శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మనం యుగపురుషుడైనటువంటి, సహాజమార్గ గురుపరంపరలోని ఆదిపురుషుడైన శ్రీకృష్ణ పరమాత్మను స్మరించుకునే ప్రయత్నంలో ఉన్నాం.
అసలు ఇటువంటి వ్యక్తిత్వాలపై ధ్యానించడం ఎలా? అనే ప్రశ్న అందరికీ వస్తుంది; వాళ్ళ జీవిత చరిత్రలను, వ్యక్తిత్వాలను, వారు వారి జీవితకాలంలో చేసిన అద్భుత కార్యాలను, వారి బోధనలను, వారి జీవించిన తీరును, వారి వైభవాన్ని గుర్తు చేసుకోవడమా, అధ్యయనం చేయడమా, ఆకళింపు చేసుకోవడమా? స్మరణలో ఇవన్నీ భాగమైనప్పటికీ ధ్యానించేది మాత్రం వీటన్నిటికీ మూలకారణమైన ఆ మహానీయుడి తత్త్వంపై ప్రత్యేకంగా ధ్యానించాలని మన గురువుల ద్వారా నాకర్థమయ్యింది. వారి-వారి జన్మదినాలలో ఆయా వ్యక్తిత్వాలను ప్రత్యేకంగా స్మరించుకుంటూ ఉంటాం. ప్రస్తుతం శ్రీకృష్ణపరమాత్మ తత్త్వంపై మనం ధ్యానిద్దాం.
నిజమైన స్మరణ, ఆత్మ యొక్క ఆధ్యాత్మిక ఆకలి, ఆధ్యాత్మిక తృష్ణ సంతృప్తి చెందుతుంది. అదే నిజమైన స్మరణ కేవలం మేధోపరంగా జ్ఞాపకాలు నెమరువేసుకోవడం కాదు; అటువంటి తత్త్వాన్ని మేధోపరంగా గాక హృదయపరంగా, ఆత్మపరంగా స్మరించడమే ధ్యానం, నిజమైన స్మరణ. పూజ్య చారీజీ అద్భుతంగా మనదరికీ అర్థమయ్యేలా వివరించారు స్మరణ అంటే: కడుపుకు ఆకలి వేస్తున్నప్పుడు, కడుపు ఆహారాన్ని స్మరించే స్థితే స్మరణ అంటే; దాహం వేసినప్పుడు గొంతుక నీటి కోసం స్మరించే స్థితి; మేధస్సు జ్ఞానం కోసం పరితపించే స్థితి; ఆత్మ దేని కోసం పరితపిస్తుందో ఆ స్థితే స్మరణ; దేన్ని స్మరిస్తే ఆత్మ సంతృప్తి చెందుతుందో అదే అసలైన స్మరణ; ఆత్మ దైవ తత్త్వాన్ని స్మరించినప్పుడు సంపూర్ణమైన ఆధ్యాత్మిక ఆకలిని, తృష్ణను తీర్చడమే గాక మరింతగా పరితపించేలా చేస్తుంది. ఈ దృష్టికోణంతో మనం అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తత్త్వం పై ధ్యానిద్దాం;
శ్రీకృష్ణ పరమాత్మ వ్యక్తిత్వంలో అనేక దైవిక పార్శ్వాలున్నాయి: జన్మించినప్పటి నుండి ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా లేడు; ఆయనలో బోధకుడున్నాడు, ప్రేమికుడున్నాడు; యోధుడున్నాడు; రక్షకుడున్నాడు; ఆపద్బాంధవుడున్నాడు; మంచి స్నేహితుడున్నాడు; ఆదర్శ వ్యక్తిత్వం ఉంది; తపోధనుడున్నాడు; సంభాషణా చాతుర్యం ఉన్నవాడు; మంచి రాయబారి ఉన్నాడు; అందరికీ అలౌకిక ఆనందాన్ని కలిగించే తత్త్వం ఉన్నవాడు; సమ్మోహన శక్తి గలవాడు; సంభాషణాల్లో అపస్వరాలు లేనివాడు; అన్నిటి కంటే పుట్టినప్పటి నుండి స్థితప్రజ్ఞత్వం ఆయన వ్యక్తిత్వంలో ప్రతీ క్షణమూ కనిపిస్తూనే ఉంటుంది; వీటన్నిటి కారణమైన ఆయనలో ఉన్న ఆ దివ్య చేతనపై ధ్యానించడమే శ్రీకృష్ణ ధ్యానం. దాన్నే శ్రీకృష్ణ చైతన్య ధ్యానం అనవచ్చు.
ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ విధంగా ధ్యానించే ప్రయత్నంలో ఉందాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి