యువావస్థ ఆదర్శంగా జీవించాలన్న ఆకాంక్షలతో నిండిన సమయం
మొదటి 15 సంవత్సరాలు మనసు అమాయకంగా ఉండే కాలం. ఇంకా స్వాతంత్ర్య భావాలు రాణి కాలం. చుట్టూ ఉన్నవారు ఏమి చెబితే అది చేసే కాలం, ఏది నచ్చితే అది చేసే కాలం, లేక పెద్దలు చెప్పినదే చేసే కాలం.
యువావస్థ అంటే ఇంచుమించు 15 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండే కాలం. మెల్ల మెల్లగా స్వతత్ర భావాలు మొదలవుతాయి. నెమ్మదిగా ఆదర్శాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆరోగ్యం చక్కటి స్థితిలో ఉండే కాలం. శారీరకంగా మార్పులు సంభవించే కాలం. ఆదర్శాలతో, ఆశయాలతోనూ జీవించాలన్న సంకల్పాలు ప్రబలంగా ఉండే కాలం. అయితే దేశాకాల పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, చుట్టూ ఉన్న వాతావరణం అనుకూలంగా లేనప్పుడు ఈ ఆదర్శాలను నిలబెట్టుకోలేక వాటికి దూరమయ్యే సమయం కూడా ఇదే. వృద్ధాప్యానికి, బాల్యానికి మధ్య ఉన్న కాలం ఈ యువావస్థ; చాలా కీలకమైన సమయం. దీన్ని సక్రమంగా వినియోగించుకోవడంలోనే విజ్ఞత ఉన్నది. యువకులు ఈ సత్యాన్ని గుర్తించే విధంగా పిల్లలకు అటువంటి వాతావరణం ఏర్పరచే బాధ్యత తల్లిదండ్రులపైన, చుట్టూ ఉండే పెద్దలపైన ఉన్నది.
మనిషి ఎప్పుడూ యువావస్థలో ఉండాలంటే మనసులో ఎట్టి పరిస్థితులలోనూ తన ఆదర్శాలను, ఆశయాలను వీడకూడదు అనేవారు పూజ్య చారీజీ. అవి జరిగినా జరుగకపోయినా. మనసు ఎప్పుడూ వయసులోనే ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. మనసును ఎప్పుడూ తాజాగా, ఆశావహంగా, ఆరోగ్యంగా ఉంచేవి వీటికి సంబంధించిన ఆలోచనలే, చేతలే. ఎప్పటికైనా మన జీవితాన్ని సవరించి తీరతాయి. జీవితం తప్పక సార్థకమవుతుంది. ఇటువంటి మానసిక స్థితే మహాపురుషులను, అసలైన మార్గదర్శిని ఆకర్షిస్తుంది. మార్గనిర్దేశనం కనిపిస్తుంది, దిశానిర్దేశం జరుగుతుంది, చివరికి ఆదర్శవంతమైన మార్గదర్శి మన జీవితాన్ని నడిపించే విధంగా, అడుగడుగునా మార్గదర్శనం చేస్తూ, వెన్నంటే ఉంటూ సంరక్షించే మహాపురుషుడు తటస్తమవడం జరుగుతుంది. ఇది జీవితంలో ఎంత త్వరగా జరిగితే అంత త్వరగా జీవితం సరైన త్రోవలో పయనిస్తుంది.
అసలైన మార్గదర్శి ప్రతీ హృదయంలో నిక్షిప్తమై ఉన్నాడు అని తెలుసుకునే వరకూ బాహ్యంగా మార్గదర్శనం చేసే వ్యక్తి అవసరం. ఆ వ్యక్తి డబ్బు మనిషి కాకూడదు, మార్గదర్శనం చేసినందుకు రుసుములు తీసుకోకూడదు, అటువంటి వ్యక్తి సన్నిధిలో ప్రశాంతటాను అనుభవించగలగాలి. సరైన మార్గదర్శి అనడానికి ఇవే సాంకేటాలని పూజ్య దాజీ సెలవిచ్చారు.
ఆదర్శ యువకుడు అనగానే మనందరికీ వెంటనే స్ఫురించేది మన యువ కిశోరం స్వామి వివేకానంద. ఆయన చిత్రం స్ఫురణలోకి రాగానే ఇలా ఉండాలనిపిస్తుంది ప్రతీ యువకుడికి. అలా ఉండాలంటే జీవితానికి ధ్యానం పునాది కావాలన్నారు స్వామీజీ. నిజానికి విద్యాభ్యాసానికి పూర్వమే ధ్యానం అవసరం అన్నారు. ధ్యానం వల్ల ఏకాగ్రత సంభవించడం వల్ల అనవసరంగా మాన్సులేని విషయాలపై గాక ఆసక్తిగల విషయాలపై దృష్టిని కేంద్రీకరించి ఆయా విషయాల్లో నిష్ణాతులయ్యే అవకాశం ఉంటుందనేవారు. లేకపోతే బలవంతంగా మనసు లేకపోయినా విషయాలను చదవడం వల్ల, సమయం వ్యర్థమవడమే గాక, నిరాశ, నిస్పృహ వంటి నకారాత్మక లక్షణాలు మనిషిలో చోటు చేసుకుని జీవితాన్ని పాడు చేసే అవకాశం కూడా ఉంటుంది.
ఇటువంటి చక్కటి ఆశయాలతోనూ, ఆదర్శాలతో నిండి ఉండవలసిన యువత ఎ కారణం చేతనైతేనేమి పెడత్రోవను పట్టడం విచారకరం - మొదట తల్లిదండ్రులకు, తరువాత కుటుంబానికి, ఆ తరువాత విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, ఆ తరువాత సమాజానికి వేదనను కలిగించే విషయం. ఈ పరిస్థితికి అనేక ప్రబలమైన కారణాలుండవచ్చునేమో గాని, ఒక ముఖ్యమైన కారణం ఆదర్శవంతమైన వ్యక్తులు సమాజంలో కరువైపోవడం, విలువలతో సంబంధం లేని విద్యాభ్యాసం, పెడత్రోవను పట్టించే అనేక చెడు మార్గాలు.
తల్లిదండ్రులుగా, పెద్దలుగా, మన వంతు కృషి మనం చేయడం ఎట్టి పరిస్థితులలోనూ చాలా అవసరం. మనం చేయలేనప్పుడు పూజ్య దాజీ వంటి మహాత్ములు ఈ పనిని చేపట్టినప్పుడు మన వంతు తోడ్పాటునందించవలసిన అవసరం ఉంది; అదే మనం మన తరువాతి తరానికి అందించగల చేయూత. సంపూర్ణ ప్రయత్నం చేద్దాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి