12, సెప్టెంబర్ 2023, మంగళవారం

పూజ్య దాజీ సందేశాల మననం - ఆధ్యాత్మికతలో నూతన అవగాహనలు, నూతన ఆవిష్కరణలు


పూజ్య దాజీ (కమలేష్ డి. పటేల్ గారు) 
పూజ్య గురుదేవులు. శ్రీరామ చంద్ర మిషన్ సజీవ మాస్టర్ అయిన దాజీ 68 వ జన్మదినోత్సవం ఈ సెప్టెంబర్ 28, 2023 న ఆసన్నమవుతున్న సందర్భంగా, వారు 2015 నుండి ఇప్పటి వరకూ నిర్వహించిన బృహత్తర కార్యాలను, నూతన ఆవిష్కరణలను నెమరు వేసుకునే అల్ప ప్రయత్నం చేస్తున్నాను.  
నా మొదటి గురుదేవులు పరమపూజ్యులు శ్రీ పార్థసారథి రాజగోపాలాచారీజీ మహారాజ్, డిశంబరు 20, 2014 న చెన్నైలో మహాసమాధి పొందిన ఉత్తర క్షణం నుండి శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షులుగా పగ్గాలు చేపట్టిన తరువాత ఇప్పటి వరకూ వారు అపారమైన ఆధ్యాత్మిక కార్యనిర్వహణను, వారికి దివ్య ఆధ్యాత్మిక ధ్యాన స్థితుల్లో వెల్లడి అయిన నూతన ఆవిష్కరణలు, ఇక్కడ క్లుప్తంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. 
1945 లో ప్రారంభమైన సహాజమార్గ ఆధ్యాత్మిక ఉద్యమానికి, వైశ్వికంగా ప్రపంచమంతటా ఈ సంస్థ సేవలను అందుబాటులో ఉంచేందుకు, 2015 జనవరిలోనే హార్ట్ఫుల్నెస్ అని ఈ ఉద్యమానికి నూతనంగా నామకరణం చేయడం జరిగింది. అప్పటి నుండి దాజీ వైశ్విక మార్గదర్శిగానూ, ఆప్యాయంగా అందరికీ  దాజీగానూ, ప్రపంచానికి పరిచయమయ్యారు. ఈ సంస్థ అనుయాయులు అనుసరించే ఆధ్యాత్మిక పద్ధతి పేరు సహజమార్గము. 
ఆ తరువాత జనవరి, ఫిబ్రవరి నెలలలోనే ప్రిసెప్టర్లందరికీ, వాళ్ళు నిర్వర్తించవలసిన విధుల్లో నూతన అనుమతులు మన గురుపరంపర అందించారని వెల్లడి చేయడం జరిగింది. అప్పటి వరకూ ప్రిసెప్టర్  ఒక్కొక్కరికే ముఖా-ముఖి ధ్యాన సిట్టింగులు ఇస్తూండేవారు; ఇప్పుడు గురుపరంపర, ఎంతమందికైనా ఒకేసారి సిట్టింగులు ఇవ్వచ్చునని అనుమతులివ్వడం జరిగింది. అలాగే రిమోట్ సిట్టింగులు, ఆబ్సెన్షియా సిట్టింగులు, సామూహిక సిట్టింగులు ఇలా అనేక విధాలుగా ప్రిసెప్టర్లందరికీ మరింత సాధికారత కలుగజేయడం జరిగింది.  
ఈ పనులు నిర్వహిస్తూనే బంజరు భూమిగా ఉన్న కాన్హా శాంతి వనాన్ని పచ్చదనంగా మార్చే పని కూడా కొనసాగిస్తూ వచ్చారు. ఆ తరువాత బాబూజీ విగ్రహాన్ని కాన్హా శాంతి వనంలోని నక్షత్ర నిర్మాణంపై ప్రతిష్ఠించడం జరిగింది. ఆ తరువాత మరల దాన్ని ఇప్పుడున్న వేరే ప్రదేశానికి తరలించడం జరిగింది. 
ఆ తరువాత 2019 లో ధ్యానోత్సవాలు పరిచయం చేశారు. మొదటగా మధ్య ప్రదేశ్ లోని రాయ్ పూర్ లో ప్రారంభించి, దేశమంతటా, ఆ తరువాత ఇతర దేశాలలో కూడా ఈ ధ్యానోత్సవాలను నిర్వహించడం జరుగుతూ ఉంది. ధ్యానోత్సవం అనేది సాధారణ ప్రజలకు హార్ట్ఫుల్నెస్ ప్రక్రియలను పరిచయం చేసే 3 రోజుల ఉచిత కార్యక్రమం. 
అక్టోబర్ 19, 2019 న ఒక అద్భుత ఘట్టం జరిగింది. మహారష్ట్రలో టుకడోజీ మహారాజ్ సంస్థ అని ఒకటున్నది. ఆయన ఈ సంస్థను నడిపిస్తూ సమాజానికి ఎనలేని సేవలనందిస్తూ వచ్చారు. 1968 లో పరమపదించడం జరిగింది. వీరు   ఏప్రిల్ 30, 1909 న జన్మించడం జరిగింది. వీరిని అందరూ శ్రద్ధతో రాష్ట్రసంత్  అని పిలుస్తారు. మహారాష్ట్ర రాష్ట్రమంతటా వ్యాపించిన ఆధ్యాత్మిక సంస్థ. పూజ్య దాజీ పైన తెలిపిన తేదీన వీరి ఆశ్రమాన్ని సందర్శించడం, అక్కడ ధ్యానం నిర్వహించడం, ఆ తరువాత చేసిన ప్రసంగంలో ఒక ప్రకటన మన అభ్యాసులందరినీ విస్మయానికి గురి చేస్తుంది.  కొన్ని వేలమంది టుకడోజీ మహారాజ్ పుణ్యతిథి సందర్భంగా సమావేశమయిన తరుణంలో పూజ్య దాజీ ఈ విధంగా ప్రకటించడం జరిగింది: "శ్రీకృష్ణుడు తో మొదలుకొని లాలాజీ, బాబూజీ, స్వామి వివేకానంద, పరమహంస శ్రీరామకృష్ణ, చైతన్య మహాప్రభు, కబీర్ దాస్, గౌతమ బుద్ధుడు, గురు నానక్, లతో కూడుకున్న మన గురుపరంపర జాబితాలో పూజ్య టుకడోజీ  మహారాజ్ కూడా చేరుకున్నారని ప్రకటించడంలో నాకు చాలా ఆనందంగా ఉంది" అన్నారు. 
ఆ తరువాత ఫిబ్రవరి 2, 2020 న బసంత్ పంచమినాడు, కాన్హా శాంతి వనం, ఒకేసారి లక్ష మంది కూర్చొని ధ్యానం చేసుకోగలిగే,  ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన మందిరాన్ని  అప్పటి భారత రాష్ట్రపతి శ్రీ రామనాథ్ కోవింద్ గారు ప్రారంభించడం జరిగింది. ఇది శ్రీరామ చంద్ర మిషన్ చరిత్రలో ఒక ప్రధాన ఘట్టం. పతంజలి పీఠ అధ్యక్షులు యోగర్షి రామ్ దేవ్ బాబా కూడా ఇందులో పాల్గొనడం విశేషం. 
ఆ తరువాతి రెండు సంవత్సరాలు కోవిడ్ మహమ్మారి తాండవించిన గడ్డు కాలంలో కూడా పూజ్య దాజీ తన అనుయాయులను  కంటికి రెప్పలా కాపాడుతూ ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు కూర్చొని ధ్యానం చేసుకొనే ఏర్పాటు చేస్తూ, లైవ్ గా సత్సంగాలను నిర్వహించారు; ప్రసంగాలు చేశారు; ఆరోగ్య జాగ్రత్తలను మనందరికీ ఎప్పటికప్పుడు తెలియజేశారు; దిల్ సే కార్యక్రమాల ద్వారా భారతదేశంలోని అన్ని  రాష్ట్రాల అభ్యాసులతో జూమ్ మీటింగుల ద్వారా పలుకరిస్తూ ఎన్నో సాధనపరమైన విషయాలను, జీవితానికి సంబంధించిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలను చెబుతూ ఆ కష్టకాలాన్ని దాటించేశారు; ఈ సమయంలో శ్రామికులకు ఉచిత భోజన సేవలు, ఉచిత వైద్య సేవలు, ఉచితంగా మాస్కుల పంపిణీ, ఇంకా అనేక సామాజిక సేవలనందించింది ఈ సంస్థ. ఈ గడ్డుకాలాన్ని పూజ్య దాజీ దాటించిన విధానం అద్వితీయం. మనందరి జీవితాల్లో ఎప్పటికీ కృతజ్ఞులై ఉండవలసిన ఘట్టం.

(ఇంకా ఉంది..)  




 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...