భగవంతునితో సంపూర్ణ ఐక్యం చెందడమే ఆధ్యాత్మిక పథం యొక్క పరమగమ్యం, అని బాబూజీ చెప్పడం జరిగింది. ఈ గమ్యాన్ని అతి సరళంగా, చేరుకునే మార్గం, అతి దగ్గర మార్గం సహజమార్గమని బాబూజీ తన స్వీయ అనుభవంలో సాక్షాత్కరించుకున్నారు. ఆ పాఠాన్ని మానవాళికి సహజమార్గ పథంగా అందజేయడం జరిగింది.
భగవంతునితో సంపూర్ణ ఐక్యము అంటే ఆ పరమపవిత్ర చైతన్యంలో లయమైపోవడమే. ఆత్మ మూలం నుండి విడిపోయినప్పుడు, ఆ పరమ పవిత్ర చైతన్యం నుండి దూరమయ్యింది; క్రమక్రమంగా ఆ దివ్య చైతన్యం నుండి దిగి వచ్చినప్పుడు 13 ప్రధాన చైతన్య గ్రంథులుగా ఏర్పడినావి. వాటినే గ్రంథులని, బిందువులని, చక్రాలని, తీర్థ క్షేత్రాలని మనం పిలుస్తూ ఉంటాం. ఒక్కొక్క చక్రం దిగిన కొద్దీ ఆ చైతన్యతలో నాణ్యత తగ్గుతూ వచ్చింది. అలా మనిషి హృదయ చక్రం వరకూ దిగిపోవడం జరిగింది. హృదయ చక్రం నుండి 13 చక్రాలు కేవలం మనుషుల్లోనే ఉంటాయి. ఇవి గాక మూలాధార, మణిపూరక, స్వాధిష్ఠాన చక్రాలు కూడా ఉంటాయి. ఇవి జంతువులలో కూడా ఉంటాయి. ఈ చక్రాల చతన్యంలో ఇరుక్కుపోయిన జీవులు కేవలం బ్రతకడం కోసమే వాటి జీవనం సరిపోతుంది. కేవలం తనను తాను కాపాడుకోవడానికి, ఆహారం, నిద్ర, ఇంద్రియపరమైన సుఖం, భయం వీటి చుట్టూనే అల్లుకుని ఉంటుంది వీటి జీవనం.
సహజమార్గ ఆధ్యాత్మిక పథము హృదయ చక్రం నుండి ప్రారంభమై, మన గమ్యమైన 13 చక్రమ వరకూ కొనసాగుతుంది.
ఆధ్యాత్మిక యాత్ర అంటే ఒక చక్రం నుండి మరొక చక్రానికి ఆత్మ యొక్క కదలిక. ఆత్మ కదులుతుందా? ఆత్మ యొక్క చైతన్యం కదులుతున్నట్లుగా అనుభూతి కలుగుతుంది. దాన్నే ఆత్మ యొక్క యాత్ర అని అంటాం. ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క ప్రత్యేకమైన చేతనం ఉండటం వలన, సాధకుడు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు చేతన కదులుతున్నట్లుగానూ, విస్తరిస్తున్నట్లుగానూ, ఆధ్యాత్మిక శిఖరాలకు ఎదుగుతూ, ఆధ్యాత్మిక ఆకాశంలో ఎత్తుగా విహరిస్తున్న అనుభూతి కలుగుతుంది. మానవ జన్మ యొక్క యదార్థమైన లక్ష్యం ఇదే. ఈ యాత్రను సమర్థుడైన గురువును ఆశ్రయించి, ప్రారంభించి, కొనసాగించి, ఈ జన్మలోనే పూర్తి చేసుకోవాలి. ఈ యాత్ర ఫలితంగానే, బాబూజీ చెప్పినట్లుగా మనిషిలో యాదార్థమైన పరివర్తన సంభవిస్తుంది. జీవితాన్ని సమగ్రమైన దృష్టితో, స్పష్టతతో లోతుగా అర్థం చేసుకునే ఎరుక ఏర్పడుతుంది. విజ్ఞత కలుగుతుంది. వ్యక్తిత్వం మరింత మరింత సూక్ష్మతరంగా మారుతూ ఉంటుంది. ఇక ఈ యాత్రకు అంతుండదు. అందుకే ఈ గ్రంథానికి, అనంతం వైపు అని పేరు పెట్టడం జరిగింది.
ఈ సహజమార్గ పాఠాన్ని పూజ్య బాబూజీ, తన గురుదేవులైన పూజ్య లాలాజీ మార్గదర్శనంలో తన "అనుభవ శక్తి" ద్వారా ప్రత్యక్షానుభవం ఆధారంగా ఆవిష్కరింపబడిన వినూత్న రాజయోగ పద్ధతి. ఈ ఆధ్యాత్మిక శిక్షణ, ప్రాణాహుతి అనే దివ్య శక్తిని సంసిద్ధుడైన సాధకుని హృదయంలోకి ప్రసరించడం ద్వారా ఇచ్చే శిక్షణ. ప్రాణాహుతిని ప్రసరణ చేయగలిగే గురువును సమర్థ గురువు అంటారు; ప్రాణాయాహుతి అంటే కేనోపనిషత్తులో ఉల్లేఖించిన ప్రాణస్య ప్రాణః అంటే ప్రాణానికే ప్రాణం అంటే, ప్రాణ తత్త్వం అన్నమాట. దేని వల్ల ప్రాణానికే ప్రాణం వచ్చినట్లవుతుందో అదే ప్రాణాహుతి. ఈ ప్రాణాహుతి ప్రసరణ వల్ల యాత్రలో చాలా సమయం ఆదా అవడమే గాక, ఒక చక్రం నుండి మరో చక్రానికి యాత్ర సహజంగా జరుగుతుంది.అయితే సిద్ధులు, శక్తులు పొందాలనుకున్నవారికి, ఇది అనుకూలమైన మార్గం కాదని, వాటికి, ఆధ్యాత్మికతకూ ఎటువంటి సంబంధమూ లేదని మన గురుపరంపర బోధన. ఆధ్యాత్మిక ఎదుగుదల కావాలనుకున్నవారికి, చైతన్య వికాసం పొందాలనుకున్నవారికి, తనను తాను మార్చుకోవాలనుకున్నవారికి, మానవ చేతనం నుండి దివ్య చేతనంగా పరివర్తన కావాలనుకున్నవారికి, దైవానుభూతి చెందాలనుకున్నవారికి ఈ మార్గం ప్రశస్తం.
బాబూజీ ఈ యాత్రను, వారు వ్రాసిన సత్యోదయం అనే గ్రంథంలో 24 వృత్తాలుగానూ, సహజమార్గ దృష్ట్యా రాజయోగ ప్రభావం అనే గ్రంథంలో 3 క్షేత్రాలుగానూ, అనంతం వైపు అనే గ్రంథంలో 13 బిందువులు, లేక గ్రంథులు లేక చక్రాలుగానూ అభివర్ణించడం జరిగింది. సాధకులు తప్పక ఈ గ్రంథాలను తమ వ్యక్తిగత సాధనను కొనసాగిస్తూ అధ్యయనం చేసుకోవాలి. లేకపోతే అవగాహన ఎప్పుడూ అసంపూర్ణంగానే ఉండే అవకాశాలే ఎక్కువ; ఎందుకంటే ఈ గ్రంథాలలో వ్రాసినవన్నీ యదార్థ ఆధ్యాత్మిక సూక్ష్మ అనుభవాలకు సంబంధించినవి కాబట్టి.
మొదటి 5 బిందువులను హృదయ క్షేత్రం అని, 6 నుండి 12 బిందువులను మనోక్షేత్రమని, 13 వ బిందువును కేంద్ర క్షేత్రం అని అంటారు బాబూజీ. ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక రకమైన చైతన్య వికాసం జరిగి, తదనుగుణమైన సహజమైన పరివర్తన సాధకునిలో సంభవిస్తుంది. ఆ మేరకు అంతఃకరణ అంటే 4 ప్రధాన సూక్ష్మ శరీరాలు (మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము) శుద్ధి చేయబడతాయి; ఇదంతా ఒక్క జన్మలోనే సాధించే అవకాశం ప్రతీ అభ్యాసికి ఉంది. కనీసం ప్రతీ అభ్యాసి ఈ జన్మలోనే హృదయ క్షేత్రాన్ని దాటి మోక్షాన్ని పొందాలన్నది మన గురుపరంపర యొక్క ఆకాంక్ష.
తదుపరి వ్యాసంలో మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి