16, ఫిబ్రవరి 2024, శుక్రవారం

హార్ట్ఫుల్నెస్ సహజమార్గ ధ్యాన పద్ధతి - 2

 




హార్ట్ఫుల్నెస్ సహజమార్గ ధ్యాన పద్ధతి - 2 

హార్ట్ఫుల్నెస్  ధ్యాన పద్ధతిని సహజమార్గ ధ్యాన పద్ధతి అని కూడా అంటారు. ఇది రాజయోగ ధ్యాన పద్ధతి అంటే ఆలోచనా శక్తిని వినియోగిస్తూ  ధ్యానించే పద్ధతి.

 

హార్ట్ఫుల్నెస్  ధ్యాన పద్ధతి యొక్క 4 ప్రధాన యౌగిక ప్రక్రియలు

1) ధ్యానానికి ముందు రిలాక్సేషన్

2) ఉదయం ధ్యానం

3) సాయంకాల శుద్ధీకరణ

4) రాత్రి పడుకొనే ముందు ప్రార్థనా-ధ్యానం  

 హార్ట్ఫుల్నెస్  రిలాక్సేషన్

ఈ యోగ  ప్రక్రియ శరీరంలోనూ, మనసులోనూ పేరుకుపోయిన ఒత్తిడిని చాలా వరకూ తొలగించి, ధ్యానానికి సిద్ధం చేస్తుంది.

ట్రైనర్లు ఇచ్చే ఆదేశాలతో/సూచనలతో కూడిన ఈ ప్రక్రియ చాలా సరళమైనది, ఎవరైనా దీన్ని అభ్యాసం చేయవచ్చును. వయసుతో నిమిత్తం లేదు. ఒక 7-8 నిముషాల ప్రక్రియ. శరీర వివిధ భాగాలను పలుకరించే ప్రక్రియ. తద్వారా శరీరంలోని, మనసులోని ఒత్తిడి చాలా వరకూ తొలగిపోయి, బరువు తగ్గినట్లు, చాలా తాజాదానం యొక్క అనుభూతిని కలిగిస్తుంది. ఆ విధంగా ఈ ప్రక్రియ అసలు ధ్యానానికి సంసిద్ధులను జేస్తుంది. 

ఉదయం ధ్యానం  

ధ్యానం యొక్క ముఖ్య ప్రయోజనాలు రెండు –

1) చంచలంగా ఉండే మనసును క్రమశిక్షణలో పెట్టడం, మనసును క్రమబద్ధీకరించడం,

2) మనసుకు అతీతంగా, మనసును దాటి ఆవలనున్న ఉన్నత ఆధ్యాత్మిక స్థితులను  అనుభూతి చెందడం.

హార్ట్ఫుల్నెస్  ధ్యానం హృదయాన్ని కేంద్రంగా తీసుకుని ధ్యానించే ప్రక్రియ. స్థిరమైన, సుఖమైన ఆసనంలో కూర్చొని, సున్నితంగా కళ్ళు మూసుకొని,  దృష్టిని హృదయంపై ఉంచి, హృదయాంతరాళంలో ఒక దివ్య వెలుగు ఉందన్న ఆలోచనతో ఉంటూ, హృదయప్రాంతంలో, అంటే గుండె కొట్టుకునే ప్రాంతంలో ఏమి జరుగుతున్నదీ, గమనించే ప్రయత్నం చేయడం. ధ్యానిస్తున్నప్పుడు వచ్చే ఆలోచనలను పట్టించుకోకుండా, ధ్యాన వస్తువైన,  లోపల  వెలుగు ఉందన్న ఆలోచనపై దృష్టిని సారించే ప్రయత్నం చేయాలి. ఇలా చేయగా, చేయగా కొన్ని రోజులకే మనసు క్రమబద్ధమై, మానసిక ప్రశాంతతను, తేలికదనాన్ని అనుభూతి చెందడం ప్రారంభిస్తారు. ఈ ధ్యానం యొక్క మొదటి  ప్రత్యేకత, ప్రాణాహుతితో కూడిన ధ్యానం  కావడం. సూర్యోదయానికి పూర్వం ఒక అరగంట సేపు  చేసుకునే ప్రక్రియ.

ప్రాణాహుతి ప్రసరణ

 ప్రాణాహుతి అనేది మూలం నుండి వచ్చే  సూక్ష్మాతిసూక్ష్మమైన శక్తి. ప్రాణాహుతి అనే దివ్య ప్రసరణతో కూడిన ధ్యానం అవడం వల్ల, ధ్యానించడం తేలికైపోతుంది; చంచలంగా ఉండే మనసు త్వరితంగా నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంది. సాధకుడికి ఈ శక్తి సహాయకారిగా ఉంటుంది. అంతేకాదు, ఆధ్యాత్మిక యాత్రలో అనేక జటిల పరిస్థితులను అధిగమించడంలో సహాయపడటమే గాక, యాత్రలో చాలా సమయాన్ని ఆదా చేస్తుంది.  ఈ ఒక్క జన్మలోనే, ఇంకా చెప్పాలంటే అందులో కొంత భాగంలోనే  యాత్ర పూర్తయ్యే అవకాశం ఉంది.


హార్ట్ఫుల్నెస్ సహజమార్గ ధ్యాన పద్ధతి - 1


హార్ట్ఫుల్నెస్ సహజమార్గ ధ్యాన పద్ధతి 

హార్ట్ఫుల్నెస్  సంస్థ

సహజమార్గ ధ్యాన యౌగిక ప్రక్రియలు


ఉచితంగా ధ్యానం నేర్చుకోండి

రోజురోజుకీ ఒత్తిడి తగ్గించుకుంటూ, రోజురోజుకూ మనశ్శాంతిని పెంచుకుంటూ, జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకొని జీవన  సార్థక్యం సాధించుకునే హార్ట్ఫుల్నెస్  జీవన విధానాన్ని అనుసరించండి. ప్రాపంచిక, ఆధ్యాత్మిక పార్శ్వాలను మేళవిస్తూ సమర్థవంతంగా జీవించండి.

అంతే కాదు, ఆధ్యాత్మిక చక్రాల ద్వారా జరిగే ఆత్మ యొక్క చైతన్య వికాస యాత్రను, మన మోక్ష యాత్రను  అనుభవపూర్వకంగా ఈ సంస్థ అధ్యక్షులు, గురుదేవులైన పూజ్య దాజీ మార్గదర్శనంలో తెలుసుకోండి.

ధ్యానానుభూతి పొందాలనుకున్నవారు, ఎవరి విధిని వారు రూపకల్పన చేసుకోవాలనుకున్నవారు, పరిపూర్ణత సాధించాలనుకున్నవారు, నిజమైన వ్యక్తిత్వ వికాసం కావాలనుకున్నవారు, ఆధ్యాత్మిక జిజ్ఞాసువులు, అంతరంగ మార్పును శాశ్వతమైన పరివర్తనను కోరుకునేవారు, ప్రతి రోజూ తమకు తాము ఒక గంట సేపు ధ్యానానికి వెచ్చించగలవారు, అందరూ ఈ సరళమైన హార్ట్ఫుల్నెస్  ధ్యాన పద్ధతికి  ఆహ్వానితులే .

ధ్యానం ప్రారంభించడానికి గల అర్హతలు:                                        15 సంవత్సరాల వయసు దాటి, ఎటువంటి మానసిక  రుగ్మతలు  లేని వారు, తమనుతాము మార్చుకోవాలనుకున్నవారు సగటు ఆధ్యాత్మికాభిలాషులెవరైనా సాధన చేయడానికి సంసిద్ధులైతే చాలు.  

సాధన ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నవారు ఈ కరపత్రం చివరనున్న నెంబర్లను సంప్రదించగలరు. మా ట్రైనర్ల ద్వారా ఇతర వివరాలు తెలుసుకోగలరు. లేక

heartfulnessApp అనే మొబైల్ ఆప్ ను playstore ద్వారా డౌన్లోడ్  చేసుకుని కూడా సంప్రదించవచ్చు.

 శ్రీరామచంద్ర మిషన్, హార్ట్ఫుల్నెస్  సంస్థలు లాభాపేక్ష లేని ఆధ్యాత్మిక సంస్థలు. వీటి ఉనికి 160 దేశాలలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 15000 కు పైగా స్వచ్ఛంద సేవగా ఉచితంగా 24 గంటలూ సేవలనందిస్తున్న ట్రైనర్లున్నారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం రంగారెడ్డి జిల్లాలోని, నందిగామ మండలంలో కాన్హా శాంతి వనం అనే పేరుతో లక్ష మంది ఒకేసారి ధ్యానం చేసుకోగలిగే ప్రపంచంలోనే  అతిపెద్ద ధ్యాన మందిరం ఉంది.  వివరాలకు ఈ క్రింది వెబ్ సైటును కూడా సంప్రదించవచ్చు:

www.heartfulness.org 

15, ఫిబ్రవరి 2024, గురువారం

బాబూజీ సహజ మార్గ సాహిత్యం - 5 ప్రధాన గ్రంథాలు

 


బాబూజీ సహజ మార్గ సాహిత్యం - 5 ప్రధాన గ్రంథాలు  

బాబూజీ మహారాజ్ 1945 లో గురుపరంపర యొక్క దివ్య మార్గదర్శనంలో, తన గురుదేవుల పేరున, గురుదక్షిణగా, శ్రీ రామ చంద్ర మిషన్ అనే ఒక లాభాపేక్ష లేనటువంటి ఆధ్యాత్మిక సంస్థను స్థాపించటం జరిగింది. తద్వారా ఆధ్యాత్మిక చరిత్రలోనే ఒక విప్లవాత్మక సహజ మార్గ రాజయోగధ్యాన పద్ధతిని పరిచయం చేయడం జరిగింది. ఆ తరువాత ఈ పద్ధతికి సంబంధించిన అయిదు మూల గ్రంథాలను  ఆవిష్కరించడం కూడా జరిగింది. క్లుప్తంగా వీటిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

మనిషి భూమ్మీదకు వచ్చిన జన్మ ప్రయోజనాన్ని సాధించడం కోసం, సరైన జీవన విధానం అవలంబించగలగడం కోసం, ముఖ్యంగా ఆధునిక మానవుడి అవసరాలకు అనుగుణంగా ఉండేటువంటి జీవన విధానాన్ని, మనం జటిలంగా భావించే ఆధ్యాత్మిక మోక్షయాత్రను ఒక్క జన్మలోనే, ఇంకా చెప్పాలంటే జీవితంలోని కొంత భాగంలోనే పూర్తి చేయగలిగే విధంగా, మార్గదర్శనం చేసే క్రమంలో ఈ మూల గ్రంథాలు మానవాళికి అందించారు బాబూజీ. 

అప్పటి వరకూ ఉన్న పద్ధతులకు భిన్నంగా, అనవసరమైన అంశాలన్నీ తొలగించేసి, కేవలం సారాన్ని మాత్రమే మిగల్చడం జరిగింది. వ్యర్థంగా శ్రమించకుండా, ఎంతో సమయాన్ని చేసేటువంటి సహజ మార్గ పద్ధతిని, ఈ మూల గ్రంథాల ద్వారా వెల్లడించారు. 

ఈ గ్రంథాలు ఆంగ్లంలో ఈ విధంగా ఉన్నాయి:
1) రియాలిటీ ఎట్ డాన్ (సత్యోదయం) -1954
ఈ గ్రంథంలో 23 వృత్తాల ద్వారా ఆత్మ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని వర్ణించారు బాబూజీ. అంతే కాదు, సగటు మనిషి ప్రయాణం, మతంతో ప్రారంభమై, సాక్షాత్కారం వరకూ ప్రయాణించడంలో దోహదపడే ప్రముఖమైన మజిలీలను గురించి అద్భుతంగా కళ్ళకు కట్టినట్లు చూపించారు. చివరి అధ్యాయంలో వారు దర్శించిన కొన్ని భవిష్యత్తులోని అనూహ్య అంశాలను వెల్లడించడం జరిగింది. వాటిల్లో కొన్ని అంశాలు ఇప్పటికే కార్యరూపం దాలచ్చాయి కూడా. 

2) ఎఫికసీ ఆఫ్ రాజా యోగా ఇన్ ది లైట్ ఆఫ్ సహజ్ మార్గ్ (సహజ మార్గ దృష్ట్యా రాజయోగ ప్రభావం) -1981 
ఈ పుస్తకాన్ని అధిచేతనాస్థితిలో వ్రాయడం జరిగింది. ఇందులో ఉల్లేఖించబడిన వాస్తవాలు ప్రకృతిని అధ్యయనం చేయడం ద్వారా, అంటే అనుభవ శక్తి ద్వారా తెలుసుకున్నవి. ఈ గ్రంథంలో సహజ మార్గ దృష్ట్యా రాజయోగ ప్రభావాన్ని వెల్లడించడం జరిగింది. 
హృదయ, మనో, కేంద్ర క్షేత్రాలనే వివిధ క్షేత్రాల గుండా ఆత్మ యే విధంగా ప్రయాణిస్తున్నదీ ఇందులో తెలియజేయడం జరిగింది. 

3) టువార్డ్స్ ఇన్ఫినిటీ (ఆనంతుని వైపు) - 1963 
ఈ గ్రంథంలో, ముందుమాటలోనే, గ్రంథకర్త ఈ గ్రంథం యొక్క ముఖ్యోద్దేశ్యము, నొక్కి చెప్పదలచుకున్నది - నిజమైన జ్ఞానం అంటే ఏమిటో స్పష్టంగా తెలియజేయడమేనని చెప్పడం జరిగింది. ప్రపంచం పరివర్తన చెండాలన్నది ప్రకృతి యొక్క సంకల్పమని, అదేమిటో అర్థం కావాలంటే నిజమైన జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోకపోతే అసాధ్యమని చెప్పారు గ్రంథకర్త.  
ఈ గ్రంథ ద్వారా తెలియజేసిన 13 గ్రంథుల్లో ప్రతీ గ్రంథిలోనూ సాధకులు ప్రత్యక్షానుభవంతో లయావస్థ పొందుతూ, పుస్తకజ్ఞానం గాకుండగా నిజమైన జ్ఞానాన్ని పొందాలని కోరుతున్నారు. 
బాబూజీ ఒకరకమైన ఆగత్యంతో మానవాళికి శుద్ధమైన ఆధ్యాత్మికతను అందించాలని, మానవుడు అతి త్వరితంగా సాక్షాత్కారాన్ని సాధించాలని, తద్వారా తన జన్మను సార్థకం చేసుకోవాలని కోరుతున్నారు. 

4) కామెంటరీ ఆన్ టెన్ మ్యాక్సిమ్స్ (దశనియమాలపై వ్యాఖ్య ) - 1959 
ఇప్పటివరకూ కేవలం మనసు నుండి మనసు ద్వారా మాత్రమే అందుకున్నటువంటి ఆధ్యాత్మిక రహస్యాలను ఈ గ్రంథంలో వెల్లడి చేసే ప్రయత్నం చేశారు బాబూజీ. కానీ వీటిని నేరుగా గ్రహించడం ద్వారా, ప్రకృతిని అధ్యయనం చేయడం ద్వారా ప్రకంపనాల వల్ల తెలుసుకోగలమే తప్ప, వాటిని మాటల్లో వ్యక్తం చేయడం అస్సలు సాధ్యంకానిది. 
"నిజమైన ప్రేమను మాటల్లో చెప్పలేము. ఈ పరమసత్యాన్ని ఎప్పటికీ మాటల్లో వ్యక్తం చెయ్యలేము."
 

5) సహజ్ మార్గ్ ఫిలాసఫీ (సహజ మార్గ దర్శనం) - 1969
ఈ గ్రంథం ఫిలాసఫీ గురించి, సహాజమార్గ చరిత్రను గురించి, సహజమార్గ ముఖ్య రూపురేఖలను గురించి, ప్రస్తావిస్తుంది. సత్యతత్త్వం యొక్క స్థిర, క్రియాశీలక అంశాలను వివరిస్తుంది. మనిషిని గురించి, అతనికి దైవంతో ఉన్న సంబంధాన్ని గురించి, ఇందులో చర్చ ఉంటుంది. సాక్షాత్కారపథాన్ని వర్ణిస్తుంది. సాక్షాత్కారపథంలోని వివిధ దశలను కూడా వర్ణిస్తుంది. 

పైన ఉల్లేఖించిన గ్రంథాలన్నీ కూడా భవిష్యత్తు కోసం వ్రాశానని అంటూండేవారు బాబూజీ. 100 సంవత్సరాల తరువాత వచ్చే తరాలకు, ఈ గ్రంథాలు  అర్థమవుతాయని చెబుతూండేవారు. అంతేకాదు వారి పుస్తకాలకు పునఃసమీక్షలు అవసరం లేదనేవారు. ఎందుకంటే అన్నీ పై నుండి వచ్చినవే గనుక; అధిచేతన స్థితిలో వ్రాసినవే గనుక. ఈ పుస్తకాలు పదే పదే, కనీసం సంవత్సరానికి ఒకసారైనా చదువుకోవలసిన గ్రంథాలు. ఈ గ్రంథాలను మన ఆధ్యాత్మిక ప్రగతిని ప్రతిబింబింపజేస్తాయి. వివిధ దశలలో వివిధ అర్థాలు స్ఫురింపజేస్తూ ఉంటాయి. సహజ మార్గ అభ్యాసం చేస్తూ ఈ గ్రంథాలు చదవమని చెప్తూండేవారు చారీజీ మహారాజ్. 


10, ఫిబ్రవరి 2024, శనివారం

శ్రీరామచంద్ర మిషన్ సంస్థాపన, షాజహానుపూర్ - సహజమార్గ పద్ధతి జన్మస్థలి - బాబూజీ మాటల్లో

 



శ్రీ రామ చంద్ర మిషన్ సంస్థాపన, 
షాజహానుపూర్ - సహజమార్గ పద్ధతి జన్మస్థలి,
- బాబూజీ మాటల్లో 

శ్రీరామచంద్ర మిషన్ మార్చ్ 31, 1945 న సహాజహానుపూర్ లో పూజ్య లాలాజీ పేరున (శ్రీరామ చంద్ర), నా ద్వారా, ఆయన అనుగ్రహం వల్ల, స్థాపించడం జరిగింది. నెమ్మదీనెమ్మడిగా అన్నీ వైపుల నుండి యదార్థ సత్యాన్ని తెలుసుకోవాలనుకున్న జిజ్ఞాసువులు ఆకర్శింపబడుతూ ఉన్నారు. మాస్టర్ కృప ఈ విషయంలో బాగా పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. జనం వారి అనుగ్రహం నుండి ప్రయోజనం పొందడానికి ఆకర్షితులవుతున్నారు. 

సంస్థలో ప్రస్తుతం అనుసరింపబడే ఈ సహజ మార్గ ధ్యాన పద్ధతి ఆ పరతత్త్వాన్ని చేరుకోడానికి తేలికైన, సరళమైన ఆధ్యాత్మిక పథాన్ని అందిస్తున్నది. నిత్యజీవితంలో మనిషి ప్రత్యక్షంగా అవలంబించలేని పచ్చి పద్ధతులను సూచించకుండా సరళమైన మార్గాన్ని సూచిస్తున్నది. సహజ మార్గ ఆధ్యాత్మిక శిక్షణలో ఇంద్రియాలను సహజమైన రీతిలో క్రమబద్ధం చేసి మూల పరిశుద్ధ స్థితికి తీసుకువస్తుంది; అంటే మొట్టమొదటిసారి మానవ రూపం సృష్టింపబడినప్పుడు ఎలా ఉండేవాడో మనిషి, సరిగ్గా అటువంటి మూలస్థితికి తీసుకువస్తుంది సహజ మార్గం. అంతే కాదు, స్వతంత్రంగా వ్యవహరించే నీచ వృత్తులను అధిచేతన నియంత్రణలోకి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి విపరీత చర్యలు ఆగిపోతాయి. ఉన్నత కేంద్రాలు దివ్య కేంద్రాల అధీనంలోకి వచ్చేస్తాయి, ఈ విధంగా మొత్తం శరీర వ్యవస్థ అంతా దివ్యీకరింపబడటం ప్రారంభమవుతుంది. 

ఈ సాధనా పద్ధతి యొక్క ముఖ్య లక్షణం ఏమిటంటే, మనిషి సాధారణ జీవన గడుపుతూ కూడా, తన విధులను, బాధ్యతలను తగిన విధంగా నిర్వహిస్తూ కూడా - తన జజీవితంలోని రెండు పార్శ్వాలను - ప్రాపంచిన, పారమార్థిక పార్శ్వాలను సమానంగా ప్రకాశించేలా పెంపొందించుకోవచ్చు. మహానీయుడైన మాస్టర్ ముందుంచిన ఈ ఆదర్షాన్ని, కొత్తగా పరిచయమైన సహజ మార్గ పద్ధతి ద్వారా వ్యాపింపజేయడం, నిద్రావస్థలో ఉన్న మానవాళిలో  దివ్యచేతనాన్ని  జాగృతం చేసి, తద్వారా వారిని ఆధ్యాత్మిక ప్రగతిపథం వైపుకు నడిపించడమే ఈ సంస్థ ఆశయం. ఈ ప్రయోజనం సిద్ధించాలంటే, బలవంతంగా కఠినంగా చేసే తపస్సులతో కూడిన,  పాత యాంత్రిక పద్ధతులను, ఆధునిక సమయానికి అస్సలు అనుకూలంగా లేనటువంటి  పద్ధతులను విడనాడి, తప్పనిసరిగా ప్రక్కన పెట్టి, వాటి స్థానంలో సరళమైన, సహజమైన మార్గాలను అనుసరించడం అత్యవసరం. 

8, ఫిబ్రవరి 2024, గురువారం

బాబూజీ - లాలాజీ గురించి - 7

 


బాబూజీ - లాలాజీ గురించి - 7 

లాలాజీలో నిజమైన మహానీయుడి లక్షణాలు, పరిపూర్ణ వ్యక్తిత్వ లక్షణాలున్నాయి. 

కేవలం ఏడు మాసాల స్వల్ప కాలంలోనే లాలాజీ పరిపూర్ణత్వాన్ని సాధించడం మహాద్భుతం కాదా? ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడే ఆయన శరీర వ్యవస్థలో అంతరంగం  మొత్తం అంతా కూడా దివ్యకాంతిగా పరివర్తన చెందింది; ఆయన చేతన,  చేరుకోగలిగిన అన్ని స్థితులనూ చేరుకుంది; అందుకోగలిగిన అన్ని శిఖరాలను  అందుకుని, వాటికి అతీతంగా కూడా దాటి వెళ్ళి, ఏ స్థితీ లేని స్థితికి  చేరుకుంది. 

ఈ విశిష్ఠ వ్యక్తిత్వం (స్పెషల్ పర్సనాలిటీ), ఈ ప్రకృతి వరప్రసాదం, ఈ పరతత్త్వం, మానవాళి ఎప్పుడో మరచిపోయిన ప్రాణాహుతి ప్రసరణ విద్యని, కళను, ఉపనిషత్తుల్లో చెప్పిన ప్రాణస్య ప్రాణః, అనే విద్యను పునరుద్ధరించి, ఆధ్యాత్మిక శిక్షణలోనే ఒక వినూత్న ఆధ్యాత్మిక పద్ధతిని ఆవిష్కరించారు; ఇందులో ఆధ్యాత్మిక సాధకుల బాధ్యతలన్నీ ఇంచుమించుగా పూర్తిగా తొలగించేయడం జరిగింది. 

కేంద్రము లేక దైవం ఎక్కడున్నదీ, సుప్రా కాస్మిక్ క్షేత్రాన్ని దాటి ఒక క్షేత్రాన్ని, సెంట్రల్ రీజియన్ (కేంద్ర క్షేత్రం) ఆవిష్కరించడం, మనిషి చేరుకోగలిగిన చిట్టచివరి స్థితియైన తమ్ ను కనుగొనడం, ఇదంతా కూడా ఆధ్యాత్మిక చరిత్రలో ఇంతకు పూర్వం అందుబాటులో లేని జ్ఞానం. ఈ ఆవిష్కరణలు, అటు మేధావులకు, ఇటు ఆధ్యాత్మిక సాధకులకు కూడా ఒకేలా మెదడుకు మేత వలె  పరిణమించాయి.

 దైవసంకల్పానికి అనుగుణంగా జీవించగలిగే సామర్థ్యం లాలాజీలో ఎలా ఉండేదో ఒక ఉదాహరణ. ఆయన చివరి రోజుల్లో కాలేయంలో ఒక వ్రణంతో బాధపడుతూ ఉండేవారు. ప్రకృతి వైద్యం తీసుకుంటూ ఉండేవారు. ఆయన శిష్యులలో ఒకరైన శ్రీ పండిత్ రామేశ్వర ప్రసాద్ మిశ్రా గారు కాలేయంపై బాహ్యంగా మట్టితో పిండికట్టు కట్టేవారు. లాలాజీ అంత తీవ్రమైన బాధకు లోనవుతూ ఉంటే చూడలేక, కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆయన కన్నీరు చూసి, లాలాజీ, "నేను తలచుకుంటే ఈ బాధను క్షణాల్లో తొలగించేసుకోగలను, కానీ ఇది దైవసంకల్పం, కాబట్టి మనం దాన్ని స్వీకరించాలి" అన్నారు. 

లాలాజీ మితానికి, సహనానికి, భక్తికి మూర్తీభవించిన వ్యక్తిత్వం; అస్సలు అహం అనేది ఉండేది కాదు. వారితో ఒక నూతన శకం ప్రారంభమయ్యింది, యౌగిక ప్రాణాహుతితో కూడిన ఆధ్యాత్మిక శిక్షణ ప్రారంభమయ్యింది; అందులో వారు దిట్ట. ఒక్క చూపుతోనే ఎవరినైనా పరిపూర్ణంగా మార్చగలిగేవారు. మనిషి ఒక్క జన్మలోనే పరిపూర్ణతను సాధించవచ్చన్న పరిస్థితిని సాధ్యం చేసింది ఆయనే - ఇంకా చెప్పాలంటే ఒక్క జన్మలో కొంత భాగంలోనే సాధ్యం అన్నారు, సాధారణ గృహస్త జీవనం గడుపుతూ. ఆధ్యాత్మిక శిక్షణను కాలం యొక్క అవసరాలకు అనుగుణంగా, చాలా మేరకు సరళీకరించడం చేశారు లాలాజీ. 







7, ఫిబ్రవరి 2024, బుధవారం

బాబూజీ - లాలాజీ గురించి - 6


బాబూజీ - లాలాజీ గురించి - 6

లాలాజీ ఆధ్యాత్మిక శిక్షణ  

లాలాజీ ఆధ్యాత్మిక పరిపూర్ణత మూడు విషయాలపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడేవారు:

1) మాస్టర్ పట్ల ప్రేమ 
2) మాస్టర్ తో సత్సంగం 
3) మాస్టర్ పట్ల విధేయత. 

మంచి సుపాత్రులైన శిష్యులకు ఆయన శాస్త్రజ్ఞానాన్ని ఇచ్చేవారు కాదు. నేరుగా సత్సంగంలో (సామూహిక ధ్యానంలో) కూర్చోమనేవారు. శిష్యుల సామర్థ్యాలను బట్టి వారు ఆధ్యాత్మిక శిక్షణనిచ్చేవారు. కొంతమందికి సూరత్ శబ్ద యోగాన్ని చెయ్యమనే వారు; కొంతమందిని హృదయంపై ధ్యానించమనేవారు. మరికొంతమందికి మంత్రజపం ఉపదేశించేవారు. మిగిలినవారికి కేవలం కొన్ని కర్మలనాచరించమనేవారు. అయితే హృదయంపై ధ్యానించినా, మంత్రజపం చేసినా, సత్సంగంలో కూర్చున్నా, గురువు అనుగ్రహం పొందడం చాలా ముఖ్యమని నొక్కి చెబుతూండేవారు. ఒక్కోసారి హృదయంలో ఓంకార శబ్ద జపాన్ని కూడా చేయమని ఆదేశించేవారు.   ఈ అన్నిటి ప్రక్రియల వల్ల గాని లేక యే ప్రక్రియ వల్లనైనా గాని సాధకుడిలో శబ్దం కదలికలోకి తీసుకువచ్చేవారు. ఈ శబ్దం వినిపించినప్పుడు లాలాజీ సాధకులను దాన్ని నిరంతరం వింటూండటానికి ప్రయత్నంచమనేవారు. 

యే కులానికి గాని యే జాతికి సంబంధించినవారినైనా, యే మత నేపథ్యం నుండి వచ్చినా సరే, యాదార్థతత్త్వం ఏమిటో తెలుసుకోవాలని తపిస్తున్నవారికి, ఆధ్యాత్మిక తృష్ణ గలవారు ఎవరైనా వారి వద్ద ఆధ్యాత్మిక శిక్షణ పొందడానికి అర్హులేననేవారు. రకరకాల వ్యక్తులకు రకరకాల పద్ధతులు ఉపదేశించేవారు. ఒక్కోసారి వాళ్ళకి బాగా ఇష్టమైన వస్తువుపైన గాని, ఇష్టమైన వ్యక్తిపైన గాని ధ్యానించమనేవారు.  సర్వమతధర్మాలకు సంబంధించిన గ్రంథాలను నమ్మేవారు; మహాత్ములందరినీ గౌరవించేవారు. యే ధర్మంలో జన్మించారో, అదే ధర్మాన్ని అనుసరించడం మంచిదని వారి విశ్వాసం. (స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః అన్న భగవద్గీతలో చెప్పిన విధంగా). 

వారు విగ్రహారాధనను వ్యతిరేకించేవారు. తన శిష్యులను తన ఫోటోను పెట్టుకోనిచ్చినా, దానిని ఆరాధించనిచ్చేవారు కాదు. ఆయనకు ఆత్మస్తుతి ఇష్టం ఉండేది కాదు; ఎవరినీ తన పాదాలను స్పృశించనిచ్చేవారు కాదు; కేవలం హిందువులకు మాత్రమే ఆ అనుమతి ఉండేది, ఎందుకంటే అది వాళ్ళ ఆచారం కావడం చేత. 

అతిగా జపతపాలు చేయడం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. ఆయన మధ్యస్థ మార్గాన్ని ఎంచుకున్నారు; హృదయంపై ధ్యానించడమే నిజమైన సాధన అనేవారు. ప్రార్థనకు గొప్ప ప్రాధాన్యతనిచ్చేవారు, కానీ భౌతిక ప్రయోజనాల కోసం కాదు. ఈ లోకం యొక్క ఆత్మను గురించి ఆయన స్వయంగా నిరంతరమూ ప్రార్థిస్తూ ఉండేవారు. 

ఆయన దృష్టిలో ప్రతీ ఆధ్యాత్మిక అన్వేషకుడికీ ఒక గురువు ఉండి తీరాలి. కానీ ఆయనను ఎంపిక చేసుకోవడంలో చాలా జాగ్రత్త వహించాలి. ఒక్కసారి సాధకుడు గురువును కనుగొన్న తరువాత, ఆ గురువుకు సంపూర్ణంగా సమర్పించేసుకోవాలి; ఒక మృతుడు తనను తాను, శవాన్ని అలంకరించేవానికి సమర్పించుకున్నట్లుగా. 

హృదయంలో ఉన్న వివిధ జటిల తత్త్వాలను తొలగించడానికి, తన అనుచరులకు, శత్రువులను, స్నేహితులుగా మార్చుకోమని, అస్సలు పడని వ్యక్తులను స్నేహితులుగా మార్చుకోమని, ఇతరులు తమకు యేది చేయాలనుకుంటారో, అదే ఇతరులకు చేయమని ఆదేశీస్తూండేవారు. అన్నిటికంటే అతిగొప్ప తపస్సు ప్రేమే అనేవారు. 

లాలాజీ ప్రవర్తన విషయంలో చాలా ప్రాముఖ్యతనిచ్చేవారు; ప్రామాణికమైన నైతిక సూత్రాలను, సత్ప్రవర్తనా నియమావళిని అనుసరించకపోయినట్లయితే, సాక్షాత్కారం అసంభవమని నిర్ద్వంద్వంగా చెప్పేవారు. అనైతిక వ్యక్తులతో కూడి ఉండటం గాని, సత్సంగంలో పాల్గొనడం గాని చేయొద్దనేవారు. ఎప్పుడూ భగవంతుని కోసం పరితపించే ప్రేమతో నిండిన హృదయాలున్నవారి సాంగత్యంలో ఉండమని, అలాగే ఇతరులను ప్రభావితం జేసే విధంగా ఉండేవారి సాంగత్యంలో ఉండమని నిర్ద్వంద్వంగా సూచించేవారు. 

5, ఫిబ్రవరి 2024, సోమవారం

స్పిరిచ్యువల్ అనాటమీ - 4 - నిర్ధారణ

 



స్పిరిచ్యువల్ అనాటమీ  - నిర్ధారణ
(ఆఖరి అధ్యాయం) 
***
ధ్యానంలో మనం కళ్ళు మూసుకుంటాం, హృదయాలు తెరుస్తాం. తెరచిన హృదయం కానుక అందుకుంటుంది. కానుకను గుర్తించడం కృతజ్ఞత. కృతజ్ఞత ఒక ఆధ్యాత్మిక స్థితిని మన హృదయాలలో కలుగజేస్తుంది. ఆ ఆధ్యాత్మిక స్థితిని కొనసాగించినప్పుడు అది ప్రేమ దిశగా పైకి ఎగుస్తుంది. అంతరంగంలో ఉన్న ప్రేమ, పరమాత్మ పట్ల పూజ్య భావం సృష్టిస్తుంది. పూజ్యభావం మనలో పెరుగుతున్నకొద్దీ, మన హృదయం దైవకృపను ఆకర్షిస్తుంది. కృపా తరంగాలపై పయనిస్తున్న కొద్దీ, సమర్పణ భావం ప్రారంభమవుతుంది. సమర్పణభావం నిర్మలత్వాన్ని సృష్టిస్తుంది. నిర్మలత్వం వల్ల శరణాగతి ప్రారంభమవుతుంది. శరణాగతి లయావస్థకు దారి తీస్తుంది. 
ప్రతీ ధ్యానం ఒక ప్రేమకలాపమే. ఆత్మ, పరమాత్మల కలయికే ధ్యానం. ఒక నీటి చుక్క మహాసముద్రంలో ఏకమయ్యే ప్రయాణమే ధ్యానం. 
మీ హృదయంలో పెల్లుబుకుతున్న  ప్రేమతో మీ ప్రయాణం కొనసాగనివ్వండి.  మిమ్మల్ని ముంచేసే ప్రేమ అయి ఉండాలి, ముంచే ప్రేమ గాకపోయినట్లయితే, ఉద్ధానం ఉండదు కాబట్టి. హృదయపూర్వకంగా మీరు అటువంటి ప్రేమకిరణాలకు లోనవ్వాలని, మీ హృదయ నిగూఢమైన లోలోతుల్లో ప్రారంభమై, అక్కడే ముగించే ప్రయాణంలో కలిగే ఏకత్వభావన వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను. మార్గం ఇరుకుగానూ, అంధకారంగానూ ఉండవచ్చు. ఒక్కోసారి ఒంటరితనం విపరీతంగా ప్రబలంగా ఉండవచ్చు.  మార్గం నిటారుగా, జారుడుగా ఉండవచ్చు. కానీ గుర్తుంచుకోండి, మీరు అన్వేషిస్తున్నది మీలోనే ఉంది. నాకు దారి తెలుసు, నేమిక్కడున్నది మీకు అడుగడుగునా సహాయం చేయడం కోసమే. మీరు అనంతం వైపుకు ఎత్తులకు ఎగుస్తూ, దానితో ఒక్కటవుతారని ఆశిస్తున్నాను. ఈ సృష్టికి మీరివ్వగలిగే శ్రేష్ఠమైన కానుక, మీ పరివర్తిత ఆత్మ మాత్రమే. 
***
(ఈ చివరి అధ్యాయంలో ఈ గ్రంథం యొక్క సారాంశాన్ని క్లుప్తంగా, అందరికీ అర్థమయ్యేలా సరళంగా, కర్తవ్య బోధను, ఆయన అడుగడుగునా మనకు సహాయం చేయడానికి అందుబాటులో ఉన్నానన్న భరోసాను, అద్భుతమైన సందేశాన్ని వెల్లడి చేశారు. ఈ ఒక్క అధ్యాయం అందరి మనసుల్లోకి స్పాంజ్ లో నీరు ఇంకినట్లుగా, మన సాధకుల శరీరవ్యవస్థలోని అణువణువునా ఈ సందేశం పూర్తిగా ఇంకిపోవాలని, జీవిత గమ్యాన్ని సాధించాలని ఆ గురుదేవులను ప్రార్థిస్తున్నాను.)




ఛాదస్తం

  ఛాదస్తం   మనలను మనం పరిశీలించి చూసుకుంటే ఎన్నో ఛాదస్తపు అలవాట్లు మనకే కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఉండటమే గాకుండగా వాటిని పాటిస్తున్నందుకు గర్వపడ...