13, మార్చి 2024, బుధవారం

ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం - మార్చ్ 14-17, 2024

 



ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం - మార్చ్ 14-17, 2024

హార్ట్ఫుల్నెస్ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ అయిన హైదరాబాదు శివార్లలో ఉన్న కాన్హా శాంతి వనంలో, హార్ట్ఫుల్నెస్ సంస్థ ఆతిథ్యంతో మార్చ్ 14 నుండి 17 వరకూ భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహించబోతున్న  "ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం యొక్క ప్రధాన లక్ష్యాల గురించి పూజ్య దాజీతో పాటు, జీయర్ ట్రస్ట్ కు సంబంధించిన చిన్న జీయర్ స్వామివారు, రామకృష్ణ మఠానికి చెందిన స్వామి బోధమయానంద గారు, హైదరాబాదులోని  హోటల్ తాజ్ కృష్ణాలో  ప్రెస్ మీట్ లో ప్రసంగించడం జరిగింది. ఆ తరువాత కాన్హా శాంతి వనంలో ఆదివారం మార్చ్ 10 న ఉదయం సత్సంగం తరువాత మరలా కొన్ని విషయాలు పంచుకోవడం జరిగింది. 

దాజీ పంచుకున్న కొన్ని మహోత్సవ లక్ష్యాలు 

మనందరమూ మన ఆదర్శాలలో ఉండే తేడాలను ప్రక్కకు పెట్టి,  ప్రపంచంలో శాంతి-సామరస్యాలు నెలకొలపే ప్రయత్నం  చేయవలసిన సమయం  ఆసన్నమయ్యింది. 
తీవ్రవాదులు, టెర్రరిస్టులు  సమైక్యంగా ఉండగలిగినప్పుడు ధార్మిక, ఆధ్యాత్మిక వేత్తలు కలిసి ఐక్యంగా ఉండలేకపోవడం ఏమిటి?
ప్రతీ మతం, ప్రతీ ఆధ్యాత్మిక సంస్థ ఒక ప్రత్యేకమైన పువ్వు లాంటిది; ప్రతీ పువ్వూ ఒక ప్రత్యేకమైన పరిమళాన్ని వాతావరణంలోకి వెదజల్లుతుంది; ఈ పూవులన్నిటినీ ఒక చక్కటి మాలగా చేసి మనందరమూ కొలిచే దైవానికి సంపూర్ణ సమర్పణ భావంతో అర్పించలేమా?
మనలో ఉండే మత-మౌఢ్యాన్ని తొలగించుకోలేమా? భగవంతుని యందు విశ్వాసం ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మిక శిఖరాలకు ఎదిగినవాళ్ళూ ఉండవలసినది ఇలాగేనా? వర్షం మంటలు ఆర్పుతుంది; కానీ వర్షమే మంటలు రగిలిస్తే ఇంకేం  చేయగలం? 
కాబట్టి ఈ సమావేశంలో అందరమూ కలిసి, కేవలం భావాత్మకంగా, తత్త్వాలు మాట్లాడుకోవడమే గాక ప్రాక్టికల్ గా ఆచరించదగ్గ పరిష్కారాలను ఆలోచిద్దాం. 1893లో స్వామి వివేకానంద మతమౌఢ్యం పూర్తిగా తొలగిపోవాలన్న పిలుపునివ్వడం జరిగింది; ఇక కలలు గనడమే గాక నిజంగా చేతల్లో మనం కోరుకుంటున్న వాటిని సుసాధ్యం చేద్దాం. 
అన్నీ కాలుష్యాల్లోకి (నీటి కాలుష్యం, గాలి కాలుష్యం, మట్టి కాలుష్యం, వగైరాలు) ఆలోచనా కాలుష్యమే భయంకరమైనది. ఈ ఒక్క కాలుష్యం పోయిందంటే మిగిలిన అన్నీ కాలుష్యాలూ మాయమైపోతాయి. 
ఇలాంటి ప్రపంచం మన పిల్లలకు, పిల్లల పిల్లలకు, భావి తరాలకు ఇవ్వద్దు. తగిన విధంగా అందరమూ కృషి చేద్దాం. ఒక్కొక్క వ్యక్తికీ మానసిక ప్రశాంతతను అందించే దిశగా కృషి చేద్దాం. మనం చేయకపోతే మరెవరూ చేస్తారు? ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాం? ఆలోచించండి. 

అందరమూ పరస్పరం గౌరవించుకుందాం; ఒకర్నొకరిని నమ్ముదాం. నేను అవతలి వ్యక్తికి పాదాలకు దణ్ణం పెట్టడానికి వెనుకాడను; అవతలి వ్యక్తి మన కంటే గొప్పవాడని భావిద్దాం; వంగినంత మాత్రాన అవతలి వ్యక్తి కంటే తక్కువ అని కాదు.

పూజ్య దాజీ పలుకుతున్న ఈ ఉదాత్త భావాలను గురించి తీవ్రంగా లోతుల్లోకి ధ్యానిద్దాం, జీర్ణం చేసుకుందాం; వారు కోరుకున్న విధంగా ప్రతీ సమాజంలో ప్రత్యక్షంగా ఆచరణలో పెట్టే ప్రయత్నం చేద్దాం.  

9, మార్చి 2024, శనివారం

ప్రెస్ మీట్ - హోటల్ తాజ్ కృష్ణా, హైదరాబాద్

 


ప్రెస్ మీట్ - హోటల్ తాజ్ కృష్ణా, హైదరాబాద్ 
మార్చ్ 9, 2024 


ప్రెస్ మీట్ వీడియో కోసం ఈ క్రింది లింకును క్లిక్ చేయండి:  




పూజ్య దాజీతో ఇతర ఆధ్యాత్మిక సంస్థల పెద్దలు 

వివిధ దినపత్రికల కవరేజ్ 

 

గ్లోబల్ స్పిరిచ్యువల్ మహోత్సవ్ , 2024 - కాన్హా శాంతి వనం



గ్లోబల్ స్పిరిచ్యువల్ మహోత్సవ్, 2024 
కాన్హా శాంతి వనం 

పూజ్య దాజీ ఈ మహోత్సవానికి అందరినీ ఆహ్వానిస్తూ, దీనికి సంబంధించి, పూజ్య బాబూజీ నుండి అందుకున్న దివ్య సందేశాల్లో కొన్ని అంశాలను ఉటంకించడం జరిగింది. వీటిపై ప్రతి అభ్యాసి ధ్యానించాలని మనవి. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి: 

"Was it not said that In the future, our way will be at the heart of a great unifying movementfor the good of all humanity? The saying goes that unity is strength. The forces of good will have to unite beyond any kind of prejudice, and see only the best in every one in the face of critical situation which cannot be handled in the human level. The divine power will see to it; that is the way it goes."
- Wednesday, October 5, 2011 - 10:00 a.m.

"భవిష్యత్తులో మన మార్గం, సమస్త మానవాళి శ్రేయస్సు కోసం,   అందరినీ ఒక్కటిగా చేసే ఉద్యమానికి కేంద్రంగా ఉంటుందని చెప్పడం జరగలేదా? ఐక్యతే  బలం అన్న నానుడి ఒకటుంది. మంచి కోసం పాటుపడే శక్తులన్నీ ఎటువంటి అభిప్రాయాబేధాలూ లేకుండా ఐక్యమవ్వలసిన అవసరం ఉంది;  మానవ స్థాయిలో నియంత్రించలేని ఈ కీలక పరిస్థితిలో అందరూ ప్రతి ఒక్కరిలోనూ కేవలం మంచిని మాత్రమే చూడవలసిన అవసరం ఉంది. దివ్య శక్తి దీన్ని చూసుకుంటుంది; ఇది ఇలాగే జరుగుతుంది."  
- బుధవారం, అక్టోబర్ 5, 2011 - ఉదయం 10:00 గంటలు 

"India has always been a beacon of spirituality; this is how it is, one might say. In the future, this country will become the centre of an unprecedented action of this kind. A land of refuge it will be, after many upheavals. An important action will unfold there, promoting an expansion of consciousness that has been long planned and wanted. The high places of Sahaj Marg will have a major importance and play an unprecedented role in our history. The current Master will be inspired accordingly and everything will take place naturally."
- Wednesday, May 20, 2015 - 10:00 a.m.

"భారతదేశం ఎప్పుడూ ప్రపంచానికి దారి చూపే వెలుతురుగానే ఉండింది; ఎప్పుడూ అలాగే ఉందని ఎవరైనా అనవచ్చు. భవిష్యత్తులో ఈ దేశం ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఈ రకమైన కార్యాచరణకు కేంద్రంగా ఉండబోతోంది. ఎన్నో ఉపద్రవాల తరువాత ఈ భూమి ఆశ్రయం ఇచ్చే భూమిగా తయారవుతుంది. ఎంతో కాలంగా ప్రణాళికలు వేస్తున్న, చాలా అవసరమైన చైతన్య వికాసం అనే ముఖ్య కార్యావిష్కరణ జరగబోతోంది. సహజ మార్గ ఉన్నత ప్రదేశాలకు చరిత్రలో ఈ విషయమై ఇంతకు ముందెన్నడూ లేని ప్రముఖ పాత్ర వహించవలసి ఉంటుంది. ప్రస్తుత మాస్టరుకు తగిన విధంగా స్ఫూర్తి కలుగుతుంది. అంతా సహజంగా జరిగిపోతుంది కూడా."
 - బుధవారం, మే 20, 2015 - ఉదయం 10:00 గంటలు 

8, మార్చి 2024, శుక్రవారం

మహిళల పట్ల బాబూజీ హృదయం

 


మహిళల పట్ల బాబూజీ హృదయం 

పైన చిత్రం పూజ్య బాబూజీ మహారాజ్ అభ్యాసి  సోదరీమణులతో తిరుపతిలో తీసుకున్న చిత్రం. వారి ప్రక్కనే  తిరుపతికి చెందిన మన సంస్థలో అందరూ గౌరవించే, మహాజ్ఞాని, బాబూజీ శిష్యులు, సీనియర్ ప్రిసెప్టర్ ప్రొఫెసర్ డా. కె. సి. వరదాచారి గారు కనిపిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా బాబూజీ మహిళలను గురించిన వారి భావాలను గుర్తు చేసుకుందాం.  

మొట్టమొదటగా, పూజ్య లాలాజీ మార్గదర్శనంలో వారు రూపొందించిన సహజ్ మార్గ్ ధ్యాన పద్ధతిని మానవాళికి అందించడంలో, దాన్ని అనుసరించడంలో, మహిళలకు ఒక ప్రత్యేక మినహాయింపునిచ్చారు. ఉదయం ధ్యానం అందరికీ సూర్యోదయానికి పూర్వమే పూర్తి చేసుకోవాలని, శుద్ధీకరణ సూర్యాస్తమయానికి పూర్వమే చేసుకోమని, సూచించడం జరిగింది. కానీ స్త్రీలకు మాత్రం, ముఖ్యంగా గృహిణులకు మాత్రం వాళ్ళకు అనువైన సమయంలో చేసుకోమన్నారు. దానికి కారణం ఆడువారు ఇంట్లో అందరికంటే ఆలస్యంగా పడుకొని, అందరికంటే ముందు నిద్రలేస్తారు కాబట్టి వాళ్ళకి ఈ మినహాయింపు ఉందన్నారు బాబూజీ. ఈ ఒక్క అంశం ధ్యాన పద్ధతిని రూపకల్పన స్థాయిలోనే బాబూజీకి ఎంత కరుణతో కూడిన దృష్టి, హృదయం ఉండిందో  మనం అర్థం చేసుకోవచచ్చు.

మరో సందర్భంలో, "భగవంతుడు ఒక్కటి సరిపోయినట్లయితే, ఆడ, మగ అని రెండు లింగాలను సృష్టించవలసిన అవసరం లేదు" అన్నారు. వివాహానికి ఒక పవిత్రమైన ప్రయోజనం ఉందని, మనిషి మరో మనిషికి జన్మనిచ్చి పునరుత్పత్తి చేయడం మానవాళి పట్ల ప్రతి మనిషి నిర్వర్తించవలసిన ధర్మమని, దైవాన్ని తెలుసుకోటానికి బ్రహ్మచారిగా లేక బ్రహ్మచారిణిగా లేక సన్న్యాసిగా ఉండవలసిన అవసరం లేదని, భగవంతుడు ఆడ, మగలు సృష్టించడానికి ఆయనేమీ మూర్ఖుడు కాదని బోధించేవారు.  

ప్రపంచంలో ఉన్న సోదరీమణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నమస్సులు; మీరు అందిస్తున్న సేవలకు సర్వదా కృతజ్ఞతలు; భూమీద జీవితం అంతా నిస్స్వార్థంగా జీవించేటువంటి, నిత్యం దైవత్వాన్ని తలపించేటువంటి మాతృమూర్తులకు ఆశ్రుపూరిత కృతజ్ఞతలు.

7, మార్చి 2024, గురువారం

చైతన్య వికాసానికి అవరోధాలు



చైతన్య వికాసానికి అవరోధాలు 

చైతన్య వికాసానికి, లేక అంతఃకరణ శుద్ధికి, లేక దైవ సాక్షాత్కారానికి లేక మనకు మనలోని అంతర్యామిగా ఉన్న దైవానికి అడ్డుగా, అవరోధాలుగా నిలిచేవి ఏమిటి? మన మానస, బుద్ధి, అహంకార చిత్ లను కలుషితం అవడానికి, అశుద్ధమవడానికి, మలినమవడానికి గల కారణాలేమిటి? మనలను, మనలో అంతర్యామిగా ఉన్న దైవాన్నీ, వేరు చేసేవి మూడే మూడు అంశాలు: కోరికలు, సంస్కారాలు/ముద్రలు/కర్మలు/వాసనలు, అహంకారము. వీటి వల్లనే మనకున్న  ప్రస్తుత స్థితి. ఇవే మన జీవితాలను శాసించేది. వీటి వల్లనే మనోబుద్ధ్యహంకారచిత్తాలు కలుషితమయ్యేది.

ఇవన్నీ మనకు కనిపించనివే. అయినా మనలను శాసిస్తున్నాయి. వీటిని శుద్ధి చే విద్యే యోగవిద్య లేక బ్రహ్మ విద్య, లేక ఆధ్యాత్మిక విద్య లేక హార్ట్ఫుల్నెస్ వంటి ధ్యాన పద్ధతి.  

కోరికలు తగ్గించుకుంటూ ఉండాలి. కోరికలు ఎంత తగ్గితే అంత ఆనందమే గాక, అన్ని జన్మలు తగ్గిపోతాయి. కోరికలు పెంచుకోవడం అంటే జన్మలు పెంచుకోవడమే. కోరికలే సంస్కారాలను పుట్టిస్తాయి. కోరికలు పెరుగుతున్న కొద్దీ హృదయభారం పెరుగుతూ ఉంటుంది. ముందు కోరికలను తగ్గించుకుని అవసరాలకు దిగాలి. ఆ తరువాత అవసరాలు కూడా కనీసంగా ఉండే విధంగా మన జీవన విధానం ఉండాలని బాబూజీ చెప్తూండేవారు. 

మనం ప్రపంచంతో వ్యవవహరిస్తున్నప్పుడు, నాలుగు రకాలుగా మన హృదయంపై ముద్రలను ఏర్పరచుకుంటూ ఉంటాం. ఈ ముద్రలే పదే పదే  ఏర్పడి సంస్కారాలుగా, పతంజలి మహర్షి చెప్పే చిత్త వృత్తులుగా ఏర్పడి అవి మన జీవితాలను శాసిస్తూ ఉంటాయి. ఈ సంస్కారాలు నాలుగు రకాలు - 1) రాగద్వేషాలు (ఇష్టాయిష్టాలు), 2) ప్రాపంచిక చింతలు 3) ఇంద్రియపరమైన, లైంగికపరమైన ముద్రలు 4) అపరాధభావాన్ని సృష్టించే ముద్రలు. 

ఇవన్నీ గతంలో ఏర్పరచుకున్నవి, ఈ జన్మలోనే గాక, ఇంతకు పూర్వం ఏర్పరచుకున్నవాటి ప్రభావం వల్ల మన ప్రస్తుత జన్మ నిర్ధారింపబడుతుంది. కాబట్టి మన జీవితశైలిని యే విధంగా మలచుకోవాలంటే, పుట్టుకతో తెచ్చుకున్న సంస్కారాలను భోగిస్తూ, అనుభవిస్తూ; ఇంకా ఖర్చవ్వాల్సిన బీజరూపంలో ఉన్న సంస్కారాలను యోగ సాధన ద్వారా తొలగించుకుంటూ, కొత్త సంస్కారాలు  ఏర్పడకుండా ఉండే విధమైన జీవన విధానాన్ని అవలంబించాలి. అటువంటి జీవన విధానమే హార్ట్ఫుల్నెస్ జీవన విధానం. ఈ సంస్కారాలన్నీ బీజరూపంలో మన చేతనలో, సూక్ష్మ-కారణ శరీరాల్లో పొరలుపొరలుగా నిక్షిప్తమై ఉంటాయి. 

ఇక అహంకారం: అంటే 'నేను',  'నాది' అనే స్పృహతో జీవించడం. దీన్ని వినయం ద్వారా అంటే, 'ఆయన', 'ఆయనది' అంటే భగవంతునిది అన్న స్పృహతో జీవించగలిగితే జీవితం డైవోన్ముఖం అవుతుంది. 

ఈ విధంగా సగటు మానవ జీవన విధానంలో పరివర్తన తీసుకురాగలిగేది మన సంకల్ప శక్తి, మన కృషి ఇటువంటి జీవన విధానాన్ని అవలంబించడం ద్వారా సుసాధ్యమవుతుంది; కనీసం రోజు-రోజుకూ మెరుగైన మనిషిగానైనా జీవించగలుగుతాం. 


సరైన ధ్యానపద్ధతిని అనుసరిస్తే ఏమి జరుగుతుంది?


హార్ట్ఫుల్నెస్ వంటి ధ్యానపద్ధతిని అనుసరిస్తే ఏమి జరుగుతుంది?

యేదైనా ధ్యానపద్ధతిని, పద్ధతిగా అనుసరించడం అంటే ప్రయత్నపూర్వకంగా ఒక జీవన విధానాన్ని అవలంబిస్తున్నట్లు, ఒక జీవన శైలిని అనుసరిస్తున్నట్లు. జీవిత దృక్పథంలో కొన్ని మార్పుల కోసం ప్రయత్నిస్తున్నట్లు. రోజు-రోజుకూ మరింత మెరుగైన మానవుడుగా తయారవడానికి ప్రయత్నించడం; జీవిత ప్రయోజనాన్ని తెలుసుకోవడం, అది సిద్ధించడం కోసం తగినటువంటి కృషి చేయడం; మనిషి జన్మను సార్థకం చేసుకోవడం; స్వార్థం తగ్గించుకుంటూ ఇతరులకు ఉపయోగపడేలా జీవించడానికి ప్రయత్నించడం. 

అంతేగాక ఆధ్యాత్మిక ప్రయోజనం ఏమిటంటే, మన అస్తిత్వానికి, మన చుట్టూ ఉన్న అస్తిత్వానికి గల మూల కారణాన్ని తెలుసుకోవడం; ఆ పరమాత్మను సాక్షాత్కరించుకోవడం; ఆ మూల తత్త్వంలో లయమైపోవడం. ఇవన్నీ కేవలం నమ్మకాలు, విశ్వాసాలే గాకుండగా, ప్రత్యక్షానుభవం ద్వారా నిజమైన జ్ఞానాన్ని సంతరింపజేసుకోవడం. జీవిత పరమార్థాన్ని ఎవరికి వారు నిజంగా అర్థం చేసుకోవడం, తద్వారా మెరుగైన సమాజానికి దోహదపడటం.
 
కాబట్టి ధ్యానం అనేది కేవలం ఏకాంతంగా చేసే ప్రక్రియ కాదు. ఒక్కరూ చేస్తే, అది కూడా కళ్ళు మూసుకుని కూర్చుంటే,  సమాజానికి ఏమిటి ప్రయోజనం? అని చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు. గోడలో ఒక్క ఇటుక సరిగ్గా లేకపోయినా గోడ పాడవుతుంది; ఆ ఒక్క ఇటుకను సర్డితే మొత్తం గోడను సరిదిద్దినట్లవుతుంది. అలాగే ఒక్క మానవుడిలో సరైన మార్పు వచ్చినా, దాని ప్రభావం ఆ వ్యక్తిలోనే గాక,  మొత్తం సమాజంలో మనకు తెలియకుండా ఉండి తీరుతుంది.

కాబట్టి ఇటువంటి ధ్యాన పద్ధతిని అనుసరించడం వ్యక్తిగత మానవ కళ్యాణానికి, మానవాళి శ్రేయస్సు మొత్తానికి చాలా అవసరం. ప్రతి ఒక్కరూ సమూలంగా మారే దిశలో ఉంటేనే సమాజం మొత్తంగా మారే దిశలో ప్రయాణిస్తుంది. 
 


ధ్యానం యొక్క ముఖ్య ప్రయోజనం

ధ్యానం యొక్క ముఖ్య ప్రయోజనం 


ప్రకృతి సిద్ధంగా, స్వతః సిద్ధంగా, ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా, వివిధ సందర్భాలలో  క్షణికంగా కళ్ళు మూసుకోవడం వల్ల కలిగిన మనశ్శాంతి, ఉపశమనం, ప్రశాంతత, స్పష్టత దీర్ఘకాలికంగా మరింత ఎక్కువగా అనుభూతి చెందాలంటే తెలిసి చేసే ధ్యానం అవసరం. 

అసలు ధ్యానం అంటే ఏమిటి? ఆలోచన అనుభూతిగానూ, బుద్ధి  వివేకంగానూ, అహం, అంటే నేను అనే స్పృహ, నీవు (భగవంతుడు) అనే స్పృహగానూ, వెరసి శుద్ధ చైతన్యంగా పరిణతి చెందే విధంగా చేసేదే ధ్యానం. 

ధ్యానం యొక్క ప్రధాన లక్ష్యాలు రెండు, అది యే రకమైన ధ్యానమైనా సరే :

1) చంచలమైన మనసును క్రమశిక్షణలో ఉంచడం 

2) మనసుకు దాటి అతీతంగా వెళ్ళగలగడం. 

మనసున్నవాడే మానవుడు. మనసును బట్టే మానవుడి మనుగడ. మనసు నాణ్యతను బట్టే మనిషి నాణ్యత. ఇక్కడ మనసు అంటే చేతనం అని కూడా అర్థం చేసుకోవచ్చు. మన ఆధ్యాత్మిక సాహిత్యంలో మనసు అంటే చేతనగా అర్థం చేసుకోవాలి. ఈ మనసులోనే, లేక ఈ చేతనలోనే, మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము ఇమిడి ఉన్నాయి. వీటిని ప్రధాన సూక్ష్మ శరీరాలు అని కూడా అంటారు. ఈ నాల్గింటినీ కలిపి అంతఃకరణ అని కూడా అంటారు. 

మనిషి సమూలంగా మారాలంటే మనసు మారాలి. అంటే మనసు, బుద్ధి, అహంకారం చిత్తము, ముఖ్యంగా ఈ నాలుగూ శుద్ధి కావాలి. ఈ అంతఃకరణ శుద్ధి జరగాలి. 

అయితే ఇవి కలుషితం ఎలా అయ్యాయి? మనలోనే ఉన్న కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలే  గాక, భయం, అలసత్వం (బద్ధకం) వల్ల మన మనసు, బుద్ధి, అహంకారం కలుషితమవడం వల్ల ఫలితంగా చిత్తం లేక చైతన్యం కూడా అశుద్ధమైపోయింది. ఈ కలుషితమైన చైతన్యమే మన జీవితాలను నడిపిస్తున్నది. ఇలా కలుషితమవడం వల్లే ఈ నాలుగు సూక్ష్మశరీరాలు ప్రభావితమై - ఆలోచనా క్రమం జటిలంగా తయారవుతుంది; దానితో మన మాటలు, చేతలు, అలవాట్లు, ప్రవర్తన, మన శీలం/వ్యక్తిత్వం అన్నీ జటిలంగా మారిపోతూ ఉంటాయి. ఇవే జటిల తత్త్వాలుగా మారతాయి. అరిషడ్వర్గాల ప్రభావంతోనే మనిషి జటిలంగా తయారవుతాడు. 

అరిషడ్వర్గాలనే అశుద్ధాలు తొలగించుకుని, శుద్ధంగానూ, జటిల తత్త్వాలను తొలగించుకుని స్వచ్ఛంగానూ, తద్వారా ఈ చైతన్య శుద్ధి చేసుకున్నట్లయితే జీవితం కూడా క్రమక్రమంగా శుద్ధి అవుతుంది. 

ఛాదస్తం

  ఛాదస్తం   మనలను మనం పరిశీలించి చూసుకుంటే ఎన్నో ఛాదస్తపు అలవాట్లు మనకే కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఉండటమే గాకుండగా వాటిని పాటిస్తున్నందుకు గర్వపడ...