గీతా ధ్యానం - విశ్వరూప దర్శనం
ఈ రోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం. ఈ పవిత్ర దినాన భగవద్గీతలోని శ్రీకృష్ణ భగవానుడు, 11 వ అధ్యాయంలోని విశ్వరూప దర్శనం గురించి స్మరించుకునే ప్రయత్నం చేద్దాం.
భగవద్గీతలో చాలా ఆసక్తికరమైన అధ్యాయం ఈ విశ్వరూప దర్శనం. 10 వ అధ్యాయంలో భగవానుడు తనను అన్నిటా దర్శించడాన్ని గురించి తెలియజేయడం జరిగింది. 11 వ అధ్యాయంలో అన్నిటినీ తనలో దర్శింపజేయడం జరిగింది. అదే విశ్వరూపదర్శనం. ఈ శ్లోకాలు, దాని అర్థము ఏ మహానుభావుని నోటైనా వింటూంటే (చదవటం కంటే కూడా) అనేక అద్భుతమైన పదాలు వినిపిస్తాయి, ఆ విశ్వరూపాన్ని (వర్ణించలేనిదాన్ని) వర్ణిస్తూ. ఒక్క పదాన్ని అందులో నుండి తీసేసినా వికారంగా తయారవుతుంది, ఒక్క పదం జోడించినా భంగం వాటిల్లుతుంది. అంత అత్యద్భుతంగా వేదవ్యాస మహర్షి పదాల కూర్పును చేయడం జరిగింది.
అసలు విశ్వరూపం దర్శించవలసిన కోరిక ఎందుకు కలిగింది ఆర్జనుడికి?
ఒక్కటే తత్త్వం అనేకంలో ఎలా ఉన్నదో భగవానుడు అనేక ఉదాహరణాలతో చెప్పడం జరిగింది - జంతువులలో వృషభాన్ని నేనని, సూర్యునిలో కాంతిని నేనని, వజ్రంలో ఉన్న మెరుపును నేనని, అందమైన వాటిల్లో అందాన్ని నేనని, బుద్ధిలో తెలివిని నేనని - ఇలా అనేకరకాలుగా అన్నిటిల్లోనూ తానే హృదయమై యున్నాడన్న తత్త్వాన్ని భగవానుడు చెప్పడం, అర్జునుడు తెలుసుకోవడం జరుగుతుంది. దీన్నే భక్తి యోగం అంటారు. ఇప్పుడు ఆర్జనుడు, ఒక విద్యార్థిగా, ఈ అనేకాన్ని ఒక్కటిలో దర్శించాలనుకుంటున్నాడు; దీన్నే యోగం అంటారు. మనిషి తన సృష్టిని, (అంటే కోరికలను, సంస్కారాలను, అహంకారాన్ని) అధిగమించి, వాటిని దాటి ఆ పరతతత్వంలో లయమవడమే యోగం. అటువంటి యోగస్థితిని దర్శించాలనుకున్నాడు.
ఏవమేతద్యా తాత్థ త్వమాత్మానాం పరమేశ్వర |
ద్రష్టు మిచ్ఛామి తే రూపమైశ్వరం పురుషోత్తమ || 11:3 ||
ఓ పరమేశ్వరా! నీ గురించి నువ్వు చెప్పినదంతా సత్యమే. పురుషోత్తమా! ఈశ్వరునికి సంబంధించిన నీ విశ్వరూపాన్ని సందర్శించాలని నాకు కోరికగా ఉన్నది.
విశ్వరూపాన్ని దర్శించాలంటే ఎలా?
శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చిన విశ్వరూప దర్శనం, ఈ మాంసపు కళ్ళతో చూసేది కాదు. దానికి దివ్య చక్షువులు, హృదయ చక్షువులు అవసరం. ఆకాశ కాలాలకి అతీతమైన, ఈ విశ్వరూప సందర్చనానికి, అందరూ అర్హులు కారు. కేవలం అనన్య భక్తితో చేసే సేవల ద్వారా మాత్రమే నన్ను అర్థం చేసుకునేందుకు శక్యమవుతుంది. నీకు ముందు ఎవ్వరూ దర్శించలేదు; వేదాది శృతి శాస్త్రాలు చదివినా, తపోయాగాదులు చేసినా, ఎన్ని దానాలు చేసినా, ఎన్ని పవిత్ర కార్యాలు ఒనర్చినా, నా ఈ రూపాన్ని, నన్ను యథాతథంగా ఎప్పుడూ ఎవ్వరూ ఇంతవరకూ చూడలేదు.
న తు మాం శక్యసే ద్రష్టు మనేనైవ స్వచక్షుషా |
దివ్యం దదామి తే చక్షుః పశ్యమే యోగమైశ్వరం || 11: 8 ||
నీకున్న కళ్ళతో ఈ విశ్వరూపాన్ని దర్శించలేవు. నీకు దివ్య చక్షువులు ప్రసాదిస్తున్నాను; వాటితో నా విశ్వరూపాన్ని దర్శించు.
ఆర్జనుడు దర్శించిన విశ్వరూపం ఎలా ఉంది?
ఈ సృష్టిలో ఉండే వస్తువులను (మనుషులను, పశుపక్షాదులను, చరాచర వస్తువులను) విడదీసేది యేది? ఆ మధ్యలో ఉన్న ఆకాశం, లేక ఖాళీ. ఈ ఖాళీని గనుక యేదో విధంగా తీసేసినట్లయితే సర్వమూ ఒక్క దగ్గరకు వస్తే ఎలా ఉంటుందో అదే విశ్వరూపం అని ఒక మహాత్ముడు గొప్పగా తెలియజేశాడు. కానీ శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా చెప్పినట్లుగా, దివ్య చక్షువులతో గాని ఆయన విశ్వరూపాన్ని దర్శింప శక్యం కాదు. అలాగే అనన్య భక్తితో సేవించే ఆర్జనుడిలాంటి వాడికి తప్ప ఈ విశ్వరూప దర్శన యోగం ఉండదేమో!
ఈ విశ్వరూపం ఎలా ఉంటుందో 11 వ అధ్యాయంలో అనేక శ్లోకాల్లో వివరించడం జరిగింది. మచ్చుకు ఇక్కడ రెండు శ్లోకాలు చెప్పుకుందాం:
అనేక వ్యక్తరనయనం అనేకాద్భుత దర్శనం |
అనేక దివ్యాభరణం దివ్యానేకో ద్యతాయుధం || 11:10 ||
దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం |
సర్వాశ్చర్యమయం దేవమనంతం విషవతోముఖం || 11:11 ||
ఆ విశ్వరూపం అనేక ముఖాలతో, అనేక నేత్రాలతో, అనేక అద్భుతాలతో, అనేక దివ్య ఆభరణాలతో, అనేక ఎక్కుపెట్టిన దివ్యాయుధాలతో, దివ్య పుష్ప వస్త్రంతో, దివ్య గంధాలతో, మహా ఆశ్చర్యకరంగా, దేదీప్యమానంగా అనంతం విశ్వతోముఖమై విరాజిల్లుతూ ఉంది.
నో వర్డ్స్ !!
రిప్లయితొలగించండి