"నేను" అంటే ఎవరు?
"నేను" అంటే ఎవరు? అద్భుతమైన తాత్త్విక ప్రశ్న. సమాధానం దొరికే వరకూ మనిషిని దొలిచివేసే ప్రశ్న. ఎన్ని ఉపన్యాసాలు విన్నా, ఎన్ని గ్రంథాలు చదివినా ఎన్ని అనుష్ఠానాలు చేసినా, అర్థమయినట్లుగా అనిపించి, పట్టు దొరకకుండా, మనిషి తెలివి తేటలకందకుండా జారిపోయే ప్రశ్న. చాలా ఆసక్తికరమైన ప్రశ్న. సమాధానం కనుక్కునే వరకూ అంతరంగంలో అంతర్లీనంగా శాంతి లేకుండా చేసే ప్రశ్న.
"నేను" అంటే ఈ శరీరం కాదు; మనసూ కాదు; బుద్ధీ కాదు; అహంకారమూ కాదు; చేతనమూ కాదు; వీటన్నిటినీ ప్రత్యక్ష సాక్షిగా చూస్తున్న వస్తువు ఆత్మ అనే ఒక ఉనికి; ఈ సత్యం అనుభవంలోకి రావడమే "నేను" అంటే ఏమిటో అనుభూతి చెందడం అని, ఆత్మసాక్షాత్కారం పొందిన మహాత్ములు తెలియజేస్తూ ఉంటారు.
ఇది సిద్ధించడానికి చంచలంగా ఉండే మనసును ప్రశాంతపరచాలి, నిశ్శబ్దం చేయాలి. మనసు ఎటువంటి తరంగాలూ లేకుండా, నిశ్చలంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ సత్యస్థితి అనుభవంలోకి వస్తుంది. మనసుకు అతీతంగా వెళ్ళగలిగే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు జీవితంలో యథాతథంగా సర్వమూ కానవస్తాయి; ఈ "నేను" అనే యదార్థ స్పృహతో ఉండటం వల్ల మనిషి భూమ్మీద ఉన్నంత సేపూ అత్యంత వివేకంతో మనుగడ కొనసాగించగలుగుతాడు; ఇది ఇహంలో కలిగే ప్రయోజనం. అలాగే పరంలో కూడా దీనికి ఆవల ఉన్న ఉన్నతోన్నత లోకాల ప్రయాణం చేస్తూ, ఈ అనంత యాత్రను సాఫీగా కొనసాగించగలుగుతాడు జీవుడు.
ఈ "నేను" లో ఎటువంటి వికారాలు గాని, అహం గాని, కోరికలు గాని ఉండవు; పరిశుద్ధమైన ఉనికి. అయితే ఈ అనంత యాత్ర ఎక్కడికి? "నేను" ను చూసే పరమ సాక్షి కూడా ఉన్నది. దాన్నే అధిష్ఠానం అని, పరతత్త్వం అని అంటారు. ఈ "నేను" ఆ పరతతత్వంలో సంపూర్ణంగా లయమై కరిగిపోయే వరకూ ఈ యాత్ర కొనసాగుతూనే ఉంటుంది.
ఈ "నేను" గురించి ప్రస్తావిస్తూ ఒకసారి బాబూజీ మహారాజ్ ఇలా అన్నారు: "నేను "నేను" అన్నప్పుడు అది నన్ను సూచిస్తున్నదో, లేక నా గురుదేవులను సూచిస్తున్నదో లేక ఆ పరమాత్మనే సూచిస్తున్నదో నాకు తెలియదు" అన్నారు. ఇది నా దృష్టిలో బాబూజీ పలికిన వాక్యాల్లో ఒక మహావాక్యం. అందరూ ధ్యానించదగ్గ వాక్యం.
కాబట్టి ఈ "నేను" కూడా సంపూర్ణంగా కరిగిపోయి శుద్ధచేతనంగా మారిపోవడమే మన లక్ష్యం; పరమసాక్షి అనుభూతి చెందడమే మన పరమ లక్ష్యం. నీటి చుక్క మహాసముద్రంలో కలిసి ఒక్కటైపోవడమే పరమ లక్ష్యం. ఈ విధంగా ఆత్మ పరమాత్మలో లాయమైతేనే ఆత్మ యొక్క సంపూర్ణ సాక్షాత్కారం జరిగే అవకాశం ఉంది.
ఇది నా అవగాహన మాత్రమే. ఎవరికి వారు సరి చూసుకోగలరు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి