(గీతా ధ్యాన శ్లోకం )
గీతా ధ్యానం - ధ్యానశ్లోకాలు
ఈ గీతా ధ్యానం అనే భగవద్గీత శ్లోకవాహినిలో మనం కొన్ని ప్రధాన శ్లోకాల భావాన్ని, తత్త్వాన్ని అర్థం చేసుకుని, మననం చేసుకుని, ఆపై మనకర్థమైన భావంపై ధ్యానించే ప్రయత్నం చేద్దాం.
ముందుగా గీతాచార్యుడైన ఆ శ్రీకృష్ణ భగవానుని, గ్రంథకర్తయైన వ్యాసభగవానుని, స్మరిస్తూ గీతా ధ్యాన శ్లోకాలను కొన్నిటిని మననం చేద్దాం.
గీతా ధ్యాన శ్లోకం 1
పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం |
వ్యాసేన గ్రధితాం పురాణ మునినాం మధ్యే మహాభారతం|
అద్వైతామృత వర్షిణీమ్ భగవతీం అష్టాదశాధ్యాయినీమ్|
అంబ త్వామనుసంధధామి భగవద్గీతే భవద్వేషిణీమ్. ||
వ్యాస భగవానుడిచే రచింపబడిన మహాభారత ఇతిహాస, మధ్యలో, నారాయణుడే స్వయంగా, శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా అర్జునుడికి ఉపదేశించినదే భగవద్గీత. అద్వైతామృత వర్షాన్ని కురిపించే దివ్య మాతా, పద్దెనిమిది అధ్యాయాలకు తల్లీ, భగవద్గీతా, సంసారంలోని మాయను నాశనం చేసే గీతామాతా, నేను నీపై ధ్యానిస్తున్నాను.
గీతా ధ్యాన శ్లోకం 2
నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయతపత్ర నేత్ర |
యేన త్వయా భారత తైల పూర్ణ ప్రజ్జ్వాలితో జ్ఞానమయ ప్రదీపః||
విశాల బుద్ధి గల, తామర రేకుల వంటి కనులుగలిగిన వ వ్యాస మహర్షీ, నీకు నమస్సులు. నీ ద్వారా భారతం అనే తైలంతో గీత అనే జ్ఞానం అనే దీపం ప్రజ్వలితం అయ్యింది.
గీతా ధ్యాన శ్లోకం 3
సర్వోపనిషదో గావః దోగ్ధాః గోపాల నందనః |
పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్ ||
ఉపనిషత్తులన్నీ గోవులైతే, పాలు పితికేవాడు గోపాలనందనుడైతే, పార్థుడు ఆవు దూడయితే గోక్షీరమనే గీతామృతాన్ని శుద్ధ మనస్కులు ఆస్వాదిస్తున్నారు.
అవును కదా ! అద్భుతం
రిప్లయితొలగించండి