ఇంద్రియార్థేషు వైరాగ్యమనహంకార ఏవచ |
జన్మమృత్యుజరావ్యాధిదుఃఖదోషానుదర్శనం || భగవద్గీత 13.9||
మానవ జన్మకు నాలుగు ప్రధాన దుఃఖాలున్నాయి, తప్పవు ఎవరికైనా. జన్మ, మృత్యువు, జరా, వ్యాధి, ఈ నాలుగు దుఃఖాలు తప్పనిసరిగా ప్రతీ మనిషీ ఎదుర్కోవలసినదే. జన్మ అంటే పుట్టుక, మృత్యువు అంటే మరణం, జరా అంటే ముసలితనం, వ్యాధి అంటే రోగం, ఈ నాలుగు దుఃఖాలు తప్పనిసరిగా అందరూ అనుభవింమచవలసినదేనని మన శాస్త్రాలు నొక్కి చెబుతున్నాయి.
వీటిని తప్పించుకోలేమని తెలిసినా, తెలియకపోయినా వాటిని పోగొట్టుకోవాలని మానవుడు సర్వవిధాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒక్కసారి జన్మించామంటే తక్కిన మూడు దుఃఖాలు వాటంతటవే తగులుకుంటాయి. నాకు ముసలితనం అంటే ఆసక్తి లేదు; నాకు మృత్యువు అంటే ఇంటరెస్ట్ లేదు అంటే అది హాస్యాస్పదమే అవుతుంది తప్ప వాటిని తప్పించుకునేది ఉండదు. అందుకే జన్మే లేకుండా పోతే మిగిలిన మూడూ ఉండవు కదా అని మన మహర్షులు యోచన చేశారు, పరిష్కారాలు కనుగొన్నారు. వాటినే మనం యోగా-ధ్యాన పద్ధతులంటాం. అందుకే దీన్ని జన్మరాహిత్యం అని కూడా అంటారు. కాబట్టి ప్రతీ మనిషి ఈ జన్మరాహిత్యం కోసం తెలిసో-తెలియకో, ఈ రోజో-రేపో మనసు పెట్టవలసిందే. ఎంత త్వరగా మనసు దానిపై కుదురితే అంత సమయం ఆదా అవుతుంది.
కాబట్టి ఏ యోగపథమైనా మనకు నేర్పించవలసినది జన్మకు, మృత్యువుకు మధ్య సక్రమంగా జీవించే విధానం ఏమిటి, లేక సక్రమంగా మరణించే విధానం ఏమిటి అన్నది తెలియజేయాలి. ఇక్కడ సక్రమంగా జీవించడమూ అంటే మరలా జన్మించవలసిన అవసరం లేకుండా జీవించే కళను నేర్చుకోవడం (ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనుకోవచ్చు); అలాగే సక్రమంగా మరణించడమూ అంటే మరలా మరణించవలసిన అవసరం లేకుండా మరణించగలిగేటువంటి శిక్షణను పొందడం (ఆర్ట్ ఆఫ్ డయింగ్ అనవచ్చునేమో). అదే మన హార్ట్ఫుల్నెస్ యోగపథము, లేక హార్ట్ఫుల్నెస్ జీవన విధానం.
ఈ నాలుగు దుఃఖాలను మనిషికుండే నాలుగు ప్రధాన ఒత్తిళ్ళు అని కూడా అనవచ్చు. ఈ ఒత్తిళ్ళను సంపూర్ణంగా అధిగమించే ఉపాయమే యోగము లేక ధ్యానము. ఈ నాల్గిటికి మూల కారణాలు, కోరికలు, సంస్కారాలు/కర్మలు/వాసనలు, అహంకారము. జన్మకు, మృత్యువుకు మధ్య ఉండే జీవనాన్ని సద్వినియోగపరచుకుంటూ వీటిని క్రమక్రమంగానైనా అధిగమించే ప్రయత్నమే ఈ యోగానుష్ఠానం. అందునా హార్ట్ఫుల్నెస్ జీవన విధానం ద్వారా సంసార సాగరంలో ఉంటూనే ఆధ్యాత్మిక దృష్టితో జీవించే కళను మనం నేర్చుకోగలుగుతాం, తద్వారా మృత్యుభయం క్రమక్రమంగా నశిస్తుంది కూడా.
కాబట్టి వీటి పట్ల ఉండవలసిన యదార్థ వైఖరి కలిగి ఉంటూ అనవసరంగా కంగారు పడకుండా, క్రుంగిపోకుండా స్వీకరించడం నేర్పిస్తుంది ఈ హార్ట్ఫుల్నెస్ యోగ పద్ధతి. ఈ పరమసత్యాలను ఈ జన్మలోనే అనుభవంలోకి అందరూ తెచ్చుకుందురుగాక. అందరూ ప్రయత్నింతురుగాక!
బాగా చెప్పారు. అయన ఈ నాలుగు తప్పవు అంటుంటే నేను ఏమో వీటి నుండి తప్పించుకోవాలనుకోవడంలోనే నా అహాన్ని మరింత బలపరచుకున్తున్నట్లే కదా ! నేను ఇటు నుండి అటు తల తిప్పి వీటిని స్వీకరించి ఆయన మీదే దృష్టి పెట్టుకుంటే మరణించే కళ అబ్బుతుంది.
రిప్లయితొలగించండి