13, డిసెంబర్ 2023, బుధవారం

గీతా జయంతి - శ్రీమద్భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడి ముఖము నుండి వెలువడిన రోజు

 


గీతా జయంతి 
(శ్రీమద్భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడి ముఖము నుండి వెలువడిన రోజు)
సుమారు 5000 సంవత్సరాలకు పూర్వం, ద్వాపరాయుగాంత సమయంలో,  పాండవులకు, కౌరవులకు మధ్య భీకర సంగ్రామ ప్రారంభించక ముందు, కురుక్షేత్ర యుద్ధభూమిలో, ఇరుసైన్యములు యుద్ధానికి సన్నద్ధులైన ఉన్న సమయంలో, ఆర్జనుడు విషాదంలో మునిగిపోయి, విరక్తితో కూడిన మనసుతో అధైర్యమునకు లోనై యుద్ధం విరమించుకుందామనుకున్న క్షణాన, శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని యుద్ధానికి ఉపక్రమించేలా చేయడానికి, కర్తవ్య బోధను చేసిన అద్భుత క్షణం ఈ క్షణం. ఈ క్షణాన్నే, శ్రీకృష్ణ భగవానుని నోటి ద్వారా గీతామృతం పెల్లుబికిన రోజు; ప్రతి సంవత్సరమూ, మార్గశిర మాస శుద్ధ ఏకాదశి నాడు భారతదేశమంతా, ఇప్పుడు ప్రపంచమంతా, అన్నీ దేశాలలోనూ ఉన్న గీతా ప్రేమికులందరూ గీతా జయంతిగా, ఈ రోజున, గీతను, గీతాచార్యుడిని ప్రత్యేకంగా స్మరిస్తూ  ఒక ఉత్సవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం గీతాజయంతిని డిశంబరు 22, 2023 న జరుపుకోబోతున్నాం. 
ఆర్జనుడి మనసులో  అలముకున్న అంధకారాన్ని తొలగించి, యుద్ధానికి ఉపక్రమించేలా ఉత్తిష్ఠుడిని  చేయడానికి ఈ బోధను చేయవలసి వచ్చింది. అదే ఈనాడు ఒక దిక్సూచిగా  మానవాళికి మార్గదర్శనం చేస్తూ ఉన్నది. ప్రతీ మానవుడు జీవితం అనే కురుక్షేత్రంలో ఇరుక్కుపోయి, మంచి-చెడుల మధ్య నలిగిపోతూ, చిత్తభ్రమలకు, భ్రాంతులకు లోనవుతూ, సరైన నిర్ణయాలు తీసుకోలేక సతమతమవుతూ, మనశ్శాంతి లేకుండా, అల్లకల్లోలంగా మారిన మనసుతో, నిరాశ-నిస్పృహలతో జీవన గమనాన్ని సక్రమంగా సాగించలేని స్థితిలో మనిషిని ఆదుకునేది ఈ గీతబోధ. 
ఇటువంటి భగవద్గీతా జయంతి ఎవరికి వారు తమకు తోచిన విధంగా ఈ రోజున శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత కృతజ్ఞతా భావంతో, భక్తితో, ప్రేమతో, సమర్పణ భావంతో, ఈ గీతాధ్యయనం చేసి గీతా సారాన్ని, గీతా హృదయాన్ని దర్శించడమే గాక, మన మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయి, అడుగడుగునా మార్గదర్శనం చేసే విధంగా,  ప్రయత్నలోపం లేకుండా తగిన కృషి చేయవలసిన అవసరం ఎప్పుడూ ఉంటుంది. గీతా దర్శనం వల్ల జీవిత పరమార్థం, కర్తవ్య బోధ, వివేకము, నిజమైన జ్ఞానము, ఆత్మనివేదనా భావము, కృతజ్ఞత వంటి అద్భుతమైన లక్షణాలు నిస్స్వార్థ బుద్ధితో కేవలం ఇతరుల కోసమే జీవించేటువంటి కళ మనలో అలవడే అవకాశం ఉంటుంది. 
శ్రీమద్భగవద్గీత, శ్రీ కృష్ణ ద్వైపాయన వేదవ్యాస మహర్షి విరచిత 18 పర్వాలతో కూడిన మహాభారత ఇతిహాసంలో, భీష్మ పర్వంలో 18, అధ్యాయాల్లో, 700 శ్లోకాలతో దర్శనమిస్తుంది. ఈ యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూసినవారు ముగ్గురే ముగ్గురు - శ్రీ వేదవ్యాస మహర్షి, సంజయుడు, బర్బరీకుడు. యుద్దానికి సన్నద్ధమైన క్షణంలో శ్రీకృష్ణుడు 700 శ్లోకాలు ఎలా చెప్పాడా అని అందరికీ సందేహం కలుగుతుంది. దానికి రానున్న వ్యాసాలలో పూజ్య దాజీ ఇచ్చిన సమాధానాలను ఏకాగ్రతతో, భక్తితో, తపనతో అధ్యయనం చేయగలరు. 
గీతాజయంతి  రోజున చాలా మంది రకరకాలుగా గీతా జయంతిని జరుపుకుంటూ ఉంటారు. సాధారణంగా అందరూ భగవద్గీత పారాయణం చేస్తూ ఉంటారు. పారాయణకు దాని ప్రభావం దానికి ఉన్నప్పటికీ, దాని కంటే కూడా ఒక గురువు ఆశ్రయంలో వారు చెప్పిన ఆదేశాన్ని అనుసరిస్తే మరింత ప్రభావపూరితంగా ఉంటుంది. 
ఈ సందర్భంగా, హార్ట్ఫుల్నెస్ ఆధ్యాత్మిక మార్గదర్శి యైన పూజ్య దాజీ వెల్లడించిన గీతా హృదయాన్ని సంస్మరిస్తూ, ధ్యానిస్తూ, ఆ సారాన్ని మన హృదయం నిండా నింపుకునే ప్రయత్నం చేద్దాం. రానున్న కొన్ని వ్యాసాలు దీనికి సంబంధించినవై ఉంటాయి. 

 


1 కామెంట్‌:

  1. ఇంకా ఎప్పుడు ఎప్పుడా అని నిరీక్షణ లో ఉన్నాను కృష్ణారావు గారు. శ్రీ కృష్ణుడు చాలా అతిగా ఎంతోమంది ద్వారా వర్ణించబడి ఉన్నారు, అయినా గాని ఆయనను గురువుగా కన్నా దేవతా వతారం గానే చెప్పుకోవడం జరిగింది. మీరు చక్కగా చెప్పినట్లు ఒక సమకాలీనులైన సమర్థులు, అయిన సద్గురువు ఆశ్రయం లో ఆయన అందించే గుళికలు మింగినప్పుడే దాని ఫలితం పొందగలం. మీ రాబోయే ప్రచురణల కోసం ఉత్సాహంగా వేచి ఉంటాను. ఇదివరకు మీరు ప్రచురించిన గీత విషయాలు ఎంతగానో జ్ఞానోదోయం కలిగించాయి....

    రిప్లయితొలగించండి

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...