23, అక్టోబర్ 2023, సోమవారం

Working on the self - తనపై తాను పని చేసుకోవడం - మానవ ప్రయత్నం - 4


Working on the self 
తనపై తాను పని చేసుకోవడం - మానవ ప్రయత్నం 
సాధన 
మనపై మనం చేసుకునే పనికి సరైన, తగిన బలాన్ని చేకూర్చేది మనం నిత్యం చేయవలసిన సాధన. అంటే ఉదయం ధ్యానం, సాయంకాల శుద్ధీకరణ, రాత్రి పడుకునే ముందు చేసే ప్రార్థనా-ధ్యానం అనే హార్ట్ఫుల్నెస్ సహాజమార్గ సాధనా పద్ధతిలోని మూడు ప్రధాన యౌగిక ప్రక్రియలు. ఈ  మూడిటిని నిర్దేశించిన విధంగా ధ్యానిస్తూ, ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకొనే వరకూ మన దినచర్యలోనూ, ప్రపంచంతో వ్యవహరించే విధానంలోనూ ఎలా ఉండాలో తెలియజేసే పది సూక్తులను గనుక ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తే, మనలోని చైతన్య వికాసం ప్రతి నిత్యం గణనీయంగా వికాసం చెందడం మనం అనుభవం ద్వారా గ్రహించగలుగుతాం. 

అయితే ఈ ప్రక్రియలను కేవలం మొక్కుబడిగా గాకుండగా, కేవలం యాంత్రికంగా గాకుండగా, ఆ విధంగా ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, కనీసం క్రమక్రమంగానైనా సరైన వైఖరితో, సరయిన దృక్పథంతో, తపనతో, భక్తి-ప్రేమలతో, ఆసక్తితో చేయడం అలవరచుకోవాలి. ఇవన్నీ మన దశనియమాల్లో విపులంగా తెలియజేయడం జరిగినది; దీనికి సంబంధించిన సాహిత్యం చదవడం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది. 

ధ్యానం యొక్క ప్రయోజనం ధ్యాన స్థితిని పొందడమే; శుద్ధీకరణ ప్రక్రియ వల్ల గుండెలోని బరువు తగ్గి, హృదయ లోలోతుల్లోకి వెళ్ళగలిగే ప్రయోజనం కలుగుతుంది; తద్వారా మరునాడు చేసే ధ్యానం మరింత నిగూఢంగా ఉండే అవకాశం కలుగుతుంది; రాత్రి ప్రార్థన వల్ల హృదయంలో ప్రార్థనాపూర్వకమైన స్థితి ఏర్పడటం, వినమ్రత అలవడటం, తద్వారా అదే  మన స్వభావంగా మారే అవకాశం ఉంటుంది. 

ధ్యానం చేసే సమయంలో వచ్చే ఆలోచనలు కూడా ఒక్కోసారి బాగా ఉపయోగపడే విధంగా ఉంటాయి; ఉదయం లేవగానే చేసే మొట్టమొదటి పని కావడంతో బహుశా మనం రోజంతా చేయవలసిన పనులను గురించిన ఆలోచనలు రావచ్చు; వాటిని మనం ధ్యానంలో స్పష్టంగా చూసినప్పుడు అక్కడికక్కడే ఏవి ముఖ్యమైన పనులో, ఏవి కావో, ఏవి చేయక్కర్లేదో తెలిసిపోవడంలో మనకు రోజులో చాలా సమయం ఆదాయ అయ్యే అవకాశం ఉంటుంది; అందుకే పూజ్య దాజీ ధ్యానం వల్ల అదనంగా సమయం దొరుకుతుందంటారు. ఆసక్తితో ధ్యానం చేసినప్పుడు అనుభవంలో ఇలా చాలా విషయాలు మనకు తెలిసే అవకాశం ఉంది. అలాగే వచ్చే పోయే ఆలోచనలను నిర్లక్ష్యం చేసే కళ క్రమక్రమంగా అలవడటం వల్ల ముఖ్యమైన వాటిపైనే దృష్టిని పెట్టడం అలవాటవుతుంది; తద్వారా జీవితం ప్రయోజనకరంగా లక్ష్యసిద్ధి కోసం ఎక్కువ సమయం దొరుకుతుంది; విచక్షణ పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. దివ్య లక్షణాలు మనకు తెలియకుండా అలవడతాయి. ముఖ్యంగా ధ్యాన స్థితిని పొందిన తరువాత ఎక్కువ సేపు నిలుపుకోగలగడం, ఆ తరువాత అదే మన స్వభావంగా మారిపోయే వరకూ ధ్యానం కొనసాగిస్తాం; ధ్యానస్థితిలో ఉంటూ మనం జీవితం కొనసాగించడం వల్ల, మనం చేసే పనులు నేర్పుతో చేయడమే గాక, వాటి ముద్రలు మన హృదయంపై ఏర్పడకుండా కూడా జీవించగలుగుతాం. 

శుద్ధీకరణ ప్రక్రియ మనలో ఏర్పడిన ముద్రలను అంటే మన గతాన్ని, ఏరోజుకారోజు మనం తుడిచి వేయగలుగుతాం; ఆ విధంగా మనం గుండె బరువు తగ్గడం ప్రత్యక్షంగా అనుభూతి చెందగలుగుతాం. అలాగే ప్రశిక్షకుల ద్వారా లేక మాస్టర్ ద్వారా తీసుకునే ధ్యాన-సిట్టింగుల్లో మరింత లోలోతుల్లో స్థిరపడిన సంస్కారాల బీజాలను దగ్ధం చేయడం జరుగుతుంది. తద్వారా మనం సాధించిన ఆధ్యాత్మిక పురోగతి దృఢంగా నిలుస్తుంది. ఆ విధంగా క్రమక్రమంగా మన సంస్కారాలన్నీ తొలగించడం వల్ల ఈ సాధన మోక్షస్థితికి దారి తీస్తుంది. నాలుగు రకాల ప్రధానంగా మనకున్నాయి - 1) రాగద్వేషాలు (ఇష్టాయిష్టాలు), 2) ప్రాపంచిక చింతలు 3) ఇంద్రియపరమైన బాధలు, 4) అపరాధాభావం. వీటిల్లో మొదటి మూడు రకాల సంస్కారాలను ఈ రకరకాల శుద్ధీకరణ ప్రక్రియ ద్వారా వదిలించుకోవచ్చు. నాల్గవది మాత్రం కేవలం ప్రార్థనా-ధ్యానం ద్వారా మాత్రమే పశ్చాత్తాపం ద్వారా మాత్రమే తొలగించుకోగలుగుతాం; దీన్ని భగవంతుడు గాని గురువు గాని వీళ్ళు కూడా తొలగించలేరు. ఇంకా అనేక ప్రయోజనాలు అనుభవపూర్వకంగా మాత్రమే తెలుస్తాయి.
 
రాత్రి పడుకునే ముందు చేసే ప్రార్థనా-ధ్యానం  సాధనలో చాలా ముఖ్యమైన అంశం. పది-పదిహేను నిమిషాలు చేసే ఈ ప్రార్థనా-ధ్యానం మన సాధనలో చాలా కీలకమైనది. ఇది మన హృదయంపై పడే అతిభారమైన సంస్కారాలను తొలగించే అవకాశం ఉంది. పైన చెప్పిన విధంగా గుండెకు అతి భారమైన సంస్కారం అపరాధ భావం; అది కేవలం ఈ ప్రార్థనా-ధ్యానం ద్వారా తొలగించుకోగలుగుతాం. వెరసి శుద్ధీకరణ అనే యౌగిక ప్రక్రియ ద్వారా మనలోని అనేక జటిల మనస్తత్త్వాలు, మలినాలు, అశుద్ధాలు తొలగిపోవడం వల్ల మనం మన అంతరంగంలో మరింత స్వచ్ఛంగా, సరళంగా తయారావుతాం. 

పై మూడు యౌగిక ప్రక్రియలు ఒకదానిపై ఒకటి ఆధారపడినవి. సమగ్రంగా ఈ ధ్యాన సాధన చేసినప్పుడు, సమాంతరంగా శీల నిర్మాణం చేసుకున్నప్పుడు,  నిజమైన నిరంతర స్మరణ లేక ధ్యాన స్థితి ఏర్పడతుంది. నిరంతర స్మరణ వల్ల నిజమైన ప్రేమ లేక భక్తి ఉద్భవిస్తుంది; ప్రేమ, పరిపక్వత చెందిన తరువాత అది శరణాగతిగా మారుతుంది; శరణాగతి తరువాత సిద్ధించే స్థితి - ఆ పరతత్వంలో సంపూర్ణ లయ ప్రాప్తించడమే . నీటి చుక్క మహాసముద్రంలో పడి మహాసముద్రంగా మారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది; ఆ విధంగా మన ఆధ్యాత్మిక యాత్ర ముగుస్తుంది. 

 






 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...