష్టి అంటే ఏమిటో ప్రస్ఫుటంగా అవగతమవుతూ ఉంటుంది. అదే మరింత తీవ్రంగా సాధన చేయాలన్న ఉత్సాహాన్ని, ప్రేరణను కూడా కలిగిస్తుంది. ఇదే నిదర్శనం ఆత్మలో ఈ సంకల్పం నిహితమై ఉందనడానికి. అందుకే ఆ సంకల్పానుగుణంగా మనిషి తన జీవిత ప్రయాణాన్ని కొనసాగించడమే విజ్ఞత అని బోధ పడుతుంది. 

15, డిసెంబర్ 2025, సోమవారం

పరమానంద స్థితిని కూడా దాటితే పరమగమ్యం చేరుకున్నట్లే - బాబూజీ


పరమానంద స్థితిని కూడా దాటితే పరమగమ్యం చేరుకున్నట్లే - బాబూజీ 

మతం భగవంతుడు లేక పరమసత్యం యేదో ఉందన్న అవగాహనను కల్పిస్తుంది; మతం యొక్క పాత్ర అదే. అలాగే ఆధ్యాత్మికత అంతర్ముఖమై భగవంతుని అంతరంగంలో అనుభూతి పొందేలా చేస్తుంది; ఆధ్యాత్మికతను కూడా దాటి వెళ్ళవలసి ఉంది ఈ వికాస యాత్రలో; ఆధ్యాత్మికతను దాటినప్పుడు యదార్థ సత్యం అనుభవంలోకి వస్తుంది; ఈ స్థితిని కూడా దాటితనప్పుడు పరమానంద స్థితి కలుగుతుంది. 

ఈ పరమానంద స్థితిని కూడా దాటితే సాధకుడు పరమగమ్యాన్ని హేరుకున్నట్లే అంటారు బాబూజీ. అయినా సాధకుడు ఆ క్షేత్రంలో ఈత కొనసాగిస్తూనే ఉంటాడట. ఇక్కడ తన ఉనికి అతి సూక్ష్మాతిసూక్ష్మంగా మారిపోయి గుర్తింపు మాత్రం మిగిలిపోతుందట మహాప్రళయం సంభవించేంత వరకు. 
అంటే ప్రతీ సాధకుడి యాత్ర, స్థూల దశ నుండి, సూక్ష్మం, సూక్ష్మం నుండి సూక్ష్మాతి సూక్ష్మంగా  ఉన్నత లోకాల్లో తన ఉనికి మారే వరకూ కొనసాగుతూనే ఉంటుంది. 
అందుకే శ్రీకృష్ణుడు, స్వామి వివేకానంద, లాలాజీ, బాబూజీ, చారీజీ వంటి మహాత్ములందరూ వారి-వారి గుర్తింపులతో యే లోకాలలోనో ఇప్పటికీ ఉన్నారు; తక్కినవారందరూ మనతో సహా తమ తమ యాత్రలను కొనసాగిస్తూ ఉన్నారు. 

అందుకే ఆధ్యాత్మిక సాధనను అవలంబించవలసిన అవసరం అందరికీ. తథాస్తు. 

 

ఎక్కడ యదార్థ సత్యం అంతమవుతుందో అక్కడ పరమానంద స్థితి ప్రారంభమవుతుంది - బాబూజీ

 


ఎక్కడ యదార్థ సత్యం అంతమవుతుందో అక్కడ పరమానంద స్థితి ప్రారంభమవుతుంది - బాబూజీ

మతం పరమ సత్తా ఉనికిని బాహ్యంగా గుర్తించేలా చేస్తుంది; ఆధ్యాత్మికత ఆ ఉనికిని అంతర్ముఖంగా అనుభూతి పొందేలా చేస్తుంది; ఆ తరువాతి దశలో సాధకుడు ఆధ్యాత్మికతను కూడా దాటి దానికి అతీతంగా యదార్థ స్థితిగా మారడం జరుగుతుంది; ఈ యదార్థ స్థితిని కూడా దాటి ఉనికితో ఏకత్వ స్థితిలో పరమానంద స్థితిలో ఉంటాడు; తనను తాను ఇంచుమించుగా మరచిపోతాడు. మాటల్లో వర్ణించరానిది ఈ స్థితి. పరమానంద స్థితి అంటే అర్థం చేసుకోలేనిది కానీ అనుభూతి చెందగలిగినది; అయినా యాత్ర కొనసాగవలైనది ఉందంటారు బాబూజీ. అందుకే ఈ యాత్రను అనంత యాత్ర అంటారు; అంతులేని యాత్ర. ఈ పరమానంద స్థితిని దాటినప్పుడు పరమ గమ్యాన్ని చేరుకున్నట్లే అంటారు బాబూజీ. 

ఆధ్యాత్మికత ఎక్కడ అంతమవుతుందో అక్కడ యదార్థ సత్యం ప్రారంభమవుతుంది - బాబూజీ

 ఆధ్యాత్మికత ఎక్కడ అంతమవుతుందో అక్కడ యదార్థ సత్యం ప్రారంభమవుతుంది - బాబూజీ 

మతం బాహ్యోన్ముఖ సాధన అని, ఆధ్యాత్మికం అంతర్ముఖ సాధన అని మనం అర్థం చేసుకున్నాం. మతం యదార్థ సత్యాన్ని యదార్థ సత్యాన్ని గుర్తించేలా చేస్తుంది; ఆధ్యాత్మికత అంతర్ముఖంగా దాన్ని అనుభూతి చెందేలా చేస్తుంది. ఆ తరువాతి దశలో, ఆధ్యాత్మికత పరిపక్వత చెందినప్పుడు, ఆ అనుభూతి యదార్థ సత్యంగా మారుతుంది; అంటే ఉదాహరణకు శాంతిని  అనుభూతి చెందిన వ్యక్తి శాంతిస్వరూపుడుగా మారతాడు; ప్రేమను అనుభూతి చెందిన వ్యక్తి ప్రేమగా మారతాడు; దివ్యత్వాన్ని అనుభూతి చెందిన వ్యక్తి దివ్యంగా మారతాడు. దీన్నే ఆధ్యాత్మికతను దాటి యదార్థసత్యంగా వికాసం చెందడం అని అర్థం చేసుకోవచ్చు. 

ఇక మాటలు తగ్గిపోతాయి; తనను తాను మరచిపోయే స్థితి ప్రారంభమవుతుంది. అయినా యాత్ర ఇంకా పూర్తి కాలేదంటారు బాబూజీ. 

ఎక్కడ యదార్థ సత్యం అంతమవుతుందో అక్కడ పరమానంద స్థితి ప్రారంభమవుతుందన్నారు బాబూజీ. 


14, డిసెంబర్ 2025, ఆదివారం

మతం ఎక్కడ అంతమవుతుందో ఆధ్యాత్మికత అక్కడ మొదలవుతుంది - బాబూజీ



మతం ఎక్కడ అంతమవుతుందో ఆధ్యాత్మికత అక్కడ మొదలవుతుంది - బాబూజీ 

బాబూజీ యొక్క ఆధ్యాత్మిక విప్లవాత్మక బోధల్లో  ఇది ముఖ్యమైనది. మనం ఈ వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 

మతం అంటే ఏమిటి?
మతం అంటే అభిప్రాయం/నమ్మకం అని అర్థం.  శ్రీరామ కృష్ణ పరమహంస - యతో మత్ తతో పాథ్  మతం - అని సెలవిచ్చినట్లుగా, భూమ్మీద ఎన్ని పుర్రెలున్నాయో అన్ని  మతాలూ ఉండవచ్చు. మతం అనగానే అనేక మతాలు గుర్తొస్తాయి - హిందూ మతము, క్రైస్తవ మతము, ఇస్లాం మతము, సిఖ్ మతము, బౌద్ధ మతము, జైన మతం, నాస్తిక మతంతో సహా ఎన్నో మతాలున్నాయి. ప్రతీ మతంలోనూ  కూడా, ప్రవక్తలు, ప్రామాణికమైన ఒక వాజ్ఞ్మయము, ఒక జీవన విధానము, ఆచారాలు, క్రతువులు, పూజలు, పునస్కారాలు యేదోక రూపంలో కనిపిస్తాయి. ప్రతి మనిషీ యేదో ఒక మతంలో జన్మించినవాడే . 

మతం యొక్క లక్ష్యం 
ఇంగ్లీషులో మతం (Religion) అనే పదానికి - తిరిగి భగవంతునితో కలయిక - అని అర్థం. ఈ మూల అర్థానికి దూరమైపోయి ఇంచుమించుగా ప్రతీ మతమూ క్రతువులకు, ఆచారాలకూ పరిమితమై పోయింది. చెరుకు-రసాన్ని విడిచిపెట్టి, చెరుకు-పిప్పిని నములుతున్నట్లుగా కనిపిస్తుంది. అందుకే యే మతమైనా తమ-తమ జనాన్ని కాపాడుకోవడం కోసం   రెండు ఆయుధాలను ప్రయోగిస్తూ ఉంటుందంటారు బాబూజీ - భయము, ప్రలోభము. నరకం యొక్క భయం, స్వర్గం యొక్క ప్రలోభం. 
కానీ చాలా మతాలలో ఉదాహరణకు, హిందువుల్లో ఋషులు, క్రైస్తవుల్లో మిస్టిక్స్, ఇస్లాం మతంలో సూఫీలు, ఇలా వీళ్ళందరూ ఒకే భాష మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తుంది. ఆమ్రముఖులై అన్వేషించేవారందరూ ఒకే భాషను, ఒకే అవగాహనను పంచుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. వీళ్ళకి ఆచారాలతోనూ, నమ్మకాలతోనూ, క్రతువులతోనూ  సంబంధం లేకుండా, భయము, ప్రలోభాలతో పని లేకుండా, అంతర్ముఖులై,  ప్రేమతో దైవం ఒక్కటే అన్న అనుభవపూర్వక పరమసత్యాన్ని ప్రబోధిస్తూంటారు, ఆచారణాత్మకంగా జీవిస్తూ ఉంటారు.

మతానికి అతీతంగా ...
నిజంగా సత్యాన్వేషణలో ఉన్నవారు, పరమసత్యాన్ని త్రికరణ శుద్ధిగా తెలుసుకోవడమే జీవిత పరమార్థంగా పెట్టుకుని జీవిస్తున్నవారి, మతానికి అతీతంగా ఎడగవలసి ఉందంటారు బాబూజీ. మతానికి అతీతంగా అంటే మతాన్ని నిరాకరించడం కాదు, తిరస్కరించడం కాదు. మతాన్ని దాటి అంతర్ముఖంగా ప్రయాణించడం. అంటే బాహ్యంగా సత్యాన్ని అన్వేషించడం ఆపి, సత్యం హృదయాంతరాళంలో అన్వేషించడం. భయానికి, ప్రలోభాలకు లోనుగాకుండా ప్రేమతో విశాల మనసుతో, ధ్యానం ద్వారా శోధించడం. స్కూలు దాటి కళాశాలలోకి, కళాశాల దాటి విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించడం లాంటిది.  
కాబట్టి బాహ్యంగా చేసే అన్వేషణ అంతమై అంతర్ముఖంగా శోధన ప్రారంభమవడమే  మన సాధనలో మతం అంతమై ఆధ్యాత్మికత ప్రారంభమవడం అంటే. 
  

 

13, డిసెంబర్ 2025, శనివారం

విలువలు - 2

 


వివిధ రకాల విలువలు 
వ్యక్తిగత విలువలు: 
నిజాయితీ, ధైర్యం, క్రమశిక్షణ, కృతజ్ఞత,సరళత

సామాజిక విలువలు: 
సమాజంలో మంచి సంబంధాలను  కాపాడేవి: గౌరవం, సహకారం, సేవాభావం, బాధ్యత

నైతిక విలువలు: 
సత్యం, అహింస,  న్యాయం, ధర్మం. 
ఆధ్యాత్మిక విలువలు:

మనసును ఉన్నత స్థాయికి తీసుకెళ్ళేవి :

ప్రేమ, కరుణ, సమత్వం, వినయం, త్యాగం. సమర్పణ (శరణాగతి)

భారతీయ శాస్త్రాలలో విలువలు

ఉపనిషత్తులు: సత్యం, శివం (పవిత్రత), సుందరం (మంచితనం)

భగవద్గీతలో శ్రీకృష్ణుడు దైవీ సంపదగా తెలిపిన విలువలు:

అభయం, హృదయ శుద్ధి, దానం, సత్యం, అహింస, కరుణ, కోపం లేలుండా ఉండటం, స్థిర చిత్తం, సమత్వం, వినయం  

పతంజలి యోగా సూత్రాలు: యమ నియమాలు 

యమలు - సత్యం, అహింస, ఆస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం 

నియమాలు - శౌచ, సంతోష, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం 

   విలువలు జీవితాలను ఎలా మారుస్తాయి? 
విలువలు ఆలోచనలను మారుస్తాయి. 
విలువలు -> ఆలోచనలు -> చేతలు -> అలవాట్లు 
-> వ్యక్తిత్వం/శీలం -> భవితవ్యం 
విలువలు మనసుకు శాంతిని కలిగిస్తాయి. 
పరాశపర సంబంధాలను మెరుగుపరుస్తాయి. 
సమాజంలో గౌరవం పెరిగి, సామరస్యం పెరిగేలా చేస్తాయి. 

విలువలు బయట నుండి అబ్బేవి కావు, హృదయం శుద్ధి అయినప్పుడు లీపల నుండి సహజంగా వికసించేవి. 

12, డిసెంబర్ 2025, శుక్రవారం

విలువలు

 


విలువల అవసరం మనందరికీ తెలియనిది కాదు. విలువల్లేని జీవితం అర్థరహితమైన జీవితం; గందరగోళంగా ఉండే జీవితం; అథోగతికి దారి తీసే జీవితం. అయినప్పటికీ మన మానవ సమాజంలో వీటి కొరత, తత్ఫలితంగా కలిగే ప్రభావాలు మనం నిత్యం అనుభవిస్తూనే ఉన్నాం. 

అసలు విలువలంటే ఏమిటి? ఇవి మనకు అవసరమా? వీటిని అలవరచుకోవడం ఎలా? ముఖ్యంగా బాల్యావస్థల్లో ఉన్న పిల్లల్లో ఈ విలువలు సహజంగా పెంపొందలంటే మనం ఏమైనా చేయగలమా? ఈ ఆధునిక సమాజంలో ఈ విలువలను బోధించడం ఎలా? తరువాతి తరానికి అందించడం ఎలా? ఇటువంటి ప్రశ్నలు మనలో కలుగుతూ ఉంటాయి. స్వగతాన్ని చూసుకుంటే ఈ విలువలను మనం కూడా సరైన విధంగా పట్టించుకోలేదని అర్థం చేసుకోగలుగుతాం కూడా. 


విలువలతో కూడిన, విలువలతో రాజీ పడని జీవితాలను చూస్తూ ఉంటే మన మనసుకు ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది; వారిలా మనం కూడా ఉంటే బాగుండేదని స్ఫూర్తి కలుగుతుంది. వాళ్ళు మహాత్ములే అవ్వక్కర్లేదు; మన చుట్టూ ఉన్న సాధారణ జీవితాల్లో కూడా గమనించవచ్చు. 


విలువలు అంటే మనం జీవించే విధానం; మన ధర్మం, మన నీతులు, ఎట్టి పరిస్థితుల్లో మనం రాజీ పడని సద్గుణాలు. మన ఆలోచనలకు, మన చేతలకు, మన అలవాట్లకు, మన ప్రవర్తనకు దిశను చూపించే దిక్సూచి, విలువలు అనేవి. 


విలువలు పెంపొందాలంటే మనసు, బుద్ధి, అహంకారాల శుద్ధి జరగాలి. అప్పుడు మనలో ఉన్న విలువలు ఆవిష్కరింపబడతాయి. విలువలు బాహ్యంగా ఉండేవి కావు. మానవ సమాజం, ప్రకృతితోనూ, పరస్పరం శాంతి-సామరస్యాలతో కూడిన జీవనం కోసం విలువలు అవసరం. విలువల ద్వారా అపారమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. క్రమశిక్షణ అలవడుతుంది. 


ఇంగ్లీషులో values are caught and  not taught అంటారు. విలువలనేవి ఇంకోకరిని చూసి నేర్చుకునేవి గాని చెప్తే వచ్చేవి కావు. విలువలతో కూడిన మనుషుల సాంగత్యంలో విలువలను తేలికగా పట్టుకోగలుగుతాం; ముఖ్యంగా పిల్లలు. ఎందుకంటే పిల్లలు పెద్దలను చూసే తెలియకుండా నేర్చుకుంటారు గనుక. 


ఇతర మార్గాలు: 

ఆత్మపరిశీలన - మన ప్రవర్తనను మనం నిశితంగా గమనించుకోవడం ద్వారా 

ధ్యానం - హృదయం అపార శాంతిని అనుభూతి చెందినప్పుడు లోపలున్న విలువలు వెలుగులోకి వస్తాయి. 

సత్సాంగత్యం - సజ్జనుల సాంగత్యం ద్వారా, మంచివాళ్ళతో మెలగడం ద్వారా 

సేవ - నిస్స్వార్థంగా  సేవ చేయడం వల్ల విలువలు బలపడతాయి. 

అభ్యాసం - రోజుకొక విలువను అమలులో పెట్టే ప్రయత్నం ద్వారా.  

కృతజ్ఞత - అన్నిటికంటే గొప్ప విలువను అభ్యసించడం ద్వారా హృదయాశుద్ధి జరుగుతుంది.

ఆత్మ వికాస సాహిత్య అధ్యయనం - మహాత్ముల జీవిత  చరిత్రలు, భారత రామాయణాలు, నీతి  కథలు, భగవద్గీత, భాగవతాలు ఇత్యాదివి. 


పైన చెప్పిన వాటిల్లో సాధ్యమైనంతగా అభ్యాసం చేయడం వల్ల ఉదాహరణగా జీవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.  అన్నిటికంటే ఉదాహరణగా జీవించడం శ్రేష్ఠం. 

5, డిసెంబర్ 2025, శుక్రవారం

ప్రపంచ ధ్యాన దినోత్సవం - పూజ్య దాజీ ఆహ్వానం

 


ప్రపంచ ధ్యాన దినోత్సవం - పూజ్య దాజీ ఆహ్వానం

ప్రియ మిత్రులారా,
 
ఈ ప్రపంచ ధ్యాన దినోత్సవం. డిశంబర్ 21 న, మీలో ప్రతి ఒక్కరినీ కొన్ని నిమిషాలపాటు అంతర్ముఖులై, ప్రపంచ శాంతి కోసం, ప్రపంచ శ్రేయస్సు కోసం, కాస్త విరామం తీసుకుని అందరమూ కలిసి హయానాం చేయాలని ఆహ్వానిస్తున్నాను. వేల మంది, లక్షల మంది ఒకే ధ్యానపూరిత సంకల్పంతో కలిసి కూర్చున్నప్పుడు ఒక సామరస్యంతో కూడన సూక్ష్మమైన క్షేత్రం, సమిష్టి చేతనం చేత సృష్టింపబడుతుంది.  ఒక ఎగ్రెగోర్ ఏర్పడుతుంది. ఈ క్షేత్రంలో గనుక ప్రేమను నిక్షిప్తం చేయగలిగితే, అది పరివర్తన తీసుకురాగలిగే శక్తిగా మారుతుంది.  కలిసి ధ్యానం చేసే ఏర్పడే శక్తి, నమ్మకంతో సంబంధించిన విషయం కాదు, కోరుకుంటే వచ్చేది కాదు. ప్రిన్స్ టన్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు కనుగొన్నదేమిటంటే, ఇలా విశ్వవ్యాప్తంగా చేసే ప్రధాన ధ్యాన కార్యక్రమాల్లో, కొలిచే భౌతిక పరికరాలు క్రమపద్ధతిలో వాటంతటవే సర్దుకోవడం ద్వారా వెల్లడి అయ్యిందేమీటంటే  సమిష్టి చైతన్యంలో ఒక పొందిక కనిపించింది. 

శరీరంలో అత్యంత శక్తివంతమైన మ్యాగ్నెటిక్ క్షేత్రం సృష్టించేది ఈ హృదయమే. అనేక హృదయాలు ఒక్కటిగా కలిసినప్పుడు,  శాంతి అనే ఒకే ఒక్క సంకల్పంతో కూర్చున్నప్పుడు కలిగే ఫలితాలు మనం కళ్ళ ముందే చూడవచ్చు, మనమే సాక్షులమవుతాం. ఈ ధ్యానం అనేది ప్రత్యేకంగా యే మతానికీ పరిమతం కాదు. అలాగే యే నమ్మకానికి గాని, యే సంస్కృతికీ  పరిమితం కాదు. ఇది విశ్వజనీనంగా అందరూ స్మరించుకునే ఒక ప్రక్రియ;  అన్ని హృదయాలూ కలిసే చోటుని, అత్యున్నత విజ్ఞతను తిరిగి పొందడానికి చేసే ప్రక్రియ. 

మనం మౌనంగా నెమ్మదిగా కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడు, శాంతి, సామరస్యం వర్ధిల్లాలన్న సత్సంకల్పాన్ని  చిత్తశుద్ధితో ధారణ చేసి కూర్చున్నప్పుడు, మనకు తెలియకుండానే ఎంతో గొప్ప ప్రక్రియలో పాల్గొనడం జరుగుతుంది. ఆధునిక విజ్ఞాన శాస్త్రం దీన్ని దృవీకరిస్తోంది కూడా - దీనికి, కళ్ళూ మూసుకుని కూర్చోవడానికి ప్రత్యేకమైన శిక్షణ యేమీ అవసరం లేదని; ప్రత్యేకమైన భంగిమ అవసరం లేదని; యే మతానికి సంబంధించి ఉండవలసిన అవసరం లేదని ధృవీకరిస్తోంది. 

మీ అవగాహనకు తగిన విధంగా, మీ సంప్రదాయానికి తగిన విధంగా ధ్యానించండి: మీరు హిందువైతే హృదయంలోని  దివ్య వెలుగుపై, దివ్యజ్యోతిపై  ధ్యానించండి; మీరు ఇస్లాం కి చెందినవారైతే నూర్-ఎ-ఇలాహీ, భగవంతుని వెలుగు అన్న భావనపై ధ్యానించండి; మీరు క్రైస్తవులైతే యేసు క్రీస్తు యొక్క ప్రేమపై ధ్యానించండి;  మీరు మరేదైనా మార్గాన్ని అవలంబిస్తున్నట్లైతే, మీ అవగాహనకు తగ్గట్టుగా దివ్యవెలుగుపై ధ్యానించండి. ఒకవేళ మీరు యే దేవుణ్ణీ నమ్మనివారైతే యేమీ ఫర్వా లేదు; మీరు కేవలం మీ హృదయంలో ఉన్న ప్రేమపై ధ్యానించండి. దీన్ని మరింత సరళం చేయడానికి యూ-ట్యూబ్ లో ప్రపంచ ధ్యాన దినోత్సవం నాడు ధ్యానాన్ని చేయడానికి అంచెలంచెలుగా ఆదేశాలివ్వడం జరుగుతుంది. 

దయచేసి మాతో కలవండి. కేవలం 5 నిముషాలయినా కూడా చాలా తేడా వస్తుంది. ప్రపంచానికి కాకపోయినా కనీసం మీకు ప్రయోజనం ఉంటుంది. మీ సంకల్పంలో విపరీతమైన శక్తి ఉంది. మీరు మీ పాల్గొనే విషయంలో దాని ప్రాముఖ్యతను తక్కువగా అంచనా వేసుకోకండి; చిత్తశుద్ధితో ధ్యానం చేసే యే హృడయమైనా ఈ సమిష్టి చేతనాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఇది పరోక్షంగా చేసే ఆశాభావం కాదు; ఇది మానవ చైతన్య వికాసంలో క్రియాశీలకంగా పాల్గనడం; మనందరం విడివిడిగా ఎవరికి వారు ఉండే మనుషులం కాదన్న సత్యాన్ని గుర్తించడం;  మనందరమూ ఒకరితో ఒకరు సంబంధం ఉన్న జీవులమని, వాళ్ళ శ్రేయస్సు ఒకరి మీద మరొకరిపై ఆధారపడుండన్న సత్యాన్ని గుర్తించడం. 

ప్రియ మిత్రులారా, ఈ ప్రపంచ ధ్యాన దినోత్సవంలో మనందరమూ మరోసారి నిరూపిద్దాం: మానవాళి ప్రేమపూరితంగా ఏకమైనప్పుడు, అందరికీ కావలసిన ప్రయోజనం, అద్భుతాలు కేవలం జరగడమే కాదు; అనివార్యం కూడా. అందరికీ శుభం కలుగుగాక. 
దయచేసి మాతో కలవండి. 
- దాజీ 
తెలుగు రిజిస్ట్రేషన్ లింక్:
https://meditationday.global/te/


28, నవంబర్ 2025, శుక్రవారం

ధ్యానం ప్రతి ఒక్కరికీ అవసరం

 


హృదయంలోని దివ్య వెలుగుపై ధ్యానం 

ధ్యానం ప్రతి ఒక్కరికీ అవసరం 

నిజానికి ధ్యానం అనేది ప్రతి ఒక్కరికీ అవసరం. ధ్యానం ప్రతి ఒక్కరి జీవితంలో దినచర్యగా మారిపోవలసిన అంశం. క్రమంగా ధ్యానం జీవన విధానంగా మారిపోవాలి. శ్వాస అయినా ఆగిపోవచ్చునేమో గాని ధ్యానం ఆగకూడదు. ఇది కొన్ని రోజుల సాధనలోనే సుసాధ్యం, అసంభవం కాదు. 

అసలు ధ్యానం ఎందుకు చెయ్యాలి? 
మనుషులలో ఆలోచనా-కాలుష్యం పోగొట్టుకోవాలంటే చెయ్యాలి. అదే మనిషిచే చేయబడే అన్ని అనర్థాలకు, అన్ని రకాల అన్ని స్థాయిల్లో జరిగే ఒత్తిళ్ళకు మూల కారణం అయి ఉంది. దురదృష్టవశాత్తు, వ్తతఇళ్ళతో జీవించడమే మనిషి జీవన విధానం అయిపోయింది. కొంతవరకూ ఒత్తిడి మంచిదే అయినప్పటికీ (బద్ధకం వచ్చేస్తుంది లేకపోతే), మనకున్నవి మోతాదుకు మించిన ఒత్తిళ్ళు. ఇవి శారీరక అనారోగ్యానికి, ఆ తరువాత మానసిక అనారోగ్యానికి దారి తీసి, తద్వారా రోజురోజుకీ మనశ్శాంతి తగ్గిపోతూ, జీవితాన్ని సార్థకం చేసుకుని ఆత్మవికాసం చెందే  అద్భుత అవకాశాన్ని కోల్పోయేలా చేస్తాయి.
కేవలం ఒత్తిళ్ళు తగ్గించుకోవాడమే కాదు, మనోబుద్ధ్యహంకారచిత్తాలను  శుద్ధి చేసి మనిషిలో నిద్రాణమై ఉండే ఎన్నో నైపుణ్యాలను వెలికి తీస్తుంది, తద్వారా మనశ్శాంతి, ఏకాగ్రత, ఆలోచనలలో స్పష్టత, సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి, ఏకాగ్ర చిత్తం జీవితంలో ఎదురయ్యే కష్టాలను చిరునవ్వుతో స్వీకరించగలిగే పరిస్థితి, భయాన్ని పోగొడుతుంది, మనలో ప్రేమను పెంచుతుంది, క్రమశిక్షణను సహజంగా పెంచుతుంది, మనుషులలో సామరస్యం పెంచుతుంది, అంతేగాక ఆధ్యాత్మిక ఉన్నత శిఖరాలకు ఎదిగేలా దారి తీస్తుంది. మనలో అంతర్యామిగా ఉన్న దైవత్వాన్ని అనుభూతి చెందే పరిస్థితి ఏర్పడుతుంది; జీవితానికి దిశ ఏర్పడుతుంది; జీవనం చరితార్థమవుతుంది. 
ధ్యానం జీవిత పరమార్థానికి అవసరమైన పరిష్కారం; మనిషి అస్తిత్వం యొక్క మూలాల్లోకి వెళ్ళి పని చేస్తుంది. 
కాబట్టి ధ్యానం శ్వాస కంటే చాలా అవసరం. ఎందుకంటే శ్వాస ఆగిపోయి ప్రాణాలు విడిచిపెట్టినప్పుడు కూడా మృత్యువు తెలియకుండా, మరో ఉన్నత లోకానికి తీసుకువెళ్ళే సాధనం ధ్యానం. ఆ విధంగా మృత్యువును కూడా అధిగమించగలిగే సాధనం.  
కాబట్టి దయచేసి ఆలోచించండి, ధ్యానం చేయకపోతే ఎంత కోల్పోతున్నాడో మనిషి!

25, నవంబర్ 2025, మంగళవారం

భౌతిక హృదయం - ఆధ్యాత్మిక హృదయం

 


భౌతిక హృదయం - ఆధ్యాత్మిక హృదయం 

భౌతిక హృదయం ప్రతి ఒక్కరికీ సాధారణంగా ఛాతీకి ఎడమ భాగంలో ఉండే శరీర అవయవం. వేల మందిలో యే ఒక్కరికో ఛాతీకి కుడి భాగంలో ఉంటుంది. ఇది భౌతిక జీవనానికి ఆధారం. ఊపిరి తిత్తుల ద్వారా శుద్ధం చేసిన రక్తాన్ని, పోషక పదార్థాలను శరీరానికి నలు మూలలా సరఫరా చేస్తుంది.  ఉద్వేగాలకు పుట్టిల్లు. భౌతిక హృదయం మనిషిలో కలిగే ఉద్వేగాలకు, ఒత్తిళ్ళకు, హార్మోన్లకు  ప్రభావితమవుతూ ఉంటుంది. 


ఆధ్యాత్మిక హృదయం శరీర అవయవం కాదు. కంటికి కనిపించదు. కానీ అనుభూతి చెందవచ్చు. ఆధ్యాత్మిక హృదయం ఆత్మకు నివాసం; మనిషి చేతనానికి, అనుభూతులకు కేంద్రం; మనం ధ్యానంలో దివ్యవెలుగును అనుభూతి చెందేది ఇక్కడే; మానవీయత, దివ్యత్వాల కలయిక జరిగే చోటు. ఆధ్యాత్మిక చేతనం ఉండేది ఇక్కడే; ఛాతీకి కొంచెం కుడి ప్రక్కగా ఉంటుందని గువులు చెప్తారు. 


ఉద్వేగాలన్నీ అనుభూతి చెందేది భౌతిక హృదయంలోనే అయినప్పటికీ, అవి ఉద్భవించేది ఆధ్యాత్మిక హృదయంలో. మన కర్మల వల్ల, మన సంకల్పాల వల్ల, మన ఆలోచనా ప్రక్రియల ఫలితంగా ఈ ఉద్వేగాలు కలుగుటూ ఉంటాయి. 


ఆధ్యాత్మిక హృదయ శుద్ధి జరిగినప్పుడు భౌతిక హృదయం ఆరోగ్యంగా తేలికగా ఉంటుంది. హృదయంపై ధ్యానం చేయడం వల్ల శాంతి, ఆలోచనలోనూ, అవగాహణలోనూ స్పష్టత, ఉద్వేగాల్లో సమతౌల్యత, చైతన్య విస్తరణ జరుగుతుంది.  


భౌతిక హృదయం శరీరాన్ని సజీవంగా ఉంచుతుంది; ఆధ్యాత్మిక హృదయం జీవుడిని సజీవంగా ఉంచుతుంది. భౌతిక హృదయం రక్తాన్ని సరఫరా చేస్తే, ఆధ్యాత్మిక హృదయం శాంతిని, ప్రేమను, ఉన్నత చేతనాన్ని సరఫరా చేస్తుంది. 


19, నవంబర్ 2025, బుధవారం

సహజ మార్గ ధ్యాన సాధనలో ఎదురయ్యే సవాళ్ళు

 


సహజ మార్గ ధ్యాన సాధనలో ఎదురయ్యే సవాళ్ళు 

అత్యున్నత ఆధ్యాత్మిక వికాస దిశగా తీసుకువెళ్ళే సరళమైన సహజ్ మార్గ ధ్యాన పద్ధతిని అనుసరించే క్రమంలో సాధకుడికి సాధారణంగా ఎదురయ్యే కొన్ని సవాళ్ళను మనం ఇక్కడ చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. సహజ మార్గ గురువుల ప్రకారం నిజానికి అవి సవాళ్ళు కావు, ఆధ్యాత్మిక పరిణతికి, ఎదుగుదలకు  తోడ్పడే అవకాశాలని చెప్తారు. 
మానసిక చంచలత్వం 
 మొట్టమొదటి అవరోధం - చంచలంగా అటు-ఇటూ తిరిగే మనసు ధ్యానం చేయనివ్వకపోవడం. 
ఆలోచనలు, కోరికలు, చింతలు, నిరంతరం తిరుగుతూ ఉండే మనసు ధ్యాన వస్తువుపై కేంద్రీకరించలేకపోవడం. 
ఇది సహజం ఎందుకంటే అనసెప్పుడూ బాహ్యఓనముఖంగా పని చేస్తూ ఉంటుంది, దాన్ని అంతర్ముఖం చేయమన్నప్పుడు వచచ్చే ఇబ్బందులివి. 

నిత్యసాధన, క్రమశిక్షణ
ఉదయం ధ్యానం, సాయంకాల శుద్ధీకరణ, రాత్రి ప్రార్థనా-ధ్యానం నిత్యం చేయగలగడం పెద్ద సమస్య చాలా మందికి. 
బద్ధకం, తీరిక లేకపోవడం, మనసు పలు రకాలుగా (మూడ్ సవింగ్స్ అంటారు)ఉండటం వల్ల ఆసక్తి లేకపోవడం 
సాధన తీవ్రంగా చేయడం కంటే కూడా నిత్యం చేయడం ములహయం అంటుంది సహజ మార్గం. పూజ్య దాజీ కనీసం 5 నిముషాలయినా ప్రతి నిత్యం ధ్యానం చేయమంటారు. తీవ్ర సాధనకు క్రమశిక్షణ, నిబద్ధత చాలా అవసరం. 

సూక్ష్మ అహం వల్ల కలిగే అవరోధాలు 
ధ్యానం ద్వారా హృదయ శుద్ధి జరుగుతున్న కొద్దీ అహం అభద్రత  అనుభూతి చెందుతుంది. 
"నేను ప్రోగ్రెస్ అవుతున్నానా?", "నాకేమీ అనిపించడం లేదు". "నేను మాస్టరుకు ఎందుకు శరణాగతి అవ్వాలి?" వంటి ప్రశ్నలు వేధిస్తూ ఉంటాయి. 
ఇటువంటి ప్రశ్నలు మరలా సాధకుడిని స్వార్థంగా ఆలోచింప చేస్తాయి. 

సంస్కారాలు ఎదుర్కోవడం 
సాయంకాల శుద్ధీకరణ సమయంలో లోపలున్న పాత ముద్రలు పైకి రావడం వల్ల, నిర్మూలింపబడటం వల్ల ఒక్కోసారి బరువుగానూ అలజడిగానూ ఉండవచ్చు. దీని మూలాన ప్రశాంతత, ఆనందం ఆశిస్తున్న వాళ్ళకి ఆసక్తి తగ్గడం జరుగుతుంది. 

అనుభూతులపై ఆధారపడటం 
చాలా మంది సాధకులు, ధ్యానంలో యేవో కనిపిస్తాయని, కాంతి కనిపిస్తుందని, ప్రత్యేకమైన స్థితులు కలుగుతాయని ఆశిస్తూ ఉండటం వల్ల అటువంటి అనుభూతులు కాలగకపోయే సరికి వారికి నిరుత్సాహం కలుగుతూ ఉంటుంది. 
మాస్టర్లు మార్పు అనేది అనుభూతిలో కాదని, అంతరంగ పరివర్తనలోనూ, అంతరంగ స్థితిలోనూ ఉంటుందని పడే పడే మాస్టర్లు చెబుతూనే ఉంటారు. 

శరణాగతి, శ్రద్ధ
మాస్టర్ పట్ల నిజమైన  సమర్పణ భావం కలగడం అంతా తేలిక కాడ. ఎందుకంటే స్వీయ నియంత్రణలోనే ఉండాలనే మన ఆధునిక ఆలోచనా ధోరణి వల్ల, మేధాపరమైన ప్రశ్నించే అలవాటు వల్ల అంతా తేలిక కాదు. 
సాధకుడు గ్రుడ్డి నమ్మకం గాకుండాగా, అతిగా సందేహించకుండా, చేసే అభ్యాసాన్ని, శ్రద్ధను సమతౌల్యంగా ఉండేలా చూసుకోవాలసి ఉంది. 

ప్రాపంచిక ఆకర్షణలు 
కుటుంబ బాధ్యతలు, పని/వ్యాపారాల ఒత్తిడి, సామాజిక ఒత్తిళ్ళు వీటితో సత్యమవుతూ ఉండటం వల్ల మనసు చంచలంగా అస్థిరంగా ఉంటుంది. 
ఆధ్యాత్మిక సాధన, ప్రాపంచిక జీవనం రెండూ సమంగా ఉండేలా చూసుకోవడం నిజంగా పరీక్షే; కానీ ప్రాపంచిక జీవనం నుండి తప్పించుకోవడం కాదు, అందులో కొనసాగుతూనే సమతౌల్యత సాధించాలన్నది మాస్టర్ల బోధ. 

ఫలితాల కోసం అశాంతి 
చాలా మంది సాధకులు తమలో  పరివర్తన అతి త్వరగా రావాలనుకుంటారు. కానీ సహజ మార్గ పద్ధతి, పరిశుద్ధంగా తయారయ్యేటువంటి జీవితకాల ప్రయాణం. 
ఓర్పు లేకపోవడం అనేది చీకాకుకు, ఇతరులతో పోల్చుకోవడం, చివరికి సాధనను వదిలిపెట్టేయడం కూడా జరుగుతుంది. 

మార్గంలో కలిగే ఒంటరితనం 
కుటుంబ సభ్యులు, స్నేహితులు సాధకుడు ఎందుకు ఈ అభ్యాసం ఈ మార్గాన్ని అవలంబిస్తున్నాడో అర్థం చేసుకోలేకపోవచ్చు; తరచూ అపార్థం చేసుకోవచ్చు లేక వేరేలా అర్థ చేసుకోవచ్చు కూడా. ఈ పరిస్థితి వల్ల కలిగే ఒంటరితనం సాధకుడి శ్రద్ధ-విశ్వాసాలకు, అంతరంగ శక్తికి పరీక్షగా తీసుకోవాలి. 

లోతైన సూక్ష్మమైన సవాళ్ళు
ఆధ్యాత్మిక పురోగతి మరింత మరింత ఎక్కువవుతున్న కొద్దీ సవాళ్ళు మరింత సూక్ష్మంగా ఎదురావుతూ ఉంటాయి:
ప్రేమతో ఉంటూ  బంధాల్లేకుండా ఉండటం,
ఇష్టాయిష్టాలకతీతంగా ఉండటం, 
ఆధ్యాత్మిక పురోగతికి తాను కారణంగా భావించకుండా ఉండటం,
స్వప్రయత్నం కంటే కూడా దివ్య కృపపై ఎక్కువగా  ఆధారపడటం వంటి సవాళ్ళు ఎదురావుతూ ఉంటాయి. 

సహజ్ మార్గ్ పద్ధతి ప్రాణాహుతి ద్వారా మనసు, బుద్ధి, అహంకారాలను క్రమక్రమంగా శుద్ధి చేసే ప్రక్రియలతో కూడిన సాధనా పద్ధతి. తద్వారా చైతన్య శుద్ధి జరిగి మనిషిలో పరివర్తన సాధ్యమవుతుంది. 
 పైన ఉల్లేఖించిన సవాళ్ళను అధిగమించడానికి కొన్ని సూచనలు:
సాధన పట్ల కాస్త ఆసక్తి, కాస్త ప్రయత్నం, కాస్త నిబద్ధత, కాస్త ఓర్పు అలవరచుకోవాలి. 
ఆధ్యాత్మిక సాహిత్య అధ్యయనం, పూజ్య గురుదేవుల ప్రసంగాలను వినడం, తోటి అభ్యాసుల సాంగత్యం, సత్సంగం, స్వచ్ఛంద సేవలలో పాల్గొనడం, మాస్టరుపై అపారమైన శ్రద్ధను అలవరచుకోవడం, వల్ల ఈ సహజ్ మార్గ్ అనంత ఆధ్యాత్మిక యాత్ర సునాయాసంగా కొనసాగుతూ ఉంటుంది. 
 

తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 7

  కరీంనగర్ ఆశ్రమంలో ఆవులు 2020  తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 7 పూజ్య దాజీ ప్రసాదించిన మరో వరం. కరీంనగర్...