2, నవంబర్ 2023, గురువారం

మనిషి జీవితంలో గురువు అవసరం, గురువు ప్రాశస్త్యం

మనిషి జీవితంలో గురువు అవసరం, గురువు ప్రాశస్త్యం 

గురోరంఘ్రి పద్మే మనశ్చైన లగ్నం, 

తతః కిం, తతః కిం, తతః కిం, తతః కిం. 

- ఆదిశంకరాచార్యులవారు   

గురువు అంటే ఎవరు కాదు? 

మొట్టమొదటగా మనం అర్థం చేసుకోవలసినది, గురువు అంటే అధ్యాపకుడు కాదు; టీచర్ కాదు; వివిధ వృత్తి విద్యలు నేర్పించే శిక్షకులు కాదు; ఆచార్యుడు లేక ప్రొఫెసర్ కూడా కాదు. ప్రసంగాలు చేసేవారు, ప్రవచ్చనకర్తలు, కేవలం కాషాయ వస్త్రాలు ధరించినవారు, వీళ్ళెవరూ కాదు. వీళ్ళందరూ వివిధ రకాల విద్యలను బోధించే స్థానంలో ఉన్నప్పటికీ, కొంతవరకూ అజ్ఞానాన్ని తొలగించేవారైనప్పటికీ, తప్పక కృతజ్ఞత కలిగి ఉండవలసిన వ్యక్తులే అయినప్పటికీ, తప్పక గౌరవించవలసినవారే అయినప్పటికీ, కూడా వీరికి ఆధ్యాత్మిక గురువు యొక్క స్థానాన్ని ఆపాదించడానికి లేదు. 

గురువు యొక్క అవసరం మనిషికి ఎప్పుడు ఏర్పడుతుంది? 

మన చుట్టూ కనిపించే ఈ అస్తిత్వానికి, మన అస్తిత్వానికి గల కనిపించని మూలకారణం యేదో ఉందనిపించినప్పుడు, దాన్ని ఎలాగైనా తెలుసుకోవాలన్న తీవ్ర ఆకాంక్ష, జిజ్ఞాస కలిగినప్పుడు, అజ్ఞానంలో సమాధానాలు ఎక్కడ వెతకాలో  దిక్కుతోచక, ఎవరైనా మార్గదర్శనం చేసేవారుంటే బాగుండునని బాగా తపిస్తూ ఉన్నప్పుడు, గురువు యొక్క అవసరం ఏర్పడుతుంది, ఆయన కోసం తపన, ప్రారంభమవుతుంది. అప్పటి వరకూ జీవితం అనుకూలంగా నడుస్తున్నంత సేపూ గురువు లేక భగవంతుడి అవసరం ఏర్పడదు.  

అసలు మనిషి జీవించడం ఎలాగో తెలియనప్పుడు కూడా మనిషికి, అది ఎవరు నేర్పిస్తారన్న ప్రశ్న కలుగుతుంది. మనిషిని సృష్టించిన భగవంతుడే స్వయంగా నేర్పించాలి; ఆయన మనకి అందుబాటులో లేడు. లేదా, సరైన గురువు నేర్పించాలి; గురువు కూడా అందుబాటులో లేకపోయినట్లయితే? అప్పుడు జీవితమే  నేర్పిస్తుంది. కానీ జీవితం నేర్పిస్తే, చాలా కఠినంగా నేర్పిస్తుంది. చాలా సమయం వ్యర్థమయ్యే అవకాశం ఉంటుంది పాఠాలు నేర్చుకోవడం కష్టంగా ఉంటుంది.  కాబట్టి గురువు తన స్వానుభవం ద్వారా ఈ భవసాగరాన్ని ఏ విధంగా సమర్థవంతంగా ఈది, తన జీవిత ప్రయోజనాన్ని, జీవిత గమ్యాన్ని చేరుకోవాలో మార్గదర్శనం చేస్తాడు. అప్పుడు చాలా సమయం ఆదా అవడమే గాక, ఈ జన్మలోనే జన్మసాఫల్యాన్ని సిద్ధింప జేసుకునే అవకాశం ఉంటుంది. 

అటువంటి గురువును ఎలా వెతకడం? ఎలా గుర్తించడం?

ఆధ్యాత్మిక దిగ్గజాలందరూ, మహాత్ములందరూ ఏకగ్రీవంగా చెప్పేది గురువును భౌతికంగా వెతకనవసరం లేదు. ఒకవేళ వెతికినా మనం మన పరిమితమైన తెలివితేటలతోనూ, పరిమితమైన జ్ఞానంతోనూ, పరిమితమైన అనుభవంతోనూ గురువును అంచనా వేసి ఆ వ్యక్తిని గురువుగా భావించే అవకాశం ఉంటుంది. సాధారణంగా అటువంటి నిర్ణయం పొరపాటుగా పరిణమించే  అవకాశం ఉంటుంది. ఇంటర్నెట్ లో బ్రౌజ్ చేసే విషయం కాదు; బజార్లో వెతికే వస్తువు కాదు గురువు. 

మనకు నిర్దేశించిన గురువును మన హృదయంలో గల తీవ్ర తపనే మన గుమ్మంలోకి  వచ్చేలా చేస్తుంది. అన్వేషకుడు చెయ్యవలసినదల్లా, గురువు తటస్థించే వరకూ  కేవలం తనలో ఉన్న తపనను తీవ్రతరం చేసుకుంటూ నిరీక్షించడమే. 

మరో రకంగా గురువు తటస్థించే అవకాశం: మన ఆప్తులు, శ్రేయోభిలాషుల ద్వారా తెలియడం. అప్పుడు మనకు తోచిన విధంగా గురువును పరీక్షించిన తరువాత  గురువు లభించాడన్న నిర్ధారణకు రావాలి. 

సరైన గురువును గుర్తించాలంటే: అటువంటి మహాత్ముని సమ్ముఖంలో మన మనసు ఒక్కసారిగా ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా మారుతుంది; అలౌకికమైన ఆనందం కలుగుతుంది హృదయంలో; అస్సలు ప్రశ్నలు తలెత్తవు. ఆ విధంగా మీ హృదయం మీకు నిర్దేశించిన గురువు తటస్తమైన వెంటనే స్పందించినప్పుడు వెంటనే అటువంటి వ్యక్తిని గురువుగా స్వీకరించాలి. బుద్ధి, హృదయానికి మధ్య ఎటువంటి స్ఫర్థ ఉండదు. అలా జరగని పక్షంలో మన నిరీక్షణ కొనసాగించాలి. 

గురువు ప్రాశస్త్యం

అటువంటి గురువు సాధకుడి జీవితంలో తటస్థించిన క్షణం జీవిత పరిష్కారం లభించినట్లే. ఇక మిగిలినది వారు చెప్పింది, చెప్పినట్లుగా, విధేయతతో ఉంటూ వారిని అనుసరించడమే. 

సాధకుని జీవితంలో గురువు యొక్క పాత్ర, రసాయన ప్రక్రియలో ఉత్ప్రేరకం లాంటిది. ఉత్ప్రేరకం తాను రసాయన ప్రక్రియకు లోనుగాకుండా, ఆ ప్రక్రియను తీవ్రతరం చేస్తుంది. అదే విధంగా గురువు శిష్యుని ఆధ్యాత్మిక పరిణతిలో తన పాత్రను నిర్వహిస్తాడు; చేయి పట్టుకొని శిష్యుని అన్నీ పరిస్థితులలోనూ కాపాడుకుంటూ, ఒక్కొక్క చక్రాన్ని సునాయాసంగా దాటిస్తాడు. ఒక్కొక్క చక్రంలో ఉండే ప్రలోభాలకు, అపాయాలకు గురిగాకుండాగా, సంరక్షిస్తూ పరమగమ్యానికి చేరుస్తాడు. గురువు శిష్యుని జీవితంలో భౌతికంగానూ, ఆధ్యాత్మికంగానూ కూడా వెన్నంటే ఉండి కాపాడుతూ ఉంటూ శిష్యుని యొక్క సమర్థతను పెంచుతూ ఉంటాడు; మానవ జీవితం  యొక్క యదార్థ లక్ష్యాన్ని చేరుకునేలా సహకరిస్తాడు. గురువు యొక్క అవసరం చిట్టచివరి దాకా ఉంటుంది; ఇంకా చెప్పాలంటే ఆ తరువాత కూడా ఉంటుంది; గురువును మించిన శిష్యునిగా తయారైనా కొనసాగుతుంది. 

అందుకే అటువంటి గురువు యొక్క పాదాలపైన మనస్సు లగ్నం చేయలేకపోతే ఈ ప్రపంచంలో ఏమి సాధించినా ఏమిటి ప్రయోజనం? ఏమిటి ప్రయోజనం? ఏమిటి ప్రయోజనం? ఏమిటి ప్రయోజనం? తతః కిం, తతః కిం, తతః కిం, తతః కిం అంటారు శంకురులు. అటువంటి గురువును గురుస్సాక్షాత్ పరబ్రహ్మగా హృదయంలో శాశ్వతంగా ప్రతిష్ఠించుకోవాలి. 



 



3 కామెంట్‌లు:

  1. గురువు ప్రాశస్త్యం గురించి ఎంత చక్కగా విపులమైన సంక్షిప్తంగా వివరించారు కృష్ణా రావు గారూ... ఇంతకన్నా ఎక్కువ ఏమీ చెప్పగలం... మనిషికి ఆది శంకరుల వారు చేసిన ఆ మార్గదర్శనమే ఎంతో విశిష్టమైనది. అలాగే మరొకటి కూడా ఉంది మనసు మాధవుని వైపు మళ్లించక గ్రామర్ సూత్రాలు ఎందుకు వల్లిస్తున్నవయ్య ! (నా జ్ఞాపక శక్తి అంతంత మాత్రమె సుమా ! క్షమించగలరు తప్పుంటే) అని. నాకు ఇవి ఎప్పుడూ విన్నా, పరమపూజ్య బాబూజీ గారు చెప్పిన ఏకైక సూత్రం మనసంతా ఆయననే నింపుకో అన్నదానిని గుర్తుకు తెస్తుంది. ఆయన మరి అదే పాటించారు. ఎవరు గురువు కాదో చాలా చక్కగా వినమ్రంగా వివరిస్తూ, మనలో అసలైన ప్రశ్న (జీవిత లక్ష్యం) మొదలైనప్పుడే ఆయన వస్తారు అని బాగా చెప్పారు. తపన అంటే అటువంటి అంతర్మధనమే ! నా విషయంలో, చాలా మంది విషయంలో లాగే, అలాంటిది జరగక గురువు వద్దకు చేరినా, సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాను. ఇతరులవైపు, పోలికల వైపు, ఏమి జరుగుతుందో అన్న విషయాలపై దృష్టి పెట్టక, ఎంతసేపూ మనలో మనం ఎదో అయిపోయినప్పుడే (ఇదేమిటి, ఇదేలాగా అని ఎవరైనా అడిగినా చెప్పలేని పరిస్థితి – అది నీకై నీవు అనుభవించాలి తప్ప వేరొకరు వివరించలేరు) మెల్లమెల్లగా అంతర్మధనం లేదా హృదయ మధనం జరుగుతుంది... తపన గా, తనపై తాను చేసుకోవలసిన పనిగా ఎదురౌతుంది అది. ఇదే అంతర్మధనం అని కూడా మనకూ తెలియదు. కాని మెల్ల మెల్లగా విషయం అర్థమై ప్రేరణ కలిగుతుంది. చక్కగా మన పూర్వీకులు దీనిని కవ్వంతో చిలకడం గా వర్ణించారు. పాల సముద్ర మథనం గురించీ చెప్పారు. అప్పుడు ఒకటీ ఒకటీ తెరలు తొలగి వాస్తవాలు కనపడడం మొదలెడతాయి. ఈ విధంగా సాధకులకు ప్రేరణ కలిగించాలి గాక !



    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...