27, జులై 2025, ఆదివారం

దేవర్షి నారద - భక్తికి ప్రమాణం

 


దేవర్షి నారద - భక్తికి ప్రమాణం   
(☝ భక్తిపై ప్రసంగం కోసం ఇక్కడ పైన క్లిక్ చేయగలరు)
*
బ్రహ్మర్షి విన్నాం, రాజర్షి విన్నాం. నారద మహర్షిని దేవర్షి అంటారు. మన పురాణేతిహాసాల్లో  భక్తికి ప్రామాణికంగా కనిపించే వ్యక్తి నారద మహర్షి. మన చలన చిత్రాల్లో చూపించినట్లుగా ఒక కామిక్ ఫిగర్ కాదు; కలహాలు పెట్టేవాడు కాదు. ఒకవేళ పెట్టినా ఆ కలహాలు లోకకళ్యాణం కోసమే ఉద్దేశించే ఉండేవి. 

నారద అనే పదానికి అర్థం ఇలా చెప్తారు: నారం దదాతి ఇతి నారద. నారం అంటే నరుడికిచ్చేది అంటే ఆత్మజ్ఞానం. ద అంటే ఇవ్వడం; నారద అంటే ఆత్మజ్ఞానం ప్రసాదించేవాడు, అని అర్థం. నారా అంటే నారాధర్మం, మానవ ధర్మం అని కూడా అర్థం ఉంది. అత్యున్నత మానవ ధర్మం ఆత్మజ్ఞానం. 

వేదవ్యాసునికి శ్రీమద్భాగవతం వ్రాయడానికి ప్రేరణ నారద మహర్షే. ప్రహ్లాదుడికి, ధ్రువుడికి, వాల్మీకి మహర్షికి ఆత్మజ్ఞానం ప్రసాదించినది నారడుడే. భగవంతునికి అతిప్రియమైనవాడు నారదుడు; నారాదుడునికి అతి ప్రియమైనవాడు భగవంతుడు, బాగవత ప్రియుడు. 
నారదుని వ్యక్తిత్వం: ఆయనను బ్రహ్మమానస పుత్రునిగా పురాణాలు చెప్తున్నాయి. అంతే కాదు, ఆయన గొప్ప ఆత్మ జ్ఞాని, భాగవత భక్తుడు, అందరి శ్రేయస్సు కోరేవాడు, అన్ని కళలూ తెలిసిన విద్వాంసుడు. ఆయనే వీణను కనిపెట్టారని చెప్తారు. భగవంతుడే స్వయంగా ఆయనకు వీణను ప్రదానం చేశారని కూడా చెప్తారు. ఆయన వీణ పేరు మహతి. 

ఆయనకు 14 లోకాలు సంచరించే వారం ఉంది. దేవతలే గాక, ఋషులు, మునులు, మహారాజులతో కూడిన మనుష్యలోకం, అసురులు, ఆశ్రమాలు అన్ని చోట్లా ఆయనను స్వాగతించేటువంటి వ్యక్తిత్వం వారిది. 

భక్తికి ప్రామాణిక గ్రంథాలు రెండే - నారద భక్తి సూత్రాలు, శాండిల్య భక్తి సూత్రాలు. కానీ నారద భక్తి సూత్రాలు చాలా ప్రసిద్ధి. 

ఈ గ్రంథంలో:
భక్తి దవభావం ఏమిటి? భక్తిని పెంపొందించుకోవడం ఎలా? భక్తిని చాటే లక్షణాలేమిటి? భక్తిని అలవరచుకోవడానికి చెయ్యవలసిన సాధనలేమిటి? భక్తి మార్గంలో కలిగే అవరోధాలేమిటి? వాటిని యే విధంగా అధిగమించాలి? భక్తిలో వివిధ స్థాయిలేమిటి? మన హృదయంలో భక్తి జాగృతమయ్యిందా, లేదా అనేది ఎలా తెలుస్తుంది? భక్తి హృదయంలోకి ప్రవేశించకుండా ఆపేది యేది? ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి? హెచ్చరికాలేమిటి? నేను భక్తి మార్గంలో ఉన్నా కూడా నేనెందుకు పురోగతి చెందడం లేదు? భక్తి ఎంతో ముఖ్యమైనదిగానూ, అలాగే అదే సమయంలో తేలికైనదిగానూ   ఎలా ఉంది? తక్కిన సాధనాలతో పోలిస్తే భక్తి సాధన ఎందుకని అంతా తేలిక? భక్తి లేకుండా ఇతర సాధనా పద్ధతులు సరైన ఫలితాలు ఎందుకని ఇవ్వవు? భక్తి అలవరచుకోవడం వల్ల ప్రయోజనాలేమిటి? 

పైన చెప్పిన ఈ అంశాలన్నీ ఈ గ్రంథంలో విస్తారంగా చర్చించడం జరిగింది. త్రికరణ శుద్ధిగా ఆధ్యాత్మిక సాధన చేసే సాధకులందరూ తప్పనిసరిగా అధ్యయనం చెయ్యవలసిన నిగూఢ ఆధ్యాత్మిక గ్రంథం - నారద భక్తి సూత్రాలు




2 కామెంట్‌లు:

  1. నారద భక్తి సూత్రములు

    38 * సూ
    ౹౹ ముఖ్యతస్తు మహాత్క్రుపయైవ భగవత్క్రుపా లేశద్వా ౹౹

    పద ౹౹ ముఖ్యతః ౼ తు ౼ మహత్క్రుపయా ౼ఏవ, భగవత్క్రుపా లేశాత్ ౼ వా.

    టీక ౹౹ ముఖ్యతస్తు = ఈ దైవభక్తియందు ముఖ్యమైనది, మహత్క్రుపయైవ = మహాత్ములయొక్క కృపచేతనే , ఆధవా=
    భగవత్క్రుపా లేశాద్వా=భగవత్క్రుపా కటాక్షలేశముచేతను గలుగవచ్చును.

    తా౹౹ ముఖ్యముగ మహాత్ములయొక్క కృపవలనను, భగవంతుని యొక్క కృపాలేశము వలనను ఈ భక్తి బాగుగ కలుగగలదు.

    భక్తిని చక్కగ సాధించుటకు నారదడు విషయ త్యాగము, నిరంతరము భజన, శ్రవణ కీర్తనములు మున్నగునవి చెప్పి, ఇపుడు ముఖ్యముగ భక్తి దేనివలన లెస్సగ ప్రాదుర్భవించునో ఆ రహశ్యమును చెప్పుచున్నారు. అదియే దైవకరుణ,మహాత్ముల అనుగ్రహము. భక్తి యొక్క ప్రాదుర్భావమునకు, అభివృద్ధికి ఈ రెండును అత్యావశ్యకములై యున్నవి. కనుకనే "ముఖ్యతః"అను
    పదము ప్రయోగింపబడెను. కాబట్టి సాధకులు ఈ విషయమును బాగుగ గుర్తెరిగి దైవానుభూతిని కలిగిన పెద్దల సాంగత్యమును భగవత్ప్రార్థన, సంకీర్తన, ధ్యానాదులను గావించవలెను. దీనినే
    సత్సంగత్యమని చెప్పుదురు. భక్తిని లెస్సగ సాధించుటకిట్టి సత్సాంగత్యము, మహాత్ములసేవ, గురుసేవ చాల అవశ్యకమై యున్నవి. భగవద్గీత 4వ. అధ్యాయమున "తద్విద్ధి ప్రణిపాతేన.."
    అను శ్లోకముద్వారా మహాత్ములను సేవించి భగవత్తత్త్వమును బడయవలెనని పేర్కొనబడి యున్నది. ఇట్టి సత్సాంగత్యముచే
    మహాత్ముల అనుగ్రహమును, దైవ ధ్యానాదులచే భగవంతుని యొక్క అనుగ్రహము పొందినచో ఇక సాధకునకు ఏమి కొఱవ?
    వారికి జ్ఞానాదులన్నియు సిద్ధించినట్లే యగును. వానిచే జీవితము ధన్యము కాగలదు.

    నారద భక్తి సూత్రములు

    39 * సూ౹౹
    మహత్సంగస్తు దుర్లభో ౽గమ్య౽మోఘశ్చ ౹౹
    పద ౹౹ మహత్సంగ : - తు- దుర్లభః - అగమ్య: -ఆమోఘ: - చ .
    టీక ౹౹ మహత్సంగస్తు=మహాత్ముల సాంగత్యమైతేనో, దుర్లభః = దుర్లభమైనది, అగమ్య:=పొందుటకు సామాన్యముగా అసాధ్యమైనది. ఆమోఘశ్చ=ఒకవేళ కలిగినచో వ్యర్థముగానిది.

    తా ౹౹ మహాత్ముల సాంగత్యము చాల దుర్లభము, అగమ్యము, ఆమోఘము అయి యున్నది.

    మహనీయుల అనుగ్రహము చేతను భగవంతుని కృపాలేశము చేతను భక్తి బాగుగ అభివృద్ధి నొందగలదని క్రీందటి సూత్రమున చెప్పబడినది. అయితే మహనీయుల సాంగత్యము అంత చులకనగా లభించునదికాదని, అది మహాదుర్లభమని ఇచట చేర్చబడినది. గురువులు దొరక వచ్చును గానీ సద్గురువు దొరకుటచాల అరుదు. అట్టి వారెచటయున్నారో ప్రయత్న పూర్వకముగ వెతికి వారిని సేవించి శుశ్రూష గావించి, వారి యనుగ్రహమును బడయవలెను. గుర్వనుగ్రహము,దైవానుగ్రహము సాధకునకు ఆమోఘఫలితము నొసంగును. దానిచే జీవుని అవరించిన మాయా ఆవనిక(తెర) విచ్ఛిన్నమై పోవును.తద్ద్వారా బంధవిముక్తి సిద్దించును. ఈ సూత్రమున తెలుపబడిన లాగున మహనీయుల సాంగత్యము దుర్లభమైనను, దుసాధ్యమైనను, అసాధ్యము కాదు. కనుక అనుభూతి పరులగు అట్టి భక్తవరేణ్యులను సముద్రములో రత్నములను వెతికినట్లు వెతికి వారి సేవాదులను గావించవలెను. గ్రుడ్డివానికి గ్రుడ్డివాడు దారిచూపలేడు. కన్నులు కలవాడే చూపకలడు. కావున జ్ఞాన నేత్రములు కల మహనీయులే సంసారవంక పరిమగ్నులను, అజ్ఞాన తిమిర యుక్తులునగు జనులకు దారి చూపగలరు. వారి సాంగత్యమే సత్సాంగత్యము. భక్తి యొక్క అభివృద్ధికి అది ఎంతేని దోహదమును కలుగజేయగలదు.

    రిప్లయితొలగించండి
  2. సమకాలీనులైన సద్గురువు లభించినప్పుడు, జ్ఞానం, భక్తీ, అన్నీ అలవడతాయి. అప్పుడు మనిషి జీవిత లక్ష్యం యొక్క అవగాహన కలిగి ఆత్మ సమర్పణ కు దారి తీసి అయన లోనే లయం అయ్యే అవకాశం లభిస్తుంది. మనిషి మారాలని అని తపన కలిగినప్పుడు గురువు తన వద్దకే వస్తాడంటారు మరి.
    కృష్ణా రావు గారు చక్కగా పరిచయం చేసారు నారద దేవర్షి మాహాత్ములను.

    రిప్లయితొలగించండి

తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 5

  జయ్యారం గ్రామ ఆశ్రమం - ధ్యాన మందిరం  తెలంగాణాలో  శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా  నా ప్రస్థానం - 5 పూజ్య గురుదేవల కృపా దృష్టి కొనస...