20, డిసెంబర్ 2023, బుధవారం

గీతా ధ్యానం - విజయానికి తారకమంత్రం

 


గీతా ధ్యానం - విజయానికి తారకమంత్రం 
(Success Mantra)
గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు, విజయానికి తారక మంత్రం ఈ క్రింది శ్లోకాల్లో సూచించడం జరిగింది. శ్రావణ, మనన, నిధిధ్యాసన చేసే ప్రయత్నం చేద్దాం:

యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః |

తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ ||18-78 ||


ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడుధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ సంపదఐశ్వర్యంవిజయందృఢమైన నీతి ఉంటాయని నా ఆభిప్రాయం.



సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ |

అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః || 18-66 ||


అన్ని రకాల ధర్మాలనూ విడిచిపెట్టి, కేవలం నన్నే శరణు వేడు; నీ యొక్క సర్వపాపాలనుండీ  నేను మోక్షాన్ని ప్రసాదిస్తాను.


పై రెండు శ్లోకాల్లో శ్రీ కృష్ణ భగవానుడు మనం చేసే యే ప్రయత్నంలోనైనా విజయం సాధించాలంటే మనం అవలంబించవలసిన మార్గాలను సూచించడం జరిగింది. మానవ ప్రయత్నము, శరణాగతి, భగవంతుని కృప - ఈ  మూడు మనం సాధన ద్వారా అలవరచుకున్నట్లయితే విజయానికి చేరువవుతాము. 


మొదటి శ్లోకంలో, ఆర్జనుడు మానవ ప్రయత్నానికి ప్రతీక, శ్రీకృష్ణ భగవానుడు భగవత్కృపకు ప్రతీక. ఎక్కడ ఈ రెండూ ఉంటాయో అక్కడ విజయం తథ్యం అని అర్థం. రెండూ అవసరం; కేవలం ప్రయత్నం ఉన్నా ప్రయోజనం లేదు; కేవలం భగవత్కృప ఉన్నా సరిపడదు; రెండూ అవసరమే. అందుకే మన జీవితాన్ని భగవత్కృపను ఆకర్షించే విధంగా మలచుకోవడం అవసరం; ఇది సరైన వైఖరులతో కూడిన, హృదయపూర్వకమైన నిష్ఠతో చేసే ఆధ్యాత్మిక సాధన ద్వారా సుసాధ్యమవుతుంది. ధ్యానం వల్ల మనసు క్రమశిక్షణలో పెట్టగలుగుతాం; మనసునే దాటి అతీతంగా ఉన్న ఉన్నత స్థితులకు వెళ్ళగలుగుతాం; హృదయం విశాలమై చైతన్య వికాసం జరగటాన్ని అనుభూతి చెందుతాం; శుద్ధీకరణ ప్రక్రియ వల్ల గతం నుండి విడుదలవుతాం; ధ్యానలోలోతుల్లోకి తేలికగా వెళ్ళగలుగుతాం; ప్రార్థన ద్వారా ఉన్నదున్నట్లుగా ఉండటం, వినమ్రత పెరగడం, అహంకారం తగ్గడం, స్వార్థం తగ్గడం, కోరికలు తగ్గడం, అప్రయత్నంగా శరణాగతి భావం అలవడటం జరుగుతాయి; ఉదయం నుండి సాయంత్రం వరకూ మన దశనియమాలను అనుసరిస్తూ జీవించడం ప్రయత్నించినప్పుడు, మన హృదయం దైవ కృపను అత్యధికంగా ఆకర్షించడం జరుగుతుంది. అటువంటి స్థితిలో చేసే ప్రయత్నాలు తప్పక సిద్ధిస్తాయి. 


పైన చెప్పిన రెండవ శ్లోకంలో సమస్త శాస్త్రాల మర్మాలు, వివిధ ధర్మాలు, వాటిల్లోని సూక్ష్మాలు ఇవన్నీ అర్థం చేసుకోనవసరం లేదు, అవన్నీ విడిచిపెట్టేసి, కేవలం అంతర్యామిగా ఉన్న ఆ పరమాత్మను శరణు వేడితే చాలు, సమర్పణ భావంతో ఉంటే చాలు, ఆ పరమాత్మే మనలోని సమస్త దోషాల నుండి విముక్తినివ్వడం జరుగుతుందని ఈ శ్లోకం చెబుతున్నది. 


ఇలా శ్రీకృష్ణ భగవానుడు ప్రతీ శ్లోకంలోనూ కర్తవ్యబోధను చేస్తున్నారు. 

కృష్ణ వందే జగద్గురుం.




2 కామెంట్‌లు:

  1. చక్కగా విశ్లేసించారు. మనం ఇక్కడ కృష్ణుడిని అప్పటి అర్జునుని గురువుగా తీసుకుని అన్వయించుకుంటే, సమకాలీనులైన, సమర్థులైన సద్గురువు మరి ఆయనను అనుసరించే మనిషి లేదా శిష్యుడు లేదా భక్తుని గా తీసుకుంటే ఇప్పటికి వర్తిస్తుంది. మనిషికి తన స్వయం కృషి తో పాటు, సద్గురువు అంటే ఆయన ఎల్లప్పుడూ ఆ పరతత్వంతో సందానమై లయామయిన వ్యక్తీ లభించి అయన అండదండలు మన తోడుగా ఉందడమే క్రుప.

    రిప్లయితొలగించండి
  2. మనిషికి తన గురువే సర్వమూ... దైవం కూడా ఆయనే మరి !

    రిప్లయితొలగించండి

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...