మతం ఎక్కడ అంతమవుతుందో ఆధ్యాత్మికత అక్కడ మొదలవుతుంది - బాబూజీ
బాబూజీ యొక్క ఆధ్యాత్మిక విప్లవాత్మక బోధల్లో ఇది ముఖ్యమైనది. మనం ఈ వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
మతం అంటే ఏమిటి?
మతం అంటే అభిప్రాయం/నమ్మకం అని అర్థం. శ్రీరామ కృష్ణ పరమహంస - యతో మత్ తతో పాథ్ మతం - అని సెలవిచ్చినట్లుగా, భూమ్మీద ఎన్ని పుర్రెలున్నాయో అన్ని మతాలూ ఉండవచ్చు. మతం అనగానే అనేక మతాలు గుర్తొస్తాయి - హిందూ మతము, క్రైస్తవ మతము, ఇస్లాం మతము, సిఖ్ మతము, బౌద్ధ మతము, జైన మతం, నాస్తిక మతంతో సహా ఎన్నో మతాలున్నాయి. ప్రతీ మతంలోనూ కూడా, ప్రవక్తలు, ప్రామాణికమైన ఒక వాజ్ఞ్మయము, ఒక జీవన విధానము, ఆచారాలు, క్రతువులు, పూజలు, పునస్కారాలు యేదోక రూపంలో కనిపిస్తాయి. ప్రతి మనిషీ యేదో ఒక మతంలో జన్మించినవాడే .
మతం యొక్క లక్ష్యం
ఇంగ్లీషులో మతం (Religion) అనే పదానికి - తిరిగి భగవంతునితో కలయిక - అని అర్థం. ఈ మూల అర్థానికి దూరమైపోయి ఇంచుమించుగా ప్రతీ మతమూ క్రతువులకు, ఆచారాలకూ పరిమితమై పోయింది. చెరుకు-రసాన్ని విడిచిపెట్టి, చెరుకు-పిప్పిని నములుతున్నట్లుగా కనిపిస్తుంది. అందుకే యే మతమైనా తమ-తమ జనాన్ని కాపాడుకోవడం కోసం రెండు ఆయుధాలను ప్రయోగిస్తూ ఉంటుందంటారు బాబూజీ - భయము, ప్రలోభము. నరకం యొక్క భయం, స్వర్గం యొక్క ప్రలోభం.
కానీ చాలా మతాలలో ఉదాహరణకు, హిందువుల్లో ఋషులు, క్రైస్తవుల్లో మిస్టిక్స్, ఇస్లాం మతంలో సూఫీలు, ఇలా వీళ్ళందరూ ఒకే భాష మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తుంది. ఆమ్రముఖులై అన్వేషించేవారందరూ ఒకే భాషను, ఒకే అవగాహనను పంచుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. వీళ్ళకి ఆచారాలతోనూ, నమ్మకాలతోనూ, క్రతువులతోనూ సంబంధం లేకుండా, భయము, ప్రలోభాలతో పని లేకుండా, అంతర్ముఖులై, ప్రేమతో దైవం ఒక్కటే అన్న అనుభవపూర్వక పరమసత్యాన్ని ప్రబోధిస్తూంటారు, ఆచారణాత్మకంగా జీవిస్తూ ఉంటారు.
మతానికి అతీతంగా ...
నిజంగా సత్యాన్వేషణలో ఉన్నవారు, పరమసత్యాన్ని త్రికరణ శుద్ధిగా తెలుసుకోవడమే జీవిత పరమార్థంగా పెట్టుకుని జీవిస్తున్నవారి, మతానికి అతీతంగా ఎడగవలసి ఉందంటారు బాబూజీ. మతానికి అతీతంగా అంటే మతాన్ని నిరాకరించడం కాదు, తిరస్కరించడం కాదు. మతాన్ని దాటి అంతర్ముఖంగా ప్రయాణించడం. అంటే బాహ్యంగా సత్యాన్ని అన్వేషించడం ఆపి, సత్యం హృదయాంతరాళంలో అన్వేషించడం. భయానికి, ప్రలోభాలకు లోనుగాకుండా ప్రేమతో విశాల మనసుతో, ధ్యానం ద్వారా శోధించడం. స్కూలు దాటి కళాశాలలోకి, కళాశాల దాటి విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించడం లాంటిది.
కాబట్టి బాహ్యంగా చేసే అన్వేషణ అంతమై అంతర్ముఖంగా శోధన ప్రారంభమవడమే మన సాధనలో మతం అంతమై ఆధ్యాత్మికత ప్రారంభమవడం అంటే.
ADBHUTAM. INTAKANNA EMI RAYANU ?
రిప్లయితొలగించండి