2, జులై 2025, బుధవారం

Brighter World - బ్రైటర్ వరల్డ్ - దివ్యలోకం - 3

 


Brighter World - బ్రైటర్ వరల్డ్ - దివ్యలోకం - 3

అద్భుతం ఏమిటంటే - ఈ గ్రంథం యే విధంగా చదవాలి? బ్రైటర్ వరల్డ్ లో ఉండే మహాత్ములు, ఇక్కడుండే ఇతర ఆత్మల స్వభావం ఎలా ఉంటుంది? ఇక్కడి వాతావరణం ఎలా ఉంటుంది?  ఇత్యాది ప్రశ్నలన్నీటికీ కూడా మనకీ గ్రంథ శ్రేణిలోనే లభిస్తాయి. ఇవి గాక మన మాస్టర్లు తరచూ ఇచ్చే సమాధానాలున్నాయి. 
క్లుప్తంగా ఈ గ్రంథం ఎలా చదవాలి?
ధ్యానస్థితిలో చదవాలి. సాధ్యమైనంత వరకూ ఉదయం ధ్యానం తరువాత చదవాలి. ఎందుకంటే అప్పుడు తాగా ధ్యాన చేసిన తరువాత ధ్యానస్థితిలో ఉంటాం కాబట్టి. అప్పుడు పంక్తుల్లో ఉండే అర్థమే గాక పంక్తుల మధ్య అదృశ్యంగా ఉండే అర్థాలు కూడా అర్థం చేసుకునే విధంగా చదవాలంటారు బాబూజీ విస్పర్శ్ లో. 
ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది?
ఈ గ్రంథం ప్రకారం, ఇక్కడ భూమ్మీద ఒకప్పుడు అవతరించి ఎన్నో మహత్కార్యాలు చేసిన మహాపురుషులందరూ ఉంటారు. వీళ్ళు గాక బ్రైటర్ వరల్డ్ దాటి, ఇంకా ఆవల ఉన్న ఎందరో ఇంకా అవతరించని మహాత్ములు కూడా ఉంటారు. వీరందరూ గాక ఆధ్యాత్మిక సాధనలో ఉన్నత స్థితులను పొంది ఇక్కడ ఉండటానికి యోగ్యతను సంపాదించుకున్న ఆత్మలు కూడా ఉంటాయట. ఇప్పటికే ఎందరో అటువంటి అభ్యాసులు కూడా ఇక్కడున్నారని విస్పర్శ్ గ్రంథం చెబుతోంది. అద్భుతమైన విషయం ఏమిటంటే ఇక్కడున్నవారందరూ ఒక్కటిగా, ఎటువంటి బేధాభిప్రాయాలూ లేకుండా ఒకే దిశగా పని చేయడం; ముఖ్యంగా భూగ్రహంపై  ఉన్న మానవాళి వికాసం కోసం, ఆ ఎగ్రెగోర్ సాధించే వరకూ వారు వాళ్ళ వాళ్ళ లోకాలను వదిలి ఇక్కడ కలిసిగట్టుగా పలు విధాలుగా పని చేస్తున్నారు. అందులో భాగమే ఈ సందేశాలను ప్రసరించడం కూడా. ప్రపంచ చరిత్రలోనే ఇన్ని వేల సందేశాలను, అది కూడా మానవాళి శ్రేయస్సును ఉద్దేశించినవి అందుకోవడం ఇదే మొదటిసారి. 
వీళ్ళందరూ నివసిస్తున్న లోకాన్ని చిత్రించడం అంతా తేలికైన విషయం కాదు.ఈ దివ్యలోకంలో కోరిక, అసూయ, ద్వేషం అనేవి అస్సలుండవు. సోదరభావం, ఓరిమి, సమగ్రమైన అవగాహన అనేవి ప్రేమకు ఆలాపనగా ఉంటాయి. పరపూర్ణత కోసం మాలో అన్వేషణ శాశ్వతంగా ఉంటంది. దివ్యత్వంతో ఏకమై  ఉండిపోవాలన్న పవిత్ర స్ఫూర్తి మాలో కణకణాల్లో నిండుగా ఇమిడి ఉంటంది. మేము ఒకే సూక్ష్మ శక్తితో ప్రకంపిస్తూ ఉంటాం. ఒక శాశ్వతమైన స్వర్గతుల్యమైన స్వరం మాలో నుండి వచ్చే  గీతాలను ఒక్కటి చేస్తుంది. మేమందరమూ ఒక్కటిగా ప్రేమిస్తూంటాం.  యే స్థానంలోనైనా కేవలం అక్కడ ఉండే సౌందర్యాన్ని, పవిత్రతను మాత్రమే చూస్తాం. 

మన మానవ సోదరులందరూ లేక ఇతర లోకాల్లో పరిణతి చెందుతున్నవారందరూ కూడా, ఇంచుమించుగా సహించలేని జీవన విధానాలకు గురవుతూ ఉన్నంతవరకూ, వాళ్ళు తమ శృంఖలాల నుండి విముక్తులయ్యే వరకూ, ఈ దివ్యలోకంలో ఉండే దివ్య అద్భుతాలను నిజంగా వాళ్ళు అనుభవించలేరు.

(ఇంకా ఉంది ... )

1, జులై 2025, మంగళవారం

Brighter World - బ్రైటర్ వరల్డ్ - దివ్యలోకం - 2

  


Brighter World - బ్రైటర్ వరల్డ్ - దివ్యలోకం - 2  

*

బ్రైటర్ వరల్డ్ కు, సాధకులకు మధ్య వారధిగా వ్యవహరించిన మన లేఖిని శ్రీమతి హెలీన్ పైరే ఆ దివ్యలోకం నుండి ప్రకంపనల రూపంగా అందుకున్న సందేశాలను ఫ్రెంచ్ భాషలోకి తర్జుమా చేసి, ఆ తరువాత వాటిని ఆంగ్లంలోకి సోదరుడు మిచేల్ అనువదించడం జరిగింది. ఈ సందేశాల సంకలనానికి పూజ్య గురుదేవులు చారీజీ మహారాజ్ 2005 వ సంవత్సరంలో విస్పర్స్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ అని నామకరణం  చేయడం జరిగింది. ఈ గ్రంథాన్ని గురించిన మరిన్ని వివరాలుఈ క్రింది లింకుల ద్వారా తెలుసుకోగలరు.   

విస్పర్స్  ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ - 1 - ఛానలింగ్

https://hrudayapatham.blogspot.com/2021/12/1.html

విస్పర్స్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ -  2 - గ్రంథ పరిచయం

https://hrudayapatham.blogspot.com/2021/12/2.html

విస్పర్స్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ - 3 - చారీజీ భావాలు

https://hrudayapatham.blogspot.com/2022/01/3.html

విస్పర్స్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ - 4- (విస్పర్ సందేశాలను చదివే విధానం)

https://hrudayapatham.blogspot.com/2022/07/4.html

మన ఆధ్యాత్మిక ప్రయాణంలో అనుభూతులు  - విస్పర్స్ సందేశాల నుండి బాబూజీ

https://hrudayapatham.blogspot.com/2024/03/blog-post_2.html

మృత్యువు - విస్పర్స్ సందేశాల నుండి బాబూజీ

https://hrudayapatham.blogspot.com/2024/03/blog-post_6.html


(ఇంకా ఉంది ... )

 


Brighter World - బ్రైటర్ వరల్డ్ - దివ్యలోకం

 


Brighter World - బ్రైటర్ వరల్డ్ - దివ్యలోకం  

*

హార్ట్ఫుల్నెస్ - సహజ మార్గ సాహిత్యంలో ఈ బ్రైటర్ వరల్డ్ అనే  పదం తరచూ తటస్థం అవుతూ ఉంటుంది. ఈ బ్రైటర్ వరల్డ్ అంటే ఏమిటి? ఈ దివ్యలోకం అనేది ఎక్కడుంటుంది? దీనికి మార్గం ఏమిటి? అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది? వీటికి సమాధానాలు శోధించినప్పుడు కలిగిన అవగాహనను ఇక్కడ పంచుకునే ప్రయత్నం చేస్తాను. 

సహజ మార్గ సాధకులు, తమ అనంత ఆధ్యాత్మిక యాత్రలో,  తగినంత ఆధ్యాత్మిక పరిణతిని సాధించిన తరువాత చేరుకునే ఆధ్యాత్మిక లోకం ఈ బ్రైటర్ వరల్డ్. ఇక్కడ, ఆత్మల యొక్క తదుపరి పురోగతి, ఇక్కడున్న దివ్యాత్ములైన మన గురుపరంపరలోని మన మాస్టర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో ముందుకు కొనసాగుతుంది. 

ఈ బ్రైటర్ వరల్డ్ కి ఆవల కూడా ఎన్నో ఉన్నత దివ్యలోకాలున్నాయట. భూమ్మీద అవతరించిన వ్యక్తిత్వాలే గాక, ఇంకా అవతరించని మాస్టర్లు కూడా (ఈ బ్రైటర్ వరల్డ్ కి ఆవల ఉన్న లోకాల నుండి) ఇక్కడికి వచ్చి మానవాళికి సేవలందిస్తున్నారట.  

బాబూజీ తన జీవితకాలంలో ఈ లోకంతో ప్రత్యక్ష సంపర్కం కలిగి ఉండేవారు. ఈ సంపర్కం ద్వారా వారందుకున్న దివ్యసందేశాలు, ఆదేశాలు, మార్గదర్శనాలు మనకు 1944 విస్పర్శ్ అనే ఉద్గ్రంథంలో కనిపిస్తాయి. బాబూజీ తరువాత అటువంటి సంపర్కం ఫ్రాన్స్ దేశస్థురాలైన, అభ్యాసి అయిన శ్రీమతి హెలీన్ పైరే అనే మన లేఖిని (Scribe) గారు కలిగి ఉండేవారు; దాదాపు 20 సంవత్సరాలకు పైగా ఆ సంపర్కంతో కొన్ని వేల సందేశాలను వివిధ మాస్టర్ల నుండి 2018 వరకు అందుకున్నారు. అవే విస్పర్శ్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ అనే గ్రంథాలుగా ఇప్పటికి 6 సంపుటాలు వెలువడ్డాయి. 

పైన చిత్రం: విస్పర్శ్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ అనే గ్రంథంలోని సందేశాల ద్వారా ఈ దివ్యలోకాన్ని గురించిన విశేషాలు, మానవాళి మనుగడకు సంబంధించిన విషయాలు, రహస్యాలు, మార్గదర్శనాలు, వివిధ మాస్టర్ల సందేశాలు - శ్రీకృష్ణుడు, రాధారాణి, స్వామి వివేకానంద, శ్రీరామ కృష్ణ పరమహంస, శ్రీచైతన్య మహాప్రభు లాలాజీ, బాబూజీ, చారీజీ వంటి మహాత్ముల నుండి సందేశాలు దర్శనమిస్తాయి. ఈ గ్రంథమే ఈ బ్రైటర్ వరల్డ్ కి మార్గాన్ని సూచిస్తోందని, ఇహానికి-పరానికి వారధి అని తెలియజేస్తున్నది. 

ఈ పవిత్ర గ్రంథాన్ని సాధకులు అత్యంత భక్తిశ్రద్ధలతో అధ్యయనం చేయవలసిన గ్రంథం; తద్వారా ఎవరికి వారు తమ ఆధ్యాత్మిక సంపదను పెంచుకోగలిగే అవకాశం. 

(ఇంకా ఉంది...)


28, జూన్ 2025, శనివారం

ఆధ్యాత్మిక సాధన ఎందుకు చెయ్యాలి?

 ఆధ్యాత్మిక సాధన ఎందుకు చెయ్యాలి? 

ఒక్కసారి సమర్థ గురువు తటస్థమయిన తరువాత, గురుదేవులు  చేయమన్నారు కాబట్టి చెయ్యాలి, అంతే. 

తక్కిన కారణాలేమయినా ఉంటే, అవి ఆ తరువాతే. ఎందుకంటే చెప్పింది చెప్పినట్లుగా చేయడమే విధేయత. ఈ లక్షణం అలవడటానికే గురువు సాధన చేయమనేది. విధేయత సాధించిన సాధకుడికి గురువు అనుగ్రహం లభించడం అతి తేలిక; గురువుకు సాధకుని గమ్యానికి జేర్చడం అతి తేలికట. ఆంగ్లంలో దీన్నే Obedience అంటారు. 







19, జూన్ 2025, గురువారం

హార్ట్ఫుల్నెస్ - సహజ్ మార్గ్ సాహిత్యం చదివే విధానం - పూజ్య దాజీ సూచనలు

 


హార్ట్ఫుల్నెస్ - సహజ్ మార్గ్ సాహిత్యం చదివే విధానం 
- పూజ్య దాజీ సూచనలు  

శుక్రవారం, సెప్టెంబర్ 4, 2015 న పూజ్య దాజీ ఒక అభ్యాసి బులెటిన్ ద్వారా పూజ్య బాబూజీ రచించిన "రియాలిటీ ఎట్ డాన్" అనే గ్రంథం ఎలా చదవాలో కొన్ని సూచనలివ్వడం జరిగింది. ఈ సూచనలే ప్రతీ పుస్తకానికీ వర్తిస్తాయి. అవి ఈ విధంగా ఉన్నాయి: 
చదివే విధానం 
రోజుకొక అధ్యాయం చదవండి. 
  • చదువుతున్నప్పుడు ఒక పెన్సిల్ దగ్గర పెట్టుకోండి. మీకు ముఖ్యమని తోచిన ప్రతి పదాన్ని అండర్లైన్ చేసుకోండి. దీన్ని మనం కీలక పదం అందాం.  
  • కేవలం కీలక పదాలను మాత్రమే అండర్లైన్ చేయండి. మీకు ఆ పదం కీలక పదం అని అనిపించినంత వరకూ ఎన్నయినా ఉండవచ్చు అటువంటి కీలకపదాలు. కీలకపదం అంటే కేవలం ఒక్క పదమే.  ఢబ్భై రెండు తరాలు లాంటి పదాలు తప్ప. 
  • ఒక అధ్యాయం చదవడం పూర్తయిన తరువాత, ఈ కీలకపదాలన్నీటినీ మీ డైరీలో వ్రాసుకోండి. ఈ పదాల మధ్య కాస్త ఖాళీ ఉండేలా వ్రాసుకోండి 
  • మీకు సమయం ఉంటే, అదే అధ్యాయాన్ని రెండవ సారి, మూడవ సారి చదవండి పెన్సిల్ అక్కర్లేకుండా. 
  • ఆ తరువాతి రోజు మీఋ డైరీలో వ్రాసుకున్న కీలకపదాలన్నిటినీ మనసులో ఉంచుకుంటూ, ఆ ఆధ్యాయాన్ని గురించిన మీ అవగాహనను డౌరీలో వ్రాయండి. ఇది వ్రాస్తున్నప్పుడు ఎ క్రింది అంశాలపై దృష్టి పెట్టండి:
  • ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు నాకేమి అర్థమయ్యింది? హృదయంలో ఏమనిపించింది?
  • ఈ అధ్యాయం చదివిన తరువాత నా అంతరంగ స్థితి (కండిషన్) ఎలా ఉంది? 
  • దృష్టిలో పెట్టుకోవాలసిన మరికొన్ని అంశాలు:
  • మరీ ఎక్కువగా వివరించకండి. 
  • వ్రాస్తున్నప్పుడు మళ్ళీ మళ్ళీ పుస్తకం చూడకండి 
కేవలం కీలక పదాలను దృష్టిలో పెట్టుకుని ఆ అధ్యాయం మీలో ఎటువంటి భావాలు కలిగించిందో వ్రాయండి. 
  • ప్రతీ అధ్యాయానికి ఇదే ప్రక్రియను అనుసరించండి. 
చదువుతున్నప్పుడు ప్రశ్నలోస్తే ఏం చెయ్యాలి?
పుస్తకం చదువుతున్నప్పుడు ఏమైనా ప్రశ్నలొస్తే, వాటిని మీ డైరీలో వ్రాసుకోండి. 
నిజమైన అవగాహన వ్యక్తిగతమైనది. కాబట్టి సమాధానం లోపలి నుండి రానివ్వండి. ఈ ప్రశ్నలవచ్చినప్పుడు వాటిపై కాస్త ధ్యానించడానికి ప్రయత్నించండి. 
ఇది ప్రయత్నించండి: ధ్యానానికి ముందర, రాత్రి నిద్రకు ఉపక్రమించే పూర్వం, ఈ ప్రశ్నను మాస్టరుకు నివేదించండి. సమాధానం లోపలి నుండి రానివ్వండి. ఒక్కోసారి దీనికి సమాధానం పుస్తకంలోని మరో భాగం నుండి రావచ్చు, లేక మరో పుస్తకం నుండి రావచ్చు. ఒక్కోసారి తరువాత ఎప్పుడో రావచ్చు. సహజంగా రానీయండి. 

దయచేసి అభ్యాసులందరూ ఈ సూచనలను పాటించి పుస్తకం పఠనం ప్రయత్నించెదరుగాక. 


18, జూన్ 2025, బుధవారం

హార్ట్ఫుల్నెస్ సహజ్ మార్గ్ - అనంత ఆధ్యాత్మిక యాత్ర - 2

  


హార్ట్ఫుల్నెస్ సహజ్ మార్గ్ - అనంత ఆధ్యాత్మిక యాత్ర - 2 

ఈ యాత్ర కొనసాగడానికి ప్రేరణ ఏమిటి?
సంపూర్ణ స్పృహతో చేసే యాత్ర ఈ ఆధ్యాత్మిక అనంత యాత్ర. దీనికి ప్రేరణ ఆసక్తి లేకపోతే ప్రయాణం కుంటుపడుతుంది. అయితే ఈ ప్రేరణ ప్రతి ఆత్మలోనూ స్వతఃసిద్ధంగా తపన రూపంలో, సహజ ఆసక్తి రూపంలో, నిద్రాణ స్థితిలో ఉంది. అందుకే సాధకులు తపనను తీవ్రతరం చేసుకోవడం చాలా అవసరం. తపనే సాధనకు ఇంధనం. 

ఈ యాత్ర ఎంత కాలం నుండి కొనసాగుతూ ఉంది? 
ఎంత కాలం నుండో తెలియదు కానీ, మన శాస్త్రాల ప్రకారం ఒక అంచనా మాత్రం ఉంది. పరమాత్మలో అంశాలైన ఈ ఆత్మలన్నీ విడిపోయిన క్షణం నుండి 84 లక్షల యోనుల గుండా ప్రవేశిస్తే గాని మానవ జన్మ రాదట. ఈ మానవ జన్మ ఇలాగే కొనసాగితే కూడా పునరపి జననం, పునరపి మరణం అన్నట్లుగా ప్రతీ జన్మలోనూ కొంచెం-కొంచెంగా ముందుకు సాగుతూ ఉంటుంది ఆత్మ, ఆ పరమాత్మలో సంపూర్ణంగా లయమయ్యే వరకూ; లేదా మహాప్రళయం జరిగే వరకూ, సాధారణంగా ప్రతీ ఆత్మ ఈ యాత్రను కొనసాగిస్తూ ఉంటుంది. ఈ యాత్ర ఆత్మకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొనసాగుతూనే ఉంటుంది. మహాప్రళయం వరకూ ఆగకుండా కొన్ని ఆత్మలు విసిగిపోయి ఈ యాత్రను కుదించాలనుకున్న ఆత్మలు యాత్రను వేగవంతం చేయాలని సంకల్పించుకుంటాయి.  అలా యాత్రను తీవ్రతరం చేసుకునే ఆత్మలే ఒక ఆధ్యాత్మిక పద్ధతిని అనుసరిస్తూ, ఒక సమర్థ గురువును ఆశ్రయించడం జరుగుతుంది.

మానవ జన్మ, మోక్షం పొందాలన్న ఇచ్ఛ, సమర్థ గురువు  ఈ మూడూ దొరకడం దుర్లభం అంటారు కదా! 
అవును, ఈ యాత్ర సాఫీగా, త్వరితంగా, సురక్షితంగా  కొనసాగడానికి ఆదిశంకరులవారు ఈ మూడూ దుర్లభం అని తన వివేకచూడామణి అనే గ్రంథంలో సెలవిచ్చారు. 
దుర్లభం త్రయం యేవ ఏతద్ దేవానుగ్రహ హేతుకం |
మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సమాశ్రయః || 
పూజ్య బాబూజీ దీనికి మరో కీలకాంశం జోడించినట్లుగా అనిపిస్తుంది. అటువంటి సమర్థ గురువు చెప్పింది చేయకపోయినట్లయితే ఈ మూడూ ఉన్నా కూడా సరిపోదన్నారు బాబూజీ. 
కాబట్టి ఈ యాత్ర యొక్క గంభీరతను, ఆవశ్యకతను అందరూ గుర్తించాలని, దానికి తగినట్లుగా యథాశక్తి  చిత్తశుద్ధిగా ప్రయత్నిస్తారని ఆ గురుదేవులను ప్రార్థిస్తున్నాను. 


హార్ట్ఫుల్నెస్ సహజ్ మార్గ్ - అనంత ఆధ్యాత్మిక యాత్ర - 1

 


హార్ట్ఫుల్నెస్ సహజ్ మార్గ్ - అనంత ఆధ్యాత్మిక యాత్ర - 1 

ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రారంభమవుతుంది?
నిజానికి పైన చిత్రంలో కనిపించినట్లుగా ఎక్కడ, ఎప్పుడు, ఎలా ప్రారంభమవుతుందో సరిగ్గా చెప్పడానికి ఉండదనిపిస్తుంది. పూర్వ జన్మలలోనే ఎక్కడో ప్రారంభమైనట్లు కనిపిస్తుంది ఒక్కోసారి ఒక్కోసారి సృష్టి ఆది నుండే ప్రారంభమయ్యిందేమో ఈ యాత్ర అనిపిస్తుంది. 

యాత్ర గమ్యం ఏమిటి?
ఏ మూలం నుండి వచ్చామో తిరిగి అక్కడికే చేరుకోవడమే మన గమ్యం. విచిత్రం ఏమిటంటే అప్పటి వరకూ మనలో ఆత్మ పదార్థంగా ఉన్నది అశాంతిగా, నిరాశగా ఉంటుంది; నిద్రపోనివ్వదు. అందుకే గమ్యం చేరుకునేంత వరకూ ఎన్ని జన్మలకైనా సిద్ధమే అన్నట్లుగా ఉంటుంది ఆత్మ స్వభావం. గమ్యం చేరుకునే వరకూ తపిస్తూనే ఉంటుంది. 

ఏమి యాత్ర ఇది?
ఇది శారీరక యాత్రా? మానసిక యాత్రా? ఆధ్యాత్మిక యాత్రా? అంటే నిజానికిది ఆధ్యాత్మిక యాత్రే; కానీ శరీరం, మనసుల పాత్ర కూడా ఇందులో ఉన్నట్లుగా కనిపిస్తుంది.  

ఈ ప్రయాణం తెలిసి జరుగుతుందా, తెలియకుండా జరుగుతుందా?
ఈ ఆత్మ చేసే యాత్ర అతి సూక్ష్మ స్థాయిలో జరుగుతుంది. దీని ప్రభావాలు కణస్థాయిలో కనిపిస్తాయి కణస్థాయిలో ఉన్న చేతనం మనకు అందుబాటులో ఉంటే. ఆ ప్రభావాలు మానసిక స్థాయికి, శారీరక స్థాయికి రావడానికి సమయం పట్టవచ్చు. కాబట్టి ఈ యాత్ర మనకు తెలిసినా తెలియకపోయినా జరుగుతూ ఉంటుంది. ఈ స్పృహతో యాత్ర చేసే సాధకులను ఆధ్యాత్మిక సాధకులంటారు. వీళ్ళు ఏదోక ఆధ్యాత్మిక సాధనను అనుసరిస్తూ ఉంటారు. 

(ఇంకా ఉంది...)




అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన 5 ఔషధాలు

  అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన  5 ఔషధాలు  ఇటీవలే పూజ్య దాజీ "ఫైవ్ ప్రిస్క్రిప్షన్స్ ఫర్ ది సోల్ ఫ్రమ్ అష్టావక్ర మహాగీత" అన...