గీతా ధ్యానం - స్వధర్మం
భగవద్గీతలోని అనేక అద్భుత అంశాలలో మనిషి జీవితానికి ఉపయోగపడే అనేక అంశాలలో స్వధర్మం ఒకటి. శ్రీకృష్ణ భగవానుడు పలికిన ఈ పదాన్ని భాష్యకారులు అనేక విధాలుగా వివరించడం జరిగింది. కానీ బహుశా ఒక సజీవ మార్గదర్శనం ద్వారా మాత్రమే సరిగ్గా బోధపడే అవకాశం ఉందనిపిస్తున్నది.
ఈ మధ్యనే పూజ్య బాబూజీ, పూజ్య దాజీకి వెల్లడించిన 7 శ్లోకాల్లో ఇది 7 వ శ్లోకం. మహాభారత యుద్ధం ఇంకా ప్రారంభించక ముందు ఆర్జనుడు విషాదంలో మునిగిపోయి ఉన్నప్పుడు శ్రీ కృష్ణ భగవానుడు కేవలం 7 శ్లోకాలు పలకడం ద్వారా మాత్రమే ఆర్జనుడిని ఉత్తిష్ఠుడిని చేశాడని, తక్కిన శ్లోకాల సారాంశాన్ని ప్రాణాహుతి ద్వారా ప్రసరించడం జరిగిందని, ఆ సారాన్ని తక్కిన శ్లోకాల్లో వేదవ్యాస మహర్షి అందులోని అంశాలను తగిన విధంగా తర్జుమా చేయడం జరిగిందని బాబూజీ వెల్లడించడం జరిగిందని పూజ్య దాజీ చెప్పడం జరిగింది. ఈ ముఖ్యమైన 7 శ్లోకాల్లో స్వధర్మాన్ని గురించి ఒక శ్లోకం ఉండటం, దీనికున్న ప్రాధాన్యతను సూచిస్తున్నది. ఈ శ్లోకం ఈ క్రింది విధంగా ఉంది:
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాస్త్వనుష్ఠితాత్ |
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావయః ||3:35||
పరధర్మాన్ని ఎంత బాగా నిర్వతిమచ్చినప్పటికీ గుణము లేనిదైనా స్వధర్మమే మేలు; పరాధర్మాన్ని నిర్వహించడం కంటే స్వధర్మం ఆచరిస్తూ మృత్యువు సంభవించినా మంచిదే.
అసలు స్వధర్మం అంటే ఏమిటి?
పూజ్య చారీజీని అసలు స్వధర్మం అంటే ఏమిటని అడిగినప్పుడు, వికాసం అని సమాధానమిచ్చారు. ప్రతీ ఆత్మ యొక్క స్వధర్మం నిజానికి వికాసమేనన్నారు. ప్రతీ ఆత్మ వికాసం కోసమే తపిస్తున్నది. ఆ పనిలో ఉండటమే ఆత్మ యొక్క నిజమైన స్వధర్మం.
ఆత్మ స్థాయి నుండి క్రిందకి వస్తే, తన సంస్కారాలను బట్టి, వివిధ పరిస్థితుల్లో, వివిధ వాతావరణాల్లో ఆత్మ జన్మించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆత్మ తన వికాసానికి అనువైన వాతావరణాన్ని, పరిస్థితులను, తనకు అనుకూలమైన తల్లి గర్భాన్ని కూడా తానే ఎన్నుకుందన్నమాట. తాను ఎన్నుకున్న ధర్మమే భూమ్మీదఉన్నంత వరకూ ఆత్మ తన వికాసానికి వినియోగించవలసిన స్వధర్మం. దానిని అనుసరించే మనుగడను సాగించవలసి ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి మార్గం ప్రత్యేకమైనది. సామూహికంగా అనుసరించే మార్గం ఒక్కటే అయినప్పటికీ, ప్రతి ఒక్కరి మార్గం చాలా ప్రత్యేకమైనది. ఎవరికి వారు, గురుదేవుల సహకారంతో అనుసరించవలసినది.
మన స్వధర్మం ఏమిటో ఎలా తెలుస్తుంది?
సర్వమూ మన హృదయానికి తెలుసు. అందుకే ప్రతి ఒక్కరూ అంతర్ముఖులై ప్రశ్నించుకోవలసిన అవసరం. హృదయం నుండి ఈ విషయమై కలిగిన ప్రేరణలే మన స్వధర్మాన్ని తెలియజేస్తాయి. ఇది స్పష్టంగా తెలియడానికే ధ్యానం ప్రతి ఒక్కరికీ అవసరం.
మనకర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఆత్మ వికాసాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరి పని వాళ్ళు చేసుకోవడమే స్వధర్మం. ఇతరుల ధర్మంతో పోల్చుకోవడం వల్ల అనార్థాలే జరుగుతాయి.
-
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి