తనపై తాను పని చేసుకోవడం - మానవ ప్రయత్నం
ఆధ్యాత్మిక సాధనలో సాధకుడి అతిముఖ్యమైన పాత్ర అయిన మానవ ప్రయత్నం ఏమిటో, దాన్ని గురించి చర్చించుకుందాం. అదే తనపై తాను పని చేసుకోవడం అంటే కూడా, ముఖ్యంగా హార్ట్ఫుల్నెస్ సహజమార్గ సాధనపరంగా.
సహజమార్గ ధ్యానం యొక్క పరమలక్ష్యం లేక యదార్థ లక్ష్యం, పూజ్య బాబూజీ చెప్పిన ప్రకారం, భగవంతునిలో సంపూర్ణ ఐక్యం చెందడం. ప్రప్రథమంగా ఆ లక్ష్యాన్ని మన హృదయంలో సుస్థిరంగా స్థాపింపబడిందా లేదా సరిచూసుకోవడం చాలా అవసరమని పూజ్య దాజీ చెప్పడం జరిగింది.
మరలా పూజ్య దాజీ చెప్పినట్లుగా, మనం నీటి చుక్క అయితే భగవంతుడు మహాసాగరం; అప్పుడే ఆ నీటి చుక్క మహాసాగరంలో ఒక్కటైపోవడం లేక నీటి చుక్క మహాసాగరంగా మారిపోవడం జరుగుతుంది; మన పరమ లక్ష్యం సిద్ధిస్తుంది.
కానీ మనం నీటి చుక్కగా గాకుండగా నూనె చుక్కగా ఉన్నట్లయితే మహాసాగరంలో ఒక్కటయ్యే అవకాశమే లేదు, ఎన్ని యుగాలయినప్పటికీ మహాసాగరంలో అలా తేలుతూనే ఉంటుంది తప్ప సముద్రంలో విలీనమవడం జరగదు. ఈ విషాదకరమైన పరిస్థితిని దయచేసి గమనించండి - ఆ నూనె చుక్క మహాసముద్రంలో ఉన్నప్పటికీ, సముద్రంతో అస్సలు సంబంధం లేకుండా ఉంటుంది. మన పరిస్థితి కూడా సరిగ్గా అలాంటిదే. సాక్షాత్తు ఆ భగవంతుడు మనలో అంతర్యామిగా ఉన్నప్పటికీ మనం ఆయనతో సంబంధం లేకుండా జీవించేస్తూ ఉంటాం. ఇంతకంటే పరమ విషాదకరమైన పరిస్థితి మనిషికి ఉండదేమో!
అయితే ఈ నూనె చుక్కలో ఉన్న నూనెతనం లేక పచ్చిగా చెప్పాలంటే నూనె చుక్కలో ఉన్న జిడ్డు మూలాన అది సముద్రంతో సంబంధం లేకుండా ఉండిపోయింది. ఆ జిడ్డును గనుక ఎలాగో అలాగ తొలగించగలిగి, అందులోని సముద్ర తత్త్వాన్ని ఆవిష్కరించగలిగినట్లయితే అది కూడా మహాసముద్రంలో విలీనమైపోతుంది. ఇదే మన గురుదేవులు మనపై చేస్తున్న ప్రయత్నం - ఈ జిడ్డును వదలకొట్టడం. ఇందులో మన పాత్ర లేక మానవ ప్రయత్నం చాలా ఉంది; అన్నీ మాస్టరే చేసేస్తారన్నది పొరపాటు భావమే అవుతుంది. కచ్చితంగా మన ప్రయత్నం చాలా అవసరం; చివరికి అసలు పని చేసేది ఆయనే అయినప్పటికీ, సాయశక్తులా మనం చేయవలసిన ప్రయత్నం చాలా ఉంటుంది.
అయితే మనలో ఉండే ఈ జిడ్డు ఏమిటి? మనకు మనలో అంతర్యామిగా ఉండే భగవంతునితో సంబంధం లేనట్లుగా మనిషి జీవించడానికి కారణమైన ఆ నూనెతనం అంటే ఏమిటి? మూడే మూడు - సంస్కారాలు, కోరికలు, అహంకారము. మూడే కదా అనిపిస్తుంది కానీ, వీటిని వదుల్చుకోడానికి ఎన్ని జన్మలైనా పట్టవచ్చు, సరైన మానవ ప్రయత్నం లేకపోతే, సమర్థుడైన గురువు ఆశ్రయం లేకపోతే.
వీటిల్లో సమర్థుడైన గురువును ఆశ్రయించి, వారు చెప్పింది చెప్పినట్లుగా అనుసరించగలిగితే సంస్కారాలను తుడిచేయగలడు ఈ జన్మలోనే. సాధకుడు తన స్వయం కృషితో తన కోరికలను కూడా తగ్గించుకోవచ్చును. కానీ అహంకారం మాత్రం సాధకుడు మాత్రమే తగ్గించుకోవాలి. ఈ మూడు సంపూర్ణంగా తొలగినప్పుడు భగవంతునిలో సంపూర్ణ ఐక్యం పొందడం, నూనె చుక్క నీటి చుక్కగా మారి సముద్రంలో విలీనమయ్యే అవకాశం ఉంటుంది.
అయ్యబాబోయ్! ఇది మన వల్ల కాదనిపిస్తుంది. కానీ తప్పదు. ఇక్కడే మాస్టర్ యొక్క అనుగ్రహం పని చేసేది. మన జీవన విధానం ఆయనను అనుసరిస్తూ ఆయన అనుగ్రహాన్ని ఆకర్షించే విధంగా మలచుకోగలిగితే వారి అపార అనుగ్రహం వల్ల కూడా పని అయ్యే అవకాశం ఉంటుంది; ఎందుకంటే ఆయన ఉన్నదే మనలను అనుగ్రహించడానికి. అయితే ఇందులో మన పాత్ర, ప్రయత్నం చాలా ఉంది. దాన్నే మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
పైన చిత్రంలో ఉన్నట్లుగా మన వైపు నుండి మనం శుద్ధి చేసుకోవలసిన అంశాలు - సాధన, శీలం, ఆత్మావలోకనం, స్వాధ్యాయం, స్వచ్ఛంద సేవ. వీటిని మన స్వభావంగా మారే వరకూ ప్రేమతో, భక్తితో అనుసరించినప్పుడు వారి దృష్టిని లేదా వారి అనుగ్రహాన్ని ఆకర్షించగలుగుతాం. ప్రయత్నిద్దాం.
తరువాయి భాగంలో వివరాలు చర్చిద్దాం.
So nicely picturized for us brother Krishna Rao gaaru. We need to remove the oilness and fat which is so easily said than done. But you have nicely said that by being obedient to our Master's teaching and by serving him slowly we would be able to peel off the unwnted and undesirable
రిప్లయితొలగించండిlayers
We don't even have to peal off anything; we just need to become dead in the hands of the dresser, as we are all aware - that is possible only through love and obedience.
రిప్లయితొలగించండి