భయం
భయం ప్రతి జీవిలోనూ ఉండేదే. మనం ముఖ్యంగా మనుషుల్లో ఉండే భయాన్ని గురించి చర్చించుకుందాం.
భయం వల్ల మనిషి సరిగ్గా ఎదగవలసిన విధంగా ఎదగడం జరగదు. ఆధ్యాత్మికంగా కూడా. అలాగని భయం పూర్తిగా చెడ్డదని అనడానికి కూడా లేదు. కొంత భయం అవసరం అని కూడా అనుభవం ద్వారా తెలుసుకున్నాడు మనిషి.
రకరకాల భయాలు - చీకటి అంటే భయం, ఎత్తులంటే భయం, పాకే జీవులంటే (పాములు ఇత్యాదివి) భయం. తిరస్కరిస్తారన్న భయం, విఫలమవుతామన్న భయం, అపరాధం చేసినప్పుడు కలిగే భయం, అసత్యం పలికినప్పుడు కలిగే భయం, తప్పులు చేసినప్పుడు కలిగే భయం, కారణం తెలియని భయం, ఇలా ఎన్ని రకాల భయాలున్నా, అసలు భయం మాత్రం మృత్యు భయమే. ఆ భయం పోయిందంటే సమస్త భయాలూ పోతాయి. అమృతత్వం లభిస్తుంది అంటారు మన పెద్దలు.
ఈ భయం ముందు ఆందోళనకు దారి తీస్తుంది, వివేకం పని చేయదు, ఆత్మవిశ్వాసం క్షీణిస్తుంది. జీవితంలో యే విధంగానూ ఎదగడం జరగదు.
అయితే ఈ భయానికి మూల కారణం ఏమిటి? మన శాస్త్రాలేమంటున్నాయి?మన మహర్షులేమంటున్నారు? మన హార్ట్ఫుల్నెస్ గురుపరంపర చెప్పేదేమిటి? భయాన్ని పోగొట్టుకోడానికి పరిష్కారాలేమయినా ఉన్నాయా?
వేదంలో
అభినో భద్రాః క్రతవో యంతు విశ్వతః
- ఋగ్వేదం
దీనర్థం: అన్ని వైపుల నుండి ఉదాత్తమైన ఆలోచనలు కలుగుగాక. భయం అజ్ఞానం నుండి పుడుతుంది కాబట్టి, దీన్ని అధిగమించడానికి అన్ని దిక్కుల నుండి ఉదాత్తమైన, సాత్త్వికమైన ఆలోచనలు కలుగుగాక అని దీని అర్థం.
ఉపనిషత్తుల్లో
ద్వితీయాడ్ వి భయం భవతి
- బృహదారణ్యక ఉపనిషత్తు
దీనర్థం: ద్వంద్వం వల్లే భయం పుడుతుంది. అద్వైతం ద్వారానే భయం పతుంది అంటుంది ఉపనిషత్తు.
భగవద్గీతలో
అజ్ఞానం వల్ల, మమకారం వల్ల కలిగే బంధాల వల్ల భయం పుడుతుందంటాడు శ్రీకృష్ణ పరమాత్మ గీతలో. దీన్ని భక్తి వైరాగ్యాల చేత, ఆత్మ సాక్షాత్కారం ద్వారా అధిగమించాలంటాడు గీతాచార్యుడు.
అభయం శతత్వ సంశుద్ధిర్ జ్ఞాన యోగా వ్యవస్థితః
అభయం (నిర్భయత్వం) మనసు పవిత్రంగా శుద్ధిగా ఉన్నప్పుడు, ఆధ్యాత్మిక వివేకం కలిగినప్పుడు సాధ్యపడుతుందని దీని అర్థం.
శ్రీమద్రామాయణం
హనుమంతుడు భక్తి-విశ్వాసాల ద్వారా, సాహసం ద్వారా భయాన్ని అధిగమిస్తాడు.
రామో విగ్రహవాన్ ధర్మః
అంటే రాముడు మూర్తీభవించిన ధర్మం. అందుఅల్లా ఆ దివ్య వ్యక్తిత్వం, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని వీడలేదు.
మహాభారతం
యుధిష్ఠరుడు సత్యనిశఠతో ఉండటం వల్ల నిర్భయతవాన్ని సాధించాడు.
భీష్ముడు మృత్యుశయ్యపై ఉన్నా కూడా భయం లేకపోవడానికి కారణం జీవితం అంతా ధార్మికంగా జీవించడం వల్ల.
మన శాస్త్రాల ప్రకారం భయానికి మూలకారణాలు
ఆవిద్య (అజ్ఞానం) - ఆత్మజ్ఞానం లేకపోవడం
రాగద్వేషాలు - మమకారాలు, వికర్షణలు, కోల్పోతామన్న భయం
అహంకారం - మృత్యుభయం
కర్మ - వ్యక్తి చేసే కర్మల వల్ల కలిగే పరిణామాల భయం
సహజ మార్గ గురుపరంపర
ఆత్మ, ఆ పరమాత్మ నుండి, ఆ మూలం నుండి మొట్టమొదటిసారిగా విడిపోయినప్పుడు కలిగినది భయం. భయమే ఆత్మ ఏర్పరచుకున్న మొట్టమొదటి సంస్కారం. మిగిలిన సంస్కారాలన్నీ భయం వల్ల ఏర్పడ్డవే. భయాన్ని నిరంతర స్మరణ ద్వారా తొలగించుకోవచ్చునన్నారు, పూజ్య చారీజీ మహారాజ్.
బ్యూటిఫుల్
రిప్లయితొలగించండి