18, సెప్టెంబర్ 2023, సోమవారం

పూజ్య దాజీ సందేశాల మననం - ఆధ్యాత్మికతలో నూతన అవగాహనలు, నూతన ఆవిష్కరణలు - 3

 



నూతన అవగాహనలు, ఆవిష్కరణలు - పరిచయం  

పూజ్య లాలాజీ, దశరథ మహారాజుకు 72 తరాలకు పూర్వం ఉన్న ఈ ప్రాణాహుతి ఆధారితమైన రాజయోగ విద్యను, కాలగర్భంలో కనుమరుగైపోయిన ఈ విద్యను వెలికి తీస్తే, పూజ్య బాబూజీ మహారాజ్ ఈ  విద్యకు పరిపూర్ణతను చేకూర్చి, సహజమార్గం అన్న పేరుతో మానవాళికి పరిచయం చేయడం జరిగింది. ఈ విద్యను పరమపదిలంగా స్వచ్ఛతను కాపాడుకుంటూ, పవిత్రంగా ఉంచుతూ పూజ్యశ్రీ పార్థసారథి రాజగోపాలాచారీజీ మహారాజ్ కు అందజేస్తే, వారు 100 దేశాలలో ఈ పద్ధతిని విస్తరింపజేశారు; ఆ తరువాత పూజ్య దాజీకి ఈ సహజమార్గ కాగడాను 2014 లో కొనసాగించమని అందజేయడం జరిగింది. దాజీ భూమ్మీద ఉన్న ప్రతి ఇంటికి ఈ పద్ధతి యొక్క అవగాహనను అందిస్తూ ప్రతి గుండెకూ ప్రాణాహుతి అనుభూతిని అందించే ప్రయత్నంలో ఉన్నారు; హార్ట్ఫుల్నెస్  అనే వైశ్విక నామకరణం చేసి ఈ సహాజమార్గ ఆధ్యాత్మిక పద్ధతిని విశ్వమంతటికీ అందుబాటులో ఉండేలా  ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనందరమూ ఉడతాభక్తిగా మన వంతు తోడ్పాటునందించే  ప్రయత్నంలో మనం ఉన్నాం. 
1945 లో పూజ్య బాబూజీచే ప్రారంభింపబడిన ఈ ఉద్యమం ప్రతీ మాస్టరు ద్వారా  కొంత పరిణామం చెందుతూ వస్తోంది. ఈ సంస్థ ఆశయం - ప్రపంచంలో ప్రబలియున్న  అనాధ్యాత్మికత  స్థానంలో ఆధ్యాత్మికతను నెలకొల్పడం; ఆధునిక మానవుని అవసరాలకు తగినట్లుగా యోగాన్ని ప్రవేశపెట్టడం. ఈ క్రమంలో ఈ సహజమార్గ సాంప్రదాయంలో నలుగురు మాస్టర్లు పరంపరగా వచ్చారు. ప్రస్తుతం పూజ్య దాజీ నాల్గవ మాస్టరుగా ఉన్నారు. మానవాళి వికాసం విషయంలోఒక్కొక్క మాస్టరుకు ఒక్కొక ప్రత్యేకమైన పాత్ర ఏర్పరచడం జరిగింది.  లాలాజీ ఈ సాంప్రదాయానికి  ఆద్యులైతే, బాబూజీ, చారీజీలు పటిష్ఠమైన పునాదులను ఏర్పరచారు. ఇప్పుడు పూజ్య దాజీ ఆ పునాదులపై విశిష్ఠమైన ఆధ్యాత్మిక సౌధాన్ని నిర్మిస్తున్నారు. 
సహజమార్గంలో జన్మతః మాస్టర్లుగా ఉండరని చారీజీ ఒకసారి చెప్పడం జరిగింది,  కొన్ని సంప్రదాయాలలో ఉన్నట్లుగా. ప్రకృతి లేక భగవంతుని ఆధ్వర్యంలో అటువంటి వ్యక్తిత్వ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. దానికి ఆ వ్యక్తులు చాలా తీవ్రంగా ఎంతో నిబద్ధతతో సహజమార్గ సిద్ధాంతాలకు అనుగుణంగా ఎంతో కాలంగా సాధన చేస్తూంటారు. ఆ క్రమంలో ఆయా కాలానికి తగినట్లుగా ఉత్కృష్ఠ ఆధ్యాత్మిక స్థితులు సిద్ధించడం, సూక్ష్మాలు తెలియడంతో వినూత్న అవగాహనలకు, నూతన ఆవిష్కరణలకు, వారి సాధన దారి తీస్తూ ఉంటుంది. సమయం వచ్చినప్పుడు గాని అటువంటి వ్యక్తి వెలుగులోకి రారు. చివరికి ఆ సమయంలో ఉన్న మాస్టరుకు కూడా తెలియకపోవచ్చు. సారాంశం ఏమిటంటే మన గురుపరంపరను నిర్దేశించేది పై లోకాల నుండే;  అత్యున్నత ఊర్ధ్వలోకాల్లో ఉన్న మహాత్ముల కూటమి ద్వారానే అన్నమాట.   

ఆ క్రమంలో పూజ్య దాజీ తన సాధన 1976 లో ప్రారంభించినప్పటి నుండి చాలా గంభీరంగా, తీవ్రతపనతో సాధన చేసిన వ్యక్తిగా ఉన్నారు. ఇప్పటికీ తనను తాను ఒక యోగసాధకుడిగానే భావించుకుంటారు, ప్రపంచానికి తనను తాను అలాగే పరిచయం చేసుకుంటారు కూడా. తన మొట్టమొదటి ధ్యాన సిట్టింగులో కలిగిన అనుభూతిని ఇప్పటికీ అవకాశం వచ్చినప్పుడల్లా ఎంత అద్భుతమైనదో చెబుతూ ఉంటారు. ఇలా తీవ్రంగా నిబద్ధతతో కొనసాగుతూ ఉన్న తపస్సు ద్వారా, నిగూఢమైన ధ్యాన స్థితుల్లో కలిగిన అవగాహనలను, ఆవిష్కరణలను పూజ్య దాజీ ఎప్పటికప్పుడు వారు మనతో తన ప్రసంగాల ద్వారా, వ్యాసాల ద్వారా, ఇంటర్వ్యూల ద్వారా, పత్రికల ద్వారా, హార్ట్ఫుల్నెస్ మ్యాగజైన్ల ద్వారా, ప్రసంగాల ద్వారా, సంభాషణల ద్వారా వెల్లడిస్తూనే ఉన్నారని ఆయనే స్వయంగా ఈ మధ్యన ఆగష్ట్ 13, 2023 న ఆదివారం సత్సంగం తరువాత వెల్లడించడం జరిగింది. వాటినే మనం, ఆ  వెల్లడించిన విషయాలనే ఇక నుండి ఒక్కొక్కటిగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...