Working on the self
తనపై తాను పని చేసుకోవడం - మానవ ప్రయత్నం
స్వచ్ఛంద సేవ
తనపై తాను పని చేసుకోవడంలో స్వచ్ఛంద సేవ కూడా చాలా కీలక పాత్ర వహిస్తుంది. మనలను మనం పరిశుద్ధంగా చేసుకునే క్రమంలో, మనలను మనం మరింత సూక్ష్మంగా తయారు చేసుకునే క్రమంలో, ఇంతకు ముందు చర్చించుకున్న ఇతర సాధానోపాయాల కంటే వేగంగా పని జరిగే అవకాశం ఉన్న అంశం ఈ స్వచ్ఛంద సేవ. మనం వలంటీర్ సేవ అని కూడా అంటూ ఉంటాం.
నిజమైన స్వచ్ఛంద సేవ ముఖ్యంగా మన హార్ట్ఫుల్నెస్ సంస్థలో అభ్యాసిలో గురువు పట్ల గాని, ధ్యాన పద్ధతి పట్ల గాని, సంస్థ పట్ల గాని హృదయంలో నిజమైన కృతజ్ఞత సహజంగా ఏర్పడినప్పుడు మొదలవుతుంది. అప్పటి వరకూ తానేమీ పొందుతున్నాడన్నది మాత్రమే ఆలోచిస్తాడు అభ్యాసి; కృతజ్ఞత మొదలైన తరువాత, నేనేమి చెయ్యగలను అని ఆలోచించడం మొదలెడతాడు అభ్యాసి.
స్వచ్ఛంద సేవ ద్వారా రకరకాల మనస్తత్వాలు గల వ్యక్తులతో రాపిడి లేకుండా ఒక్క జట్టుగా ఎలా పని చెయ్యాలో అలవాటవుతుంది; నెమ్మదిగా అందరి పట్ల ప్రేమ భావం పెరుగుతుంది; ఓరిమి పెరుగుతుంది; పరస్పరం సహాయం చేసుకునే తత్త్వం పెరుగుతుంది; మనసులో కూడా ఎవరినీ తిట్టుకోకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది; అందరమూ ఆ గురుదేవుల బిడ్డలమేనన్న స్పృహ నెమ్మదిగా పెంపొందుతుంది. నిజమైన విశ్వజనీన సౌభ్రాతృత్వం ఏమిటో అర్థమవుతుంది; కుల, మత, రంగు, జాతి, భాష, ధనిక-పేద, వంటి తారతమ్యాలు మెల్లమెల్లగా మనలో నశించే అవకాశం ఉంది. ఎందుకంటే మన లక్ష్యసిద్ధికి ఇవన్నీ అడ్డొచ్చేస్తాయి.
స్వచ్ఛంద సేవ యొక్క అసలు రుచి తెలియాలంటే, నిజంగా లక్ష్యసిద్ధి కోసం తపించేవారైతే, పూజ్య దాజీ సూచన ఏకాంతంగా గుండె నిండా గురువు పట్ల కృతజ్ఞతా భావం నింపుకొని సేవలనందించమంటారు. గుంపుగా చేయడంలో ఇతర ఆనందాలు కలుగుతాయి కానీ, ఇలా ఏకాంతంగా సేవనందించడంలోనే పరమార్థం దాగి ఉండంటారు దాజీ. అటువంటి స్పృహ లేక చేతనావస్థ చేయగా చేయగా స్థిరపడే అవకాశం ఉంటుంది; ఆ స్పృహతో ఈ భవసాగరాన్ని ఈదడం తేలికైపోతుంది.
వారి కృపకు అర్హత సంపాదించే మార్గం, దగ్గర త్రోవ ఈ స్వచ్ఛంద సేవ. serve to deserve అన్నారు పూజ్య చారీజీ మహారాజ్. దైవాన్ని ప్రేమించడం గాని, గురువు పట్ల విధేయత గాని చాలా కష్టం కావచ్చును గాని, వారి ఆశయాన్ని తన ఆశయంగా చేసుకుని సేవ చేయడం ద్వారా వారి మనసులో చోటు సంపాదించడం చాలా తేలిక అంటారు, పూజ్య చారీజీ. ఎటువంటి గుర్తింపును ఆశించకుండా, నిండు మనసుతో, గుండె నిండా కృతజ్ఞతను నింపుకొని చేసే సేవే గురువు కోరుకునే నిజమైన స్వచ్ఛంద సేవ. ఈ విధంగానే మనిషిలో అసలైన పరివర్తన సంభవించే అవకాశం ఉంటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి