5, అక్టోబర్ 2023, గురువారం

శీల నిర్మాణము - ఆధ్యాత్మికము - ధ్యానం

 


శీల నిర్మాణము  - ఆధ్యాత్మికము - ధ్యానం
  శీల నిర్మాణం అభ్యాసి బాధ్యత, ఆధ్యాత్మిక పురోగతినివ్వడం నా బాధ్యత
- బాబూజీ  మహారాజ్ 
నేను మీ పట్ల చేస్తున్నది నా బాధ్యత; మీరు నా పట్ల ఏమి చేయడం లేదో అది మీ బాధ్యత. 
- బాబూజీ  మహారాజ్ 
శీలనిర్మాణం అనగానే ప్రముఖంగా అందరికీ స్ఫురించే వ్యక్తి స్వామి వివేకానంద. శీలాన్ని గురించి బహుశా అంతా విస్తృతంగా మాట్లాడినది కూడా ఆయనే. వారి బోధనలను అనుసరిస్తూ తరించిన వాళ్ళు, తరిస్తున్నవాళ్ళు ఇప్పటికీ  ఉన్నారు, భవిష్యత్తులో కూడా తప్పక ఉంటారు. 
అసలు శీలనిర్మాణం అంటే ఏమిటి? ఇది అంత అవసరమా? అందులో ఆధ్యాత్మికతకూ, ధ్యానానికీ శీలనిర్మాణానికి గల సంబంధం ఏమిటి? ఎప్పుడు మొదలవుతుంది? ఎలా మొదలవుతుంది? తనంతతానుగా అప్రయత్నంగా జరుగుతుందా? ఈ ప్రశ్నలు ప్రతీ సాధకునికీ కలుగుతాయన్నది నా విశ్వాసం. వీటికి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

శీలనిర్మాణం ఎవరికి అవసరం?
శీలనిర్మాణం అనేది ఎదగాలనుకున్న ప్రతీ వ్యక్తికీ అవసరం; ఆధ్యాత్మిక పరిణతి చెందాలనుకున్న ప్రతీ సాధకునికి అవసరం; ప్రకృతికి అనుగుణంగా శ్రుతిలో ఉంటూ జీవించాలనుకునే వారందరికీ అవసరం; అర్థవంతమైన జీవితం గడపాలనుకున్నవారందరికీ  అవసరం; జీవిత ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవాలనుకున్నవారందరికీ అవసరం; మానవ పరిపూర్ణత దిశగా ప్రయాణించాలనుకున్నవారందరికీ అవసరం; సంపూర్ణ ఆత్మ సంతృప్తి కలిగే విధంగా జీవించాలనుకునేవారికి అవసరం; విలువలతో కూడిన జీవితం  కావాలనుకున్నవారికి అవసరం; దైవసాక్షాత్కారం లేక ఆత్మసాక్షాత్కారం కావాలనుకున్నవారికి అవసరం; జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలనుకున్నవారికి అవసరం; జీవితంలో రాణించాలనుకున్నవారికి అవసరం; మానవ పరిపూర్ణతను సాధించాలనుకున్నవారికి అవసరం.  వెరసి శీలనిర్మాణం, మనస్సాక్షికి విరుద్ధంగా, ప్రకృతికి విరుద్ధంగా, విలువలకు దూరంగా, అపరాధభావాన్ని ప్రోగు చేసుకుంటూ హృదయభారాన్ని మరింత పెంచుకోవాలనుకునే వారికి తప్ప, అందరికీ అవసరమని స్పష్టమవుతున్నది.  

శీలనిర్మాణం అంటే ... 
శీలనిర్మాణం అనేది ఇటుకపై, ఇటుక పెడుతూ కట్టే ఇటుక-కట్టుడులాంటిది. మనిషి చేసే ప్రతీ సంకల్పంతోనూ ప్రతీ ఆలోచనతోనూ, ప్రతీ అలవాటుతోనూ, ప్రతీ ప్రవర్తన ద్వారా, నిర్మింపబడేది శీలనిర్మాణం. కాబట్టి ఒక్కరాత్రిలో అయిపోయేది కాదు. వీటి నాణ్యతను బట్టే, వీటి శుద్ధతను బట్టే, మన శీలం ఏర్పడుతుంది. శీలనిర్మాణం తనంతతానుగా జరిగే ప్రక్రియ కాదు; అప్రయత్నంగా జరిగేది కాదు; ప్రయత్నపూర్వకంగా, సంపూర్ణ స్పృహతో నిర్మాణం చేసుకునేది. కాబట్టి ఇందులో మన సంకల్పశక్తిని ఉపయోగించడం చాలా అవసరం. 

శీలము-ఆధ్యాత్మికము-ధ్యానము 
మన పెద్దలందరూ కూడా శీలం లేకపోతే ఆధ్యాత్మికత లేదన్నారు. అసలు సరైన జీవితమే ఉండదు.  సౌశీల్యం లేకపోతే ఆధ్యాత్మిక స్థితులు గాని ఆధ్యాత్మిక సంపద గాని నిలబడదు. ఆధ్యాత్మిక సాధన ద్వారానే లేక ధ్యానం ద్వారా మాత్రమే మనిషి అంతరంగంలో ఉన్న  సూక్ష్మ శరీరాల శుద్ధి జరుగుతుంది; అంటే మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం, అనే ప్రధాన  సూక్ష్మ శరీరాల శుద్ధి జరుగుతుంది. మన ఆలోచనలకు, చేతలకు, అలవాట్లకు, ప్రవర్తనకు వెరసి మన శీలానికి మూలకారణమైనటువంటి వీటి శుద్ధి జరుగుతుంది; లోపల జరుగుతున్న ఈ శుద్ధికి అనుగుణంగా పై నుండి మన ఆలోచనలను, ప్రవర్తనను మాలచుకోవాడమే శీల నిర్మాణం. ఈ ప్రక్రియ, పై నుండి మనిషి ప్రయత్నపూర్వకంగా చేయవలసిన పని. అదేమిటి? మరి ధ్యానం/ఆధ్యాత్మిక సాధన చేత శీలం అప్రయత్నంగా ఏర్పడదా? తప్పక శీల నిర్మాణం జరుగుతుంది కానీ చాలా నెమ్మదిగా జరుగుతుంది; అందుకే సాధకుడు రోజూ చేసుకునే ధ్యానం తరువాత కలిగే సూక్ష్మ స్థితికి అనుగుణంగా ఆ స్థితితో లయమై ఉంటూ మన శీలాన్ని మలచుకోవడం ప్రతీ సాధకుడు తప్పక చేయవలసినది; లేకపోతే మనం ధ్యానంలో పొందిన స్థితిని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక సంపద, శీల నిర్మాణం - ఈ రెండూ చేదోడు-వాదోడుగా ఉంటూ ముందుకు సాగడమే, పరిపూర్ణమైన ఆధ్యాత్మిక వికాసం అవుతుంది. ఇటువంటి జీవితం మానవ పరిపూర్ణతకు దారి తీస్తుంది. 

ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పటి వరకూ కొనసాగాలి?
మనిషి నిర్దుష్టమైన గమ్యం ఏర్పరచుకున్నప్పుడు; ఆ గమ్యానికి అనుగుణంగా తన శీలాన్ని నిర్మించుకోవడం ప్రారంభిస్తాడు; ఈ  ప్రక్రియ ప్రతీ క్షణమూ జరిగేది. ఆ గమ్యం రకరకాలుగా ఉండవచ్చు; గమ్యాన్ని బట్టి తన శీలాన్ని నిర్మించుకోవడం, లేక వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతూ ఉంటుంది; అది ఆధ్యాత్మిక గమ్యమైతే, తపన యొక్క తీవ్రతని బట్టి, శీలనిర్మాణం యొక్క అవసరాన్ని గుర్తించడం జరిగి, తగిన ప్రయత్నాలు చేయడం జరుగుతుంది, సాధకుడి ద్వారా; మరింత సూక్ష్మ స్థాయిల్లో తనను తాను మలుచుకునే ప్రయత్నంలో ఉంటాడు. ఎందుకంటే ఆధ్యాత్మిక గమ్యం అంత సూక్ష్మాతి  సూక్ష్మమైనది కాబట్టి. ఈ  ప్రయత్నం లేక ఈ దిశగా చేసే కృషికి అంతం అంటూ ఉండదు; తుది శ్వాస వరకూ జరుగుతూండవలసిందే; అనంతంగా కొనసాగుతూనే ఉంటుంది. 

శీలనిర్మాణానికి సాధనం ఆత్మావలోకనం  
శీలనిర్మాణానికి సాధనం అంటే ప్రతీ క్షణం నడిపించేది - ఆత్మావలోకనం; స్వాధ్యాయం అంటే తనను తాను ఆత్మపరిశీలన చేసుకోవడం; తన ఆలోచనలను, చేతలను, అలవాట్లను, ప్రవర్తనను, ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఎప్పటికప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉండటం; దీనికి ధ్యానం అద్భుతంగా సహాయపడుతుంది, ముఖ్యంగా హార్ట్ఫుల్నెస్ ధ్యాన పద్ధతి చక్కటి సహకారాన్ని అందిస్తుంది. 

తేలికగా శీలనిర్మాణం జరగాలంటే...  
పెద్దలు చెప్పినది: ఎవరో ఒకరిని ఆదర్శ వ్యక్తిగా భావించి, ఆ వ్యక్తి మనం ఆరాధించే వ్యక్తిగా మారడానికి గల కారణాలను, ఆ వ్యక్తి చేసిన కృషిని కూలంకషంగా అధ్యయనం చేస్తూ త్రికరణ శుద్ధిగా అనుసరించే ప్రయత్నం చేయమన్నారు. 







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సంస్కృత సుభాషితాలు, శ్లోకాలు - 2

  సంస్కృత సుభాషితాలు, శ్లోకాలు - 2 ధృతిః క్షమా దమః ఆస్తేయం శౌచమింద్రియనిగ్రహః ధీర్విద్యా సత్యమక్రోధో దశకం ధర్మలక్షణం. తాత్పర్యం:  ధృతి (ధైర్...