తనపై తాను పని చేసుకోవడం - మానవ ప్రయత్నం - 2
శీలనిర్మాణం
ఆధ్యాత్మిక ప్రగతి నా వంతు, శీల నిర్మాణం అభ్యాసి వంతు - బాబూజీ
నేను మీ పట్ల చేస్తున్నది నా ధర్మం, మీరు నా పట్ల యేది చేయడం లేదో అది మీ ధర్మం. - బాబూజీ
మనం నిత్యం సాధన చేసుకుంటూ, అది గాక మన మాటలను, చేతలను, అలవాట్లను, ప్రవర్తనను, మన మనోద్వేగాలను, ఉద్రేకాలను, మన సంకల్పాలను (అంటే మన మనసులో ఉండే ఉద్దేశాలను), వెరసి మన శీలాన్ని గమనించుకుంటూ వాటిని మెరుగుపరచుకునే దిశగా కృషి చేయడమే మన వంతు.
ఇదే మనపై మనం పని చేసుకోవడమూ అంటే. ఇదే బాబూజీ చెబుతున్న అభ్యాసి వంతు. ఒక కన్ను అంతరంగంలోకి చూసుకోవడానికి మరో కన్ను లౌకిక వ్యవహారాల్లో మన ప్రవర్తనను గమనించుకోవడానికి, అని బాబూజీ అంటూండేవారు. ఇలా ఉండనప్పుడే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోతుంది. జరుగవలసిన వికాసం జరగదు. ఎక్కడున్నామో అక్కడే ఉండిపోతాము.
బాబూజీ దయ వల్ల అంతరంగంలో వెలుగు దేదీప్యమానంగా వెలుగుతున్నప్పటికీ, దాని కాంతి మాత్రం బయటకు ప్రసరించకపోవడానికి కారణం లాంతరు మసితో నిండిపోవడం. ఆ మస్సే మన శీలం. లాంతరు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటే తప్ప వెలుతురు బయటకు రాదు. ఈ అవగాహన పూజ్య చారీజీ ఇచ్చినది.
ఇక్కడ సౌశీల్యాన్ని గురించి మనకు కొన్ని ప్రశ్నలు రావచ్చు.
ఆధ్యాత్మికంగా ఎదుగుతూ కూడా సౌశీల్యం లేకుండా ఉండగలరా?
ఉండవచ్చు. మన చుట్టూ గమనిస్తే చాలా మంది కనిపిస్తారు. మన ఆధ్యాత్మిక చరిత్రలో చూస్తే, రావణ బ్రహ్మ ఒక కొట్టొచ్చే ఉదాహరణ. అతను గొప్ప తపః సంపన్నుడు, వేదశాస్త్రాలు వంటబట్టించుకున్నవాడు, కానీ శీలంలో లోపం ఉండటం వల్లనే అతను పతనమవుతాడు. రావణుడు తన శవం ద్వారా లక్ష్మణుడికిచ్చిన చివరి సందేశంలో మనకర్థమవుతుంది. మంచి చేయడానికి ఆలస్యం చేయవద్దని ఆతని చివరి సందేశం. మంచి అని తెలిసినా ఆలస్యం చేయడమే తన పతనానికి కారణమని, తన జీవితంలో నేర్చుకున్న పాఠమని, చెప్పడం జరుగుతుంది. ఇలా ఒక్క ఆలోచన మన శీలాన్ని పతన దిశగా తీసుకువెళ్ళవచ్చు. పూజ్య లాలాజీ కూడా శీలవంతుడు గాకపోతే సాధకుడు ఎంత ఆధ్యాత్మికంగా ఎదిగినా ప్రయోజనం ఉండదన్నారు.
ఆధ్యాత్మిక సాధన చేస్తున్న సాధకుడిలో శీల నిర్మాణం తనంత తానుగా జరగదా?
మనం సహజమార్గ సాధన ప్రతి నిత్యం చేస్తున్నప్పుడు సౌశీల్యం అప్రయత్నంగా పెంపొందదా, అంటే పెంపొందుతుంది; కానీ చాలా నెమ్మదిగా జరుగుతుందన్నారు చారీజీ. అందుకే అభ్యాసి శీలనిర్మాణంపై దృష్టి పెట్టవలసిన అవసరం. అది గురువు చెయ్యలేడు. సహకరించగలడు.
శీల నిర్మాణం అనేది మనం ఇదివరకు చెప్పుకున్నట్లుగా ఇటుక కట్టుడులాంటిది. ఇటుకపై ఇటుక పెడుతూ ప్రతీ ఆలోచనను గమనించుకుంటూ నిర్మించుకోవలసినది. తుదిశ్వాస వరకూ కొనసాగవలసినది. ప్రయత్నపూర్వకంగా చెయ్యవలసినది. ఆటోమ్యాటిక్ గా జరగదు. బాబూజీ ప్రసాదించే ఆధ్యాత్మిక ప్రగతికి అనుగుణంగా మన వ్యక్తిత్వాన్ని, మన ఆలోచనలను సరిదిద్దుకోవలసి ఉంటుంది. చేతలను, అలవాట్లను, ప్రవర్తనను మాలచుకోవలసి ఉంటుంది. అప్పుడే ఆధ్యాత్మిక పురోగతి పరిపూర్ణమవుతుంది. దీనికి ఒక ఆదర్శ వ్యక్తి మన జీవితంలో ఉన్నట్లయితే శీలనిర్మాణం తేలికయ్యే అవకాశం ఉంటుంది. అందుకే గురువును ఆదర్శంగా చేసుకునేది సహజమార్గంలో. అటువంటి ఉన్నతోన్నత వ్యక్తులే సహజమార్గ గురుపరంపరలో ఉంటారు - ఆధ్యాత్మికంగానూ శీలపరంగానూ పరిపూర్ణాతను సాధించిన ఆదర్శవంతమైన వ్యక్తులు వీరు. ఇంకా చెప్పాలంటే సజీవ గురువు అవసరం కూడా ఇదే సాధకులకు. ధ్యానం వల్ల, గురువు యొక్క అనుసరణ వల్ల కష్టసాధ్యమైన శీలనిర్మాణం తేలికయ్యే అవకాశం ఉంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి