18, నవంబర్ 2021, గురువారం

గీతాహృదయం 1 - పరిచయం

భగవద్గీత పరిచయం

భగవద్గీత  పరిచయం చేసే  గ్రంథం  కాదు.  కాని  ఎన్నిసార్లు  చదివినా  నిత్యనూతనంగా  ఉండేటువంటి,  ఎప్పుడూ  తాజాగా  కొత్తగా  కనిపించే  గ్రంథం. నిత్యం  మరిన్ని  మరిన్ని  సూక్ష్మాలు  తెలుసుకోగలిగేటువంటి  గ్రంథం.  5000 సంవత్సరాలుగా  ఎందరి  జీవితాలకో  దిక్సూచిగా  ఉన్న గ్రంథం;  జీవిత  మార్గదర్శిని; సక్రమమైన  దారిలో  నడిపించిన  గ్రంథం. 

లక్ష శ్లోకాల మాహాభారతంలోని  6వ  పర్వమైన  భీష్మ  పర్వంలో ఉన్న  18  అధ్యాయాలతో  700 శ్లోకాలతో  కూడుకున్న ఉద్గ్రంథం  భగవద్గీత. ఒక  గొప్ప  యోగశాస్త్రం. శ్రీకృష్ణార్జునుల  మధ్య  జరిగిన  సంవాదం. పాండవులు 7 అక్షౌహిణీల సైన్యం; కౌరవులు 11  అక్షౌహిణీల  సైన్యం.

కురుక్షేత్ర  రణరంగంలో యుద్ధానికి  సన్నద్ధమైన ఇరుసైన్యాల  మధ్య నిలబడిన అర్జునుడు  తన  బంధువులను, హితులను  జూచి,  తాను  ధర్మపక్షాన యుద్ధం చెయ్యడానికి  వచ్చానన్న వాస్తవాన్ని  మరచి యుద్ధాన్ని  వ్యక్తిగత  దృష్టితో  చూడటం  వల్ల  కలిగిన మోహం వల్ల  అతనిలో,  ఆ  విజయునిలో, ఆ సవ్యసాచిలో, ఎన్నో  యుద్ధాలు  అంతకు  పూర్వం  గెలిచిన పార్థునిలో, స్వధర్మాన్ని   మరచిన  ఆ  పరాక్రమవంతునిలో విషాదం  అలుముకుంటుంది. దీన్నే  మనం  ఆధునిక  భాషలో  డిప్రెషన్  అంటాం.  ఈ డిప్రెషన్ లోనుండి,  ఈ  విషాదంలో  నుండి  తన స్వధర్మాన్ని  గుర్తు  చేస్తూ వెలికి  తీసిన  క్రమంలో  అర్జునుడికి  అనేక రకాల  బోధలు  చేసిన సన్నివేశం  భగవద్గీత. 

ఈ  గ్రంథంలోని  18  అధ్యాయాల పేర్లలో  చివరి  పదం  యోగంగా  కనిపిస్తుంది. అవి ఇలా  ఉన్నాయి:

1) అర్జున విషాద యోగం - 46 శ్లోకాలు

2) సాంఖ్య  యోగం - 72 శ్లోకాలు

3) కర్మ యోగం  - 43 శ్లోకాలు

4) జ్ఞాన యోగం - 42 శ్లోకాలు

5) కర్మసన్న్యాస యోగం - 29 శ్లోకాలు

6) ధ్యానయోగం - 47 శ్లోకాలు

7) జ్ఞానవిజ్ఞాన యోగం - 30 శ్లోకాలు

8) అక్షరపరబ్రహ్మ యోగం - 28 శ్లోకాలు

9) రాజవిద్య రాజగుహ్య యోగం - 34 శ్లోకాలు

10) విభూతి యోగం - 41 శ్లోకాలు

11) విశ్వరూప సందర్శన యోగం - 55 శ్లోకాలు

12) భక్తి యోగం - 20 శ్లోకాలు

13) క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - 35 శ్లోకాలు

14) గుణత్రయ విభాగ యోగం - 27 శ్లోకాలు

15) పురుషోత్తమ యోగం - 20 శ్లోకాలు

16) దైవాసుర సంపద్విభాగ యోగం - 24 శ్లోకాలు

17) శ్రద్ధాత్రయ విభాగ యోగం - 28 శ్లోకాలు

18)  మోక్ష సన్న్యాస  యోగం - 78 శ్లోకాలు

ఈ  క్రమంలో  శ్రీకృష్ణార్జునుల  మధ్య  సంవాదాన్ని  ప్రత్యక్షంగా  తిలకించిన సంజయుడు,  వ్యాసుల  వల్ల  మనకు  ఈ  సంవాదం  మనందరికీ   అందుబాటులోకి  వచ్చింది. వ్యాస  మహర్షి  ఈ  సంవాదాన్ని  700  శ్లోకాలుగా  వ్యాఖ్యానించారు.  ప్రతీ శ్లోకమూ  అతి  ముఖ్యమైనదే.  యావత్  భగవద్గీత  అంతా  కూడా  పూర్తిగా, సమగ్రంగా అధ్యయనం చెయ్యవలసిన  గ్రంథమే. ఆధ్యాత్మిక  జిజ్ఞాసువులందరూ  తమ జీవితకాలంలో  ఒక్కసారైనా చదువవలసిన  గ్రంథం. 

కాని పూజ్య  బాబూజీ  ప్రకారం (హార్ట్ఫుల్నెస్ వ్యవస్థాపక  అధ్యక్షులైన మహనీయుడు) ఇరుసైన్యాలు  యుద్ధానికి  సన్నద్ధంగా  ఉన్న తరుణంలో  700  శ్లోకాలు  చెప్పే అవకాశం  లేదని,  శ్రీకృష్ణ భగవానుడు  తాను  చెప్పదలచుకున్నదంతా  కేవలం  7 శ్లోకాల్లోనే  నిక్షిప్తం చేసి చెప్పాడని  వెల్లడించడం  జరిగింది.  భగవద్గీతలోని ఆ   ఏడు  శ్లోకాలు ఏమిటో  మన  గురుదేవులు  పూజ్య  దాజీ  ఈ  మధ్యనే  వెల్లడి  చేయడం  కూడా జరిగింది. . వీటిని  గురించి  తరువాయి  భాగంలో  పరిశీలిద్దాం. (సశేషం) 

మార్పు - పరివర్తన - సేవ (భాగం 11)


మార్పు - పరివర్తన - సేవ (భాగం 11)

 

5) సేవ

సేవ అనేది హృదయ లోలోతుల్లో  నుండి  పెల్లుబికేటువంటి భావం;  మనిషి తనను  గురించి గాక  ఇతరులను  గురించి  త్రికరణశుద్ధిగా  ఆలోచించే సందర్భం. ఈ  నిజమైన సేవాభావం మనిషిలో  భగవంతుని  పట్ల గాని,  గురువు  పట్ల  గాని  లేక  వ్యక్తిత్వాల  ప్రేరణల కారణంగా  మనసులో  కృతజ్ఞత  ఏర్పడటం  వల్ల  కలుగుతుంది. అటువంటి  సేవ  మనిషికి  నిజమైన  ఆఅనందాన్ని  కలిగిస్తుంది.  క్రమక్రమంగా  దీనికి  మించిన  ఆనందం  మరొకటి  లేదని  అర్థమవుతుంది.  సేవించడమే  జీవితపరమార్థమని  అనుభవంలో  తెలుస్తుంది.  అప్పుడు  స్వామి  వివేకానంద  చెప్పిన  అద్భుతమైన  వాక్కులు  మనసుకెక్కుతాయి: They only live who live for others, others are more dead than alive. అన్నాడు  ఆ  మహానుభావుడు. అంటే  ఇతరుల  కోసం  జీవించేవారే  నిజంగా  జీవిస్తున్నట్లు, తక్కినవారు జీవిస్తున్నారనడం  కంటే  మృతులతో  సమానమనే  చెప్పాలి. 

నిజమైన సేవ  ఏ  విధంగా  ఉండాలి? 

నిజమైన  సేవ  స్వార్థరహితమైనదై  ఉండాలి. ఎటువంటి  ప్రతిఫలమూ  ఆశించరానిదై  ఉండాలి -  ధనము  గాని, గుర్తింపు  గాని,  గౌరవం గాని, ప్రశంసలు  గాని ఇత్యాదివి ఏ  విధంగానూ  మన మనసులో  లేకుండా  అందించేదే  నిజమైన సేవ. 

హార్ట్ఫుల్నెస్  గురువుల  ప్రకారం,  ఆకలిగా  ఉన్నవారికి  భోజనం  పెట్టడం,  బట్టల్లేనివారికి  బట్టలివ్వడం,  దాహంగా  ఉన్నవారికి  నీరు ఇవ్వడం, డబ్బు  లేనివారికి  డబ్బివ్వడం,  బలహీనులకు  బలం  ఇవ్వడం,  విద్యలేనివారికి  విద్యనందించడం ఇటువంటివన్నీ  సేవ  క్రిందకు  రావని  చెప్తారు.  ఇవన్నీ  మన  తోటి  సోదరసోదరీమణులకు  చెయ్యవలసిన  ధర్మ,  కర్తవ్యం అంటారు.  

చాలా  మంది  పైన  విధంగా  సేవ  చేయడం  మానవ  సేవ  అనుకుంటారు. ఇటువంటి  మానవ సేవ  మాధవ సేవ అనుకుంటారు. భక్త పోతన చలనచిత్రంలో  ఎటువంటి  మానవ  సేవ  మాధవ సేవ అనేది  చక్కగా  ఒక  గేయరూపంలో  చెప్పడం  జరిగింది. ఒక చరణం  ఇలా  ఉంటుంది: ... భోగభాగ్యముల రోసి, ఆడంబరము  తెగత్రోసి, అహము మమత  త్యాగము  చేసి, తనువు  ధనము  హరిపరముగ   చేసే  మానవ  సేవ  మాధవ  సేవ... అని  ఉంటుంది  ఆ  చరణం. 

మానవ  జీవితం  ఆ  భగవంతుని  పట్ల  లేక  ఈ  జీవితపరమార్థాన్ని  తెలియజేసినటువంటి  గురువు పట్ల  కలిగిన కృతజ్ఞత యొక్క  అభివ్యక్తీకరణ  అయిపోవాలి; వారి  పట్ల క్రమక్రమంంగా  ఏరపడెటువంటి  సంపూర్ణ  శరణాగతి  యొక్క  అభివ్యక్తీకరణ  అవ్వాలి. 


17, నవంబర్ 2021, బుధవారం

మార్పు - పరివర్తన - స్వాధ్యాయం (భాగం 10)

మార్పు - పరివర్తన - స్వాధ్యాయం (భాగం 10)

 

4) స్వాధ్యాయం 

పతంజలి  యోగసూత్రాల  ప్రకారం, కైవల్యప్రాప్తి  కోసం అంటే పరమోత్కృష్ఠ  యోగస్థితి మానవుడు  సిద్ధింపజేసుకోవడం  కోసం, అష్టాంగ  యోగాన్ని  ప్రతిపాదిస్తాడు  మహర్షి - యమ, నియమ, ఆసన,  ప్రాణాయామ,  ప్రత్యాహార,  ధారణ,  ధ్యాన సమాధి అనే 8 అంగాలు. దీని ప్రకారం, నియమంలో  నాలుగు అంశాలున్నాయి: 1)  సంతోషము, 2) తపస్సు, 3) స్వాధ్యాయం 4) ఈశ్వర ప్రణిధానం.  ఇందులో  స్వాధ్యాయం సాధకుడు  అనుసరించవలసిన నియమాల్లో  మూడవ  నియమం  స్వాధ్యాయం. 

ప్రాచీన  సాంప్రదాయం  ప్రకారం స్వాధ్యాయం అంటే  స్వ+అధ్యయనం అంటే  తనను  తాను  తెలుసుకొనే  ప్రయత్నం, తనను తాను  అధ్య్యయనం  చేసుకొనే  ప్రయత్నం. దేహాత్మను,  పరమాత్మను  కూడా  తెలుసుకొనే  ప్రయత్నం చెయ్యడం. ఇందులో భాగంగా  శాస్త్రాలు  అధ్యయనం  చేస్తూంటారు.

హార్ట్ఫుల్నెస్  గురువులు  స్వాధ్యాయాన్ని  పరికించే  విధానం,  సూచనలు  ఈ  విధంగా  ఉన్నాయి: స్వాధ్యాయం అంటే  సంపూర్ణ  స్పృహతో  తనను  తాను  అధ్యయనం  చేసుకొనే  ప్రక్రియ.  వారి  ప్రకారం  స్వాధ్యాయం  అంటే  "నేను  తప్పనిసరిగా  చెయ్యవలసినది" అని అంటారు.  

ఆధ్యాత్మిక  సాధకులందరూ సమానంగా  కోరుకునే  లక్ష్యం ఆత్మ-పరివర్తన, స్వీయ పరివర్తన. ఇంచుమించు  ఆధ్యాత్మికపథాలన్నీ  కూడా  గురువు మీద  ఆధారపడటమే  మార్గంగా బోధిస్తూ  ఉంటాయి.  కాని  పరివర్తన అనేది మరొకరిపై  ఆధారపడినంతవరకూ  అది  అసాధ్యమే. "ఇది  నా  బాధ్యత"  అని  కర్తవ్యంగా  భావిస్తేనే  పరివర్తన  సాధ్యపడుతుంది.  భగవంతునిపై  భారం  పెట్టడం  కూడా  తప్పించుకోవడమే  అవుతుందంటారు  పూజ్య  దాజీ. 

అందుకే హార్ట్ఫుల్నెస్  సాధకులకు అంతరంగీకరణ (interiorization) చాలా  ముఖ్యం. సాధనలో  ముందుకు  సాగుతున్న కొద్దీ మనలను  మనం  పరికించి  చూసుకోవాలి;  ఆత్మవిమర్శ  చేసుకోవాలి; ధ్యానం  ద్వారా  అందించినదాన్ని  విలీనం  చేసుకోవాలి; విలీనాకి  అడ్డుపడేదాన్ని  విశ్లేషించుకోవాలి; అడ్డుపడుతున్న  లక్షణాలేమిటి  నాలో  అని  ప్రశ్నించుకోవాలి. ఆత్మవిమర్శ  ద్వారానే  మనకు  మనం  ప్రేరణ  కావాలి;  ఆత్మవిమర్శ  ద్వారానే  గుర్తించిన  మార్పులను  ఇష్టపూర్వకంగా  మనలో  కలిగేలా  చూసుకోవాలి. మనలను  మనం  అధ్యయనం  చేసుకోవడంలోని  సూక్ష్మాలను  గ్రహించగలగాలి.  ఎక్కడ  పొరపడుతున్నామో  మనమే  తెలుసుకోవాలి. మనం  ఎక్కడ  తప్పులు  చేస్తున్నామో  తెలియడానికి  గురువు  అవసరం  లేదు.  అదే  స్వాధ్యాయం. 

మనం  ఇలా  ఉండటానికి  కారణం  మనమేనని  మనం  గుర్తించాలి;  అంగీకరించాలి. మరోలా  తయారవ్వాలంటే  కూడా  మీరే  కారణం  కాగలరని  ఇది  ఋజువు  చేస్తోంది.  అలాగే  మనలను  మనం  మార్చుకోగలిగే  సామర్థ్యం  కూడా మనలోనే  ఉందనడానికి  ఇదే  ఋజువు.  మనిషి  జంతువుగా  మారగలుగుతున్నాడంటే,  జంతువు  కూడా  తిరిగి  మనిషి  కాగలదు.  కాబట్టి  మన  ఆధ్యాత్మిక  వికాసానికి  బాధ్యత  కేవలం  మనపైనే  ఉందని  గ్రహించాలి.  

సాధన  ద్వారా  మన  ఆలోచనలను,  చేతలను, అలవాట్లను,  ఉద్వేగాలను,  భావాలను, ప్రవర్తనను,  శీలాన్ని  మనం  ప్రత్యక్షంగా  చూడగలుగుతాం. మనలో  ఉండే  భయాలు,  చింతలు ఇంకా  ఇతర  నకారాత్మక  విషయాల  వల్ల మనలో  వత్తిడి  ఏర్పడుతుంది.  ఆ  వత్తిడి  మన  దవ్డల్లోనూ,  మెడలోనూ,  భుజాల్లోనూ,  నుదుటిపైన, వీపులోనూ,  మోకాళ్ళల్లోనూ,  ఉదరభాగంలోనూ,  ఛాతీలోనూ,  నడుంలోనూ  ఇలా  అనేక  చోట్ల  పేరుకుపోతూ  ఉంటుంది.  దీన్ని  మనం  గమనించడానికి  ప్రయత్నించాలి;  ఈ  వత్తిడికి  కారణం  ఏమిటో  పరిశీలించాలి; హార్ట్ఫుల్నెస్  రిలాక్సేషన్  పద్ధతి  ద్వారా ఈ  వత్తిడిని తొలగించుకొనే  ప్రయత్నం  చెయ్యాలి. ఆలోచనలే,  చేతలవుతాయి;  చేతలే  అలవాట్లవుతాయి;  అలవాట్లే  ప్రవర్తనగా  మారుతుంది;  ఇదే  శీలంగా  మారుతుందిమారుతుంది;  శీలాన్ని  గమనించి  స్వరించుకుంటే  మన  విధిగా  మారుతుంది. కాబట్టి  స్వాధ్యాయం అనేది  ప్రతీ  సాధకుడు  ప్రయత్నపూర్వకంగా  నిత్యమూ  ఆచరించవలసిన ప్రక్రియ అను  మనం  గుర్తుంచుకోవాలి.  



12, నవంబర్ 2021, శుక్రవారం

మార్పు - పరివర్తన - గురువు (భాగం 9)

మార్పు - పరివర్తన - గురువు (భాగం 9)

3) గురువు

గు అంటే  చీకటి లేక  అంధకారం; రు  అంటే  తొలగించి  జ్ఞానం  అనే వెలుగును   నింపేవాడు అని అర్థం. ఇక్కడ  చీకటి అంటే  అజ్ఞానం, అవిద్య అని చెప్తారు పెద్దలు.  ఈ  శరీర  వ్యవస్థలో అనేకం కనిపిస్తాయి - అవయవాలతో  కూడిన  శరీరమే  గాక, ఇందులో  పంచభూతాలు,  పంచ కర్మేంద్రియాలు, పంచ  జ్ఞానేంద్రియాలు, పంచకోశాలు,  పంచప్రాణాలు, మనసు, బుద్ధి, అహంకారం,  చిత్తము వీటన్నిటితో  తయారైనది  ఈ  శరీర  వ్యవస్థ. వీటన్నిటికీ  కదలికను,  ప్రాణాన్ని  ఇచ్చేది  ఆత్మ.  ఆత్మ  అనేది  వస్తువు  కాదు; ఒక ఉనికి. ఈ ఉనికి  వ్యక్తమవ్వాలంటే  ఈ  శరీరం అనే  వ్యవస్థ  అవసరం.  ఆత్మ  వ్యక్తమయ్యేందుకు  శరీరాన్ని  సాధనంగా  ఉపయోగిస్తుంది. ఈ  శరీర  వ్యవస్థ  ద్వారా ఈ  ఆత్మ  పట్టుపురుగులా  తన ప్రపంచాన్ని తానే  అల్లుకుంటూ (ఆ  కక్కూన్ లో) అందులో  తానే  ఇరుక్కుపోయింది.  ఆ  కక్కూనే  మనం  అనుకునే  కర్మ/వాసనలు/సంస్కారాలు/మలినాలు, సంక్లిష్టతలు. దీన్నే  అజ్ఞానం  లేక  అంధకారం  అని అంటాం.  వీటి  మూలానే  మనిషి  జన్మ, మృత్యు, జరా, వ్యాధులను అనుభవిస్తూ  ఉన్నాడు;  జనన-మరణ  వలయంలో  ఇరుక్కుని  ఉన్నాడు; ఈ  జ్ఞానం  లేక  మరింత  ఈ  సంస్కారాల  ఊబిలో  ఇరుక్కుపోతున్నాడు. నిజానికి  ప్రతీ  ఆత్మ  ఈ  బంధం  నుండి  విముక్తి  కావాలని  పరితపిస్తూ  ఉంది.  ఈ  ఊబిలో  నుండి బయటకు  లాగి  రక్షించేవాడే,  ఈ  అజ్ఞానం  తొలిగే  మార్గాన్ని  చూపించేవాడే  గురువు. ఆదిశంకరులవారు  చెప్పినట్లుగా  అటువంటి మహాపురుషుడు,  సమర్థుడైనటువంటి   గురువును  పొందడం  దుర్లభమే. 

అటువంటి  సమర్థుడైన  గురువును  వెదకడం ఎలా?

మన  పరిమితమైన  జ్ఞానంతో,  పరిమితమైన  అనుభవంతో,  పరిమితమైన తెలివితేటలతో అటువంటి  గురువును  వెదకలేము,  ఊహించలేము,  ఊహించినా అది  పరిమితమైనదే  అవుతుంది. కాబట్టి  అటువంటి  ప్రయత్నం  చేయడం  వ్యర్థమే  అవుతుంది.  మరేం  చెయ్యాలి? 

ఏ  విధంగానైతే  నేల విత్తనాన్ని వెతుక్కుంటూ  వెళ్ళదో అలాగే  జిజ్ఞాసువు, తపించేవాడు గురువును  వెతుక్కుంటూ  వెళ్ళనవసరం  లేదు. విత్తనమే  సారవంతమైన  నేలను  వెతుక్కుంటూ  వస్తుంది.  నేల  సారవంతంగా  ఉంటే  విత్తనమే  నేలను  వెతుక్కుంటూ  వస్తుంది. నేల  సారవంతంగా  ఉండేలా  చూసుకోవాలి  అన్నారు  స్వామి  వివేకానంద.  ఇక్కడ  నేల  అంటే హృదయం.  హృదయం  సారవంతంగా  ఉండేలా  చూసుకోవాలి.  హృదయం  సారవంతమయ్యేది  తపన  ద్వారా  మాత్రమే. అటువంటి  హృదయం  కోసం  గురువే  స్వయంగా  వెతుక్కుంంం  వస్తాడు. ఆ  విధంగా  గురువు  కోసం  లేక  మనిషి  అస్తిత్వానికి  సంబంధించిన  ప్రశ్నల  సమాధానాల  కోసం  పరితపించేవాడు ఓపికగా  వేచి  ఉంటాడు  గురువు  తటస్థమయ్యే  వరకూ. 

గురువు  తటస్థమైనప్పుడు  గుర్తించేదెలా?

అటువంటి  గురువు  గనుక  తటస్థమైనప్పుడు  హృదయం  వెంటనే  గుర్తిస్తుంది;    స్పందిస్తుంది; వెంటనే  అద్భుతమైన  సూచనలు  కలుగుతాయి.  వాటిని  సాధారణంగా  తప్పించుకోలేము;  నిర్లక్ష్యం  చెయ్యలేము. గుర్తించిన మరుక్షణమే  వారికి  దాసోహమవగలిగేవాళ్ళు  పరమ ధన్యులు. 

ఇతర  మార్గాలు

పైన  చెప్పిన  మార్గం  చాలా  సహజమైన  మార్గం.  హృదయాన్ని  వినగలిగేవాళ్లకు  ఇది  తేలిక. మనలో  అత్యధికమంది  హృదయాన్ని  గాక  బుద్ధిని  అనుసరించేవారే  ఎక్కువగా  ఉండేవారికి, హితులు,  శ్రేయోభిలాషులు, సూచించినవారిని  కొంతకాలం  అనుసరించి ప్రత్యక్షానుభవం ద్వారా  మీలో  మార్పులు  వస్తున్నాయో  లేదో  అన్నది  తెలుసుకున్న  తరువాత వారిని  తమ  గురువులుగా  స్వ్వెకరించవచ్చు. మహాత్ములు  సూచించిన  మరో  మార్గం:  అటువంటి  వ్యక్తుల  సమక్షంలో  కూర్చున్నంత  సేపూ  మనసు  ఆలోచనరహితంగా,  నిశ్చలంగా  అప్రయత్నంగా  మారిపోతుంది;  ఒక  అలౌకికమైన  ఆనందం  కలుగుతుంది; హృదయం  చాలా  తేలికగా  అయిపోతుంది.  ఇవి  మరికొన్ని  సంకేతాలు  సరైన  గురువు  సన్నిధికి  చేరుకున్నామనడానికి. మరొక  సూచన:  వారితో  సంభాషిస్తున్నప్పుడు  గాని  లేక  సాన్నిధ్యంలో  గాని  వారి  ఉనికి మన  అస్తిత్వాన్నే  కుదిపేసే  విధంగా  ఉంటే  వెంటనే  వారిని  మీ  గురువుగా  భావించండి,  మీ  అహంకారం  అడ్డు  వచ్చినా  కూడా. 

గురువు  సంప్రాప్తమైన  తరువాత  మనం  ఏం చెయ్యాలి?

అటువంటి  సమర్థ  గురువు  యొక్క ఆశ్రయం  దొరికిందన్న  దృఢమైన  విశ్వాసం  హృదయంలో  బలంగా  ఏర్పడిన  తరువాత మనలను  మనం  వారితో  ఇనుము  సంకేళ్ళతో  బంధించేసుకోవాలి. ఎప్పటికీ  విడదీయరాని  విధంగా  వారిని  కలవాలి. ఆ  క్షణం  నుండి  పరోక్షంగా  వారి  పట్ల  విధేయత  ప్రారంభమవ్వాలి.  వారు  చెప్పింది  చెయ్యడానికి  అన్ని  విధాలా  ప్రయత్నించాలి. జిజ్ఞాసతో  వేసిన  ప్రశ్నలకు  సమాధానాలు వెంటనే  రాకపోతే వేచి  ఉండాలి  కాని  వెంటనే  నిర్ధారణకు  రాకూడదు.ఖచ్చితంగా  అన్ని  ప్రశ్నలకూ  సమాధానాలొస్తాయి. క్రమం  తప్పక  వారు  నిర్దేశించిన  ధ్యాన  పద్ధతిని  అనుసరించాలి; వారు  నిర్దేశించిన  జీవన  విధానాన్ని  అవలంబించడానికి  ప్రయత్నించాలి. వారితో  అనుబంధం  దినదినప్రవర్ధమానమవ్వాలి. గురువుతో  అంటే  వారి  ఆధ్యాత్మిక  గురుతత్త్వంతో  తాదాత్మ్యం  పూర్తిగా  చేమ్దే  వరకూ  వారిని  అనుసరిస్తూనే  ఉండాలి.  వారిపై  ఆధారపడటం  రోజురోజుకూ  పెరుగుతూ  ఉండాలి. గురురేవ  పరబ్రహ్మ  అని  సాక్షాత్కరించుకున్న  తరువాత  కూడా  గురువును  వీడరాదు.  

గురువు  తన  శిష్యుడికి  ఏ  విధంగా  తోడ్పడతాడు?

గురువు  మన  ఆధ్యాత్మిక  యాత్రలో  ఒక  ఉత్ప్రేరకంలా  పని  చేస్తాడు. గురువు  లేనిదే  మన  ఆధ్యాత్మిక  యాత్ర  అసంభవం.  గురువు  శిష్యునికి  ఒక  రక్షణ కవచంగా  వ్యవహరిస్తాడు;  గురువు  ఒక  సజీవ  శాస్త్రం; శిష్యునిలో  ఉన్న  దైవత్వాన్ని  వెలికి తీస్తాడు; శీష్యుడి  యాత్ర  పూర్తయ్యే  వరకూ  వెన్నంటే  ఉంటూ  సమ్రక్సిస్తూ  ఉంటాడు; శాస్త్ర  జ్ఞానం  ఇస్తాడు,  అనుభూతులనిస్తాడు;  ప్రేమగా  మారుస్తాడు; పొరపాట్లు  చేసినప్పుడు  మందలిస్తాడు. సర్వకాల సర్వావస్థల్లోనూ మనకు  తెలిసినా  తెలియకపోయినా మన  యాత్రలో  చెయ్యి  పట్టుకొని  తోడుగా  ఉంటాడు. తల్లి, తండ్రి, గురువు, దైవంగా,  సాక్షాత్తు  పరబ్రహ్మగా  మారిపోతాడు. 

గురు  ఋణం  ఎప్పటికైనా  తీర్చుకోగలమా?

జన్మనిచ్చిన తల్లి  ఋణమైనా  తీర్చుకోగలమేమో  గాని అటువంటి  గురువు  యొక్క  ఋణం  ఏ  విధంగానూ  తీర్చుకోలేము. ఎన్ని  విరాళాలిచ్చినా, ఎంత  సేవ  చేసినా, ఎన్ని  జన్మలు  చేసినా  ఈ  ఋణం  తీరేది  కాదు.  మరేమి  చెయ్యగలం?  అది కూడా  మన  గురువులే  చెప్పడం  జరిగింది.  మనం  వారికి  ఇవ్వగల  గురుదక్షిణ మనం  మారడమే.  మనలో  కలిగే  పరివర్తనే  వారికి  అసలైన  గురుదక్షిణ.  సంపూర్ణంగా  వారిలా  మారగలిగితే  పూర్తిగా  ఋణం  తీర్చుకున్నట్లనుకోవచ్చు.  కాని  నిజానికి  గురువు  ఋణం  అప్పటికీ  తీరదు.  ప్రతీ తండ్రీ తన  కొడుకు  తన  కంటే  గొప్పగా  ఎదగాలని  కోరుకుంటాడు;  అలాగే  ప్రతీ  గురువు  తన శిష్యుడు  తనను  మించి  ఎదగాలని  మనస్ఫూర్తిగా  కోరుకుంటాడు. అలా  ఎదిగినప్పుడు  గురువు  మనసుకు  అసలైన  ఆనందాన్ని  కలుగజేసినవాడవుతాడు  శిష్యుడు. 

10, నవంబర్ 2021, బుధవారం

మార్పు - పరివర్తన - సాధన (భాగం 8)


మార్పు - పరివర్తన - సాధన (భాగం 8)

 2) సాధన

మనలను  మనం  నిష్ప క్షపాతంగా,  నిజాయితీగా పరికించి  చూసుకున్నప్పుడు,  ఆత్మావలోకనం  ద్వారా  ఉన్నదున్నట్లుగా  మన  ఆలోచనలను,  చేతలను,  భావాలను, ప్రవర్తనను, మన శీలాన్ని  చూసుకున్నప్పుడు  ఇవన్నీ  మెరుగుపడాలంటే  సాధన యొక్క  ప్రాముఖ్యతను,  అవసరాన్ని  గుర్తించడం  జరుగుతుంది. ఈ  సాధన  మనకు  ఏ  విధంగా  ఉపయోగపడుతుందో  క్లుప్తంగా  చూసే  ప్రయత్నం  చేద్దాం.  ముఖ్యంగా  హార్ట్ఫుల్నెస్  సహజమార్గ సాధనా పద్ధతి ఏ  విధంగా  నిత్యం  మనకు  తోడ్పాటునందిస్తుందో  పరిశీలిద్దాం.

హార్ట్ఫుల్నెస్  ధ్యాన  పద్ధతిలో  నాలుగు  ప్రధాన  యోగ  ప్రక్రియలున్నాయి  -  హార్ట్ఫుల్నెస్ రిలాక్సేషన్,  హార్ట్ఫుల్నెస్  ధ్యానం,  హార్ట్ఫుల్నెస్ శుద్ధీకరణ/నిర్మలీకరణ, హార్ట్ఫుల్నెస్  ప్రార్థన అనే  నాలుగు  ప్రధాన  యోగప్రక్రియలు.  ఈ యోగప్రక్రియలను ప్రతి  నిత్యం  అనుసరించడానికి  రోజులో  ఉన్న  24  గంటల్లో  కేవలం  ఒక గంట/గంటన్నర పడుతుందంతే. ఈ  మాత్రం  సమయం  మన  కోసం  మనం వెచ్చించినట్లయితే,  సాధన  ప్రారంభించిన  కొద్ది  రోజుల్లోనే  మనలో  సమూలమైన  మార్పులు  కలగడం  గమనించవచ్చు. ఈ  ప్రక్రియలు  మనం అనుకున్న  మన  ఆలోచనల్లోనూ,  భావాల్లోనూ,  ఉద్వేగాల్లోనూ, తద్వారా  మన  చేతల్లోనూ,  ప్రవర్తనలోనూ,  వెరసి  మన  శీలంలోనూ  సహజమైన  రీతిలో  మార్పులు  సంభవించడం  గమనించవచ్చు. 

మొదటిది హార్ట్ఫుల్నెస్  రిలాక్సేషన్: ధ్యానానికి  పూర్వం  శరీర  వ్యవస్థలోనూ  మనసులో  పేరుకున్న  వత్తిడిని  తొలగించౌకోవడం  చాలా  ప్రధానం.  ఇది  కేవలం  7-8 నిముషాల  యౌక  ప్రక్రియ. దీని  వల్ల మన  శరీరంలో  విధ  శరీర  అవయవాల్లో,  వివిధ  ప్రధాన  ప్రదేశాల్లో  పేరుకున్న వత్తిడిని  తేలికగా  తొలగించుకోవచ్చు. దానితో  మనసు  కూడా  కొంత  ప్రశాంతతను  సంతరించుకుని  ధ్యానానికి  సంసిద్ధంగా  తయారవుతుంది.  ఈ  ప్రక్రియ  ముగించేసరికి  శరీర  వ్యవస్థ  అంతా  కూడా  ఎంతో  ప్రశాంతంగా  మారిపోతుంది. 

రెండవది  హార్ట్ఫుల్నెస్  ధ్యానం: ఇప్పుడు  ధ్యానానికి  ఉపక్రమించినప్పుడు  ధ్యానవస్తువుపై  దృష్టిని  నిలపడం  తేలికైపోతుంది.  ఈ  క్రమంలో  ఎన్నో  ఆలోచనలు  వస్తాయి -  పనికొచ్చేవి,  పనికిరానివి,  అసలు  సంబంధం  లేనివి,  దివ్యమైనవి, వికారమైనవి,  నకారాత్మకమైనవి అన్నీ  వస్తూంటాయి.  ఇవన్నీ  మనలో  నుండే  వస్తున్నాయి  కాబట్టి  అవి  మన  ఆలోచనలే. మన  మనసు  ఆలోచించే  విధానాన్ని  మొట్టమొదటగా  మనకు  నచ్చకపోయినా  మనం  దగ్గర  నుండి మన  మనసు  పని  చేసే  తీరును గమనించడం  జరుగుతుంది.  అంతరంగం  అంతా  అలజడిగా  ఉంటుంది. మన  దృష్టి  ధ్యానవస్తువైన  హృదయంలో  అప్పటికే  ఉన్న  దివ్యజ్యోతి  మనలను  ఆకర్షిస్తోందన్న భావనపై  నిలిపినప్పుడు  ఈ  ఆలోచనల  ప్రభావం  అంతగా  ఉండదు.  కాని  ఆలోచనలపై  మన దృష్టి  ఉన్నప్పుడు  అలజడిగా  ఉంటుంది. మనకు  నచ్చని  విధంగా  ఉంటుంది.  ఆలోచనలు  లేకపోతే  బాగుండుననిపిస్తుంది.  కాని  ఆ  ఆలోచనల  ద్వారా  కూడా  మన  ఆలోచనలు  ఎలా  ఉన్నాయో  మన  ఎంతగా  మన  అంతరంగాన్ని  శుద్ధి  చేసుకోవలసిన  అవసరం  ఉందో  మనకర్థమవుతుంది.  అలాగే  మనలో  కలిగే  భావాలను,  ఉద్వేగాలను, కూడా  ఇలా  మనం  ఒక  సాక్షిగా  చూడగలగడం  అలవాటు  చేసుకుంటాం. ఆ  విధంగా  మనం  సరిదిద్దుకోగలిగినవి  ఏమిటి,  సరిదిద్దుకోవలసినవేమిటి,  సరిదిద్దుకోలేని భావాలేమిటి  అన్న  జ్ఞానం  మనకు  కలిగి  దానికి  మన  గురువులు/మహాత్ములు  సూచించిన  పరిష్కారాల్ను  ప్రయత్నించగలుగుతాం.  ఆ విధంగా  మనలో  మనం  పరివర్తన  కలగడానికి  పూర్తి  స్పృహతో  ప్రతి  నిత్యం  సంపూర్ణ  ప్రయత్నంలో  నిమగ్నమవుతాం. నెమ్మదినెమ్మదిగా  ఆలోచనలు  తగ్గుముఖం  పట్టడం,  నిజమైన  ఆలోచనలు  లేని  మానసిక  ప్రశాంతతను  అనుభూతి  చెందడం, తద్వారా  నకారాత్మకతను  తొలగించుకోవడం  జరుగుతుంది. అందుకే  ప్రతీ  ధ్యానం  తరువాత  శాంతిని  అనుభూతి  చెందడం  జరుగుతుంది. 

మూడవది   హార్ట్ఫుల్నెస్   శుద్ధీకరణ/నిర్మలీకరణ: ఈ  ప్రక్రియ  ద్వారా  మనలో ఏర్పరచుకున్న,  మన  అంతఃకరణ  శుద్ధికి  అడ్డుపడే  ముద్రలను/సంస్కారాలను  తొలగించుకోగలుగుతాం.  వీటినే  మనం మలినాలనీ,  సంక్లిష్టతలని / జటిల తత్త్వాలని సహజమార్గ  పరిభాషలో  అంటూంటాం.  మలినాలంటే  మనలో ఉండే  కామక్రోధలోభమద  మాత్సర్యాలే  గాక,  భయం, నకారాత్మకత వగైరావి.  వీటి  వల్ల  మన  ఆలోచన  విధానంలో  ఏర్పడే  జటిల  ఆలోచనా  విధానాలే  సంక్లిష్టతలఁటే.  ఈ  సంక్లిష్ట  మనస్తత్త్వాల  వల్ల  మనం  అనేక  బలహీనతలకు  గురవుతూ  ఉంటాం,  అనేక విధాలుగా  పొరపాటులు  చేస్తూ  మన  దుఃఖానికి  కారణం  మనమే  అవుతున్నాం.  వీటిని  ప్రతి  నిత్యమూ  తొలగించుకోవడం  వల్ల హృదయంలో  చాలా  తేలికదనాన్ని,  ఆలోచనల్లో  స్పష్టతను,  ఉద్వేగాల  భారం  తొలగడం,  ధ్యానలోలోతుల్లోకి  వెళ్ళగలగడం  వంటి పెనుమార్పులు  సంభవించడం  మనం  గమనించవచ్చు.  మన  జీవితం రోజురోజుకూ  ఈ  హృడయభారం  తగ్గడం  వల్ల మరింత  మరింత  సరళంగా,  స్వచ్ఛంగా  తయారవుతూ  ఉండటం  మనం  అనుభూతి  చెందుతాం.

నాల్గవది  ప్రార్థన: ఈ  ప్రార్థన  వల్ల,  మనలో  ఉండే  అహంకారం  తగ్గడం,  స్వార్థం  తగ్గుముఖం  పట్టడం,  అణకువగా  ఉండటం,  గతంలో చేసిన  పొరపాట్లకు పశ్చాత్తాప పడటం,  మరల  ఆ  పొరపాట్లు  చెయ్యకుండా  ఉందాలని  తీర్మానించుకోవడం, అత్యున్నత  శక్తియైన  భగవంతునిపై  ఆధారపడటం, ఆత్మసమర్పణా భావాన్ని  పెంపొందించుకోవడం మనలో  ఉన్న  అంతర్యామితో  అనుసంధానమవడం, ఇత్యాదివన్నీ  మన  చేతుల్లో  లేనివాటిని  సరిదిద్దుకొనే  అవకాశాన్ని  ఈ  ప్రార్థన  మనకు  కలిగిస్తుంది. దీని  వల్ల,  మనలోనే  గాక,  మనకున్న  సంబంధాల్లో  కూడా  గణనీయమైన  మార్పును  గమనించడం  జరుగుతుంది.

అంతఃకరణ శుద్ధి:  మనసు,  బుద్ధి,  అహంకారము,  చిత్తము  అనే  ఈ  నాలుగు  ప్రధాన  సూక్ష్మ శరీరాలను  కలిపి  అంతఃకరణ  అని  అంటారు.  ఈ  హార్ట్ఫుల్నెస్  రాజయోగ  ప్రక్రియలను  నిత్యం  అవలంబించడం  వల్ల  ఈ  అంతఃకరణ  శుద్ధి  జరిగి  మన  హృదయం  సరైన  సమయంలో  సరైన  సూచనలిస్తూ  మన  జీవన గమనాన్ని  సరైన  బాటలో  నడిపిస్తుంది. మన  హృదయాన్ని  వింటూ  ఆచరణలో  పెట్టగలిగే  స్థైర్యాన్ని  కూడా  మనకు  సహజంగా  కలుగుతుంది. (సశేషం)

  

30, అక్టోబర్ 2021, శనివారం

మార్పు - పరివర్తన - ఆత్మావలోకనం (భాగం 7)


మార్పు - పరివర్తన - ఆత్మావలోకనం  (భాగం 7)

 

మార్పు అంటే  ఎదుగుదల. ఎదుగుదల  ఆనందాన్నిస్తుంది.  ఎదుగుదల  పరిణామానికి  అనుకూలమైనది.  అందుకే  ప్రకృతికి  కూడా  అనుకూలమైనది.  మార్పు  ఎప్పుడూ  మెరుగుపడటానికే.  మార్పు  ఒక్కటే శాశ్వతం  ఈ  సృష్టిలో.  మార్పుకు  అడ్డుపడటం  ప్రకృతి  ప్రవాహానికి  అడ్డు  పడటమే;  అది  వినాశనానికే  దారి  తీస్తుంది. మార్పు  లేనిదే  భవిష్యత్తు  లేదు. 

మార్పు  అనేది  ప్రక్ఱ్ర్తిలో  అన్ని  స్థాయిల్లో  ప్రతీ క్షణం  జరుగుతున్నా  కూడా  అది  చాలా  నెమ్మదిగా  జరుగుతూ  ఉంటుంది.  తనంతతానుగా  జరుగుతుంది.  ఈ  మార్పు  మహాప్రళయం  వరకూ  కొనసాగుతూ  ఉంటుంది  మన  శాస్త్రాల  ప్రకారం.  కాబట్టి  మార్పు  అనేది  ప్రకృతి నియమం.  సమస్త చరాచర జీవుల్లోనూ  అప్రయత్నంగా  జరుగుతూ  ఉంటుంది. దాన్నే  వికాసం  అని  పరిణామం  అని  కూడా  అంటారు.  ఈ  పరిణామ  ప్రక్రియలో  మనకిష్టమున్నా  లేకపోయినా  పాల్గొనవలసినదే - ప్రత్యక్సంగానో,  పరోక్షంగానో.  కాని  కేవలం  మనిషిలో  మాత్రమే  ఈ  ప్రకృతి  కార్యంలో  ప్రయత్న  పూర్వకంగా  పాల్గొనే  అవకాశం  ఉంది.  ఎందుకంటే  మనిషిలో  మాత్రమే  తనను  తాను  తెలుసుకోగలిగే  బాగా వికసించిన పరికరాలున్నాయి. వాటినే  మనం  సూక్ష్మశరీరాలంటాం;  ప్రధానంగా  మనసు, బుద్ధి,  అహంకారం, చిత్తము అనేవి  నాలుగు. ఇవి  యే  జీవరాసుల్లోనూ  ఇంతగా  వికసించి  లేవు. అలాగే  మనిషి  తరువాత  ఉండే  అనంత  యాత్రలో  ఉన్న  దేవతలకు  కూడా  లేవంటారు  పెద్దలు.  అందుకే  వాళ్ళైనా  సరే,  అత్యున్నత  ఆధ్యాత్మిక  శిఖరాలకు  ఎదగాలంటే  ఈ  మానవ  జన్మ  ధరించవలసినదే.  ఇక్కడే  ఈ  మానవ  జన్మలోనే  అత్యున్నత  ఆధ్యాత్మిక  వికాసం  సుసాధ్యమవుతుంది.  అందుకే  మానవ జన్మ  చాలా  విలువైనది. మానవ  జన్మెత్తిన  ముఖ్యోద్దేశ్యం వికాసం, పరిణామం. దీనికి  విరుద్ధంగా  జీవించడం  లేక  కాలాన్ని  వృథా చేయడం    మానవజన్మను  వ్యర్థం  చేసుకోవడం అవుతుంది. మానవుడు  ఎప్పుడైతే  అత్యున్నత  వికాసం  కోసం  ప్రయత్నపూర్వకంగా  పాల్గొనడానికి  ప్రయత్నిస్తాడో  అప్పుడు  ప్రకృతి  కూడా  సహకరిస్తుంది; ఎందుకంటే  ఇది ప్రకృతి  కార్యం  గనుక. అప్పుడు  మనిషి  వికాసం  త్వరితంగా  జరుగుతుంది.  ఈ  ప్రయత్నపూర్వకంగా  పాల్గొనడాన్నే  ఆధ్యాత్మిక  సాధన  అంటారు. ఇటువంటి  ఆధ్యాత్మిక సాధన  వల్ల ఎంతో కాలాన్ని  ఆదా  చేయడం  జరుగుతుంది;  జీవితాన్ని  అర్థవంతంగా  గడిపినట్లవుతుంది; ఎంతో  ఆత్మసతృప్తినిస్తుంది;  జీవిత  గమనం  సరైన దిశలో  జరుగుతుంది;  ఆలోచనలో  స్పష్టత  ఉంటుంది; సరైన  నిర్ణయాలు  తీసుకుంటూ  ఉంటాం;  రోజురోజుకూ  సూక్ష్మత్వం  పెరుగుతూ  ఉంటుంది;  లోపలి  ప్రపంచంం  బయట ప్రపంచాన్ని  గురించి  సమగ్రమైన  అవగాహన  పెరుగుతూ  ఉంటుంది;  ఈ  సృష్టిలో  మన  స్థానం  ఏమిటో  అర్థమవుతుంది;  మన ఉనికికి  సంబంధించిన  రహస్యాలను  తెలుసుకోగలుగుతాం -  దీన్నే  ఆత్మ  సాక్షాత్కారం  అని  కూడా  అంటారు. ఇక  నిత్య  జీవితంలో  ఈ  మార్పు  దిశగా,  ఈ  పరిణామ  దిశగా  ప్రయత్నపూర్వకంగా  చేసే  ఈ  హార్ట్ఫుల్నెస్ ఆధ్యాత్మిక  యాత్ర  విజయవంతంగా  సాగడానికి మనం  అనుసరించవలసినవి, అనుసరించదగ్గవి:  1) ఆత్మావలోకనం  2) సాధన  3) గురువు 4) స్వాధ్యాయం  5)  సేవ

1) ఆత్మావలోకనం: ఇవన్నీ  విస్తృతంగా  చెప్పుకోవలసిన అంశాలు. ప్రస్తుతానికి మనం  ఆత్మావలోకనం  గురించి  చెప్పుకుందాం. ఇది  మనిషిలో  రావలసిన  మార్పును  త్వరితంగా  తీసుకురాగలిగే  చాలా  కీలకమైన  పరికరం. 

ఇక్కడ  ఆత్మావలోకనం  అంటే యేది  కాదో  కూడా  తెలుసుకోవడం  అవసరం. ఆత్మావలోకనం  అంటే  కేవలం  కళ్ళు  మూసుకుని  కూర్చోవడం  కాదు;  ధ్యానించడమూ  కాదు; ఏకాగ్రతా  కాదు.

ఆత్మావలోకనం  అంటే  తనను తాను యథాతథంగా  ఉన్నదున్నట్లుగా ఎటువంటి పక్షపాత  ధోరణి  లేకుందా  గ్రహించగలగడం;  తనలో  ఉండవలసిన  లక్షణాలను,  ఉండకూడని  లక్షణాలను  గుర్తించడం; ఈ  ప్రక్రియ  ఎప్పటికప్పుడు  తన  ఆలోచనలను,  తన  చేతలను,  తన  అలవాట్లను,  తన  కోరికలను,  తన ప్రవర్తనను,  తన  ఉద్దేశాలను, తన  ఉద్వేగాలను, తనలో  కలిగే  భావాలను ఒక  సాక్షి  భావంతో  గమనించడం  ద్వారా  సాధ్యపడుతుంది. అప్పుడే  సరిదిద్దుకోవలసినవాటిని  సరిదిద్దుకోవడం  సాధ్యపడుతుంది; తొలగించుకోవలసినవాటిని  తొలగించుకోవడం  సాధ్యపడుతుంది. ఆత్మావలోకనం  సూక్ష్మగ్రాహ్యతను  కూడా  పెంపొందిస్తుంది. 

కొరతలు,  దోషాలు  గుర్తించిన  తరువాత  వాటిని  మనస్ఫూర్తిగా  స్వీకరించాలి;  ఎప్పటికప్పుడు  ప్రయత్నపూర్వకంగా  తొలగించుకునే  ప్రయత్నం  చెయ్యాలి. అలాగే  మెరుగుపరచుకోవలసిన  లక్షణాలను  గుర్తించిన  తరువాత  వాటిపై  దృష్టి పెట్టి  అవసరమైనది  చెయ్యాలి.  ఇది  ప్రతి  నిత్యం  జరగాలి.  మన  నిత్యజీవనంలో  ఈ  ఆత్మావలోకన  ప్రక్రియ  అంతర్లీనంగా  నేపథ్యంలో  జరుగుతూ  ఉండాలి. ఇది ప్రయత్నిస్తేనే  జరుగుతుంది. ఇది  జరగాలంటే  తనలో  పరివర్తన  రావాలన్న  ఆకాంక్ష,  ఆసక్తి,  తపన చాలా  అవసరం. గుర్తించిన  అంశాల్లో  కొన్ని  బాగుచేయడం  గాని,  తొలగించడం  గాని,  సరిదిద్దుకోవడం  గాని  అసాధ్యమయ్యేవి  ఉండవచ్చు.  వాటిని  హృడయపూర్వకంగా  స్వీకరించి  వాటికి  తగినట్లుగా  మనలను  సర్దుకుంటూ  దివ్యప్రణాళికలో  వీటి  పాత్ర  యేదో  ఉండుంటుందని  ప్రార్థనాపూర్వకంగా  స్వీకరించడానికి  ప్రయత్నించాలి.  ఇక్కడ  హార్ట్ఫుల్నెస్  ప్రార్థన  ఎంతగానో  సహాయపడుతుంది. గుర్తించిన  దోషాలను  తొలగించుకోవడానికి  హార్ట్ఫుల్నెస్  శుద్ధీకరణ  ప్రక్రియ ఎంతో  చేయూతనిస్తుంది;  అలాగే  ఉన్న  మంచి  లక్షణాలను  మెరుగుపరచుకోవడానికి,  హృదయ  వికాసం  జరగడానికి  ధ్యానం  ఎంతగానో  ఉపకరిస్తుంది. 

ఇవన్నీ  క్రమక్రమంగా  చేయడం  వల్ల  మన  శీలంలో  గణనీయమైన  మార్పు  లోపల  ప్రాణాహుతితో  కూడిన  ధ్యానం  ద్వారా కలిగే  ఆధ్యాత్మిక  స్థితికి  అనుగుణంగా  సర్దుకుంటుంది;  ఆ  విధంగా  మన  ఆధ్యాత్మిక  ప్రగతి,  పరిణతి,  యాత్ర  త్వరితంగా  జరుగుతుంది. ఇది  మనందరమూ  ప్రత్యక్షానుభవంతో  తెలుసుకోవచ్చు.  (సశేషం)


27, అక్టోబర్ 2021, బుధవారం

మార్పు - పరివర్తన (భాగం 6)


మార్పు - పరివర్తన (భాగం 6)

ఆధ్యాత్మిక  పరివర్తన

 మనం  ఇప్పటి  వరకూ  చర్చించుకున్నది  ఆధ్యాత్మిక మార్పును  గురించి,  అంతరంగంలో  జరుగవలసిన  మార్పును  గురించి;  అదే  నిజమైన  మార్పు. ఆ  మార్పు  అనంతంగా  కొనసాగుతూనే  ఉంటుంది  ఇక  మార్పుకు  అవకాశం  లేని స్థితి కలిగే  వరకూ; అదే  మూలంలో  లయమైపోవడం  లేక  భగవంతునిలో  సంపూర్ణ  ఐక్యం  పొదడం  లేక  మనిషి  పరిపూర్ణత్వాన్ని  సాధించడం అంటే.  దీన్నే  అంతరంగా ప్రవర్తన అని  కూడా  అనవచ్చు. ఈ  సూక్ష్మ  శారీరాల్లో  పరివర్తన  కలగడానికి  మనం  ఆధ్యాత్మిక  సాధన  సహాయం  తీసుకుంటాం. ముఖ్యంగా  హార్ట్ఫుల్నెస్  వంటి  సమర్థవంతమైన సాధనను  ఆశ్రయిస్తాం.

మార్పు-పరివర్తన

మార్పు  అంటే  వస్తువులోని  అంశాల యొక్క అమరిక  మారుతూ  ఉండటం; మార్పు  అనేది  ప్రతీ క్షణమూ  జరుగుతూ  ఉండేది.  పరివర్తన  అంటే  పూర్వాశ్రమంలోని  ఏ  పోలికా  లేకుండా  పూర్తిగా మారిపోవడం.  మనం  ఇంతకు  పూర్వం  చెప్పినట్లుగా  పరివర్తన  అంటే,   పురుగు  సీతాకోకచిలుకగా  పరివర్తన  చెందడం;  బందిపోటుగా  ఉన్న  రత్నాకరుడు  వాల్మీకి  మహర్షిగా  పరివర్తన  చెందడం. పాశవికంగా  ఉండే  మానవుడు  మానవత్వం  గల  మానవుడుగానూ  మానవత్వం  గల  మానవుడు  దివ్యమానవుడిగా  పరివర్తన  చెందడమూ అన్నమాట.

శీలపరమైన  పరివర్తన

కేవలం  ఆధ్యాత్మిక  పరివర్తన  వస్తే  సరిపోదు,  అదే  అసలైన  మార్పు  అయినా  కూడా. దానికి  దీటుగా,  తగినట్లుగా,  అంతరంగ  మార్పుకు అనుగుణంగా  బాహ్యమైన  శీలమార్పులు  జరుగకపోయినట్లయితే  అంతరంగంలో  జరిగిన  ప్రవర్తన  నిరర్థకమైపోతుంది.  అందుకే  ఆధ్యాత్మిక  సాధన ద్వారా  సంభవిస్తున్న  అంతరంగ  మార్పులను  అప్రమత్తంగా  ఉంటూ  గమనిస్తూ,  దానికి  అనుగుణంగా  మన  ఆలోచనలను,  మన  చేతలను,  మన  అలవాట్లను,  మన  ప్రవర్తనను,  వెరసి  మన  శీలాన్ని  గనుక  మలచుకోకపోయినట్లయితే సూక్ష్మ శరీరాల్లో  సంభవించిన మార్పుల  ప్రయోజనం  సరిగ్గా  చేకూరదు.  ఈ  అంశం  కొంత  ఆశ్చర్యాన్ని  కలిగించవచ్చు.  కాని  కొంచెం  పరికించి  చూసినట్లయితే  అర్థమవుతుంది.  దీపంలో  ఉన్న  జ్యోతి  దేదీప్యమానంగా  వెలుగుతున్నా  కూడా  వెలుతురు  బయటకు  రాకపోవచ్చు.   దీపానికి  పట్టే  మస్సే దీనికి  కారణం. ఈ  మస్సి (అంటే  సౌశీల్యం  లేకపోవడమే)  పట్టకుండా  ఎప్పటికప్పుడు  చూసుకోకపోతే  లోపల  వెలుగు  ఎంత  గొప్పగా  ఉన్నా  అది  సరిగ్గా  బయటకు  రాదు.  అదే  విధంగా  లోపల  కలుగుతున్న  ఆధ్యాత్మిక  ప్రగతికి  అనుగుణంగా  ఎప్పటికప్పుడు  శీలాన్ని  తగినట్లుగా  సరిదిద్దుకోవడం,  మలచుకోవడం  చెయ్యవలసినది  సాధకుడి  బాధ్యత.  ఈ  విధంగా  ఆధ్యాత్మిక  వికాసం,  శీల వికాసం  రెండూ  చేదోడు-వాదోడుగా  ముందుకు  సాగుతూ  ఉండాలి.  అప్పుడే  మనిషిలో  సమగ్రమైన  పరివర్తన  రోజురోజుకూ  స్రైన  దిశలో  కొనసాగుతూ  సంతృప్తికరమైన  మనుగడను  సాగించడం  ప్రతీ  మనిషికి  సాధ్యపడుతుంది.  

సౌశీల్యంలో  కలుగవలసిన  మార్పులకు  కొన్ని  మార్గాలు

సౌశీల్యాన్ని  ఎప్పటికప్పుడు  సరిదిద్దుకోవడానికి  లేక  తగిన  విధంగా  మలచుకోడానికి  చేపట్టవలసిన  కొన్ని  మార్గాలు: 

  1. ఆదర్శ వ్యక్తిని  అనుసరించడం అంటే  విధేయతగా  ఉంటూ  గురువును    అనుకరించే/అనుసరించే  ప్రయత్నం.  వారి  అలవాట్లు,  వారి  ప్రవర్తనను, వారి  లక్షణాలను అనుసరించే  ప్రయత్నం
  2. స్వాధ్యాయం అంటే  సముచిత  గ్రంథాలను  చదవడం,  తనను  తాను  సూక్ష్మంగా  సమగ్రంగా  తెలుసుకునే  ప్రయత్నం  చెయ్యడం
  3.  ఎప్పటికప్పుడు  ఆత్మావలోకనం ద్వారా  తన  ఆలోచనలను,  చేతలను,  అలవాట్లను,  ప్రవర్తనను  గమనించుకుంటూ  సరిదిద్దుకునే  ప్రయత్నంలో  ఉండటం.
  4. ఇతరుల  సేవలో, గురువుల  సేవలో  కొంతైనా  సమయాన్ని  వెచ్చించడం. 

(సశేషం)

అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన 5 ఔషధాలు

  అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన  5 ఔషధాలు  ఇటీవలే పూజ్య దాజీ "ఫైవ్ ప్రిస్క్రిప్షన్స్ ఫర్ ది సోల్ ఫ్రమ్ అష్టావక్ర మహాగీత" అన...