పూజ్యశ్రీ బాబూజీ మహారాజ్ ధ్యానంలో
సహజమార్గ ధ్యాన పద్ధతి - అష్టాంగ యోగ మార్గము
సహజమార్గ ధ్యానం పూజ్యశ్రీ బాబూజీ మహారాజ్ గారిచే ఆవిష్కరింపబడిన రాజయోగధ్యాన పద్ధతి. మన శరీర వ్యవస్థలో రాజు వంటిది ఆలోచన లేక మనసు. ఈ రాజువంటి ఆలోచనా శక్తి ద్వారా యోగాన్ని సాధించడమే రాజయోగసాధన అని అంటారు.
యోగం అంటే కలయిక, ఆత్మ పరమాత్మతో లయమవడం.
పతంజలి మహర్షి అష్టాంగ యోగంలోని - యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి - అనే ఎనిమిది అంగాల్లో ఏడవ మెట్టయిన ధ్యానంతో ఈ యోగపద్ధతి ప్రారంభమవుతుంది.
ఈ ధ్యానం యొక్క ప్రత్యేకత ప్రాణాహుతి అనే దివ్యశక్తి యొక్క ప్రసరణతో కూడినటువంటి ధ్యానం. ఈ ప్రాణాహుతితో కూడిన ధ్యానం వల్ల ధ్యానించడం తేలికైపోతుంది.
అంతకు ముందున్న యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ప్రక్రియల సాధన చేయకుండా ధ్యానంతో ప్రారంభించడం ఏ విధంగా సాధ్యపడుతుంది? అన్న ప్రశ్న కలుగుతుంది. అది ప్రాణాహుతితో కూడా ధ్యానం వల్ల ఇది సాధ్యపడుతున్నది. ధ్యానంతో ప్రారంభించడం వల్ల లోపలికి అంతరంగంలోకి చూడటం సాధకుడు తనను తాను గమనించడం నేర్చుకుంటాడు. ఆ తరువాత ధ్యానం చేయడంలో వచ్చే అవరోధాలను గుర్తించడం ప్రారంభిస్తాడు. ఫలితంగా ఈ ముందున్న ప్రక్రియల విలువను, ప్రాముఖ్యతను గుర్తిస్తాడు సాధకుడు. మనిషి సాధారణంగా దేని విలువైనా గుర్తిస్తేనే గాని వాటిని సక్రమంగా సాధన చేయడానికి ఉపక్రమించడు .
ఉదాహరణకు, ప్రపరతమంగా కూర్చోవడానికే, అంటే ఆసనం విషయంలోనే ఇబ్బందులు ఎదురవడం వల్ల, ఆసనం యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తాడు. అలాగే తనలో అవగుణాలు ధ్యానంలో కనిపించినప్పుడు వాటిని తొలగించుకునే ప్రయత్నంలో యమనియమాలను సాధన చేయడం ప్రారంభిస్తాడు. అలాగే శ్వాసను తాజాగా ఆరోగ్యవంతంగా చూసుకోవలసిన అవసరాన్ని గుర్తించి ప్రాణాయామ సాధన యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తాడు. అంతేగాక ఇంద్రియపరమైన బలహీనతలను గుర్తించినప్పుడు ప్రత్యాహారం అనే అంగం యొక్క గొప్పదనాన్ని గుర్తించి ప్రత్యాహార సాధన ప్రారంభిస్తాడు. ఆ తరువాత ఒకే అంశంపై ఆలోచనను అంతరాయం లేని విధంగా, తైల ధారగా ఉంచడం అప్రయత్నంగానే వస్తుంది. అదే ధారణ. వీటన్నిటి సాధన వల్ల ధ్యానంలోకి తేలికగా వెళ్ళగలుగుతాడు సాధకుడు. ధ్యానం మనసును క్రమశిక్షణలో పెట్టడమే గాక, మనసుకు ఆవల ఉన్న ఉన్నతోన్నత ఆధ్యాత్మిక స్థితులకు చేర్చగలుగుతుంది. ఫలితంగా సమాధి స్థితికి చేరుకోవడం సాధ్యపడుతుంది.
ఈ ప్రక్రియలన్నీ చిత్తశుద్ధితో చేసే ప్రతీ సహజమార్గ అభ్యాసి తెలియకుండానే ఆచరిస్తూ ఉంటాడు. ఇన్ని తెలియకుండా జరిగేటువంటి అద్భుతమైన పద్ధతి, తెలిసినప్పుడు అమితమైన కృతజ్ఞత, ప్రేమ, భక్తి, సమర్పణ భావం గురువు పట్ల ఏర్పడటం వల్ల, ప్రాణాహుతి ప్రసరణకు మరింత అనుకూలంగా సాధకుడు తనను తాను సవరించుకోవడం జరుగుతుంది. ఈ సహజమార్గ ధ్యాన పద్ధతిని బాబూజీ మహారాజ్ మానవాళి పట్ల ఎంతో కరుణతో రూపొందించడం జరిగింది. ఇవన్నీ ప్రాణాహుతి ప్రసరణ వల్లనే సాధ్యపడుతున్నది. ఎంతో సమయాన్ని ఆదా చేస్తున్నది, తగ్గిస్తూ ఉన్నది. అందుకే ఈ ఆధ్యాత్మిక పద్ధతి, తీరిక లేని ఆధునిక మానవులకు చాలా అనుకూలమైనది. ఈ సాధన పట్ల విధేయతతో ఉంటూ అనుసరించడం వల్ల ప్రతి జీవితంలోనూ ఉన్న తెలియని వెలితిని పూరించడమే గాక జీవితానికి గల పరమార్థాన్ని గుర్తించి, తగు రీతిలో జీవించే కళను అప్రయత్నంగా నేర్చుకోవడం జరుగుతుంది.
అందుకే పూజ్య దాజీ మనలను పదే పదే రియాలిటీ ఎట్ డాన్ పుస్తకంలో సాక్షాత్కారం అనే అధ్యాయాన్ని చదవమంటారు. అందుకే దాజీ మన అభ్యాసులకు ప్రత్యేకంగా తెలియజేయవలసిన అవసరం ఉందని, వీటన్నిటినీ మరల పరిచయం చేస్తున్నారు, వాటి ప్రాముఖ్యతను, ఆచరించవలసిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. సజీవ మాస్టర్ ఇలా ఎప్పటికప్పుడు అవసరమైన విధంగా తన సూచనలతో మానవాళిని సరిదిద్దుతూ ఉంటారు. మన పని, మనకు తగినట్లుగా వారిని ఆచరించడమే.
(ఇది నా నూరవ బ్లాగు. ఆదరించిన ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు)
ఎంత చక్కగా సమన్వ్వాయ పరిచారు కృష్ణా గారు ! ధన్యోష్మి !! ఇలాగే జరుగుతుంది సుమా ! సాధకునికి తెలియకుండా ఇవన్నీ ఒక్కొక్కటిగా ఆచరణలోకి వస్తాయి. పరమపూజ్య బాబూజీ పధ్ధతి !!
రిప్లయితొలగించండి