Working on the self
తనపై తాను పని చేసుకోవడం - మానవ ప్రయత్నం - 3
ఆత్మావలోకనం
ఆత్మావలోకనం అంటే తనను తాను నిష్పక్షపాతంగా, నిర్దుష్టంగా, ఉన్నదున్నట్లుగా చూసుకోగలిగి, తనను తాను యథాతథంగా ఉన్నదున్నట్లుగా స్వీకరించుకోగలగడం. మనలోని కొరతలను, లోటుపాట్లను, బాగోగులను ఉన్నదున్నట్లుగా గుర్తించినప్పుడే వాటిని సరిదిద్దుకునే అవకాశం ఏర్పడుతుంది; అప్పుడే మనిషి మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఆత్మావలోకం అంటే తన సమస్యలకు పరిష్కారాన్ని తనలోనే వెతుక్కోవడం.
అలాగాక ఎక్కడికక్కడ మన లోటుపాట్లను సమర్థించుకున్నట్లయితే మనలో మార్పు రాకపోవడమే గాక, ఆత్మవంచనగా మారి, మనలో అపరాధాభావం ఎక్కువై గుండె రోజు-రోజుకూ బరువెక్కుతుంది. కాబట్టి గుండె రోజు-రోజుకూ తేలికపడటానికి ఆత్మావలోకనం చక్కటి పరికరం. ఎప్పటికప్పుడు వినియోగించుకోవాలసిన ప్రక్రియ.
ఆత్మావలోకనం లేక ఆత్మపరిశీలన అనే ప్రక్రియ కొన్ని పరిస్థితుల్లో మనిషి జీవితంలో సహజంగా జరుగుతూ ఉంటుంది; ముఖ్యంగా జీవితంలో విపరీత ఫలితాలు వచ్చినప్పుడు సహజంగా జరుగుతుంది; అప్రయత్నంగా జరుగవచ్చు. కానీ మనిషి తాను మరింత మెరుగైన విధంగా జీవించాలనుకున్నప్పుడు, తనను తాను మార్చుకోవాలనుకున్నప్పుడు, ఆధ్యాత్మికంగా త్వరితంగా పురోగతి చెండాలనుకున్నప్పుడు, ఆత్మ వికాసం లేక వ్యక్తిత్వ వికాసం లేక చైతన్య వికాసం త్వరితంగా జరగాలనుకున్నప్పుడు ఈ ప్రక్రియను ప్రయత్నపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా వినియోగించవలసి ఉంటుంది.
ఇది అంతర్లీనంగా జరిగే ప్రక్రియ. ధ్యానంలోనూ, శుద్ధీకరణ ప్రక్రియ చేస్తున్నప్పుడు, మెలకువగా ఉన్నప్పుడు, నిద్రలో కూడా ఎల్లవేళలా జరుగుతూ ఉంటుంది. దీనిపై ప్రయత్న పూర్వకంగా, ప్రత్యేక దృష్టిని పెట్టి పరిష్కారాలు వెతుక్కోవడమే ఆత్మావలోకనం.
ఆత్మావలోకనం అంటే ఏది కాదు?
ఆత్మావలోకనం అంటే ధ్యానించడం కాదు. కళ్ళు మూసుకొని ఆలోచించడమూ కాదు. ఆత్మావలోకనం అంటే శుద్ధీకరణ ప్రక్రియ కూడా కాదు. ఆత్మావలోకనం అంటే కేవల కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవడం కూడా కాదు.
మరి ఆత్మావలోకనం అంటే ఏమిటి?
ఆత్మావలోకనం అంటే వ్యక్తి తనను తాను ఉన్నదున్నట్లుగా పరికించుకోగలగడం, పరిశీలనగా చూసుకోగలగడం. దీని వల్ల వ్యక్తి తనను తాను యథాతథంగా స్వీకరించగలిగే పరిస్థితి ఏర్పడుతుంది. తనను తాను మార్చుకోవాలంటే ఈ విధంగా తనను తాను యథాతథంగా స్వీకరించగలగడం అవసరం, ముఖ్యంగా ఆధ్యాత్మిక పురోగతికి ఇది చాలా కీలకం; అప్పుడే వ్యక్తిలో సమూలమైన శాశ్వతమైన మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది.
ఆత్మావలోకనం ద్వారా తన ఆలోచనా విధానాన్ని, ఆలోచనలను, ఉద్వేగాలను, అనుభూతులను ప్రత్యక్షంగా ఉన్నదున్నట్లు గమనించగలుగుతాడు. వ్యక్తి తన బాలాలను, బాలహీనతలను, సమస్యలను, యథాతథంగా చూడగలిగే అవకాశం ఉంటుంది.
ఆ విధంగా మనలో ఏ యే సమస్యలను పరిష్కరించగలము, ఏవి పరిష్కారానికి కొంత కష్టపడాలి, ఏ యే సమస్యలను కష్టపడినా పరిష్కరించలేము, వాటిని యథాతథంగా స్వీకరించగలిగే శక్తి వస్తుంది.
పరిష్కరించగలిగే సమస్యలను గుర్తించినప్పుడు, వాటిని వెంటనే మనం ప్రయత్నం ద్వారా పరిష్కరించుకోగలుగుతాము. పరిష్కరించడం కష్టం అన్న సమస్యల కోసం అంతర్యామిగా ఉన్న భగవంతుని సహాయం కోసం ప్రార్థించి పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తాం. అసాధ్యం అన్న సమస్యను లేక కష్టాలను దైవ సంకల్పాలుగా భావించి, దివ్య ప్రణాళికలో భాగంగా భావించి, సంతోషంగా స్వీకరించగలుగుతాం.
ఈ విధంగా ఆత్మావలోకనం అనే ఈ ప్రక్రియ, ప్రయత్నపూర్వకంగా చేసే ఈ ప్రక్రియ, మన ఆధ్యాత్మిక పరిణతిని, ఆధ్యాత్మిక పురోగతిని, ఆత్మ వికాసాన్ని, ఆధ్యాత్మిక ఎదుగుదలను, సహజంగా జరిగే పరిణామ క్రమాన్ని మరింత వేగాన్ని పుంజుకునేలా తోడ్పడుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి