నా ఆదర్శ ఉపాధ్యాయిని - శ్రీమతి విద్యాధరిగారు
|| ఆచార్యదేవో భవ ||
ఈ ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంగా నాకు విద్యాబుద్ధులు నేర్పించిన తల్లిదండ్రులు గాక, ఉపాధ్యాయులందరికీ, ప్రవచనాల ద్వారా, ప్రసంగాల ద్వారా, ఆధ్యాత్మిక శిక్షణనందించిన నా ప్రశిక్షకులందరికీ, నాకు సంస్కృతంలో ప్రవేశం కల్పించిన పండిత ధర్మానంద శాస్త్రిగారికి, ఇంకా ఎన్నో రకాలుగా విద్యనందించిన పెద్దలందరికీ పేరు-పేరునా, నా గుండెలోతుల్లో ఉండే కృతజ్ఞతను పూజ్యభావంతో వ్రాస్తున్న వ్యాసం ద్వారా వినమ్రతతో వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నాను.
వీరందరిలోనూ నా స్మృతిలో లోతుగా నాటుకుపోయిన ఉపాధ్యాయురాలు, నా ఆదర్శ స్త్రీమూర్తి, శ్రీమతి విద్యాధరిగారు. పేరుకు తగ్గట్టుగానే ఆమె నిజంగా విద్యా ధరి, విద్యను ధరించినవారు. ఈమె వద్ద నేను 4 సంవత్సరాలు మాత్రమే చదువుకున్నాను. 1973 నుండి 1977 వరకు. అంటే నా వయసు ఆ స్కూల్లో చేరినప్పుడు పదేళ్ళు. ఆ సమయంలో వారు న్యూఢిల్లీలోని, రామకృష్ణాపురంలోని, సెక్టార్ 2 లో ఉన్న తెలుగు స్కూల్లో హెడ్ మిస్ట్రెస్ గా పని చేసేవారు. ఆమె ఏమి చదువుకున్నారో నాకిప్పటికీ తెలియదు; నేపథ్యమేమిటో నాకిప్పటికీ తెలియదు; ఆవిడ మాకు టీచరు, హెడ్ మిస్ట్రెస్ అని మాత్రమే తెలుసు.
ఈమధ్యనే అమెరికాలో ఉన్న వారి అబ్బాయిని (శ్రీధర్ గారు) సంప్రదించి, వారి చిత్రాన్ని సంపాదించాను. ఆ చిత్రం చూసిన వెంటనే అప్రయత్నంగా అరగంటసేపు కృతజ్ఞతతో కూడిన ఆశృధారలు చాలా సేపు కారుతూనే ఉన్నాయి. ఆమే నా మనసులో అంతా లోతుగా చెరగని ముద్ర వేశారనడానికి, నా మనసులో శాశ్వతంగా నిలిచిపోయారని చెప్పడానికి చెబుతున్నాను. చాలా సమయం పట్టింది మామూలు అవడానికి. ఇంత లోతైన ముద్ర ఆమె వేశారని నాకూ కూడా అప్పుడే అర్థమయ్యింది. 46 సంవత్సరాల తరువాత ఆమె చిత్రం చూసిన తరువాత ప్రత్యక్షంగా ఎదురుగా ఉన్న అనుభూతి కలిగింది.
ఆమె నాకు మొదటిసారిగా క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడమే గాక మేమందరమూ ఆచరించేలా కూడా చేశారు. నా స్వభావం న్యూనతా భావంతో కూడినది; ఆంగ్లంలో ఇంట్రావర్ట్ అంటారు; ఎవరితోనూ మాట్లాడేవాడిని కాదు; అందరితో కలిసిపోయే మనస్తత్వం ఉండేది కాదు; చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది; మా తల్లిదండ్రులకు కూడా ఏమి చేయాలో తెలిసేది కాదు.
అటువంటివాడి చేత, బొమ్మలు వేయించింది, కవితలు, ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ, హిందీ భాషలో కూడా వ్రాసేలా ప్రోత్సహించారు; ఆరోగ్యసూత్రాలను పాటించేలా చేశారు; ప్రతీ సోమవారం, మా గోళ్లను చెక్ చేసేవారు; (ఇప్పటికీ నేను ప్రతీ సోమవారం గోళ్ళు తీసుకుంటాను); ప్రతి రోజూ ఉతికిన బట్టలు వేసుకోవడం నేర్పించారు; వక్తృత్వ పోటీల్లో మూడు భాషలలో పాల్గొనేలా తర్ఫీదునిచ్చేవారు; పెద్ద-పెద్ద నాటకాలు వేయించారు; రేడియో నాటకాలతో సహా; 3 సంవత్సరాలు స్కూల్ లీడరుగా నిలబెట్టారు; పాటలు పాడించేవారు; ఎన్నో రకాల ఆటలు ఆడించేవారు; స్కూల్లో చిన్న-చిన్న బాధ్యతలిచ్చేవారు; అలాగే చదువులో కూడా మంచి మార్కులు వచ్చేలా చూసేవారు; ఆ విధంగా ఎన్నో విలువలు మాకు తెలియకుండానే మాలో అబ్బేలా చేశారు. నా చేత మొట్టమొదటగా ఢిల్లీలోని రామకృష్ణా మఠంలో స్వామి వివేకానంద సాహిత్యంలో నుండి తీసిన ఒక స్ఫూర్తిదాయకమైన ప్రసంగాన్ని మాట్లాడేలా చేశారు. అలాగే అప్పుడప్పుడు ప్రేమతో కూడిన కఠినత్వం కూడా చూపించేవారు; వారు కోపం చూపిస్తే అందరమూ భయపడేవాళ్ళం, వెంటనే తప్పులు సరిదిద్దుకునేవాళ్ళం. ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి అని అర్థమయ్యింది. కానీ ఆమె నేపథ్యం ఏమిటో ఇప్పటికీ తెలియదు. మా నాన్నగారికి హైదరాబాదు బదిలీ అవడంతో 1978 లో హైదరాబాదు వచ్చేశాం; ఇక్కడికి రాగానే ఒక రకమైన బెంగతో ఒక ఉత్తరం వ్రాస్తే ఆమే ఎంతో ఆప్యాయంగా వెంటనే జవాబు వ్రాయడం జరిగింది. నా ఆనందానికి అవధుల్లేవు. 1973 నుండి 1977 వరకూ గడచిన సంవత్సరాలు నా జీవితంలో అతి మధురమైన క్షణాలు, నా జీవితానికి గొప్ప పునాదులు ఏర్పడిన సంవత్సరాలు. ఆమె వ్యక్తిత్వం అంత గొప్పది. తలచుకుంటున్న కొద్దీ ఇంకా వ్రాయాలనే అనిపిస్తోంది. కానీ ఇది తరగనిది. విద్యాధరి టీచర్ గారి పట్ల నా కృతజ్ఞత, నా హృదయంలో ఎప్పటికీ ఊరుతూనే ఉంటుంది.
వారి కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను. విద్యాధరి టీచర్ ఏ లోకాల్లో ఉన్నా, వారికి నా గురుదేవుల ఆశీస్సులు సదా ఉండాలని, ఊర్ధ్వలోకాలలో వారి పయనం ఇంకా ముందుకు-ముందుకు కొనసాఘాట్ ఉండాలని, ఎప్పటికీ వారు నన్ను ప్రేమతో ఆశీర్వదిస్తూ ఉండాలని ఆ సర్వశక్తిమంతుని ప్రార్థిస్తూ విరమిస్తున్నాను.
రిప్లయితొలగించండిఒక అనుసరించదగ్గ వ్యక్తిత్వం గా కృష్ణ ను తీర్చి దిద్దింది ఆ ఉపాధ్యాయురాలు మహా తల్లి విద్యాదరి గారు . ఒక ఆదర్అశవంతమైన టీచర్యి . తే ఇదంతా మనం మన జీవితాన్ని నేమరువేసుకున్నప్పుడు తెలిసే అంశాలు. అలాగే కృష్ణ కు సహజ మార్గం, హార్ట్ ఫుల్ నెస్ ధ్యాన మాధ్యమం ద్వారా మరింతమందికి చక్కగా తీర్చిదిద్దే అవకాశం లభించింది. మన ఉపాధ్యాయులు పూర్వం నాకూ అల్లాంటి ఒక అపాధ్యాయుడు సత్యనారాయణ గారు అని ఉన్నారు. వారు కృష్ణ చెప్పినట్టు కథినంగా వ్యవహరించేవారు గాని చదువులో దిట్ట .. ఇప్పటికి నా చేతులు చూసుకుంటే మిగిలిపోయిన వాటి చిహ్నాలు కనిపిస్తాయి. కాని నాకు ఎప్పుడు ఆయన మీద కోపం రాలేదు. ఇంట్లో అమ్మ నాననలు క్రమశిక్షణ లో పెట్టడానికి చేసే ప్రయత్నాలు తిరుగుబాటు లక్షణాలు పెంచాయి గాని, గమ్మతు ఏమిటంటే ఆయన మీద ఏమీ లేదు. మా పిల్లలలో క్రమశిక్షణ, తప్పు,ఒప్పుల తారతమ్యం తెలుసుకోవడం, ఇలాంటి విశయలుఎన్నొ చొప్పించారు. అంటే కాదు ఆయన మా అమ్మ, నాన్న గార్లకు కూడా మిత్రులు ఇంకా కుటుంబ వ్యవహారాల్లో కూడా సలహాలు, సహకారాలు అందించేవారు. అప్పటి టీచర్ ల దృష్టి పిల్లలను తీర్చిదిద్దడం మీదే ఉండేది. కృష్ణ తో ఉన్న మనందరికీ అదే కనపడుతుంది....ఒక విధమైన తపన బహుశా దహించివేస్తూ ఉంటుందేమో నని అనిపిస్తుంటుంది నాకు. భళా ! దీనిని ఇంకా కొనసాగించు కృష్ణ ... నేను కూడా ఈ అవకాశాని వినియోగించుకుని మా మాస్టరు ని తలచుకున్నాను. మళ్ళీ పూజ్య దాజీ రచించిన వివేక వారధి విషయాలలోనికి వెళ్లి తండ్రిగా నేను చేసిన తప్పులకు క్షమించమని వేడుకుంటున్నాను. వాటిని ఇప్పుడు నేను ఏమీ చేయలేను.... అలాగే నా పిల్లలు పెద్దవాళ్లు అయిపోయి నేను పెంచిన విధానాలకు వ్యతిరేకత కనబరుస్తూనే అవే తప్పులు తమకు తెలియకుండా వారూ చేస్తున్నారు.... ఇదంతా మార్చడానికి చేసేదే మన హృదయాదారిత ధ్యానం అని తెలుసుకున్నప్పుడు ఎంతో తేలిక అనిపిస్తుంది.
అద్భుతం రాము భయ్యా. మీ ఆశీస్సులకు కృతజ్ఞతలు.
రిప్లయితొలగించండి