22, డిసెంబర్ 2021, బుధవారం

విస్పర్స్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ - 2 - గ్రంథ పరిచయం

 విస్పర్స్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ -  గ్రంథ పరిచయం 

విస్పర్స్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ అనేది  హార్ట్ఫుల్నెస్  (శ్రీరామచంద్ర  మిషన్) సంస్థ యొక్క  పరమపవిత్ర  గ్రంథం. దివ్యలోకాల్లో  ఉండేటువంటి  ఎందరో  మహాత్ముల  నుండి అందుకున్న  దివ్య  సందేశాలు.  ఈ  సందేశాలని  ఇచ్చినవారిలో  శ్రీకృష్ణభగవానుడు, రాధాదేవి, స్వామి  వివేకానంద, బుద్ధ భగవానుడు,  ఏసుక్రీస్తు,     శ్రీ రామకృష్ణ  పరమహంస,  కబీరు, చైతన్య మహాప్రభువు, గురు  నానక్, లాలాజీ,  బాబూజీ, చారీజీ, ఇంకా  ఎందరెందరో  మహాత్ములున్నారు. ఈ  గ్రంథం  వీళ్ళందరూ  ఇచ్చిన  సందేశాల  సమాహారం. ఈ  సందేశాలను  అతిఉత్కృష్టమైన ధ్యాన  స్థితిలో  అందుకున్నవారు  శ్రీమతి  హెలీన్  పైరే గారు, ఒక  ఫ్రెంచి  దేషస్థురాలు, అభ్యాసి. వీరిని  శ్రీరామచంద్ర  మిషన్,  హార్ట్ఫుల్నెస్  అభ్యాసులందరూ  ఎంతో  శ్రద్ధతో  మదర్ అని  ఆప్యాయంగా  పిలుచుకుంటారు. 

మదర్  హెలీన్  పైరే  ఈ  సందేశాలను  1990  నుండి  అందుకోవడం  ప్రారంభించారు.  2018  వరకూ  కొన్ని  వేల  సంఖ్యలో  అందుకోవడం  జరిగింది;  ఇంచునమించు  ప్రతీ  రోజూ  అందుకోవడం  జరిగింది. ఇంతకు  ముందు  ప్రస్తావించినట్లుగా,  ఇన్ని  సందేశాలు  అందుకోవడం ప్రపంచ  ఛానలింగ్  చరిత్రలోనే  ఇది  మొట్టమొదటిసారి. 

ఈ  సందేశాల  సంకలనానికి హార్ట్ఫుల్నెస్  సహజమార్గ  గురుపరంపరలోని  మూడవ  గురువు,  రెండవ  అధ్యక్షుడు  అయిన పూజ్యశ్రీ  పార్థసారథి  రాజగోపాలాచారీజీ  ఒక  గ్రంథరూపంగా రూపొందించి, ఈ  గ్రంథానికి  విస్పర్స్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ అని  నామకరణం  చేసి  2005 ఏప్రిల్ 30వ తేదీన  తిరుప్పూరులో  బాబూజీ  జయత్యుత్సవాల్లో  విడుదల  చేశారు.  ఈ  మహాత్ములందరూ  మానవ ఉద్ధరణ  కోసం సూక్ష్మ రూపంలో  ఉండేటువంటి  లోకమే  ఈ  బ్రైటర్ వరల్డ్.  నిగూఢమైనవి,  గుహ్యమైనవి అయిన ఈ  దివ్యోపదేశాలన్నీ  కూడా  చెవిలో  రహస్యంగానే  ఉపదేశించడం  అనేది  అనాదికాలం  నుండి  జరుగుతూ  ఉన్నదే.  వీటిని  ఆంగ్లంలో  విస్పర్స్ అంటారు.  అందుకే  పూజ్య  చారీజీ  వీటికి  విస్పర్స్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ అని  నామకరణం  చేశారనిపిస్తుంది. 

ఈ  సందేశాలు  ఈ  భూమ్మీదున్నప్పుడు  అద్భుతమైన  దైవకార్యాలను  నిర్వహించినటువంటి  మహాత్ముల  నుండి, ఎన్నో  సంస్థలు  ఏర్పాటు  చేసినటువంటి  మహాత్ముల  నుండి అందుకోవడం  జరిగింది.  చాలా  వరకూ  ఈ  సందేశాలు  బాబూజీ  వద్ద  నుండి  అందుకున్నవే ఉన్నాయి. వీరందరూ  ఇప్పుడు  ఒక్కటిగా,  ఐక్యంగా  ఈ  బ్రైటర్ వరల్డ్ లో  ఉంటూ  మానవ  ఆధ్యాత్మికోద్ధరణకు  కృషి  చేస్తూ  ఉన్నారు;  వారి  ప్రణాళికను  భౌతికంగా  మన మధ్య  ఉన్న  సజీవ  మాస్టరు  ద్వారా  అమలు  చేస్తూ  ఉన్నారని  ఈ  సందేశాల  ద్వారా  మనం  చదువుకున్నప్పుడు  తెలుస్తుంది. 

ఇక  ఈ  సందేశాల్లోని  విషయానికొస్తే, ఇవన్నీ  కూడా  కేవలం  శ్రీరామ చంద్ర  మిషన్  లోని  అభ్యాసులకు  మాత్రమే  కాదు,  యావత్  మానవాళి  శ్రేయస్సును  ఉద్దేశించి  మనిషి జీవితం  యొక్క  అన్ని  పార్శ్వాలను  స్పృశిస్తూ, మానవాళి  భవిష్యత్తుకు  సంబంధించిన సందేశాలను,  మాస్టర్లను  గురించి,  నిగుఢ  ఆధ్యాత్మిక  సత్యాలను  గురించి  చాలా  సరళంగా  ఈ  సందేశాల  ద్వారా  అందించడం  జరిగింది. ఈ  గ్రంథాన్ని  గురించి  పూజ్య  చారీజీ  మహారాజ్  అనేక  సందర్భాల్లో  అనేక  ప్రసంగాల్లో  మాట్లాడిన  విషయాలను  తరువాయి  భాగంలో  తెలుసుకుందాం. అలాగే  పూజయ్ దాజీ  ప్రసంగాల్లో  చెప్పినవి  కూడా  తెలుసుకునే  ప్రయత్నం  చేద్దాం. అలాగే  మన  మదర్  హెలీన్  పైరే  గురించి  పూజ్య దాజీ  వివరించిన  అంశాలను  కూడా  తెలుసుకుందాం.

అయితే  ఈ  ప్రకంపనలు  ఏ  విధంగా  అందుకున్నదో  మనం  ఇంతకు  పూర్వం  చెప్పుకున్నాం. అంటే  శబ్ద రూపంలో  అందుకున్న  ఈ  సందేశాలను, (సంస్కృతంలో శబ్దం  అంటే  వైబ్రేషన్, అంటే  ప్రకంపన) మదర్  తన  మాతృభాష  అయిన  ఫ్రెంచి  భాషలో  తర్జుమా  చేయడం  జరిగింది.  ఆమేకు  ఫ్రెంచి  భాష  తప్ప  మరొక  భాష  రాదు. పూజ్య  చారీజీ  ఆ  సందేశాలందుకునేవారు  తెలుగు  వారై  ఉండుంటే  ఈ  సందేశాల మూలం  తెలుగు  భాషలో  ఉండేవని  చెబుతూండేవారు.  కాబట్టి  ప్రస్తుతం  ఈ  సందేశాలన్నీ  కూడా  ఫ్రెంచి  భాషలో  ఉన్నాయి.  వాటిని  ఆంగ్లంలొకి  తర్జుమా  చేసిన  తరువాత  పూజ్య  చారీజీ  ఆమోదించిన  తరువాత  అభ్యాసులు  చదువుకోవడానికి  అందించేవారు. ఆ  తరువాత  పూజ్య  దాజీ  ఆ  బాధ్యతలను  స్వీకరించారు. 2018, జూన్ లో  ఆమె  పరమపదించే వరకూ  ఈ  ప్రక్రియ  కొనసాగింది.  (సశేషం)


1 కామెంట్‌:

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...