5, ఫిబ్రవరి 2024, సోమవారం

స్పిరిచ్యువల్ అనాటమీ - 4 - నిర్ధారణ

 



స్పిరిచ్యువల్ అనాటమీ  - నిర్ధారణ
(ఆఖరి అధ్యాయం) 
***
ధ్యానంలో మనం కళ్ళు మూసుకుంటాం, హృదయాలు తెరుస్తాం. తెరచిన హృదయం కానుక అందుకుంటుంది. కానుకను గుర్తించడం కృతజ్ఞత. కృతజ్ఞత ఒక ఆధ్యాత్మిక స్థితిని మన హృదయాలలో కలుగజేస్తుంది. ఆ ఆధ్యాత్మిక స్థితిని కొనసాగించినప్పుడు అది ప్రేమ దిశగా పైకి ఎగుస్తుంది. అంతరంగంలో ఉన్న ప్రేమ, పరమాత్మ పట్ల పూజ్య భావం సృష్టిస్తుంది. పూజ్యభావం మనలో పెరుగుతున్నకొద్దీ, మన హృదయం దైవకృపను ఆకర్షిస్తుంది. కృపా తరంగాలపై పయనిస్తున్న కొద్దీ, సమర్పణ భావం ప్రారంభమవుతుంది. సమర్పణభావం నిర్మలత్వాన్ని సృష్టిస్తుంది. నిర్మలత్వం వల్ల శరణాగతి ప్రారంభమవుతుంది. శరణాగతి లయావస్థకు దారి తీస్తుంది. 
ప్రతీ ధ్యానం ఒక ప్రేమకలాపమే. ఆత్మ, పరమాత్మల కలయికే ధ్యానం. ఒక నీటి చుక్క మహాసముద్రంలో ఏకమయ్యే ప్రయాణమే ధ్యానం. 
మీ హృదయంలో పెల్లుబుకుతున్న  ప్రేమతో మీ ప్రయాణం కొనసాగనివ్వండి.  మిమ్మల్ని ముంచేసే ప్రేమ అయి ఉండాలి, ముంచే ప్రేమ గాకపోయినట్లయితే, ఉద్ధానం ఉండదు కాబట్టి. హృదయపూర్వకంగా మీరు అటువంటి ప్రేమకిరణాలకు లోనవ్వాలని, మీ హృదయ నిగూఢమైన లోలోతుల్లో ప్రారంభమై, అక్కడే ముగించే ప్రయాణంలో కలిగే ఏకత్వభావన వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను. మార్గం ఇరుకుగానూ, అంధకారంగానూ ఉండవచ్చు. ఒక్కోసారి ఒంటరితనం విపరీతంగా ప్రబలంగా ఉండవచ్చు.  మార్గం నిటారుగా, జారుడుగా ఉండవచ్చు. కానీ గుర్తుంచుకోండి, మీరు అన్వేషిస్తున్నది మీలోనే ఉంది. నాకు దారి తెలుసు, నేమిక్కడున్నది మీకు అడుగడుగునా సహాయం చేయడం కోసమే. మీరు అనంతం వైపుకు ఎత్తులకు ఎగుస్తూ, దానితో ఒక్కటవుతారని ఆశిస్తున్నాను. ఈ సృష్టికి మీరివ్వగలిగే శ్రేష్ఠమైన కానుక, మీ పరివర్తిత ఆత్మ మాత్రమే. 
***
(ఈ చివరి అధ్యాయంలో ఈ గ్రంథం యొక్క సారాంశాన్ని క్లుప్తంగా, అందరికీ అర్థమయ్యేలా సరళంగా, కర్తవ్య బోధను, ఆయన అడుగడుగునా మనకు సహాయం చేయడానికి అందుబాటులో ఉన్నానన్న భరోసాను, అద్భుతమైన సందేశాన్ని వెల్లడి చేశారు. ఈ ఒక్క అధ్యాయం అందరి మనసుల్లోకి స్పాంజ్ లో నీరు ఇంకినట్లుగా, మన సాధకుల శరీరవ్యవస్థలోని అణువణువునా ఈ సందేశం పూర్తిగా ఇంకిపోవాలని, జీవిత గమ్యాన్ని సాధించాలని ఆ గురుదేవులను ప్రార్థిస్తున్నాను.)




బాబూజీ - లాలాజీ గురించి - 5

 


బాబూజీ - లాలాజీ గురించి - 5 

లాలాజీ బోధలు (కొనసాగింపు... )
మహాత్ముడికి మూడు విషయాలు అవసరమని చెప్పేవారు:
1) శాశ్వతమైన శారీరక రుగ్మత (ఇల్లత్)
2) ఆర్థిక ఇబ్బంది (కిల్లత్) 
3) విమర్శకు గురికావడం (జిల్లత్) 

మనసును సమత్వంలో ఉంచడమే నిజమైన సాధన. 

తక్కువగా తినండి, నిజాయితీగా సంపాదించండి. నిజాయితీగా సంపాదించని ఆహారం గాకపోతే, సాధారణంగా ఆధ్యాత్మిక అనుభూతులు సక్రమంగా ఉండవు. 

"చింతలకు గురవడం మంచిదే. సహనానికి, సమర్పణ భావం ఇత్యాది వాటికి శిక్షణా స్థలి, గృహస్థ ఆశ్రమం; ఇదే అత్యున్నత త్యాగము, తపస్సు కూడా." అని వ్రాసుకున్నారు ఒక చోట. 

"ఇక క్లేశాల విషయానికి, చింతల విషయానికి వస్తే, నా వంతుకు ఉండవలసినవి, నాక్కూడా ఉండేవి, బహుశా ఇతరులను చకితులను చేస్తాయేమో కూడా. ఒక్కోసారి నాకు తినడానికి ఏమీ ఉండేది కాదు. నా సంతానమే గాక నామీద ఆధారపడినవాళ్ళు ఎక్కువగానే ఉండేవారు. ఇది గాక, నేను సహాయం చేయవలసినవాళ్ళు కూడా ఉండేవారు, అది అనివార్యంగా ఉండేది.  వాళ్ళందరి బాధ్యత నా ఒక్కడిపైనే ఉండేది, వాళ్ళ అవసరాలన్నీ తీర్చి, వీళ్ళందరినీ చూసుకోవలసిన బాధ్యత నాపైనే ఉండేది. మొత్తం కుటుంబం అంతా ఒకే దుప్పటి, అది కూడా చిరుగులతో కూడిన దుప్పటినే కప్పుకునేవాళ్ళం. కానీ ఆ పరిస్థితిని కేవలం దురదృష్టంగా భావించాను; కాలక్రమేణా దానంతటదే పోయింది. ఇదంతా కూడా సత్యతత్త్వంతో పోలిస్తే తృణప్రాయంగా అనిపించేది, పెద్ద ప్రాముఖ్యత ఉండేది కాదు; భగవత్  తత్త్వంతోనే   నా ఆస్తిత్వమంతా ప్రబలంగా నిండి ఉండేది. కాబట్టి వాటిని చూసి ఒక చిరునవ్వు నవ్వుకునేవాడిని, ఇవన్నీ మోక్షానికి మార్గాలుగా భావించేవాడిని" అని మరొక చోట వ్రాసుకున్నారు.  

 కొన్ని సూత్రాలు 

భగవంతుడిని అన్వేషించేది ఆత్మ; ఆత్మచే యేది అన్వేషించబడుతున్నాడో అది పరమాత్మ

ఆత్మకున్న విచక్షణా శక్తి మేరకు మనిషి యొక్క ఆత్మ శుద్ధంగా ఉంటుంది. 
మనిషి పరిపూర్ణుడు గాకుండగా భగవత్సాక్షాత్కారం అనేది సాధ్యం కాదు. 

అభ్యాసం ద్వారా మీ మనసును శుద్ధి చేసుకోండి, అప్పుడు సాహిత్యాన్ని చదవండి; లేకపోతే సత్యపదార్థం మీకు గోచరించదు. 

ఎవ్వరికీ భగవంతుని సాక్షాత్కారం ఇంత సమయంలో జరిగిపోతుందని మాటివ్వకండి. 

భగవంతుడు ఉన్నాడా, లేదా లేక ఆత్మ ఉన్నదా లేదా, అన్న సంశయాన్ని తొలగించేసుకోవాడమే ముఖ్యం. ఈ సంశయం విముక్తులయ్యారంటే, ఇక మీకు గురువు అవసరం ఉండదు. 

భగవంతుడి కోసం, ఆత్మ కోసం అన్వేషించడం అన్నది సహజం, ఇదొక రకమైన మానసిక దౌర్బల్యం. ఈ స్వైరకల్పనను నయం చేయగలది, గురువు అనే మరో స్వైరకల్పన. 

భగవంతుని నమ్మనివాడు నాస్తికుడు కాదు. శారీరకంగానూ, మానసికంగానూ, మేధాపరంగానూ, ఆధ్యాత్మికంగానూ ఇతరులకు హాని కలిగించేవారే నాస్తికులు. 

భగవంతుడు తనను తాను మీ హృదయాలలో దాగి, మిమ్మల్ని బయట ఉంచాడు; ఇప్పుడు మిమ్మలని మీరు దాచుకొని భగవంతుడిని బయట పెట్టండి; ఇదే సాధన అంటే. 

క్లేశాలన్నీ భగవంతుడు ఇచ్చిన వరాలే. వాటిల్లో బోలెడు రహస్యాలున్నాయి; అలాగే అనేక ఆధ్యాత్మిక అనుభూతులు ఆ కష్టాలను అనుభవిస్తున్నప్పుడు కలుగుతాయి. 


స్పిరిచ్యువల్ అనాటమీ - 3 - భారత ప్రచురణ

 



                      అమెరికలో విడుదలైన ప్రచురణ               భారతదేశంలో విడుదలైన ప్రచురణ 



స్పిరిచ్యువల్  అనాటమీ - భారత ప్రచురణ 
(ఆధ్యాత్మిక శరీర నిర్మాణం) 
స్పిరిచ్యువల్ అనాటమీ అన్న పేరుతో గురుదేవులు, హార్ట్ఫుల్నెస్ ఆధ్యాత్మిక మార్గదర్శి అయిన పూజ్య దాజీ (కమలేష్ పటేల్ గారు) 2016 జనవరి నెలలో ప్రారంభించి అకుంఠిత దీక్షతో ఆరు సంవత్సరాలపాటు తదేక దృష్టితో ఈ గ్రంథాన్ని రచించడం జరిగింది. 

ఇది మొట్టమొదటగా అక్టోబర్ 2023 లో అమెరికాలో విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు భారతదేశంలో ఫిబ్రవరి 2 న బసంత పంచమి సందర్భాన భారత ప్రచురణను విడుదల చేయడం జరిగింది. (ఈ రెండు చిత్రాలు పైన కనిపిస్తున్నాయి).
 వీటిని www.hfnlife.com ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చును. 

ఆ తరువాత ఈ విషయంపై పూజ్య దాజీ అనేక ఇంటర్వ్యూలు, సంభాషణలు, ఆన్లైన్లో, బ్రూస్ లిప్టన్, దీపక్ చోప్రా, డోటీ, వంటి ఎందరెందరో మహాప్రముఖులతో చర్చలు ఈ గ్రంథాన్ని వ్రాయవలసిన అవసరాన్ని గురించి, దాని తాలూకు అనుభవాలను గురించి ఇత్యాదివెన్నో విషయాలను చర్చించడం జరిగింది. ఈ ప్రముఖులందరూ ఈ గ్రంథాన్ని అధ్యయనం చేసి అనేక ప్రశ్నలను, తమతమ అనుభవాలను ప్రేక్షకులతో పంచుకోవడం జరిగింది. అలాగే ప్రేక్షకుల ప్రశ్నలకు కూడా సమాధానాలివ్వడం జరిగింది. అన్నీ యూట్యూబ్ లో అందరికీ అందుబాటులో ఉన్నాయి; అందరూ వీలుచేసుకుని వీక్షించగలరు. ప్రతీ వీడియో ఎన్నో విషయాలను వెల్లడి చేస్తుంది. ఆధ్యాత్మిక జిజ్ఞాసను ఎంతగానో పెంచుతుంది; ఆధ్యాత్మిక తృష్ణను పెంచుతుంది; తద్వారా మన ధ్యానసాధన మరింత లోలోతుల్లోకి నిగూఢంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. 

ఈ గ్రంథంలో మెడిటేషన్, చక్రాలు, కేంద్రానికి చేసే యాత్రను గురించి ఆధ్యాత్మిక చరిత్రలోనే, బహుశా ఇంతకుముందెన్నడూ లేని విషయాలను, కేవలం అనుభవపూర్వకంగా మాత్రమే తెలుసుకోగలిగిన అంశాలను, సరళమైన మాటల్లో, ఒక చిన్న పిల్లవాడు చదివినా ఎంతో కొంత అర్థమయ్యే విధంగా, నిగూఢమైన విషయాలను మానవాళికి అందుబాటులోకి తీసుకువచ్చారు దాజీ. కేవలం హార్ట్ఫుల్నెస్ సహజమార్గ ధ్యాన సాధకులు మాత్రమే గాక,ఆధ్యాత్మిక జిజ్ఞాస, తపన గలవారందరూ తప్పక అధ్యయనం చేయవలసిన గ్రంథం. 

ఇందులో కొన్ని ముఖ్య అంశాలను, అన్నీ ముఖ్యమే అయినప్పటికీ, కొన్నిటిని తదుపరి వ్యాసాల ద్వారా అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం.  

బాబూజీ - లాలాజీ గురించి - 4

 


బాబూజీ - లాలాజీ గురించి - 4 

బాబూజీ బోధలు 
"అడిగితే తప్ప ఎవ్వరికీ సలహా ఇవ్వకండి, లేకపోతే పర్యవసానాలు చెడుగా ఉండే అవకాశం ఉంటుంది."  

"ఎవరిలోనైనా యేదైనా దోషం కనిపిస్తే, ఆ వ్యక్తి ఆ దోషం నుండి విముక్తుడవ్వాలని ప్రార్థించండి."

లాలాజీ స్వయంగా ఎప్పుడూ నేరుగా ఎవరినీ చెడు అలవాట్లను మానమని చెప్పేవారు కాదు. ఆయన సాంగత్యంలో ఉన్న అనతికాలంలో వాళ్ళల్లో ఉండే దురలవాట్లు, క్లేశాలూ  అన్నీ వాటంతటవే విడిచిపోయేవి. 

ఈ ధ్యాన పద్ధతిని గురించి వ్యాఖ్యానిస్తూ, "అగ్నికి దగ్గరగా కూర్చుంటే వెచ్చగా ఉంటుంది; ఐసుకు దగ్గరగా కూర్చుంటే చల్లగా ఉంటుంది; అటువంటప్పుడూ క్రమశిక్షణతోనూ, సత్ప్రవర్తనతోనూ పరిపూర్ణుడైన వ్యక్తితో కూర్చున్నప్పుడు వ్యక్తిలో పరివర్తన ఎందుకు రాదు?" అన్నారు. 

కోరికలను తగ్గించుకోమని ఎప్పుడూ చెప్తూండేవారు. 

"పాత వస్తువులతో పని జరుగుతున్నప్పుడు కొత్త వస్తువును కొనకండి" అనేవారు. 

నిజాయితీగా డబ్బు సంపాదించదాన్ని ఆయన వ్యతిరేకించేవారు కాదు, కానీ ఆ డబ్బును ఇతరులపై ఖర్చు పెట్టమని నొక్కి చెప్పేవారు.  మత్తుపదార్థాలను, వ్యభిచారాన్ని పూర్తిగా నిషిద్ధం అనేవారు. ఈ విషయంలో తన అనుచరులను తమ మనసును నమ్మద్దనేవారు. ఆయన ప్రకారం ఇంద్రియసుఖాలకు బానిసలుగా ఉండేవారు, దురాశ కలిగినవారు పారమార్థికమైన పనులు చేయలేరనేవారు. 

ఆయన అభిప్రాయం ప్రకారం ప్రదర్శన అనేది అయోగ్యత అనేవారు. అందుకు భిన్నంగా ఉన్నదున్నట్లుగా సత్యాన్ని పలకడం చాలా మంచిదనేవారు. ఆయన దృష్టిలో నిజమైన క్రమశిక్షణ, నిజమైన సత్ప్రవర్తన అంటే హృదయంలో ఉన్నదే నాలుకమీద ఉండాలన్న దృఢవిశ్వాసం, కలిగి ఉండేవారు. అభ్యాసి అంతరంగ స్థితి, బాహ్య స్థితి రెండూ ఒక్కటై ఉండాలి. ఇతరుల దోషాలను గురించి మాట్లాడుకోవటం వారికిష్టం ఉండేది కాదు. ఒకవేళ అటువంటి చర్చ చేయవలసిన పరిస్థితి వస్తే, మౌనంగా ఉండిపోయేవారు. 

అద్భుతాలు ప్రదర్శించడం ఆయనకు విపరీతమైన విసుగు పుట్టించేది. ఎవరికైనా సాధనలో సిద్ధి కలిగిందంటే వెంటనే తొలగించేసేవారు. అలాగే ఆహాన్ని ఎప్పుడూ పెరగనిచ్చేవారు కాదు. సాధకులందరినీ తమ గమ్యాన్ని చేరుకునే వరకూ, తమలో క్రమశిక్షణ పరిపూర్ణ స్థితికి వచ్చేవరకూ ఈ సిద్ధులకు దూరంగా ఉండమనేవారు. సాధకుడు గమ్యాన్ని చేరుకున్న తరువాత ఆ సాధకుడు చేసే చేష్టలన్నీ అప్రయత్నంగానే అద్భుతాలుగా మారతాయి. ఆయన దృష్టిలో, ఒక మహాత్ముడు చేయగల అత్యద్భుత కార్యం ఏమిటంటే, పాశవికంగా ఉండే మానవుడిని పరిపూర్ణ మానవునిగా పరివర్తింప జేయడం. లాలాజీకి తన సిద్ధులపై సంపూర్ణ ఆధిపత్యం ఉందన్న సత్యాన్ని నిరాకరించడానికి లేదు; కానీ వారు ఆ శక్తులనెప్పుడూ వినియోగించేవారు కాదు. 

(సశేషం ... )



3, ఫిబ్రవరి 2024, శనివారం

బాబూజీ - లాలాజీ గురించి - 3

 


బాబూజీ - లాలాజీ గురించి  - 3

వ్యక్తిత్వం 
లాలాజీ క్రతువులకు విరుద్ధంగా ఉండేవారు. వితంతు వివాహాలను, ఆడపిల్లల చదువుకోవాలని ప్రోత్సహించేవారు. మరొకటి ఆయన బాగా ఇష్టపడే విషయం, తన సహచరుల పిల్లల్లో, వాళ్ళల్లో వాళ్ళు వివాహం చేసుకోవడాన్ని ఇష్టపడేవారు. కానీ వివాహం త్వరగా చేసుకోవడం గాని, ఆలస్యంగా చేసుకోవడం గాని వారికిష్టం ఉండేది కాదు. 
ఆయనకు పనిచేసేవారు అందరూ వారి కుటుంబసభ్యుల్లాగే ఉండేవారు. వాళ్ళకు ఇవ్వవలసిన జీతాలు సమయానికి ఇచ్చేసేవారు. లాలాజీ ప్రకారం, సేవకులు అంటే యజమాని చేసుకోలేని పనులు చేయగలిగే సహాయకులు మాత్రమే, వాళ్ళను అటువంటి పనుల్లోనే వినియోగించుకోవాలి. 
వాగ్దానాలను పట్టించుకోపోవడం, అనవసరంగా పండుగలకు, పబ్బాలకు స్తోమతకు మించి డబ్బు వృథాగా ఖర్చు పెట్టడం ఆయనకిష్టం ఉండేది కాదు. వెనుక నుండి కీడు చేసేవారికి ఆయన సానుభూతి ఉండేది కాదు. ఇందుకు విరుద్ధంగా బాగా చీవాట్లు పెట్టేవారు. "మిమ్మల్ని ఎవరూ గూఢచారులుగా ఉండమని నియమించలేదు" అంటూ మందలించి వెంటనే దారిలోకి తీసుకు వచ్చేవారు. 
లాలాజీ వ్యక్తిత్వము, ఆయన జీవించే విధానము, ఆయన ప్రవర్తన చుట్టుప్రక్కలవారిని ఎంతగానో ఆకర్షించేవి; అందరూ ఆయనను ప్రేమించేవారు, అమితంగా గౌరవించేవారు. మొదట్లో కొంతమంది ఆచార్యులు ఆయన వద్దకు వచ్చేవారు; వాళ్ళు అనతికాలంలోనే  పరివర్తన చెందేవారు. తమలో కలిగిన పరివర్తనను గమనించి, తమ వ్యక్తిత్వాల్లో సంభవించిన  మార్పును గురించి తమ విద్యార్థులకు చెప్పడంతో లాలాజీ వద్దకు విద్యార్థులు ఎక్కువగా రావడం ప్రారంభించారు; వాళ్ళు కూడా అదే విధంగా పరివర్తన చెందేవారు. 
ఆయన వద్దకు వచ్చినవారందరినీ సమూలంగా శుద్ధి చేసేవారు. అలా వ్యక్తి మనసు శుద్ధి అయిన తరువాత, అతని జీవితం తన సంస్కారాలే దారి చూపిస్తాయి. అనవసరమైన వ్యక్తికి ఉపదేశం ఇవ్వకూడదనేవారు; కానీ ఒకవేళ వస్తే, తిరిగి ఉపదేశం అందుకోకుండా వెళ్ళకూడదు అన్నది ఆయన సిద్ధాంతం. ఆయనను ఎవరైనా గురువు అని పిలిస్తే నచ్చేది కాదు. శిక్షణ విషయంలో తాను కేవలం ఒక ఆఫీసరు వద్ద బంట్రోతు వంటి వాడినని, జయాపజయాలతో సంబంధం లేకుండా దివ్యత్వం యొక్క ఆజ్ఞలను అమలు చేయడం వరకే తన పని అని భావించేవారు. 
తన పనిని ఎప్పుడూ వాయిదా వేసేవారు కాదు, ఎంత అనారోగ్యంగా ఉన్నా కూడా.  
హిందీ, సంస్కృత భాషలలో మంచి జ్ఞానం ఉండేదాయనకు. ఇంతకు ముందెప్పుడు తెలియని వేద రహస్యాలను వెల్లడించేవారు. 

(సశేషం ... )

2, ఫిబ్రవరి 2024, శుక్రవారం

బాబూజీ - లాలాజీ గురించి - 2

 


బాబూజీ - లాలాజీ గురించి  - 2

అలవాట్లు 
ఖరీదైన దుస్తులు వేసుకోవడం వారికిష్టం ఉండేది కాదు; పట్టు బట్టలు చాలా అరుదుగా వాడేవారు. కానీ వారు వేసుకునే దుస్తులు మాత్రం ఎప్పుడూ శుభ్రంగా ఉండేవి. సాధారణంగా కుర్తాలు, చిక్కాలు, పైజామాలు, ధోవతులు  వేసుకునేవారు. అప్పుడప్పుడు కుర్తా మీద ఒక చిన్న కోటు, మోకాళ్ళ వరకూ బొత్తాలున్న కోటు  వేసుకునేవారు. రంగు-రంగుల టోపీ పెట్టుకునేవారు; చలికాలం భుజాలపై శాలువా కప్పుకునేవారు. ఆయన ఆభరణాలేవీ ధరించేవారు కాదు. 
చిరు తిండ్లంటే  వారికి చాలా ఇష్టం ఉండేది. ఉదయం భోజనంలో సాధారణంగా రొట్టెలు, పప్పు, పచ్చడి; రాత్రి భోజనంలో రోట్టేలు, కూర, ఊరగాయ తినేవారు. ఆయన మాంసం గాని, ఐసు గాని, టీ గాని తీసుకునేవారు కాదు. కచోరీ, అరవీ అంటే బాగా ఇష్టపడేవారు. 

ఆయన దినచర్య ఎప్పుడూ ఖాళీ లేకుండా ఉండేది. వారెప్పుడూ సూర్యోదయం తరువాత నిద్రపోలేదు. ఆయన అవసరాలు తీర్చుకున్న తరువాత, శుభ్రమైన దుస్తులు ధరించి, తన ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నులైపోయేవారు. అలాగే ఇతరులకు శిక్షణనివ్వడంలో కాలం గడిపేవారు. ఆ తరువాత ఆఫీసుకు వెళ్ళేవారు, ఆఫీసు నుండి తిరిగి వచ్చిన తరువాత మరలా శిక్షణనిస్తూండేవారు. ప్రతీ రోజూ సాయంకాలం 7, 8 గంటల మధ్య భోజనం చేసేవారు. ఆ తరువాత కొంత సమయం నడకకు  వెచ్చించేవారు. తిరిగి వచ్చిన తరువాత మరలా శిష్యులకు ఆధ్యాత్మిక శిక్షణనిచ్చేవారు. రాత్రి 10 గంటలకు నిద్రకు ఉపక్రమించేవారు. కానీ నిద్ర పోయేవారు కాదు. ఉదయం 2 గంటల వరకూ అందరికీ ప్రాణాహుతి ప్రసరణ చేసేవారు. ఆయన విడిగా వేరే గదిలో పడుకునేవారు; తోటిసాధకులు ఎవరైనా ఉంటే, వాళ్ళను కూడా ఆ గదిలో పడుకోనిచ్చేవారు. అప్పుడప్పుడు గంగా నాడీ తీరాన నడక కోసం వేళ్ళేవారు; తనతో పాటు వారి అతిత్తులను కూడా తీసుకువెళ్ళేవారు. ఒక్కోసారి వాళ్ళను, మార్పు కోసం తీర్థాలకు కూడా తీసుకువెడుతూ ఉండేవారు. 

ప్రకృతి, స్వభావం 
స్వాభావికంగా ప్రశాంతచిత్తం గలవారు, కానీ ఇతరుల కష్టసుఖాలకు తేలికగా స్పందించేవారు. మధురమైన కంఠస్వరం గలవారు. తన ఆలోచనలను తెలియజేయడానికి తియ్యని భాషను ఉపయోగించి తన శ్రోతల మనసులను గెలుచుకోవడంలో నిష్ణాతులు. కోపం చాలా అరుదుగా వచ్చేది. అనవసరంగా మాట్లాడేవారు కాదు; చాలా తక్కువగా మాట్లాడేవారు; కానీ ఎవరైనా ప్రశ్నలు వేస్తే మాత్రం క్షుణ్ణంగా సంపూర్ణంగా సమాధానాలు చెప్పేవారు; మళ్ళీ వాళ్ళ మనసుల్లో ఆ ప్రశ్నలుండేవి కావు, సందేహాలుండేవి కావు. ఎవరైనా ఆయన చెప్పినది అర్థంచేసుకోలేకపోతే, ఆ వ్యక్తిలో అవసరమైన ఆధ్యాత్మిక స్థితిని, చర్చించుకుంటున్న విషయ జ్ఞానాన్ని  అనుభవంలోకి తీసుకువచ్చేవారు. 

సాధారణంగా లాలాజీ సాహెబ్ కళ్ళు క్రీడకే దించుకొని ఉండేవారు; బిగ్గరగా నవవేవారు కాదు; కేవలం చిరునవ్వు మాత్రమే ఉండేది. ఆయన చిరునవ్వు మంచితనాన్ని, తియ్యదనాన్ని ప్రకటించేది, వారి ఆధ్యాత్మిక చురుకుదనం వల్ల ఇతరుల ముఖాల్లో వెలుగును నింపేది. మానవాళిని గొప్పగా ప్రేమించే వ్యక్తిత్వం, ప్రేమతో వారికి ఎవరైనా ఇచ్చిన వస్తువులను తరచూ ఉపయోగిస్తూ ఉండేవారు, వారికి వ్యక్తిగతంగా వాటి పట్ల అయిష్టత ఉన్నా లేకున్నా కూడా. ముఖాస్తుతిని ద్వేషించేవారాయన. ఆయన అనుచరులందరినీ వాళ్ళల్లో ఉన్న దోషాలతో సహా స్వీకరించినా కూడా, క్రమశిక్షణ విషయంలో కఠినంగా ఉండేవారు. లాలాజీ కఠినమైన క్రమశిక్షణను ప్రేమతో అమలుపరచడంలో ఎప్పుడూ విఫలమవలేదు. 
తన సోదరులకు, శిష్యులకు శిక్షణనివ్వడం కోసం తన గృహస్థ ధర్మాలను   చాలా బాగా నిర్వర్తించేవారు. పెద్దలను గౌరవించేవారు, నమస్కరించేవారు, తన వేయసువారి పట్ల చిన్నబుచ్చకుండా  వినమ్రంగా ఉండేవారు,  తన కంటే చిన్నవారి పట్ల ప్రేమతో మెలగేవారు.
 
అల్పాహారం ఆయనకు అలవాటు ఉండేది కాదు, పొగతరాగేవారు కాదు. జూదం గాని పేకాట గాని ఆడటం ఆయనకిష్టం ఉండేది కాదు. అప్పుడప్పుడు హార్మోనియం వాయించేవారు. 

(సశేషం ... )


1, ఫిబ్రవరి 2024, గురువారం

బాబూజీ - లాలాజీ గురించి - 1


బాబూజీ - లాలాజీ గురించి - 1 

"Lives of great men all remind us, we can make our lives sublime."

"మహాత్ముల జీవితాలన్నీ మనం మన జీవితాలను ఉదాత్తమైనవిగా మార్చుకోవచ్చునని మనకు గుర్తు చేస్తాయి."

అవతరణ 
ఫిబ్రవరి 2, 1873 బసంత పంచమి శుభసందర్భాన  ఒక దివ్య వెలుగు ఈ భూమ్మీదకు దిగివచ్చింది. ప్రకృతి ఒక నిశ్శబ్ద వాగ్దానం చేయడం జరిగింది;  మనలను ఆదుకోవడం కోసం ఒక కనిపించని చేయి ముందుకు చాపడం జరిగింది. మానవాళి తెలియకుండానే తనపై తాను వేసుకున్న ఉక్కు శృంఖలాల నుండి, తాను ఏర్పరచుకున్న భారం నుండి తనను తాను వదిలించుకోవడం ప్రారంభించింది. 

కుటుంబ నేపథ్యం 
లాలాజీ (శ్రీరామచంద్రజీ, ఫతేగఢ్, ఉత్తర ప్రదేశ్) ఒక గొప్ప పేరున్న జమీందారీ కుటుంబానికి చెందినవారు. వాళ్ళను జాగీర్దార్లనేవారు. వారి తాతగారైన బృందావన్ బాబు గారికి, వారి అద్భుతమైన లక్షణాలను, సాధించిన ఉదాత్తమైన సిద్ధులను చూసి, అక్బర్ చక్రవర్తి 555 గ్రామాలను ఇవ్వడం జరిగింది. వారి తండ్రిగారు శ్రీ హరబక్స్ రాయ్ గారు ఫరూక్కాబాద్ జిల్లాలో టాక్స్ సూపరింటిండెంట్ గా పని చేసేవారు. తల్లి సాధు స్వభావురాలు. ఆమెకు చక్కటి గళం ఉండేది, పాడితే మధురంగా ఉండేది. ఆమె రామచరిత మానస్ పాటతో అందరి మనసులు తేలికగా గెలుచుకునేవారు.

విద్యాభ్యాసం  
వారి తల్లిగారి వద్ద రామచరితమానస్ నేర్చుకున్నారు. చాలా శ్రావ్యంగా పాడేవారు. విన్నవారు మంత్రముగ్ధులయిపోయేవారు. సంగీతం పట్ల మంచి అభిరుచిని కనబరచేవారు. విన్న పాటలను ఉన్నదున్నట్లుగా సూక్ష్మాలతో సహా సరిగ్గా పాడేసేవారు. లాలాజీ ఉర్దూ, పర్షియన్, అరబిక్, హిందీ, ఇంగ్లీషు  భాషలలో మంచి ప్రావీణ్యం ఉన్నవారు. ఇంకా స్కూలు విద్యార్థిగా ఉండగానే భగవంతుని తెలుసుకోవాలన్న తీవ్ర తపన వారిలో కలిగింది. 

వివాహం, గృహస్థ జీవనం 
సాధుస్వభావం గల ఒక  స్త్రీతో, మంచి కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన  స్త్రీతో లాలాజీ వివాహం జరిగింది. అప్పటికి వారసత్వంగా వచ్చిన ఆస్తులు బాగానే ఉండేవి. కాని లాలాజీ ఒక ధనికుడిలా జీవించలేదు. విధివశాన వారి పూర్వీకులు సంపాదించిన ఆస్తులన్నీ కోల్పోవడం జరిగింది. ఎన్నో విషాదకరమైన సంఘటనలు చోటు చేసుకోవడంతో, ఎప్పటికప్పుడు అన్నీ రకాల పరిస్థితులకు తగినట్లుగా తనను తాను సర్దుకుంటూ ఎన్నో భరించలేని కష్టాలను ఎదుర్కున్నారు.  వీరి కష్టాలు విన్న ఫరూక్కాబాద్ కలెక్టర్ నెలకు 10 రూపాయల ఉద్యోగంలో వారిని నియమించడం జరిగింది. 

లాలాజీ విగ్రహం 
సగటు మనిషి ఎత్తు కలిగి ఉండేవారు. చక్కని ముఖవర్ఛస్సు. ఆయన వ్యక్తిత్వం ఎంత తేజోమయంగా ఉండేదంటే, ఆయన ఆహార్యం ఆత్మలో ఉన్న అపూర్వ సామరస్యం ఆయన ముఖంలో కనిపించేది. ఉదారతతో నిండిన వ్యక్తిత్వం. గోధుమ రంగు ఛాయ, ఆకర్షణీయమైన ముఖభాగాలు. విశాలమైన మేధస్సును సూచిస్తూ విశాలమైన ఎత్తైన నుదురు. కానీ దాన్ని తన కోసం ఉపయోగించలేదెప్పుడూ; ఇతరుల కోసం ఒక దీపస్తంభంలా దారి చూపించడానికి వినియోగించేవారు. ఆయన కళ్ళు రెండు నక్షత్రాల్లా మెరుస్తూండేవి. ఆ కళ్ళు దేనినైనా, దేనిలోకైనా ఆశాంతమూ లోలోతుల్లోకి చూసే విధంగా ఉండేవి. ఆ కళ్ళ లోతులు కొలవలేని విధంగా ప్రశాంతమైన సరస్సుల్లా ఉండేవి. నిద్ర, వేకువగా ఉండటం కలగలసి ఉన్నట్లుగా ఉండేవి ఆ కళ్ళు; ఒక్క కనురెప్పపాటులో అవతల వ్యక్తిలో భగవత్సాక్షాత్కార అనుభూతి కలిగించే విధంగా ఉండేవి ఆ కళ్ళు; వారి జుట్టు ముట్టుకుంటే పట్టులా ఉండేది. ముందు పన్ను ఒకటి మిగిలినవాటితో పోలిస్తే పెద్దదిగా ఉండేది. ఒక చిన్న అందమైన గడ్డం, మీసం ఉండేవి. ఆయన చెవులు మధ్యస్థంగా ఉండేవి. ఆయన చేతులు, పాదాలు చాలా నాజూకుగా సున్నితంగా ఉండేవి. 

(సశేషం ..) 

అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన 5 ఔషధాలు

  అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన  5 ఔషధాలు  ఇటీవలే పూజ్య దాజీ "ఫైవ్ ప్రిస్క్రిప్షన్స్ ఫర్ ది సోల్ ఫ్రమ్ అష్టావక్ర మహాగీత" అన...