శ్రీకృష్ణాష్టమి మనందరికీ గొప్ప పర్వదినం; ఆయన యుగపురుషుడే కాదు, యోగేశ్వరుడు కూడా; అంటే యోగానికి ఈశ్వరుడు, యోగానికి భగవానుడు కూడా.
పూజ్య లాలాజీకి శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఎనలేని భక్తి, పూజ్యభావం, శ్రద్ధ గలవారు. ఆయన ఇప్పటివరకూ ఉన్న భారతీయ ఆధ్యాత్మిక చరిత్రనంతా తిరగేసి శోధించినప్పుడు, శ్రీకృష్ణుడు అందరిలోకీ భిన్నంగా ప్రకాశిస్తూ ఉన్నదని తన గ్రంథాలలో వ్రాసుకోవడం జరిగింది. అలాగే బాబూజీ మహారాజ్ కూడా శ్రీరాముడిని గురించి అలాగే, నైతికతకు, సత్ప్రవర్తనకు, సంస్కృతికీ పునాదులు వేసిన వ్యక్తిగా విశ్వసించేవారు. శ్రీకృష్ణ భగవానుడు ఈ కలియుగాన్ని శాసించే యుగపురుషుడు. నైతికత, సత్ప్రవర్తన లను పునాదులుగా ఏర్పరచుకుని శ్రీకృష్ణ భగవానుడు మానవ జీవిత గమనంలో భక్తిని ప్రవేశపెట్టడం జరిగింది. భగవంతుని పట్ల ప్రేమను ఆధ్యాత్మిక యోగసాధనలో భక్తిని ప్రవేశ పెట్టడం జరిగింది.
సహజమార్గ పద్ధతి ద్వారా మనకర్థమయ్యేదేమిటంటే, మనం నిత్యం చేసే కర్మలను, ప్రేమ లేకుండా, ఉత్సాహం లేకుండా కేవలం భౌతికంగా, మానసికంగా మాత్రమే చేసినట్లయితే బ్రతుకు ఈడుస్తున్నట్లుగా ఉంటుంది. అలా గాకుండగా మనం చేసే పనులను గనుక కాస్త భగవంతుని పట్ల ప్రేమతో చేసినట్లయితే అది ఒక విధమైన భక్తిగా మారుతుంది, జీవితం ధన్యంగా మారుతుంది. లేకపోతే ఎప్పుడూ శ్రమగానే మిగిలిపోతుంది. అలాగే మనం సంపాదించుకున్న జ్ఞానం కూడా పాడైపోతుంది; పాలు పాడైతే పెరుగుగా మారినట్లే; అలాగే జ్ఞానం కూడా అహం వల్ల కలుషితమైపోతుంది; ఆ జ్ఞానానికి భగవంతుడు కేంద్ర బిందువుగా ఉంటే తప్ప; భగవంతుని ప్రభావం ప్రబలంగా ఉంటూ భగవంతుడు కేంద్ర స్థానాన్ని గ్రహిస్తే తప్ప. అప్పుడే జ్ఞానం భక్తిగా పరివర్తన చెందుతుంది; లేకపోతే ఆ జ్ఞానం మూర్ఖత్వంగా మిగిలిపోతుంది.
శ్రీకృష్ణుని జీవితంలో మరొక ముఖ్యమైన పాత్ర ఏమిటంటే, మనందరికీ ఈ రోజున తెలిసిన సహజమార్గ పద్ధతి ద్వారా ప్రసరించే ప్రాణాహుతి పద్ధతి, ఆధ్యాత్మిక శక్తి యొక్క ప్రసరణను గురించి. అర్జునుడికి అంత జ్ఞానాన్ని, 18 అధ్యాయాలలోనీ 700 శ్లోకాలు, మౌఖికంగా అందజేయడం అనేది అసాధ్యమైన విషయం; ముఖ్యంగా యుద్ధం ప్రారంభం కానున్న సమయంలో, అన్నీ దిక్కుల నుండి శంఖాలు పూరించిన తరువాత; ఆ క్షణంలో అర్జునుడు విషాదంలో మునిగి ఇక నేను యుద్ధం చేయలేనని చతికిల పడిపోయినప్పుడు; ఆ పరిస్థితిని ఒక్కసారి ఊహించండి. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ఈ జ్ఞానాన్నంతటినీ ప్రాణాహుతి ప్రసరణ ద్వారా కొన్ని క్షణాల్లోనే అర్జునుడికి అందజేయడం జరిగింది; వేదవ్యాస మహర్షి ఈ ప్రక్రియనంతటినీ సాక్షిగా ఉన్నాడు; కృష్ణార్జునుల మధ్య జరిగిన ఈ క్షణాలలో ప్రాణాహుతి ద్వారా అందించిన జ్ఞానాన్ని తర్జుమా చేసినదే మనం ఈ రోజున చదువుకుంటున్న 700 శ్లోకాల భగవద్గీత. కేవలం ఆధునిక మానవుడు మాత్రమే ఈ ప్రక్రియను అర్థం చేసుకోగలుగుతాడు; ఏ విధంగా ఈ జ్ఞానాన్ని డౌన్ లోడ్ చేయడం జరుగుతుందో. కొన్ని గిగా బైట్ల మెమరీని ఒక సెకను కంటే తక్కువ వ్యవధిలో ఎలా డౌన్ లోడ్ చేయవచ్చో ఈ ఆధనిక మానవుడు మాత్రమే అర్థం చేసుకోగలుగుతాడు. ఈనాటి ప్రపంచం మాత్రమే ఏ విధంగా ఈ జ్ఞానాన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చునో అర్థం చేసుకోగలడు.
ఆయన జీవితకాలంలోనే దివ్యలోకాలకు తరలి వెళ్ళాలని సంకల్పించినప్పుడు, ఉద్ధవుడు తెలుసుకొని, స్వామీ, మీరు వెళ్ళిపోతే మేము ఏం చేయాలి? మీరు మాతో ఏమీ పంచుకోలేదు అంటాడు. దానికి శ్రీకృష్ణుడు, నువ్వే అందరికీ బోధించాలి; భక్తిని గురించి గోపికలకు బోధించు; భక్తిని గురించి ప్రపంచానికి అందరికీ తెలియజేయి అంటాడు. ఆ సాంప్రదాయమే ఈరోజుకీ కొనసాగుతూ ఉంది.
శ్రీకృష్ణుని ప్రకారం భక్తి అంటే, కేవలం బాహ్య ఆరాధనే కాదు; మనం చేసే అన్నీ పనులకు వర్తిస్తుంది; వాటన్నిటినీ స్వామికి అంకితం చేస్తాం; జీవితంలోని ప్రతీ అంశమూ ఆ పరతత్త్వం పట్ల ఉన్న ప్రేమ తరంగాలతో కంపించాలి; అప్పుడే దాన్ని నిజమైన భక్తి అనగలుగుతాం.
చక్కని పాలలో ఒక నిమ్మరసం యొక్క చుక్క పడితే పాలు పాడైపోయినట్లు, భక్తి అనేది కలుషితమైపోయేది, భక్తికి మచ్చలేర్పడేది, ఎప్పుడంటే దురాశ ఏర్పడినప్పుడు, ఏదైనా ఆడగాలనుకున్నప్పుడు, చివరికి బ్రహ్మ విద్యను గురించి గాని, మోక్షాన్ని గురించి గాని, ఒక ఆలోచన మెదిలినా కూడా; భగవంతుడా నేనింత తపస్సు చేస్తున్నాను, ఇంత ధ్యానం చేస్తున్నాను, కొంచె మనశ్శాంతినిస్తావా? అనేటువంటి వ్యాపార ధోరణి భక్తిని పాడుచేస్తుంది. ఎందుకంటే భక్తి దేన్నీ కోరదు గనుక. భక్తి అంటే కేవలం ప్రేమ కోసం ఉండే ప్రేమ మాత్రమే; కేవలం భగవంతుని కోసం ఉండేది. మన ఉనికి ఉన్నదే భగవంతుని కోసం. కేవలం ఆయన సేవ కోసం మాత్రమే.
ఆయన జీవితం ఎప్పటికీ ఆధ్యాత్మిక జీవితానికి, ఆధ్యాత్మిక వెలుగుకూ కాంతిపుంజమై భాసిస్తూ ఉంటుంది. మనం వాటిని ఆకళింపుచేసుకోవాలి. ఆయన తత్త్వాన్ని మన జీవితాల్లో భాగం చేసుకోవాలి.
సహజమార్గ మాస్టర్ల గురుపరంపర శ్రీకృష్ణ భాగవానునితో ప్రారంభమవుతుంది. అది కొనసాగుతూ ఉంది కూడా; మీలో కొంతమందికి తెలిసి ఉండవచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చును. మన మాస్టర్ల గురుపరంపర శ్రీకృష్ణుడు, శ్రీరాధతో ప్రారంభమవుతుంది; ఆ తరువాత చైతన్య మహాప్రభువు, గౌతమ బుద్ధుడు, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, లాలాజీ మహారాజ్, బాబూజీ మహారాజ్, చారీజీ మహారాజ్, ఇలా కొనసాగుతూ ఉంది; ఒక్కోసారి ఈ పేర్లన్నీ గుర్తుంచుకోవడం కష్టంగా ఉంటుంది; దయచేసి క్షమించండి. నేను అన్ని పేర్లూ చెప్పకలేకపోవచ్చు; అన్నీ పుస్తకాలలో ఉన్నాయి. చెప్పలేకపోతే కూడా ఏమిటి నష్టం? కృష్ణుడి పేరు ముందా, లాలాజీ పేరు ముందా, అసలు ఏ పేరూ లేదా? ఒకవేళ వాళ్ళ పేర్లన్నీ చెప్పినా, వాళ్ళను గురించి మనకేమి తెలుస్తుంది? వారి దివ్య తత్త్వాలను గురించి ఎలా తెలుస్తుంది? మనం కూడా అటువంటి తత్త్వాలుగా మారితే తప్ప. కాబట్టి గురుపరంపర యొక్క పిలుపు ఒక్కటే - వాళ్ళల్లా తయారవ్వండి; తయారైన తరువాత ఆ తయారైన తత్త్వాన్ని వారికే అర్పించండి; ఆ విధంగా తయారై మిమ్మల్ని మీరు పూర్తిగా లేకుండా చేసుకోండి; మిమ్మల్ని మీరు లేకుండా చేసుకోవడం అంటే, మిమ్మల్ని మీరు కాల్చుకోవడం కాదు, మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవడం కాదు; ఈ తయారైన తత్వానికి అతీతంగా ఎడగండి; అప్పుడొక నూతన అస్తిత్వం ప్రారంభమవుతుంది; అప్పుడు మనకు ఏమి జరుగుతుందో ఏమీ తెలియదు. కనీసం వారిలా తయారవ్వాలన్న దిశగా ఆసక్తి కనబరచండి, దానికి అవసరమైన లక్షణాలను మీలో పెంపొందించుకోండి; వాళ్ళకి మన జీవితాల్లో స్థానం కల్పించండి; మనం వారికి అందుబాటులో ఉందాం; ఇలా మనలను మనం, మన ఆత్మలను, మన హృదయాన్ని, మన కృషి వారికి అందుబాటులో ఉంచడం అనేది చాలా కీలకం. ప్రస్తుతం మనం అందుబాటులో ఉన్నాం ఇక్కడ; వాళ్ళు మనపై పని చేయగలరు; మీరొక్క సమూహంగా ఇక్కడ అందరూ ధ్యానంలో కూర్చున్నారనుకోండి - దీన్నే అందుబాటులో ఉండటం అంటారు; వారి దివ్యకృపకు, దివ్య ప్రాణాహుతికి పాత్రులవడం; అప్పుడు మనకీ, వారికీ మధ్య జరుగవలసిన విలీన ప్రక్రియ జరిగే అవకాశం ఉంటుంది; అలాగే మన ఇళ్ళల్లో కూడా మనం ఈ ప్రాణాహుతికి, పై నుండి వర్షిస్తున్న ఈ దివ్యకృపకు అందుబాటులో ఉంటున్నామా? మీరు అందుబాటులో లేనట్లయితే, మీరు వాటిని అందుకొనే పరిస్థితుల్లో లేకపోయినట్లయితే, మీలో పరివర్తన ఎలా వస్తుంది? కాబట్టి ఆధ్యాత్మిక పరివర్తనకు, అందుబాటులో ఉండటం అనేది కీలకమైనది. భౌతికంగా అందుబాటులో ఉన్నా హృదయం మూసుకొని ఉంటే? ఎవరైతే అందుబాటులో ఉండాలనుకోవడం లేదో వాళ్ళకి చాలా అవరోధాలుంటాయి. ఎవరైతే నిజంగా, నిజంగా, నిజంగా పురోగమించాలనుకుంటున్నారో, వాళ్ళకు ఎటువంటి సాకులూ ఉండటానికి వీల్లేదు. కాబట్టి మనం ఇక మనకు ఈ అందుబాటులో ఉండటం కోసం, ఎటువంటి కారణాలూ, సాకులూ ఉండవన్న నిబద్ధత కలిగి ఉందాం. ధన్యవాదాలు.
(పైన హైలైట్ చేసిన వాక్యాలు, మనం మరలా-మరలా, మనలో జీర్ణమయ్యే వరకూ మననం చేసుకోవలసిన వాక్యాలు. గమనించగలరు. )
జ్ఞానం ఏవిధంగా కలుషితమౌతుంది, అది మనకు ఏవిధంగా ఉపయోగపడకుండా పోతుందో చక్కగా పూజ్య దాజీ గారి మాటలను చెప్పారు మాకు. మన జీవితానికి, మనమ్ చేసి ప్రతి పనికీ ఆయనే కేంద్రం గా ఉండాలని చెప్పారు. ఈ మీ ప్రయత్నాన్ని కొనసాగించగలరు.
రిప్లయితొలగించండి