గీతా ధ్యానం - కర్మలంటకుండా జీవించడం
సుఖదుఃఖే సమే కృత్వా లాభ అలాభౌ జయ అజయౌ ।
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి ।। 2: 38 ।।
సుఖ-దుఃఖాలను, లాభ-నష్టాలను, జయాపజయాలను సమానంగా గ్రహిస్తూ, కర్తవ్య దీక్షతో యుద్ధం చెయ్యి. బాధ్యతలను ఈ విధంగా నిర్వర్తించటం వల్ల ఎన్నటికీ పాపం అంటదు.
బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః ।
లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా ।। 5:10 ।।
సమస్త మమకారాసక్తులు త్యజించి, భగవంతునికే తమ అన్ని కర్మలు అంకితం చేసే సాధకుడు, తామరాకు నీటిలో ఉంటూ కూడా తడి అంటకుండా ఉన్నట్లుగా, సాధకుడు కూడా పాపముచే తాకబడకుండా జీవించగలుగుతాడు.
ఇక్కడ పాపం అంటే ద్వంద్వాలు. ఈ ప్రపంచంలోని ద్వంద్వాలను సమదృష్టితో చూడగలిగే స్థితి, హార్ట్ఫుల్నెస్ సహాజమార్గ ధ్యానం వల్ల, స్వల్ప కాలంలోనే కలిగే అవకాశం ఉంది. సహజమార్గ ఆధ్యాత్మిక యాత్రలోని మొదటి 5 గ్రంథులను/చక్రాలు, దీనినే హృదయ క్షేత్రం అని కూడా అంటారు; ఈ హృదయ క్షేత్ర శుద్ధి జరిగినప్పుడు, ఈ ద్వంద్వాలచే, అంటే కర్మలచే/వాసనలచే/సంస్కారాలచే అంటకుండా మానవుడు ఈ ప్రపంచంలో జీవించగలుగుతాడు. దానర్థం, కర్మలు చేయకుండా ఉండమని కాదు; కర్మలను ధ్యాన స్థితిలో, దివ్యస్మరణలో చేస్తూ ఉన్నప్పుడు సంస్కారాల ప్రభావం మనపై ఉండదని అర్థం.
అలాగే ఈ హృదయక్షేత్ర శుద్ది జరుగుతున్నప్పుడు, మనిషి తన మమకారాలను-ఆసక్తులను, భగవంతునికే తన సమస్త కర్మలను అర్పించి జీవించే పరిస్థితి ఏర్పడి, తామరాకు నీటిలో ఉంటూ కూడా తడి అంటకుండా ఎలా ఉంటుందో, అదే విధంగా, సాధకుడు కూడా ఈ ప్రపంచంలోని మాయ తనను అంటకుండా మనుగడను సాధించగలుగుతాడు. అంటే, ప్రపంచంలో తానుంటాడు గాని, తనలో ప్రపంచం ఉండదన్నమాట.
మమకారం, ఆసక్తులు రెండింటినీ త్యజించాలి ఎంత సక్షిప్తంగా చెప్పారు. ఇవి ఆచరణలో పెడితే చాలు జీవితం ధనయం కావడానికి.
రిప్లయితొలగించండి