26, సెప్టెంబర్ 2023, మంగళవారం

పూజ్య దాజీ 68 వ జన్మదినోత్సవ సందేశ మననం - 2

 

ఆధ్యాత్మికంగా గురువుకు "అందుబాటులో ఉండటం"అనే అంశానికి సంబంధించి దాజీ చెప్పిన అద్భుత ఉదాహరణలు 

పరమపూజ్య బాబూజీ (దాజీ చెప్పినట్లుగా హుక్కా పీలుస్తూ, లాలాజీకి అందుబాటులో ఉంటూ  ఉన్నత స్థితుల్లో పనిచేస్తున్న సన్నివేశం)  
మదర్ హెలీన్ పైరే (బాబూజీ నుండి, ఇతర మహాత్ముల నుండి మన విస్పర్స్ సందేశాలను అందుకున్న లేఖిని, దాజీ మామ్  అని సంబోధిస్తూంటారు)


పూజ్య దాజీ, సెప్టెంబర్ 23, 24 తేదీల్లో సత్సంగాల తరువాత తన సందేశాన్ని చదువుతూ మధ్య-మధ్యలో అదనంగా కొన్ని వ్యాఖ్యలు, విపులీకరణలు చేయడం జరిగింది. అలాగే వారి సందేశంలో ఉటంకించిన 4 విస్పర్ సందేశాలను కూడా పూర్తిగా చదవడం చేశారు. ఈ సందేశం అంతా కూడా శిష్యుడు గురువుకు అందుబాటులో ఉండటాన్ని గురించే. గత వ్యాసంలో వీటిల్లో కొన్ని భావాలను మనం మననం చేసుకున్నాం. ఈ వ్యాసంలో అదనంగా వారు చెప్పినవాటిని మననం చేసుకుందాం. 
ముఖ్యంగా అందుబాటులో ఉండటాన్ని గురించి ఉల్లేఖిస్తూ, తనకు జరిగిన ఒక  అనుభవాన్ని నెమరు వేసుకున్నారు. ఒక రోజు దాజీ, ఫ్రాన్స్ లోని మోంప్లే ఆశ్రమంలో ఉన్నప్పుడు, మన లేఖిని మదర్ హెలీన్ పైరే ను కలుసుకున్నప్పుడు, ఆమె దాజీని మరునాడు ఉదయం 10 గంటలకు బాబూజీతో మీటింగ్ ఉంది ఇంటికి రమ్మని ఆహ్వానిస్తారు. ఈ సందేశాలను ఆంగ్లంలోకి అనువదించే సోదరుడు మిచేల్ ఆతని భార్య జనేట్ దాజీని కలిసి ఆమెకు బాబూజీతో మీటింగ్ ఉంది కాబట్టి, మనం ఆమెను డిస్టర్బ్ చేయకుండా ఉంటే మంచిది అని చెప్పగానే ఆయన మదర్ ఇంటికి వెళ్ళకుండా ఉండిపోయారు. ఆ తరువాత ఆయన 10.45 గంటలకు మదర్ ఇంటికి వెళ్ళిన తరువాత మదర్, "చెప్పాను కదా నీకు బాబూజీతో 10 గంటలకు మీటింగు ఉందని, ఎందుకు రాలేదు?" అని ప్రశ్నిస్తారు. అప్పుడు దాజీ, తాను బాబూజీకి అందుబాటులో ఉండలేకపోయానే, అవకాశాన్ని కోల్పోయానే అని బాధపడ్డారట. జరిగినది చెప్పినప్పుడు మదర్ దాజీని ఓదారుస్తారట. 

పూజ్య దాజీ పలికిన కొన్ని అద్భుత వాక్యాలు; శ్రవణం, మననం, నిధిధ్యాసనం ద్వారా సాక్షాత్కరించుకోవాలసిన వాక్యాలు:

1) విజ్ఞత అంటే సంపూర్ణంగా భగవంతుని పనిలో నిమగ్నమై ఉండటం. 
"నేను మళ్ళీ మళ్ళీ అనుభవంలో చూసిందేమిటంటే, ఎన్ని ఇబ్బందులున్నా ఎలాగో అలాగ, మనం చేయవలసిన ధర్మానికి అనుగుణంగా బలవంతంగా అయినా పని చేసినప్పుడు, ప్రకృతి ఏర్పరచిన అవరోధాలు లేక పరీక్షలన్నీ ఆధిగమించగలుగుతాం. తలనొప్పనో, లేక మరే కారణం చేతనో మనం చేయవలసిన ధ్యానం చేయడం వంటి పనులు చేయకపోతే, మనం ఇబ్బందులపాలవుతాం. అస్తమానూ వాయిదా వేస్తూనే ఉండటం వల్ల మనం వికాసపథంలో ఉండం. అందుబాటులో ఉండటమూ అంటే, సంపూర్ణ సమర్పణ భావంతో, చేయవలసిన పనిని ఏమి జరిగినా స్వీకరిస్తూ పని చేయడమే. ఇలా పనిచేయడానికి పూర్తిగా అందుబాటులో ఉండటమే దైవత్వం. భగవంతుని సేవకు సంపూర్ణంగా అందుబాటులో ఉండటమే విజ్ఞత. దీనికి ఏ  నెపమూ పనికి రాదు.. అందుబాటులో లేకపోవడానికి లక్ష కారణాలుండవచ్చు, కానీ అందుబాటులో ఉండటానికి ఉన్నది కేవలం ఒకే ఒక్క కారణం - నా పట్ల నేను చేసుకోవలసిన ధర్మం. 
2) నిజంగా అందుబాటులో ఉండటం, అహం యొక్క పాత్ర 
సంస్కారాలు అందుబాటులో ఉండటం అనేదాన్ని వడాపోస్తున్నట్లుగా వ్యవహరిస్తాయి. సంస్కారాలు గతానికి సంబంధించినవి. మన కోరికలు, అహంకారం ఇప్పటికే ముద్రల ద్వారా ఏర్పడిన చట్రాలకు తోడవుతాయి. అహం అంటే ఏమిటి? అహం తన అథమ స్థితిలో, జడంగానూ, మంకుపట్టు పట్టడం, దబాయించి ఆడగటం, ఈ విధంగా ఉంటుంది. ఈ ధోరణి అందుబాటులో ఉండటానికి విరుద్ధమైనది.  
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అలసత్వం - బద్ధకం

  అలసత్వం - బద్ధకం  బహుశా అస్సలు అలసత్వం/బద్ధకం లేకుండా ఏ మనిషి ఉండడేమో! దీని వల్ల నష్టాలూ ఉన్నాయి, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రయోజనాలున్నాయ...