అహంకారం - ego
పైన చిత్రం: అహంకార ముద్ర. ఈ ముద్ర కనీసం 10 నిముషాలు చేస్తే ప్రయోజనం చాలా కనిపిస్తుందంటారు యోగసాధకులు.
అహంకారం అంటే నేను, నాది అనే భావం; అంతర్యామికి, జీవుడికి మధ్య ప్రధాన అవరోధాలు - అరిషడ్వర్గాలనే వికారాలు, కోరికలు, సంస్కారాలు, అహంకారం. వీటిల్లో అతిపెద్ద అవరోధం ఈ అహంకారం. మిగిలినవాటిని యేదో విధంగా తొలగించుకోవచ్చునేమో కాని, అహంకారాన్ని మాత్రం సాధకులు ఎవరికి వారు తొలగించుకోవలసిందేనంటారు మన మాస్టర్లు. అయితే ఈ అహంకారం లేకపోతే కూడా ఈ భూమ్మీద ఏ కర్మ చేయడానికి ఉండదు. "నేను ఈ పని చేయగలను" అని అనిపించేది అహం. కాని అహాన్ని స్వాధీనంలో ఉంచుకోవడానికి వినమ్రత అలవరచుకోమంటారు పూజ్య దాజీ. ఆహాన్ని శుద్ధి చేయగలిగే సాధనం ఈ వినయమే.
శాస్త్రాల ప్రకారం అహం అవిద్య వల్ల, అంటే ఆత్మను ఆత్మగా గాక శరీరము గాను, మనసు, బుద్ధి, అహంకారములగాను భావించడం వల్ల కలుగుతుంది. ఇది గుర్తించి సాధకుడు, ఈ అహాన్ని సంపూర్ణంగా శరణాగతి భావంతో ఆ అంతర్యామికి సమ ర్పించడమే పరిష్కారం. ఇది చెప్పినంత తేలిక కాదు. అందుకే సమర్థ గురువు యొక్క అవసరం. ఈ అహాన్ని ఆ గురువుకు సంపూర్ణంగా సమర్పించి జీవించడమే గొప్ప పరిష్కారం.
పూజ్య బాబూజీ పలికిన ఒక మహాయవాక్యంలో దీనికి సమాధానం కనిపిస్తుంది: "నిన్ను నువు మరచిపో. కేవలం ఆయన స్మరణలోనే ఉండు." ఇదే మనం సహజ్ మార్గ్ ధ్యానం ద్వారా మొట్టమొదటి రోజు నుండి నేర్చుకునేది.
"నిన్ను నువ్వు మరచిపో... " అంటే, మొట్టమొదట ఈ నేను అనే శారీరక స్పృహ పోవడం; ఆ తరువాత నేను అనే మానసిక (నేను అంటే మనసు, బుద్ధి, అహం అనే) స్పృహ కూడా పోవాలి; అప్పుడే శుద్ధ చేతనంతో ఒకటయ్యే అవకాశం ఉందంటారు. అంటే మన చేతనం యొక్క తత్త్వం మనం సాధన చేస్తున్న కొద్దీ పరిణతి చెందుతూ ఉంటుంది. ఇది మనం అనుభవం ద్వారా గమనించవచ్చకు. చేతన యొక్క తతత్వంలో మార్పులు వస్తున్న కొద్దీ మనిషిలో కూడా వికాసం జరుగుతూ ఉంటుంది.
నిత్యజీవితంలో మన మానవ సంబంధాల్లో, అహంకారం వల్ల దుష్ప్రభావాలే ఉంటాయి, నకారాత్మక ప్రభావాలే ఉంటాయి. వివేకాన్ని నశింపజేసేవిగానే ఉంటాయి. దీనికి పరిష్కారం మనం అహం గురించి అస్సలు మాట్లాడకుండా, చర్చించుకోకుండా, కేవలం ఎవరికి వారు అర్థం చేసుకుని, మన సంభాషణల్లో నాలుకను నియంత్రించుకుంటూ , సాధ్యమైనంత వరకూ పూజ్య లాలాజీ అందించిన సంభాషణా సూత్రాలను అనుసరించే ప్రయత్నంలో ఉండటం ఒక సమాధానం. అహం సంపూర్ణంగా లయమయ్యేది లయావస్థలోనే.
అహాన్ని దాటే ప్రయాణం అతి క్లిష్టమైన, పెద్ద ప్రయాణం. పూజ్య బాబూజీ కూడా సత్యోదయం అనే గ్రంథంలో యాత్రను 24 వృత్తాలుగా వివరించినప్పుడు అందులో 11 వృత్తాలు అహంకారానికి సంబంధించినవే.
అందుకే సమర్థ గురువు యొక్క ఆశ్రయం తప్పదు. ఇదే శాశ్వత పరిష్కారం.
అద్భుతం. ఈ ఒక్క కాకభూశుండి పేరుతొ నిర్మితమైన కన్హ శాంతి వనం ఆశ్రమం అందించే సహజ మార్గ హార్ట్ ఫుల్ నెస్ పధ్ధతి లోనే అహామ్ సమకాలీన సద్గురువు మాట వింటుందేమో !!
రిప్లయితొలగించండి