Working on the self
తనపై తాను పని చేసుకోవడం - మానవ ప్రయత్నం
స్వాధ్యాయం
పతంజలి మహర్షి రచించిన యోగసూత్రాల్లో సూచించిన అష్టాంగ యోగపద్ధతిలో రెండవ అంగమైన నియమ లోని అంశం స్వాధ్యాయం. ఆధ్యాత్మిక సాధనలో, యోగా సాధనలో భాగంగా సాధకుడు ముఖ్యంగా చేసుకోవలసినది.
స్వాధ్యాయం అంటే స్వ ను అధ్యయనం చేయడం. అంటే తనను తాను విచారించి తెలుసుకోవడం. ఇది అనేక రకాలుగా చేయడం జరుగుతూ ఉంటుంది. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, మహాభారతం, రామాయణం, మహాభాగవతం, వంటి పవిత్ర గ్రంథాలను అధ్యయనం చేయడం ద్వారా; ధ్యానం ద్వారా, ఆత్మావలోకనం ద్వారా సాధకుడు తనలోని ఆలోచనలను, ఉద్వేగాలను, అనుభూతులను, అలవాట్లను, చేతలను, ప్రవర్తనను అర్థం చేసుకోవడం ద్వారా తనను తాను తెలుసుకుంటాడు.
ఆ చదివినవాటిని లేక వినిన వాటిని శ్రవణ మనన, నిధిధ్యాసన ద్వారా జీర్ణించుకోవడాన్ని కూడా స్వాధ్యాయం అంటారు. అలాగే సామూహికంగా, సమిష్ఠిగా ఇటువంటి విషయాలను చర్చించుకుంటూ, తోటి సాధకులతో పంచుకుంటూ పరస్పరం ఉపయోగపడటమే స్వాధ్యాయం అంటే. ప్రస్తుతం మనం చేస్తున్నది కూడా స్వాధ్యాయంలోకే వస్తుంది.
సహజమార్గ సందర్భంలో స్వాధ్యాయంలో సహజమార్గ సాహిత్యాన్ని కూలంకషంగా అధ్యయనం చేయడం, సాధనాంశాలను గురించి లోతైన అవగాహనలు పరస్పరం పంచుకోవడం, సత్సంగాల్లో పాల్గొనడం, సంస్థ కార్యక్రమాల్లో వీలు చేసుకుని పాల్గొనగలగడం, అవకాశం వచ్చినప్పుడల్లా పూజ్య గురుదేవుల సన్నిధిలో సమయాన్ని గడపటం, అలాగే కుదిరినప్పుడల్లా స్వచ్ఛంద సేవలో వలంటీరుగా సేవలనందించడం, ఇవన్నీ మన స్వాధ్యాయంలోకి వస్తాయి. స్వాధ్యాయం మన లక్ష్యసిద్ధిలో చాలా కీలకమైన అంశంగా మనం గుర్తించవలసి ఉంది; తగువిధంగా మన జీవితాలను మనం మలచుకోవలసి ఉంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి