13, అక్టోబర్ 2023, శుక్రవారం

ఆధ్యాత్మిక పురోగతి, ఆధ్యాత్మిక పరిణతి, చైతన్య వికాసం

 



ఆధ్యాత్మిక పురోగతి, ఆధ్యాత్మిక పరిణతి, చైతన్య వికాసం 
ఆధ్యాత్మిక పురోగతి, ఆధ్యాత్మిక పరిణతి, చైతన్య వికాసం - ఈ  మూడూ కూడా పర్యాయపదాలే. అర్థం ఒక్కటే. ప్రతీ సాధకుడూ ఆధ్యాత్మికమగా పురోగతి చెండాలనుకుంటాడు. మన హార్ట్ఫుల్నెస్ సహాజమార్గ మాస్టర్ల ప్రకారం ఆధ్యాత్మిక పురోగతి అంటే ఏమిటి? జరుగుతున్నదని ఎలా తెలుస్తుంది? దానికి మనం మన వంతుగా చేయవలసినదేమిటి? వీటికి మనం మౌలికమైన  సమాధానాలు వెతుక్కునే ప్రయత్నం చేద్దాం. 

ఆధ్యాత్మిక పురోగతి అంటే ఏది కాదు?
ఆధ్యాత్మిక పురోగతి అంటే యేది కాదో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఆధ్యాత్మిక పురోగతి అంటే, అకస్మాత్తుగా పేదవాడు ధనికుడైపోవడం కాదు, విద్య లేనివాడు విద్యావంతుడైపోవడం కాదు, తెలివి తక్కువవాడు, తెలివైనవాడైపోవడం కాదు, ఇలాంటివన్నీ వాళ్ళ-వాళ్ళ సంస్కారాల/కర్మల/వాసనల వల్ల జరుగుతాయి. 
అలాగే ఆధ్యాత్మిక పురోగతి అంటే గాలి లోంచి యేవేవో వస్తువులను సృష్టించినట్లు అద్భుతాలు చేయడం కాదు, రకరకాల సిద్ధులు పొందడం కాదు, ప్రవచనాలు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, కుండలినీ శక్తిని మేలకొల్పడం కూడా కాదు, వీటికి, ఆధ్యాత్మికతకూ ఎటువంటి సంబంధమూ లేదని సుస్పష్టంగా ఎంతో మంది మహాత్ములు తెలియజేయడం జరిగింది, ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు. భయంతోనూ, ప్రలోభంతోనూ సాధించేవి యేవీ కూడా ఆధ్యాత్మికత కోవకు చెందవు. 

మరి ఆధ్యాత్మిక పురోగతి అంటే ఏమిటి? 
బాబూజీ చెప్పిన విధంగా, పాశవికంగా ఉండే మానవుడి నుండి మానవత్వం కలిగిన మానవుడిగానూ, మానవత్వం కలిగిన మానవుడి నుండి దైవత్వంతో నిండిన మానవుడిగానూ మారడమే ఆధ్యాత్మిక పురోగతి. 
స్థూల స్థితిలో ఉన్న చేతనం నుండి రోజురోజుకూ సూక్ష్మంగా మారడమే ఆధ్యాత్మిక పురోగతి. అంటే రోజురోజుకూ మన హృదయం మరింత-మరింత తేలికగా దూది పింజలా తయారవడమే ఆధ్యాత్మిక పురోగతి. స్థూలం నుండి సూక్ష్మంగా, ఆతిసూక్ష్మంగా, సూక్ష్మాతి సూక్ష్మంగా తయారవడమే ఆధ్యాత్మిక పురోగతి. 
మనిషి చేతనను బట్టే అతని తత్త్వం ఉంటుంది. మనిషి చేతనలో నాణ్యత వస్తే తప్ప మనిషిలో నిజమైన మార్పు రాదు. మరే రకంగా మార్పులు వచ్చినా అవి తాత్కాలికమే, శాశ్వతం కాదు. మనిషి లోలోతుల్లో నుండే వచ్చే మార్పే ఆధ్యాత్మిక పురోగతి. 
పట్టు-పురుగు తాను సృష్టించుకున్న పట్టులో తానే ఇరుక్కున్న రీతిగా ఆత్మ తానే సృష్టించుకున్న ఈ సంస్కారాలు, కోరికలు, అహంకారం అనే వలలో చిక్కుకున్న స్థితిలో నుండి బయట పడటమే నిజమైన ఆధ్యాత్మిక పురోగతి. 
భయము, ప్రలోభాలు పోయి, ప్రేమతో నిండిపోయి నిష్కపటంగా పసిహృదయంగా తయారవడమే  ఆధ్యాత్మిక పురోగతి. 
 
ఆధ్యాత్మిక పురోగతి జరుగుతున్నదీ-లేనిదీ మనకెలా తెలుస్తుంది?
సాధన ప్రతి నిత్యం క్రమం తప్పకుండా సరైన దీక్షతో, భక్తిప్రేమలతో చేస్తున్నప్పుడు రోజు-రోజుకూ తేలికదనాన్ని హృదయంలో అనుభూతి చెందుతాం. రోజు-రోజుకూ దైవంపై ఆధారపడటం పెరుగుతుంది; కుల మత జాతి భాషా బేధాలు మనసులో నుండి సమూలంగా పోయే విధంగా మనం అడుగులు వేస్తూంటాం. భగవంతుని పట్ల సమర్పణా భావం పెరుగుతూ ఉంటుంది; మన కుటుంబం పట్ల, సమాజం పట్ల, ఉద్యోగం పట్ల, దేశం పట్ల, ఇంకా ఇతర ధర్మాల పట్ల సరైన ఆసక్తితో మన కర్తవ్యాలను నిర్వహిస్తాం. అలాగే చుట్టూ ఉండే చెట్ల పట్ల, మొక్కల పట్ల, రాళ్ళ పట్ల, ఆకాశం పట్ల, చుట్టూ ఉన్న వాతావరణం పట్ల ఒక నూతన దృక్పథం ఏర్పడుతుంది; అన్నిటా దైవత్వం గోచరించే అవకాశం ఉంటుంది.  
భయప్రలోభాలు తగ్గుముఖం పడతాయి; నిష్కారణంగా అందరి పట్ల ప్రేమ కలుగుతూ ఉంటుంది; రోజు-రోజుకూ మనశ్శాంతి పెరుగుతూ ఉంటుంది; కష్టాలను ఎదుర్కొనే ధైర్యం పెరుగుతూ ఉంటుంది; భగవంతుడిని యేదీ యాచించడం మానేస్తామ; బదులుగా జీవితంలో వచ్చే సవాళ్ళను ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించమని వేడుకుంటాం; మనకు ప్రతికూలంగా ఉన్నవాటిని కూడా స్వీకరించగలుగుతాం, కోరికలు తగ్గుముఖం పడతాయి, అహంకారం తగ్గుతూ ఉంటుంది, క్షమా గుణం ఎక్కువవుతూ ఉంటుంది; ఇలా కొన్ని సూచనలు మనకే కనిపించడం మొదలెడతాయి; ఇదే చైతన్య వికాసం. 
అదే రోజు-రోజుకీ గుండె బరువెక్కుతున్నదంటే మనం మనలో సవరించుకోవలసినవి చాలా ఉన్నాయని తెలుసుకోవాలి, వాటిని ఆత్మావలోకనం ద్వారా గుర్తించే ప్రయత్నం చేయాలి. ఆ తరువాత శ్రీదిద్దుకునే ప్రయత్నం చేసుకోవాలి.

ఆధ్యాత్మిక పురోగతికి మనం మన వంతుగా ప్రతి నిత్యం చేయవలసినదేమిటి? 
ఎప్పటికప్పుడు ఆత్మావలోకనం చేసుకుంటూ మనలో కొరతలను సరిదిద్దుకుంటూ, దిద్దుకోలేనివాటికి భగవంతునికి మొరపెట్టుకుంటూ, చేసిన తప్పలకు పశ్చాత్తాపం చెందుతూ, చేసిన తప్పులు మరలా చేయకుండా ఉంటూ జీవితాగమనాన్ని కొనసాగించడానికి సంపూర్ణ ప్రయత్నం చేయాలి.  
గురువును ఆశ్రయించినవారు గురువు పట్ల విధేయతను మరింత-మరింతగా పెరిగేలా చూసుకోవాలి; గురువు చెప్పింది చెప్పినట్లుగా చేయడానికి ప్రయత్నించాలి; వారి బోధనలను నిత్యజీవితంలో అన్వయించుకుని జీవించే ప్రయత్నం చేయాలి; వారి ఆదేశాలను పాటించే ప్రయత్నం చేయాలి; ఈ క్రమంలో ఏమైనా ఇబ్బందులొస్తే గురువును వేడుకోవాలి; ప్రతినిత్యం క్రమ  తప్పకుండా సాధన చేసుకోవాలి. శీలనిర్మాణం పట్ల తగిన శ్రద్ధ వహించాలి. 
గురువును ఇంకా ఆశ్రయించనివారు మన శాస్త్రాల అధ్యయనం చేసి, నైతిక విలువలకు ప్రాధాన్యమిస్తూ, పెద్దలను అనుసరించే ప్రయత్నం చేయాలి. ఇది గురువును ఆశ్రయించినవారికి కూడా వర్తిస్తుంది. 



1 కామెంట్‌:

  1. బ్రహ్మ విద్య అంటే ఇదే నెమో ! అప్పుడు గాని బ్రహ్మ అంటే ఎవరు, ఏమిటీ, ఎందుకు అన్నవి తెలియవేమో !!

    రిప్లయితొలగించండి

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...