జన్మదినం ఎందుకు జరుపుకుంటారు?
ఎందుకు జరుపుకోవాలి?
చాలా మంది జన్మదినాన్ని వేడుకగా ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. కొందరు కొవ్వొత్తి ఆర్పుతారు; కొందరు దీపం వెలిగిస్తారు, శుభసూచకంగా. కేక్ లు కోస్తారు లేక పిండివంటలు చేసుకుంటారు.
మరో రకం జన్మదిన వేడకలు - మహాత్ముల జయంతులుగా వారి గొప్పదనాన్ని స్మరించుకుంటూ, వారి బోధలు జ్ఞాపకం చేసుకుంటూ, పూజ్య భావంతో వారి ఆదర్శాలను గుర్తు చేసుకుంటూ జరుపుకుంటాం.
అలాగే మరో రకం జన్మదిన వేడుకలు - దేశానికి త్యాగం చేసినవారిని, మరచిపోలేని సేవలనందించిన వారిని, ఆదర్శ వ్యక్తులుగా ఆరాధిస్తూ కూడా వేడుకలు జరుపుకుంటూ ఉంటాం.
కానీ మన జన్మదినం మనమే ఎందుకు జరుపుకుంటామో నాకార్థమయ్యేది కాదు. నేనెప్పుడూ జరుపుకోలేదు కూడా. తల్లిదండ్రులు మన జన్మ దినం జరుపుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు; మన పిల్లలు మన జన్మదినం కృతజ్ఞతతో చేసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు; కానీ మన జన్మదినం మనమే చేసుకోవడంలో అర్థం ఏమిటో అని అనుకుంటూ ఉండేవాడిని.
భారతీయ సనాతన ధర్మ సాంప్రదాయం ప్రకారం, మానవ జన్మ కలిగినందుకు, అంటే మోక్షసాధన చేసుకోగలిగే వీలు కల్పించినందుకు, ఆధ్యాత్మికంగా ఎదిగే అవకాశం కలిగినందుకు, అంతరంగంలో కలిగిన ఆనందంతో ఆ పరమాత్మకు కృతజ్ఞతతో జరుపుకుంటామని స్ఫురించింది.
అయితే ఈ స్ఫూర్తితో, కృతజ్ఞతతో జన్మదినం జరుపుకోవడమేగాక ఈ లక్ష్యాని కోసమే జీవితాన్ని వెచ్చించాలన్న నూతన సంకల్పంతో ప్రతి సంవత్సరమూ నిరాశ పడకుండా సకారాత్మకంగా ఆలోచిస్తూ చేతనైనంత కృషి చేయాలి. అట్లే జరుగుగాక.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి