18, సెప్టెంబర్ 2023, సోమవారం

వినాయకుడు మానవ పరిపూర్ణతకు చిహ్నం





|| వశిష్ఠ వామదేవాది వందిత || 
|| మహాగణపతిం, మనసా స్మరామి ||

వినాయకుడు మానవ పరిపూర్ణతకు చిహ్నం 

వినాయకుడి రూపం మనిషి పరిపూర్ణతను సాధించాలంటే ఉండవలసిన లక్షణాలను సూచించే స్వరూపం; ప్రేరణను కలిగించే ఆకారం; ఆచరణకు నిత్యస్ఫూర్తినిచ్చే గొప్ప తత్త్వం ఈ రూపం; చూడగానే మనసుకు ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగించే సమ్మోహన రూపం, వినాయకుడు. 
ఆధ్యాత్మిక సాధకులు ఈ స్వరూపాన్ని పరిశీలనగా గమనిస్తే బోలెడంత స్ఫూర్తి కలుగుతుంది. 
తొండంతో ప్రారంభిద్దాం; ఏనుగు తొండంలో చాలా సున్నితత్త్వం ఉంటుందంటారు; సూదిని కూడా ఎత్తగలదంటారు ఆ తొండంతో. అలా మనిషి కూడా అంతా సున్నితత్త్వం కలిగి ఉండాలి. అలాగే విశాలమైన నుదురు, జ్ఞానానికి ప్రతీక; చిన్న కళ్ళు; అంటే దూరదృష్టి, సూక్ష్మదృష్టి గలవాడని అర్థం; పెద్ద చెవులు; అంటే బాగా వినాలని సంకేతం; పెద్ద ఉదరం అంటే, ఎన్ని అవమానాలు పడినా స్పందించకుండా కడుపులో పెట్టుకోగలిగినవాడు; అంత బరువైన శరీరంలా కనిపించినా చిన్ని ఎలుక మోయగలిగేంత తేలికగా ఉండేవాడు; ఎలుక కోరికలను సూచిస్తుంది; ఎలుకపై అంటే కోరికలపై ఆధిపత్యం సంపాదించినవాడు అంత తేలికగా ఉంటాడని సంకేతం. ఇలా ఇటువంటి లక్షణాలన్నీ అలవరచుకుంటే మనిషి దైవంగా మారతాడని వినాయకుడి రూపం మనకు తెలియజేస్తున్నది. ఈ లక్షణాలన్నీ సాధన ద్వారా అలవరచుకొని మనిషి దివ్యంగా పరిపూర్ణ వ్యక్తిత్వంగా మారాలన్న ఆదర్శాన్ని సూచిస్తుంది ఈ దివ్యమంగళ విగ్రహం. 
ఒక చేతిలో దుష్ట శక్తులను నాశనం చేసే ఆయుధాలు, అంటే మనిషిలోని మలినాలను, అరిషడ్వర్గాలను తొలగించే శక్తులు; మరొక చేతి ద్వారా అభయం. 

అంతేగాక పూజ్య దాజీ చెప్పినట్లుగా, ఆయనలో కొంత భాగం పశువుది, కొంతభాగం మనిషిది, మరికొంత భాగం దివ్యమైనది - అంటే పాశవికత నుండి మానవత్వం; మానవత్వం నుండి దివ్యత్వం వరకూ చేసే మన ఆధ్యాత్మిక యాత్రను సూచిస్తున్నది. ఇలా సూక్ష్మదృష్టితో పరికించి చూసినప్పుడు మరిన్ని సూక్ష్మాలు మనకు స్ఫురించవచ్చు. అంతర్ముఖులై ధ్యానించినప్పుడే సూక్ష్మదృష్టి కలిగే అవకాశం, తద్వారా మనిషి పరిపూర్ణుడుగా మారే అవకాశం ఉంటుంది. 



 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...